అనుబంధ బంధాలు-29

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 29వ భాగం. [/box]

[dropcap]“అం[/dropcap]టే పైకం వాళ్ళకు ఇవ్వాలంటారు.”

“నేను అననమ్మా, కానీ వాడు ఇవ్వకపోతే అదను చూసి కాల్చిపారేస్తాడు.”

“ఇచ్చాడు పో, ఊపిరాడనివ్వక వ్యాపారం చేయిస్తాడా? అదీ లేదు కదా” అన్నాడు నవ్వుతూ.

“అర్థం కాలేదు మామయ్యా” అంది విజయ.

“చెప్తాను, ఈ సాంబయ్యను వదిలెయ్యి. వీడికి ఏ రేంజిలో సాయపడుతున్నారో నాకు అంతగా తెలీదు. సారా కాంట్రాక్టరు p.p అనే వాడున్నాడు తెలుసా?” అడిగాడు.

“తెలీదు.”

‘లోకావలోకనానికి దూరం ఈ తరం’ అనుకుని “వాడి అసలు పేరు పెంట్ల పుల్లారావు. ఇది వినటానికే బాగలేదని వాడి మనస్తత్వమంత చంఢాలంగా ఉందని వాడి రూప మంత కంగాళిగా ఉందని… తెల్సుకొని వాడికి వాడుగా p.p గా మార్చుకున్నాడు. విప్పదీస్తే వడ్ల గింజలోదే బియ్యపు గింజగానీ పొట్ట విప్పి పురుగుల్ని చూస్తే ఓపిక లేని సజ్జు గదా మన జనం. పైగా p.p అంటే అదేదో ఫారెన్ నుంచి ఇంపోర్టు అయిన లెవల్లో జనం ఫీలయిపోయి ఆరేడు వందల ఏళ్ళ బానిసత్వం గుర్తుకొచ్చి పాత వాసన వదలక అకారణంగా సాల్యూటు కొడతారు.

“ఇంత ఉపోద్ఘాతం ఎందుకు? విషయం చెప్పేదానికి” అంది విజయ విసుగ్గా.

అందుకు దీక్షితులు నవ్వి “విజయా, కొన్ని కొన్ని అంత త్వరగా చెప్తే అర్దం కావు. ‘రావణాసురుడు’ అనగానే మనకు తలలో బల్బు వెలిగి పది తలలూ పది చేతులు కనిపించినట్టూ ఈ త్రాష్టపు లంజాకొడుకుల పేర్లు చపితే అలా వెలగవు గదా” అని అదోలా నవ్వి, “వాడిది ఒంటి అరక ఎగసాయం. ముగ్గురు అన్నదమ్ములు. వాడికిచ్చిందాన్ని కాస్తా అమ్ముకొని ఊరు వదిలి పెట్టిండు. చేతిలో కొచ్చింది అయిపోతుండగా తెగబడి బొడ్డుకు మసిరాసుకొని బరిలౌకి దిగిండు. గంజాయి బేరం చేసిండు. సగానికి సగం కాజేసి సారా యాపారంలో దిగిండు. చేరినోడినల్లా, దగ్గరికి వచ్చినోడినల్లా జాగ్రత్తగా ముంచిండు. ఉచ్చనీచాల్ని వదలి ఎగబాకిండు. పదేనేళ్ళలో కోటీశ్వరుడైండు. బినామీ పేర్లతో బోలెడు అమర్చుకొన్నాడు. ఇన్కంటాక్సు వాళ్ళను కూడా కొన్నాడు. సారా కంటే గంజాయి కంటే రాజకీయాల కంటే చదువుల యాపారం కంటే వైద్యయాపారం సక్కంగ ఉందని చివరకు దాంట్లోకి దిగిండు. ఇట్టాంటోడ్ని పాపం నక్సలైటోళ్ళేగాదు ఎవడు ఎంత అడిగితే ఏముంది? మంది పెళ్ళాల పుస్తెలు దెంపి సంపాదించిందే గదా. ముంచిన దాంట్ల పీస పాలు వాటా ఇచ్చనట్టయితది.

