ముద్రారాక్షసమ్ – పఞ్చమాఙ్కః – 3

0
4

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

సిద్ధార్థ:

ణిసా మేదు కుమారో, అహు ఖు అమచ్చ రక్ఖసేణ ఇమం లేహం దేఇ అ చందఉఉత్తసఆసం వేసిదో. (నిశా మయతు కుమారః। అహం ఖల్వమాత్య రాక్షసే నేమం లేఖం దత్వా చన్ద్రగుప్త సకాశం ప్రేషితః).

అర్థం:    

కుమారః+నిశామయతు=రాకుమారుడు విందురు. అహం+ఖలు=నేనైతే, అమాత్యరాక్షసేన=రాక్షసమంత్రి చేత, ఇమం+లేఖం+దత్వా=ఈ ఉత్తరాన్ని ఇచ్చి, చన్ద్రగుప్త+సకాశం=చంద్రగుప్తుని సన్నిధికి, ప్రేషితః=పంపబడ్డాను.

మలయ:

వాచిక మిదానీం శ్రోతుమిచ్ఛామి.

అర్థం:   

ఇదానీం=ఇప్పుడు (ఇక), వాచికం=నువ్వు ముఖతః చెప్పవలసిన దానిని,  శ్రోతుం+ఇచ్ఛామి=వినాలనుకుంటున్నాను.

సిద్ధార్థ:

కుమాల, ఆదిట్ఠోహ్మి అమచ్చేణ టహా ఏదే మహా వఅస్సా పంచరాఅణో తుఏ సహ వముప్పణ్ణసిణేహా (పా. సంధాణా)। తే జహా కులూదాహివో చిత్తవమ్మో మలయణరాహివో సింహణాదోత్తి। కహ్మీర దేసణాదో పుక్ఖరక్ఖో సింధురాఓ సింధుసేణో, పారసీఓ మేహణాదోత్తి, ఏదేసు పుడమగిహీదా తిణ్ణి రాఆశో మలఅ కేడుతో విసఅం ఇచ్చంతి. అవరే హ త్తిబం కోసం అ। తా జహ చాణక్కం ణిరాకరిఅ మహాభాఏణ మహ పీదీ సముప్పాది దా తహా ఏదాణఇ పి పుడమభణిదో అత్థో సంపాదఇదవ్యోత్తి। – ఎత్తిఓ వాఆ సం దేసో।

(కుమార, ఆదిష్టో స్మ్యమా త్యేన యథైతే మమ వయస్యా పఞ్చ రాజాన స్త్వయా సహ సముత్పన్న స్నేహాః, తే యథాకులూతాధిప శ్చిత్రవర్మా, మలయన రాధిపః సింహనాదః కాశ్మీర దేవనాథః పుష్కరాక్షః, సిన్ధురాజః సిన్ధు సేనః పారసీకో మేఘనాధ ఇతి। ఏతేషు ప్రథమగృహీతా స్త్రయో రాజానో మలయ కేతో ర్విషయ మిచ్ఛ న్త్యపరౌ హస్తిబలం కోశం చ। త ద్యథా చాణక్యం నిరాకృత్య మహాభాగేన మమ ప్రీతిః సముత్పాదితా, తథై తేషామపి ప్రథమభణితో ఽర్థః సంపాదయితవ్య ఇత్యేతావాన్ వాక్యసన్దేశః।)

అర్థం:  

