[dropcap]చ[/dropcap]ల్లని గాలిలో ఆకులు పైకి లేస్తున్నాయి
పెదవులు వణుకుతూ
వెచ్చని కౌగిలింత కోసం ఆరాట పడుతున్నాయి
అవి శరదృతు పండుటాకులు అనుకునేరు
ఎంగిలి పడ్డ విస్తరాకులు
మేమున్నామంటూ ఒక్కసారిగా
గొంగళిగా మారిన దొన్నెలు
నీ మెత్తని చీర దోపుల తొట్టెలలో ఉండాల్సిన నేను
ఈ చెత్త కుప్ప తొట్టిలో ఏంచేస్తున్నానమ్మా ?
మొరిగే నాలుగు కాళ్ళు నా చుట్టూరా తిగురుతున్నాయి
వాటిని చూసి ఏడిచే నన్ను చూసి, నా ఏడుపే ఎక్కి ఎక్కి ఏడుస్తుంది
ఆకులకి కుక్కలు బెదిరే కాలం సుదూరం
ఆకలికి ఏదైనా ససేమిరా అనడం కలికాలం
ఇంతలో దైవ చొరబాటు
నా తలపై తామర పత్రము
గారాబు చేస్తే గారెలిచ్చే వాళ్ళు లేరు
అడుగులు వేస్తె అరిసెలు పంచె వాళ్ళు లేరు
పాల పళ్ళు వస్తే పాయసం వండే వాళ్ళూ లేరు
మొదటి మాట ఏమనాలో తెలియని తికమక
అ .. అ .. అంటూ అంబలి అన్నానట
కడుపు కాలితే గుండె కదలదట
అందుకేనేమో గుండె లేని నా వాళ్ళు నాకు గూడు లేకుండా చేశారు
ఎదుగుతున్న నాకు
మట్టితోటే ఆటలు
సద్దన్నమే నా సుఖము
నాలాంటి వాళ్ళే నాకు స్నేహితులు
నా మనుగడంటేనే నాకు అమితానందం
అసలు అమ్మంటే ఎలా ఉంటది, బొమ్మలు నాన్న తెస్తే ఎలా ఉంటది,
సాయంకాలం మేంముగ్గురం గుడికెళ్తే దేవుడు ఎలా స్పందిస్తాడు,
నుదుటి పై ముద్దు పెట్టి బడికి పంపితే ఎలా ఉంటది?
ఇవన్నీ ఒకప్పుడు ఆశలు
ఇప్పుడు వాస్తవాలు
అనురాగం కోసం ఎదురు చూసిన క్షణాలు
ఆఖరికి పూయించాయి నా ముఖంలో పక పక నవ్వులు
అనాథ అని లోకువనుకున్నారేమో
నా కైదండను చూపిస్తా
నా గొంతు విశ్వమంతా వినిపిస్తా
నా సత్తా చాటుతా
నా మటుకు కనిపించే వాళ్ళే నాన్న అమ్మ
కనీ పారేసిన వాళ్ళని ఏమనాలమ్మా ?!?!