వీడొక్కడే కాదు.

ఈ ఇరవై ఏళ్ళలో ఇలా పెరిన నియోరిచ్ జాతి రకరకాలుగా రకరకాల వృత్తులలో ఈ జన పదంలో ఉంది.

వీళ్ళ రేసులో ఉద్యగస్తులూ అలాగే తయారయినారు. రేట్లు fix చేసుకొని రాజకీయాలు చేసటోంళ్ళు ఇలాంటి వెధవల కందడేమే ఆర్హతగా తయారయారు. వాళ్ళు కనిపించాక అప్పనంగా కుబేరులవ్వాలనే ముందు చూపు ఎక్కువ మందికి కల్గి జన జీవితం కల్లోలమయిపోయింది. కలుషితమైంది, అదుపు తప్పింది.

అన్యాయం పట్టం కట్టుకొని ‘నీతి నిజాయితీ జాతీయతా’ అనేవి పుస్తకములో చదివే మాటలుగా మిగిలాయి. వాటిని ఇక్కడనే ఇలాగే ఉంచే ప్రయత్నం ఎవరి వంతు వారు perfect గా చేసారు.”

“పూర్తిగా అర్థం కాలేదు” అంది.

“చెప్తా! యథా రాజా తథా ప్రజా అన్నది నానుడి. అనుభవసారమైన విషయం, రాజును పట్టి జనం ఉంటారు అని అర్థం.”

పాపం గాంధీగారు రాజ్యం తెచ్చిండు, కాల్చి పారేస్తే చచ్చిపోయిండు.

ఆ పేరును ఆ ఖ్యాతినీ ఆ త్యాగాన్నీ ఆ నిజాయితీని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని ఏలుతున్నోళ్ళు అన్నీ మరచి దీన్ని స్వంత జాగీరులాగా చేసుకొని కుక్కలలా గతకడం ప్రారంభించారు. మొదటి రోజులలో ఇలా గతకడం తప్పు, పార్టీ ప్రతిష్ట పోతది అని కొంచం బయపడ్డారు…. రానురాను అదిపోయింది. పూర్తిగా పది తరాలకన్నా సంపాదించుకోలేని వాడు వెఱ్ఱివెంగళప్పగా ఇప్పటి రాజకీయాలలో మిగులుతున్నారు. జనం కూడా దేశాన్ని బాగా అమ్ముకున్నోడినే, తెలివికల నాయకుడిగా, న్యాయంగా ఉన్నోడ్ని పిచ్చి మారాజుగా చూడసాగారు. తెవిగలోడింట పడి వాళ్ళు వీళ్ళు మందం దోపిడి ప్రారంబించారు.

ఇది చూసి అపోజిషన్ వాళ్ళు పాపం గావు కేకలేసారు. చొక్కాలు చింపుకుంటామన్నారు. కానీ చివరకు దిక్కులేక వాళ్ళను blackmail చేసి బ్రతకడం ప్రారంబించారు. అంటే పరోక్షంగా ఈ దోపిడిలో వాటాదార్లుయ్యారు.

ఆ వరసలో కొందరు ఇజాల్ని అడ్డం పెట్టుకుంటే కొందరు మతాల్ని అడ్డం పెట్టుకున్నారు. కొందరు సెక్యులరిజం అన్నారు. చివరకు ఎవరి వాటా వారిదన్నారు. అట్ట దేశపు మూలగలలో గుజ్జును గూడా చప్పరిస్తున్నారు. ఇన్ని వందలేళ్ళ బానిసతనంలో కూడా స్వర్ణభూమిగా మిగిలిన ఈ గడ్డను అర్ధ శతాబ్దం దాటకుండా తిని దివాలా తీయించి చిప్పపట్టుకొని ప్రపంచం పై పడ్డారు.