కుమార=రాకుమారా, అమాత్యేన+ఆదిష్టః+అస్మి=మంత్రి చేత (ఇలాగ) ఆదేశించబడ్డాను. యథా=ఏ విధంగా అంటే, “ఏతే+మమ+వయస్యాః+పఞ్చరాజానః=ఈ నా స్నేహితులైన అయిదుమంది రాజులు, త్వయా+సహ=నీతో పాటు, సముత్పన్న+స్నేహాః=స్నేహం పాటిస్తున్నారు – తే+యథా=వారు ఎవరంటే, కులూతాధిపః+చిత్రవర్మా=కులూత దేశపాలకుడు చిత్రవర్మ, మలయ+నరాధిపః+సింహనాదః=మలయ దేశపు రాజు సింహనాదుడు, కాశ్మీర+దేవనాథః+పుష్కరాక్షః=కాశ్మీర దేశాధిపతి పుష్కరాక్షుడు, సిన్ధురాజః+సిన్ధుసేనః=సింధురాజు సింధుసేనుడు, పారసీకః+మేఘనాధః+ఇతి=పారశీక దేశాధిపతి మేఘనాధుడూనూ. ఏతేషు=వీరిలో, ప్రథమగృహీతాః+త్రయః+రాజానః=తొలి  ముగ్గురు రాజులు, మలయకేతోః+ విషయం=మలయకేతుని దేశాన్ని (రాజ్యాన్ని), ఇచ్ఛన్తి=కోరుకుంటున్నరు. అపరౌ=చివరి ఇద్దరు, హస్తిబలం+కోశం+చ=ఏనుగు బలాన్ని, ధనాగారాన్ని (కోరుకుంటున్నారు). తత్+యథా+చాణక్యం+నిరాకృత్య=అందుమూలంగా చాణక్యుణ్ణి వ్యతిరేకించి, మహాభాగేన=ప్రభువు (చేత), మమ+ప్రీతిః+సముత్పాదితా=నాకు సంతోషం కలిగించారు (కలిగింపబడింది). తథా+ఏతేషాం+అపి=వీరి విషయంలో కూడా, ప్రథమభణితః+అర్థః=తొలుత అనుకొన్న వీరి కోరిక, సంపాదయితవ్యః+ఇతి=నెరవేర్చదగినదని – ఏతావాన్=ఇంతవరకు, వాక్యసన్దేశః=నోటిమాటగా చెప్పమన్న సందేశం.

మలయ:

కథం! చిత్రవర్మాదయో ఽపి మహ్య మభిద్రుహ్యన్తి। అథవాఽత ఏవ రాక్షసే నిరతిశయా ప్రీతిః. (ప్రకాశమ్) విజయే, రాక్షసం ద్రష్టు మిచ్ఛామి

అర్థం:   

కథం=ఎలాగా! చిత్రవర్మ+ఆదయ+అపి=చిత్రవర్మ మొదలైనవారు కూడా, మహ్యం=నాకు, అభిద్రుహ్యన్తి=ద్రోహం చేస్తున్నారన్న మాట. అథ+వా=లేదంటే, అతః+ఏవ=ఆ కారణం చేతనే, రాక్షసే=రాక్షసుడి విషయంలో, నిరతిశయా+ప్రీతిః=సాటి లేని ఇష్టం! (ఇష్టానికి కారణం అదే). (ప్రకాశమ్=పైకి) విజయా=(ప్రతీహారీ) విజయా, రాక్షసం+ద్రష్టుం+ఇచ్ఛామి=రాక్షసుణ్ణి చూడాలనుకుంటున్నాను.

ప్రతీ:

జం కుమార ఆణవేది. (యత్ కుమార ఆజ్ఞాపయతి.)

(ఇతి నిష్క్రాన్తాః)

అర్థం: 

కుమారః+యత్+ఆజ్ఞాపయతి=రాకుమారుడు ఆజ్ఞాపించినట్టే (చేస్తాను). – (ఇతి=అని, నిష్క్రాన్తాః=వెళ్ళింది).

(తతః ప్రవిశతి ఆసనస్థః స్వభవనగతః పురుషేణ సహ సచిన్తో రాక్షసః)

(తతః=పిమ్మట, స్వ+భవనగతః+పురుషేణ+సహ=తన ఇంటికి వచ్చిన వ్యక్తితో కూడ, ఆసనస్థః=పీఠంపై కూర్చొని ఉన్న, సచిన్తః+రాక్షసః=ఆలోచన దశలో ఉన్న రాక్షసుడు,  ప్రవిశతి=ప్రవేశించాడు.)

రాక్షసః:

(ఆత్మగతమ్) పూర్ణ మస్మద్భలం చన్ద్రగుప్త బలై రితి యత్సత్యం నమే మనసః పరిశుద్ధి రస్తి; కుతః –

అర్థం:

(ఆత్మగతమ్=తనలో), అస్మత్+బలం=మా పక్షం, చన్ద్రగుప్త+బలైః=చంద్రగుప్త పక్షంవారితో,  పూర్ణం=నిండి ఉన్నదనే, యత్+సత్యం=ఏ యథార్థమైతే ఉన్నదో (అది), మే+మనసః=నా మనస్సుకు, పరిశుద్ధి+న+అస్తి=నమ్మకం కలగడం లేదు; కుతః=ఎందుకంటే –

శ్లోకం:

సాధ్యే నిశ్చిత మన్వయేన ఘటితం,

బిభ్రత్సపక్షే స్థితిం,

వ్యావృత్తం చ వివక్షతో భవతి యత్

త త్సాధనం సిద్ధయే.

