గుడ్ న్యూజ్ : “విశేషమా? విశేషమే!”

0
4

[box type=’note’ fontsize=’16’] “గర్భం దాల్చిన స్త్రీలిద్దరి కథ చెబుతూ మాతృత్వం, దాంపత్యం, పుట్టబోయే బిడ్డ బయాలోజికల్ తండ్రి ఎవరన్నది వగైరా విషయాల మీద నవ్విస్తూనే దృష్టి పడేలా చేసిన చిత్రం” అంటున్నారు పరేష్ ఎన్. దోషిగుడ్ న్యూజ్‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] వారం గుడ్ న్యూజ్ చూశాను. సరదాగా సాగే ఈ సినెమాలో గర్భం దాల్చిన స్త్రీలిద్దరి కథ చెబుతూ మాతృత్వం, దాంపత్యం, పుట్టబోయే బిడ్డ బయాలోజికల్ తండ్రి ఎవరన్నది వగైరా విషయాల మీద నవ్విస్తూనే దృష్టి పడేలా చెయ్యడం జరిగింది. పితృస్వామ్యం విలువలు వగైరా.

వరున్ బత్రా (అక్షయ్ కుమార్), దీప్తీ బత్రా (కరీనా కపూర్) ఇద్దరూ ఉద్యోగస్తులు. పెళ్ళై ఏడు సంవత్సరాలైనా పిల్లలు లేరు. స్త్రీకి అండం విడుదల అయ్యే సమయానికి గనక కలిస్తే గర్భం దాల్చడానికి అవకాశాలెక్కువ అని చెప్పి, కేలెండర్లో ఆ తేదీలు మార్క్ చేసుకుని అతన్ని కూడా సిధ్ధమవమంటుంది. దాని పరిణామంగా అతను ఒత్తిడికి గురై అసలుకే ఎసరు వస్తుంది. ఈ విషయం చుట్టూ కాస్త హాస్యం అల్లి తర్వాత కథ ముందుకు తీసుకెళ్తారు. ఎన్ని చేసినా ఫలితం లేకపోవడంతో దగ్గరి స్నేహితులు డాక్టర్ జోషి (ఆదిల్ హుస్సేన్) దగ్గరకెళ్ళమంటారు. అతను ఫర్టిలిటి సెంటర్, తన భార్య సంధ్య (టిస్కా చోప్రా) తో కలిసి నడుపుతుంటాడు. బత్రా దంపతులు వెళ్ళిన నాడే, మరో జంట హనీ బత్రా (దల్జీత్ దొసాంఝ్), మోనికా బత్రా (కియారా ఆడ్వాణి) లు కూడా వెళ్తారు. వాళ్ళదీ అదే కథ. వరుణ్, హనీ లు తమ వీర్యం సేంపిళ్ళు ఇస్తారు. ఇద్దరి ఇంటి పేర్లు వొక్కటే కావడం వల్ల పొరపాటున హనీ వీర్యం దీప్తి అండంతో, వరుణ్ వీర్యం మోనా అండంతో ఫలదీకరణ చెయ్యడం జరుగుతుంది. విషయాన్ని దాయకుండా డాక్టరు వీళ్ళకు నిజం చెబుతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది నవ్వుల సందడి. ముందైతే ఇద్దరూ కోపోద్రిక్తులవుతారు. ఆ తర్వాత ఆ రెండు జంటలు ఎలా ప్రవర్తిస్తారు, ఆడవాళ్ళ స్పందన, మగవాళ్ళ స్పందన ఏమిటీ అన్నది మిగతా కథ. వరుణ్ కి ససేమిరా ఇష్టం వుండదు, గర్భాన్ని కొనసాగించడం. అబార్షన్ చేయించుకోమంటాడు. ఆమె వినదు. హనీ జంట కాస్త పల్లె వాతావరణంలో పెరిగిన వారు. హనీ లాంటి బిడ్డ పుడితే తనకు అసహ్యంగా వుంటుంది అనుకుంటాడు వరుణ్. అతనికి దీప్తి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద శ్రధ్ధ వుండదు, మోనా కడుపులో పెరుగుతున్న “తన” బిడ్డ మీదా ఆసక్తి వుండదు. కాని హనీకి మాత్రం తన భార్య ఆరోగ్యం, ఆ బిడ్డ గురించిన జాగ్రత్త తో పాటు, దీప్తి కడుపులో పెరుగుతున్న “తన” బిడ్డ మీద కూడా శ్రధ్ధ వుంటుంది. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని దీప్తి వాళ్ళు వుంటున్న అపార్ట్మెంట్ లోనే వో ఫ్లాట్ అద్దెకు తీసుకుని వుంటారు. దీప్తి కదలికలన్నిటి మీదా నిఘా పెడుతూ, జాగ్రత్తలు చెబుతుంటాడు. అది దీప్తి జంటకు చాలా చిరాకు తెప్పిస్తూ వుంటుంది. వీళ్ళందరి ప్రవర్తనా, రకరకాల సంధర్భాలలో స్పందనా, డెలివరీ తర్వాత ప్రతిస్పందనా వగైరా తెర మీద చూడాల్సిందే.

