కావ్య పరిమళం-23

0
4

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

పలికించెడువాడు రామభద్రుండట (పోతన భాగవతం)

[dropcap]ఆం[/dropcap]ధ్ర మహాభాగవతం ఆంధ్రుల పుణ్యాల పేటి. పోతానార్యుని సుధామధుర రసస్యందిలో పద్యం రసవత్తరంగా రూపొంది తెలుగువారి నాలుకలపై నర్తించింది. దశమ స్కందంలోని శ్రీకృష్ణుని బాల్య లీలా విశేషాలు పలువురికి కంఠస్థమై హృద్యపద్యాలుగా వర్ధిల్లాయి.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పోతన కవితాశైలిని ఇలా విశ్లేషించారు:

“ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య; అ
ట్లద్దక – వట్టిగంటము నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు – ఈ మధురభావన లెచ్చటినుండి వచ్చురా?” (ఉదయశ్రీ మొదటి భాగం)

పోతన సహజకవి. లలితస్కందము – అనే పద్యంలో పోతన భాగవత కల్పతరువునకు కృష్ణావతారమే మూలమని నిర్దేశించి ఆ కృష్ణుడే మహావిష్ణువని స్పష్టంగా ప్రతిపాదించాడు. మోక్షప్రదాలైన శ్రీకృష్ణుని కథలను వినదలచిన శౌనకాది మహామునులకు సూతుడు భాగవత కథనానికి ఉపక్రమించడమే శ్రీకృష్ణ చరిత్ర. భాగవతంలో కృష్ణ చరిత్ర గల దశమస్కందం ఈ పురాణశరీరానికి హృదయస్థానం.

ఆచార్య పింగళి లక్ష్మీకాంతం పోతనను గూర్చి ఇలా విశ్లేషించారు:

“తెలుగు కవులలో శ్రీకృష్ణ నామాత్మకమైన భాగవతతత్వ ప్రబోధము ప్రారంభించిన కవి యోగి పోతనయే. అంతే కాదు వంగదేశమున రాధాకృష్ణ మత సంప్రదాయమును నెలకొల్పి, దేశమెల్లడల వ్యాపింపజేసిన చైతన్యస్వామి పోతన తర్వాత ఏబది సంవత్సరములకు అవతరించెను. కావున చైతన్యావతారమునకు ముందే ఈ ఆంధ్ర భక్త యోగి కృష్ణతత్వమును మనదేశమున గానము చేసి ఆంధ్రుల మనోలోకమున  ఒక పరివర్తనము దెచ్చెను. ఆ సమయము  నందే అపర ప్రహ్లాదుడనదగిన అన్నమయ్య (1408-1503) తన సంకీర్తానాదులచే విష్ణుపారమ్యమును బోధింపనారంభించెను. మహాభక్తులు జన్మించిన యుగమది.” (ఆంధ్రసాహిత్య చరిత్ర, పుట 319).

సార్వజనీన ప్రశస్తి:

తెలుగు సాహిత్యంలో పురాణేతిహాసాలలో ఆంధ్రమహాభాగవతానికున్న ప్రజానురంజకత్వం మరో గ్రంథానికి లేదు. దానికి ప్రధాన కారణాలివి. భాగవతంలో ప్రతిపాదింపబడిన భక్తియోగం సర్వప్రాణి సాధారణమైన తారకమంత్రం. ఆపదలు వచ్చినప్పుడు గజేంద్ర మోక్షాన్ని సంజీవనిగా జపిస్తారు:

“లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ తప్పెను, మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపన్ తగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!”

‘కావవే వరదా!’ అని చేసిన ఆక్రోశమే చాలు ప్రపన్నత్రాణ పరాయణుడైన వైకుంఠవాసుని భూలోకానికి తీసుకురావడానికి. ఇక్కడ గజేంద్రుని మొర పోతన మొర. “శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించిదెన్” – అని భాగవత రచన కుపక్రమించిన భక్త కవి యోగి ఆయన.