యత్ సాధ్యం స్వయ మేవ, తుల్య ముభయోః,

పక్షే విరుద్ధం చ యత్,

త స్యాఙ్గీకరణేన వాదిన ఇవ స్యాత్

స్వామినో నిగ్రహః. (10)

అర్థం:

యత్+సాధ్యే(విషయే)=సాధింపదగిన ఏ విషయంలో, నిశ్చితమ్=నిస్సందేహంగా ఉంటుందో, అన్వయేన=ఒకటి ఉంటే మరొకటి కూడా ఉంటుంది అనే పరస్పర సంబంధంతో, ఘటితమ్=చేర్చడం జరుగుతుందో -, సపక్షే=సమానమయే, స్థితిం=ఉండడాన్ని, బిభ్రత్=వహిస్తూ – వివక్షతః=అది లేనిదే మరొకటి లేదు అనే పక్షంలో, వ్యావృత్తం+చ=తొలగిందో (తిరిగిపోయిందో), తత్+సాధనం=ఆ సాధనం, సిద్ధయే+భవతి=నెరవేరినది అవుతుంది. యత్ (సాధనమ్)= ఏ సాధనం, స్వయం+ఏవ=తనకై తాను, సాధ్యం=సంపాదించదగినది కాగలదో, ఉభయోః=స్వపక్ష, పరపక్షాలు రెండింటికి, తుల్యం=సరిసమానమో, తస్య=దానికి సంబంధించి, స్యాఙ్గీకరణేన=ఒప్పుకోలు ద్వారా – వాదినః+ఇవ=వాదికి మాదిరి, స్వామినః=ప్రభువుకు, నిగ్రహః=ఓటమి, స్యాత్=కాగలదు.

వృత్తం:

శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు.

అలంకారం:

ఉపమ. వాదినః ఇవ స్వామినః నిగ్రహః స్యాత్ అని పోలిక చెప్పడం కారణం.

వ్యాఖ్య:

ఈ శ్లోకార్థం తర్క పరిభాషతో నిండి ఉంది. ఇక్కడ ‘సాధనం’, ‘సాధ్యం’ – అనే రెండంశాలున్నాయి. రాక్షసమంత్రి సేనాపరంగా చెప్పాలంటే – తన సైన్యం తన పట్ల నిలకడ బుద్ధితో – తన మిత్రులందరి సాయంతో – తన పని జరిగితీరాలనే పట్టుదలతో – తన వ్యతిరేకులకు లోనుగాకుండా ఉంటే – జయం నిశ్చయం. అలాగ కాకుండా తన సైన్యం శత్రుపక్షానికి కూడా అనుకూలంగానూ, స్వపక్షానికి ప్రతికూలంగానూ నడుచుకునే పరిస్థితి ఏర్పడితే, పరాజయం తప్పదు.

ఇక్కడ తర్క పరిభాష ఏమంటే –

కారణం – కార్యం అనే రెండు అంశాలలో కారణం అనేది, కార్యానికి అనుకూలంగా ఉండాలి. నేరుగా, సంపూర్ణ సంబంధం కలిగి ఉండాలి. అంతే కాదు; తనకు అనుకూల సందర్భాలతో కలిసిరావాలి. నిర్ణయం చేయటంలో పట్టుదలతో ఉండాలి. వేరే దానికి అది చెందరాదు. అలా జరగని పక్షంలో – తానే నిర్ణయింపబడవలసినదైతేనూ, – అలా నిర్ణయింపబడవలసిన దానికీ, దాని వ్యతిరేకానికీ కలగలిసి కుదిరినట్లయితేనూ – అసలు ఏది నిర్ణయింపబడవలసి ఉందో దానికి సంబంధించకపోతేనూ, – కావలసిన నిర్ణయం కాజాలదు.