బయట ఎంత సిగ్గు మాలినతనంలో ఉన్నా దొరికిన దాంట్లో ఇక్కడ వాటా వస్తది గదా, దేశాన్ని నిలువున అమ్మినా చాలనంత అప్పు చేసారు. ఇవ్వాళ్ళ మన బడ్జెట్ను మనం చేయలేం. మన మాట మనం చెప్పలేం. మన బ్రతుకు మనం బ్రతకలేం. అసలు మనం ఏమిటి అనేది తోచని పరిస్థితిలోకొచ్చి కూర్చున్నాం. స్వతంత్ర్యం మనకు రాక ముందు బానిసలం. ఆ మాట మనకు తెల్సు. స్వాతంత్ర్యంలో ఇవ్వాళ్ళ నిండు బానిసలమయినాం.

మనకు చదువులేదు. చదివించండి అని ఏవరో ఇన్ని విదిలిస్తే చదివిస్తున్నాం. మనం పోరళ్ళని కంటే మనకు అప్పిచ్చేటోడికే కష్టం మవుతదని ఠక్కున ఆపరేషన్లు చేయించుకుంటున్నాం. రోడ్లెయించుకోండంటే ఏయించుకుంటున్నాం. డబ్బు ఇచ్చేటోడు ఏది చేయమంటే అది నిఖార్సుగా నిస్సుగ్గుగా చేస్తున్నాం.

ఇంతకంటే బానిసతనం ఏముంటది? ఇంతటి దిగజారుడుతనమూ ఈ సమాజం పైననే పడుతుంది గదా!

అంటే?…

మన చదువులు కాపీ…

బతుకులు కాపీ…

నడక కాపీ…

నాకుడు కాపీయే…

ఓ మంత్రి రొండందల కోట్లు సంపాదిస్తే మామూలోడు ఎదో ఒకటి చేయాలి గదా. అంచేత అతగాని అవకాశం మేరన అతను చేస్తూనే ఉన్నాడు. ఈ వ్యవస్థ ఇలా దిగజారి దిగిపోయి ఎక్కడ నిలిచిందో అర్థమయిందనుకుంటాను.”

“నువ్వు చెప్పింది ఈ కొద్ది కాలంలో జరుగుతున్నదే” అంది.

“ఏమిటి దాన్నేమిటో తికమక పెట్టిస్తున్నారు?” అంటూ శాంతమ్మ బయటకొచ్చింది.

“అదేం లేదు లేవోయ్. ప్రశ్నలు అడుగుతుంటే చెపుతున్నాను” అని ఆగి… “శ్రీనివాస్‌కు స్కూటరు కావాలా” అన్నాడు అర్ధాంతరంగా….

తల ఊపింది.

“తప్పదన్నమాట” అన్నాడు

“ఆయన అడిగాడు” అంది.

“గమనం లేనప్పుడు ఇలానే అడుగుతారు ఆఁ…”

“మీ ఆయన వస్తున్నాడా?”

“వస్తాడు.”

“అతనెదురుగానే తెల్సుకుంటానేం.”

“మీ పట్టదలల మధ్యన నేనొక దాన్నున్నానని మరచిపోయేట్టుంది మీరు” అంది విజయ నవ్వి.

“అందుకేగదా ఉగ్గపట్టడం.”

“కాకపోతే.”

“జరిగేదేదో జరిగిపోతది.”

“నేను వెళ్తానేం” అంది లేస్తూ ‘ఇది పరిష్కారమా’ అన్నట్లుగా చూసి.

తల ఊపాడు ఆలోచనల్లో పడి.

లోపలకొచ్చి శాంతమ్మతో రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయింది విజయ.

***

“నేనేమన్నాను?” అన్నాడు దీక్షితులు.

“విజయతో అలా అనవచ్చునా? మీరు అన్నది దాని మొగుణ్ణే గదా! పెళ్ళయి కాపురం చస్తున్న పిల్ల అది అన్న ధ్యాస ఉండదా మీకు? వాళ్ళకు అభిప్రాయ బేధాల చిన్న చిన్న మనస్పర్దలు ఉంటే ఉండచ్చు గాక, అయినా అందుకే చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయింది” అన్నది బాధపడుతూ శాంతమ్మ.

