[dropcap]తా[/dropcap]గుబోతు నాన్న
అన్నం పళ్ళెం
ముఖాన్ని కొడితే
‘ఛీ’ దీని బతుకు చెడ
యెంత జరిగినా అమ్మకు
సిగ్గు లేదని
సహనం చచ్చి
బర బారా చేయి పట్టుకు లాక్కుపోతే
ఒక్క క్షణం
అంటూ
లోనికి వెళ్లి
కన్నీరు తుడుచుకుంటూ
మరో పళ్ళెంతో అమ్మ ప్రత్యక్ష్యం
ఇన్ని తన్నులు తిన్నాక
తిండి అవసరమా?
నేనేం తనను సాకలేనా?
పిడికెడు అన్నం పెట్టలేనా?
అనిపించింది బయటకు పోయా.
యెంత ఎదురు చూసినా.
అమ్మ రాదు.
ఆవేశం గా లోనికి వెళ్ళాను.
అమ్మ వడిలో నాన్న,
చంటి పిల్లాడిలా,
గోరుముద్దలు తింటున్నాడు.
అమ్మ చేతిలోని ఆ గోరుముద్ద
కొడుకుగా నా కర్తవ్యానికి,
లెంపకాయ కొట్టింది.
అదిరా భార్య
అదిరా సహనం
అదిరా ఆదరణ
అదిరా బాధ్యత
అదిరా ప్రేమ
శభాష్ అంటూ……
నాలోని సిగ్గు
అమ్మ పాదాలకు నమస్కరించింది.
నాన్న తలపై నా చేయి,
అమ్మ నుదిటిపై నా పెదవులు.
ముత్యాల కన్నీళ్ళు
మళ్ళీ,
వారిరువురికి
తలంబ్రాలు పోసాయి.
భారత సంస్కృతి అనే అద్దాల మేడకు
ఈ వైవాహిక వ్యవస్థ పునాది.
అది నిత్యం వర్ధిల్లాలని,
ఆకాంక్షతో,
మళ్ళీ,
వారిరువురికి షష్టి పూర్తి ని చేసాయి.