భాగవత పద్యాలు భజన కీర్తనలవలె, పెళ్ళి పాటల వలె, ఏల పాటల వలె మధురాతి మధురములై మందార మకరంద మాధుర్యమున తేలియాడిస్తాయి. ఆ పద్యాలలోని శ్రుతిలయలు పలికినంతనే మనసులోగొనే శక్తి గలవి. కవి తా ననుభవించిన దారిద్ర్యము, దాని నెదుర్కొని పోరాడిన ధీరత్వం వలన ఆయన పట్ల పాఠకులకు పూజ్యభావం కలుగుతుంది. “అల్ల కర్ణాట కిరాత కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!” అని శపథం చేసిన కవి ఆయన.

ఈ సందర్బాన్ని వర్ణిస్తూ వానమామలై వరదాచార్యులు ఇలా అంటారు

“నశ్వర రాజ్య సంపదల  నశ్వర యౌవన జీవనమ్ములన్
నశ్వర భోగభాగ్యముల నమ్మిన మానవు నాశ్రయించుచున్
విశ్వవిధాత నచ్యుతుని విశ్వచరాచర భూతరక్షకున్
శాశ్వత సౌఖ్యదాతను విచారము దక్కి త్యజింప నొప్పునే!” (పోతన చరిత్ర – సప్తమాశ్వాసం – 197).

రాజు భాగవతాన్ని అంకితం తీసుకోవాలని కోరినపుడు పోతన రాజాజ్ఞ కంటే రామాజ్ఞ అధికమని తెలిపిన ఘట్టమది.

భావకవితా ప్రతిభ:

పోతన కావ్యశిల్ప మర్యాదలకు కట్టుబడిన కవి కాదు. ఆయన వాటన్నిటికంటే అతీతుడైన భాగవత కవిశేఖరుడు. తిక్కన కవితా ప్రతిభ నాటకీయమైనట్లే, పోతనది భావకవితా ప్రతిభ. ఆయన శైలి కర్ణపేయం. భక్తి శృంగార భావ సరి పోషణలో ఆయన భావలోలుడు. శ్రీకృష్ణుని బృందావన విహార సమయంలో యమునానది హర్షాతిరేకంతో ఉప్పొంగినట్లే, పోతన రచనలో శృంగారధిక్యతకు భావలోలత ప్రధాన కారణం. అది జీవేశ్వరరైక్య ప్రతిపాదకమైన ఆధ్యాత్మిక శృంగారమై పరమపవిత్రమైనది.

తన హృదయంలో పొంగిపొరలిన రసభావాలను వట్టిపోనీక ఒక బిందువును సముద్రంగా విస్తరింపజేయగల మహత్తర శక్తి పోతన స్వంతం. శ్రీకృష్ణ భక్తి యోగం పోతన మంత్రం. ఆయన అద్వైతియే కాని, విశిష్టాద్వైతి కాదు. ఛందస్సంబంధమైన మాధుర్యం ఆయనకు సహజంగా సిద్ధించింది. కవి స్వేచ్ఛగా పాడుకొను భక్తి గానాన్ని, ఆ గానానికి సరిపడే మధురాతి మధురమైన శబ్దాన్ని, ఆ శబ్ద సంఘానికి మకుటాయమైన అంత్యప్రాసము కలిపి భాగవతం చదివేడప్పుడు తాళ మృదంగాలతో ఒక గాన సభలా భాసిస్తుంది.

రుక్మిణీ కల్యాణ ఘట్టంలో జగన్మోహనకారుని రుక్మిణి చూచిన సందర్భం అద్భుత కళాసృష్టి:

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖున్, కంఠీరవేంద్రావల
గ్ను నవాంభోజదళాక్షు, చారుతరవక్షున్, మేఘ సంకాశ దే
హు నగారాతిగజేంద్రహస్తనిభబాహున్, చక్రి, పీతాంబరున్
ఘనభూషాన్వితు, కంబుకంఠు, విజయోత్కంఠున్, జగన్మోహనున్. (దశమ స్కందం – 1749).

పోతన కవితా మాధుర్యము భక్తి భావరస సమ్మిళితమై కృష్ణ కథా స్రవంతియై ఆంధ్ర సాహితీ నందనోద్యానవనంలో కల్పతరువై ఇన్ని శతాబ్దాలుగా పాఠకలోకాన్ని ఆదరిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here