“భగవంతుడా? ఏమిటిది? నా కొడుకే ఉంటే అసలీ సమస్యలే లేవు గదా! స్వామీ. నీ ఆట ఆడిన మటుకు చాలు గానీ పిల్లదాని బతుకుతో ఆట ప్రారంభించకు” అని మనస్సులో నమస్కరించుకున్నారిద్దరూ ఎవరికి వారుగా.

“ఏమిటీ? ఎదో సణుగుతున్నారు?” అనాల్సిందేదో అర్థం పర్థం లేకుండా అనేసి “ఏం లేదులే” అంటుంటే కాఫీ కప్పు చేతిలో ఉంచింది. రెండు గుటకలలో అంత వేడి కాఫీనీ త్రాగి బయలుదేరాడు.

“ఎటు?” అంది

“పనుంది.”

“లేనిదెపుడు.”

“నీ ఎదురుగా కూర్చోనా?”

“బాగానే ఉంది సంబడం” అని కాఫీ కప్పు అందుకని “మాట” అంది ఆగి.

“చెప్పు” అన్నాడు వేయబోయిన అడుగు నాపి.

“పిల్ల దాని మొఖంలో కాపురాని కెళ్ళిన కళ కనిపించ లేదు. మెల్లిగా కనుక్కుందామనుకుంటే ఏదో సొద చెప్పి దాన్ని పంపించేసారు.”

“నేనా?”

“మరి నేనా?”

“సర్లే.”

“దాని మనస్సులో ఏదో ఉంది. అది మీకయితేనే చెపుతుంది” అని ఆగి

“ఇదిగో కనీసం దాని మఖాన్నయినా సంతోషం పండేలా చూడండి” అని గిరుక్కున వెనక్కి తిరిగింది శాంతమ్మ. కన్న తల్లిలా కదలిపోయి చెప్పడం కనిపించింది.

విజయ ఇందరి ప్రేమ నీకు అండగా ఉండగా ఇంకేం కావాలమ్మా అనుకుంటూ నడచాడు. గుడి దాకా వెళ్ళి స్వామికి మనసారా దండం పెట్టుకోవాలనిపించింది. పదడుగులు పట్టుమని వేశాడో లేదో “బాబయ్యా” అన్న మాట వినిపించింది.

ఆగి అటూ ఇటూ చూసాడు.

గుడిసెల రామాస్వామి వెనుకనే వస్తూ కనిపించాడు.

బాగా మారాడు మనిషి. గూడెం నుంచి టౌనుకు వెళ్ళినపుడు ఇంత దైర్యం లేదు. కాకపోతే ఆశాంతి కనిపించింది.

“బావున్నావా? ఇట్టా ఊడిపడ్డావేంది? పనులు లేవా?” అని పరామర్శించాడు.

“అదేంది బాబయ్యా ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు పెద్దోళ్ళు” అన్నాడు.

“మాటలు నేర్చాడు పర్వాలేదు” అనుకుని “ప్రస్తుతం నువ్వున్న ఊరు ఇది కాదుగా? రామస్వామీ” అన్నాడు నవ్వుతూ.

“అది నిజమే కాని బాబూ నేను పుట్టిన మట్టి ఇదేగా. చిన్నతనాన ఈడనే ఉంటిని. గోసి పికేసి కండువా కట్టిందీ ఈడనే. పంచె కట్టింది ఈడనే. నూనుగు మీసాలతో పాటు పనీ పాటూ తెల్సుకుందీ ఈడనే. అది ఉండబట్టే గదా..” అన్నాడు నవ్వుతూనే.

“అయితే పర్వాలేదు అంతా గుర్తే ఉన్నాం” అని నవ్వి, “అది సరే ఎట్టా గడుస్తుంది కాలం? అంత మంచిగా ఉన్నారు గదా?” అడిగాడు దీక్షితులు.

“కాలనికేం బాబయ్యా ఎప్పటిలానే ఉంది.”

“అంతేనంటావా?”

“కాక.”

“అట్ట అడగద్దు బాబయ్యా. గుడి అదే కదా, చావిడి అదే గదా, ముత్యాలమ్మ అదే గదా, పోయినోళ్లు పోంగ ఉన్నోళ్ళు వాళ్ళే గదా. కాకపోతే కూస్తంత బుద్దులు మారినయి” అన్నాడు నవ్వుతూ.