రాజ్ మెహతా దర్శకత్వం పర్లేదు. నటన అందరిదీ బానే వుంది. స్టీరియోటైప్ పంజాబి పాత్ర అయినా దల్జీత్ దోసాంఝ్ బాగా చేశాడు. కియారా కు పెద్దగా నటనకు అవకాశం లేదు. కరీనా ఎప్పటిలా చేసింది. అక్షయ్ కుమార్ తన నెరిసిన మీసం, గడ్డంతో తెర మీద కనిపిస్తాడు, అదొకటి రిలీఫ్. వో యువ హీరోలా కాకుండా. వరుణ్ కూడా పంజాబీ అయినా ఎక్కడా కాస్త కూడా పంజాబీ ఫ్లేవర్ లేకుండా కనబడతాడు. అంతే కాకుండా హనీని చూసినప్పుడల్లా చిరాకు పడతాడు. ఇది కొంత అసహజంగా కనిపించింది.

వొక పక్కా వ్యాపార చిత్రం. హాస్యం (కొన్ని చోట్ల బాలేదు అయినా) కోసం చూడొచ్చు. ఇక బోనస్ గా మగవాడికి తన బిడ్డలో తన అంశ వుండాలి అన్న కోరిక ఎంత బలంగా నాటుకుని వుంటుందో చూడొచ్చు. దానికి వూతం ఇవ్వకుండా చివర్లో మగవాళ్ళిద్దరూ వొకరినొకరు సపోర్ట్ చేస్తూ పరిస్థితులను సంబాళించుకోవడం, మానవత్వంతో ఎదగడం బాగుంది. వొక బిడ్డ పుట్టడానికి పురుషుడి పాత్ర వీర్యదానంతో ముగుస్తుంది. కాని పుట్టే బిడ్డ తండ్రి ఇంటిపేరుతో ఎదిగి “అతని”కి చెందిన బిడ్డ అనిపించుకుంటుంది. స్త్రీ మాత్రం నవమాసాలూ మోసి, దాని పరిణామంగా ఎన్నో ఇబ్బందులు, త్యాగాలు, కష్టాలూ పడి చివర్న పురిటి నొప్పి రాక్ష క్షణాలు కూడా అనుభవించి మరీ కంటుంది. వరుణ్ కి ఎంత సేపూ తన భార్య కడుపులో బిడ్డ తనది కాదు అని కోపం. మరో పక్క హనీ మాత్రం ఇద్దరు బిడ్డల సమ్రక్షణా చూడాలని కోరిక వున్నవాడు. ఈ కోణం లో కథ ఇంకొంచెం వివరంగా చూపి వుంటే ఇంకా బాగుండేది.

ఈ వొక్క విషయం కోసం సినెమాకి పాస్ మార్కుల కంటే కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here