“దోవ కొచ్చావన్నమాట. బుద్ది కర్మానుసారిణి అన్నారు మనోళ్ళు. మన సుకృతాన్ని బట్టే బుద్ది మనకు నడిపిస్తుందట” అని “ఏ మాత్రం వెనకేసావు? పిల్లలేం చేస్తున్నారు?” అడిగాడు.

“తినే కూడుకు డోకా లేదు బాబయ్యా. ఇక పోరళ్ళంటారు ఉండేది టౌనులో గద, రెక్కలొచ్చినంక ఎవడి జాగాకు వాడెల్లిపోయినారు.”

“పోతే మానెలే, బావున్నారు గదా?”

“ఆఁ పర్లెదు నాకియ్యరు, నన్నడగరు” అన్నాడు నవ్వుతూ.

“అది సరే గాని రామస్వామి నీ పేరు ఇక్కడ గుంపుల రామస్వామి గదా, అక్కడ గుడిసల రామస్వామి అయినవన్నారు. మతలబెంటి?” అని అడిగాడు.

“మా అయ్యకు ఆవులుండేడివి. వాటికి తోడు మందను (జంగిరి) కాసెటోడు. అందుకే గుంపుల అని వాడుకయింది. ఆడ అట్ట కాదు. ఇట్టనే ఉళ్ళ నుంచి వచ్చిన వంద కుటుంబాలోళ్ళను ఎంటెసుకొని పని మొఖం చూపెటోడ్ని. మేం ఎక్కడున్నా ఏకంగా వంద గుడిసెలు ఒక్క చోట వేసెటోళ్ళం. దాంతో వాళ్లకు మేస్త్రిని గనుక గుడిసెల రామస్వామినయిన. అయితే మేముండే తరీఖా జూసి మీకు మేలు జేస్తనన్న నాయకుడకడు (నోరున్నోడు) ఒక ఆలోచన చేసిండు. మేం గుడిసెలను ఎప్పుడూ టౌనుకు దగ్గరలో వెసేటోళ్ళం గదా ఆయనేమో టౌన్లో పోరంబోకు బంజరాయి ఇంకా ఆఁవారా భూముల్ని కనిపెట్టి అక్కడ వెయించేటోడు ఆనక మాకు ఉండేటందుకు జాగా కావాలని అర్జిపెట్టించి పైరవీ చేసెటోడు. అందులో మాకు పట్టాలు రాగానే మరో చోటికి మకాం మార్పించేటోడు. పొద్దు పొడిచేటేళ్లకి టిఖాణ ఎత్తి కొత్త చోట ఎలిసేటోళ్ళం. ఇట్టా ఇప్పటికి ఏ పదయిదుసార్ల మాకు పట్టాలిచ్చింది గవర్నమెంటు. మా నాయకుడేమో దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకునేటోడు. లేకపోతే ప్లాట్లు కట్టేటోడు. అట్టా వచ్చిందాంట్లో కూడా అంతో ఇంతో మాకు ఇస్తేనే ఉంటడు. రాజకీయాలొస్తే మమ్మల్ని లారీల్లో తీస్కుపోతడు, మళ్లీ దింపుతడు. దిగంగానే పాతికిస్తడు, ముందు బువ్వ పెట్టిస్తడు. అట్ట గుడిసల రామస్వామి నయిన.”

“నువ్వు స్ధిరపడలేదా రామస్వామి?”

“అంటే నేను లచ్చాదికార్ని కాకున్నా మా నాయకుడు మాత్రం కోటీశ్వరుడు అయిండు. మంత్రి అయిండు. సినిమా హాళ్ళ గట్టుకుండు. మాకే దన్నా ఆపదొస్తే అడ్డంగ ఆప్తుడవతడు. చెయ్యి బాగానే విదిలిస్తాడు. కాకపోతే మావాళ్ళ ఎప్పటిలా గరీబులుగానే ఉన్నారు. ఎవని గీత వానిదే గదా” అని నవ్విండు.

“ఇప్పుడు ఇక్కడకి ఏం పని మీద వచ్చినవు?”

“గూడెంలో మాట ఉంది పోయస్త” అని దండం పెట్టి నడచాడు.

జమాలు కనిపించిండు ఇంక నాల్గడుగులలో.

“దండం దొర.”

“పెద్దరింట్లో జీతం మానేసిన వంట, ఎక్కడన్న కుదిరినవా?”

“ లేదు దొర పట్నం పనికి పోతున్నా.”

“పని దొరుకుతుందా?”

“ఒక్కనాడు దొరకదు. ఆ యేళ్ళ రిక్ష ఏస్త అదీ అంతంతలోనే ఉంది. దొరికిన్నాడు బాగానే ఉంటది” అన్నాడు సణుగుతూ.

“అది సరే పెద్దరి బాకీ ఏం చేసినవు?”

“చెలకపెయ్యను అమ్మి కట్టిన.”

“అరణం వచ్చిందాన్నా.”

“ఆఁ”

“నీ పెళ్ళాం వప్పుకుందా?”

“ఆఁ”

“నువ్వు రెండు నెలల నుంచి కూలికి పోతన్నవట గదా.”

“పోయిన కానీ ఇరవై దీనాలు కూలి దొరక్కపోయే. బాగానే రోజుకు పాతిక రూపాయలు మిగిలితాయి. కాకపోతే కొన్ని రోజులు బందులు, కొన్ని శెలవలు.”

నక్సలైట్ల నేడనో పోలీసోళ్ళు చంపినారని ఒకనాడు. పోలీసు వాళ్ళను వారు చంపినారని ఒకనాడు. ఒక రిక్షా వానికి న్యాయం జరగలేదని ఒకనాడు. మాకు కూలి చాలడంలేదని ఒకనాడు. సారా బందు చేయాలని ఒకనాడు.

సారా త్రాగాలని ఒకనాడు. పెద్ద షావుకారు పోయి ఒకనాడు. సాయిబుల సమాధి నాక్రమించుకున్నారని ఒకనాడు. అది న్యాయమేనని ఒకనాడు. లాకప్పులో ఒకడు చచ్చాడని ఒకనాడు. మంత్రిగారికి మర్యాదలు జలగలేదని దానికి జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పాలని ఒకనాడు… ఇవి గాక రాస్తారోకోలు, ఊరేగింపులు సభలు… ఇట్ల ఎన్నని చెప్పేది.

ఈ బందుల మధ్యన జనం నలిగి చస్తున్నారు. రోజు బత్తం గాళ్ళు ఎందరో పస్తులుంటారు. నా బోటోళ్ళకు ఈ బందుల మూలానా బస్సు చార్జీలకీ కూలంత సరిపోతది. దుబార అవుతది. అయిన నాకు తెలీక అడుగుతా దొరా ప్రభుత్వానికి నిరసన తెలిపెటుదుంకు ఈ తరీఖ తప్ప మరొకటి లేదా? ఇట్టా చేసి అనేక మంది నోటికాడి కూడు దీసెన్తనే సరింగ తెల్సినట్టయితదా. అసలు దీని మతలబెంది. ఇదంతా అడవి లాగాని పిచ్చి పని మాట వదిలి రిక్షాలంట పడ్డా.

ఈ రిక్షాలకు అడ్డలున్నయి. ఆడరోజు కింత గట్టాల. రిక్షాకు కిరాయిగట్టాల. పోలీసోళ్ళకు అంతో ఇంతో ఇయ్యాలి. యూనియన్‌కి ఇయ్యాలి. ఇట్లా చెప్పుకుంట పోతే కొండ వీటి చాందాడంత అవుతది. పైంగ ఇది బొత్తిగ కూటికి గుడ్డకి అక్కరకచ్చదేది కూడ కాదు.”

“అయితే ఏం చేస్తవు మరి?”

“మళ్ళీ ఏదన్న కమతంలో జేరడమే బాగుంటదనుకుంటున్న.”

నవ్విండు దీక్షితులు.

“నవ్వుతావేం దొరా?” అన్నాడు జమాలు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here