అథవా, విజ్ఞాతాపరాగ హేతుభిః ప్రాక్పరిగృహీతోఽ పజా పై రాపూర్ణమితి న వికల్పయితు మర్హతి। (ప్రకాశమ్) భద్ర ప్రియంవదక। ఉచ్యన్తా మస్న ద్వచనాత్ కుమారానుయాయినో రాజానః। సంప్రతి దినే దినే ప్రత్యాసీదతి కుసుమపురమ్। తత్ పరికల్పిత విభాగై ర్భవద్భిః ప్రయాణే ప్రయాతవ్యమ్। కథ మితి।

అథవా=అలా కాదు కద!, విజ్ఞాత+అపరాగ+హేతుభిః=వెల్లడైన విరోధ కారణలతో (చంద్రగుప్తుని పట్ల), ప్రాక్+పరిగృహీతః+అపజాపైః=తొలుతగా స్వీకరింపబడిన ఆశలు గలవారితో, ఆపూర్ణం+ఇతి=నిండి ఉన్నది (మన పక్షం), (ఆ విషయంలో) వికల్పయితుం+న+అర్హతి=మరొకలాగు నేను భయపడనవసరం లేదు. (ప్రకాశమ్=పైకి), భద్ర+ప్రియంవదక=నాయనా, ప్రియంవదకా! కుమార+అనుయాయినః+రాజానః=చంద్రకేతువు పట్ల అనుకూలురైన రాజులతో (రాజులు), అస్మత్+వచనాత్=నా మాటగా, ఉచ్యన్తాం=చెప్పు (చెప్పబడుగాక). సంప్రతి=ప్రస్తుతం, దినే+దినే=ఒకనాటి ఒకనాడు, కుసుమపురమ్+ప్రత్యాసీదతి=పాటలీపుత్రం దగ్గరపడుతోంది. తత్=ఆ కారణంగా, భవద్భిః=మీరు (మీ చేత), పరికల్పిత+విభాగైః=వివిధ విభాగాలుగా ఏర్పాటు చేసుకొని, ప్రయాణే+ప్రయాతవ్యమ్=యాత్రకు సిద్ధం కావలసి ఉన్నది (యాత్రలో పాల్గొనవలె గాక)- కథం+ఇతి=ఎందువల్లనంటే –

శ్లోకం:

ప్రస్థాతవ్యం పురస్తాత్ ఖశమగధగణై

ర్మా మనువ్యూహ్య సైన్యై;

ర్గాన్ధారై ర్మధ్యయానే సయవనపతిభిః

సంవిధేయః ప్రయత్నః,

పశ్చాత్తిష్ఠన్తు వీరా శకనరపతయః

సంభృతా శ్చీణహూణైః,

కౌలూతాద్యశ్చ శిష్టః పథి పథి వృణుయా

ద్రాజలోకః కుమారమ్. (11)

అర్థం:

పురస్తాత్=ముందరగా (సేనాగ్రంలో), ఖశమగధగణై=ఖశ, మగధ సేనలతో, మాం+అనువ్యూహ్య=నా వెంటనంటి నిండుగా, ప్రస్థాతవ్యం=నడవవలసి ఉంటుంది. మధ్య+యానే=ప్రయాణం మధ్యలో, గాన్ధారైః+స+యవనపతిభిః=యవనరాజులు, గాంధార రాజులతో, ప్రయత్నః+సంవిధేయః=ప్రయత్నం (ప్రయాణ సన్నాహాలు) చేయవలసి ఉంటుంది,

పశ్చాత్=వెనుకగా (సైన్యం వెనుక భాగాన), వీరాః+శక+యవనరపతయః=వీరులైన శక రాజులు, యవనుల ప్రభువులు, చీణ+హూణైః=చీనులతోనూ, హుణులతో, సంభృతాః=నిండుకొన్నవారై, తిష్ఠన్తు=ఉండాలి. శిష్టః కౌలూతాద్యః+చ=మిగిలిన కులూత చిత్రవర్మా మొదలైన, రాజలోకః=రాజసమూహం, పథి+పథి=ప్రయాణపు అన్ని దారుల్లోనూ, కుమారమ్+వృణుయాత్=చంద్రకేతు కుమారుణ్ణి అనుసరించి రావాలి.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

వ్యాఖ్య:

రాక్షసమమంత్రి తమ పక్షాన అనుకూలురైన రాజులు పాటలీపుత్రం ఆక్రమణకు ఏ క్రమంలో ప్రయాణించాలో నిర్ణయిస్తున్నాడు. సేనాగ్రంలో ఖశ, మగధ గణాలు, సేన మధ్యలో యవనులు, గాంధారులు, సేన వెనుక భాగంలో శకులు, చీనులు, హుణులూ నడవాలి. మిగిలిన కులూత రాజాదులు చంద్రకేతువు వెంట ఉండాలి. సేనాగ్రంలో తానే నడుస్తానని సూచించాడు. ఈ యుద్ధానికంతకూ మూలమైన చంద్రకేతుణ్ణి చుట్టూ క్రమ్ముకొని కులుతాది నరపతులు రక్షించాలని కట్టడి చేశాడు.

ప్రియం:

తథా. (ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

తథా=అలాగే, (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

ప్రతీ:

(ప్రవిశ్య) జేదు అమచ్చో. అమచ్చ ఇచ్ఛది తుమం కుమారో పేక్ఖిదుం. (జయ త్వమాత్య , అమాత్య ఇచ్ఛతి త్వాం కుమారః ప్రేక్షితుమ్.)

అర్థం:

(ప్రవిశ్య=ప్రవేశించి), జయతు+అమాత్య=మంత్రిగారికి జయమగు గాక! అమాత్య=మంత్రివర్యా, కుమారః=మలయకేతు రాకుమారుడు, త్వాం+ప్రేక్షితుమ్+ఇచ్ఛతి=తమను చూడాలనుకుంటున్నాడు.)

రాక్షసః:

భద్రే, ముహూర్తం తిష్ఠ. కః కో ఽత్ర భోః?

అర్థం:

భద్రే=అమ్మా, ముహూర్తం+తిష్ఠ=ఒక్క క్షణం ఉండు. కః+కః+అత్ర+భోః=ఎవరయ్యా అక్కడ?

పురుష:

(ప్రవిశ్య) ఆణ వేదు అమచ్చో. (ఆజ్ఞాపయ త్వమాత్యః.)

అర్థం:

(ప్రవిశ్య=ప్రవేశించి), అమాత్యః=మంత్రిగారు, ఆజ్ఞాపయతు=ఆజ్ఞాపింతురు గాక!

రాక్షసః:

ఉచ్యతాం శకటదాసః యథా – పరిధాపితా కుమారే ణాభరణాని వయమ్. తన్న యుక్త మనలఙ్కృతైః కుమారదర్శన మనుభవితుమ్. అతో యత్త దలఙ్కరణత్రయం క్రీతం తన్మధ్యా దేకం దీయతా మితి.

అర్థం:

శకటదాసః+ఉచ్యతాం=శకటదాసుకి (ఇలా) చెప్పు (చెప్పబడుగాక!), యథా=ఏమనంటే – కుమారేణ=మలయకేతు రాకుమారుని చేత, వయమ్=మేము, ఆభరణాని+పరిధాపితా=నగలను (చే) ధరింపబడ్డాను (రాకుమారుడు నగలను నా చేత ధరింపజేశాడు). తత్=అందువల్ల, అనలఙ్కృతైః (ఆభరణైః)=ఆ నగలు ధరించకుండా, కుమారదర్శనమ్+అనుభవితుమ్=రాజకుమారుని దర్శనం చేయడం, న+యుక్తం=తగదు. తతః=ఆ కారణంగా, యత్+తత్+అలఙ్కరణత్రయం+క్రీతం=ఏ మూడునగలైతే తీసుకొనడం జరిగిందో, తన్మధ్యాత్=వాటి నుంచి, ఏకం+దీయతాం+ఇతి=ఒకటి ఇవ్వబడుగాక – అని (వాటి నుంచి ఒక నగనివ్వు – అని).

పురుష:

తథా. (ఇతి నిష్క్రమ్య పునః ప్రవిశ్య) అమచ్చ, ఇదం ఆహరణం. (అమాత్య, ఇద మాభరణమ్.)

అర్థం:

తథా=అలాగే, (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పునః+ప్రవిశ్య=మళ్ళీ వచ్చి) అమాత్య=మంత్రివర్యా, ఇదం+ఆభరణమ్=ఇదిగో నగ.

రాక్షసః:

(నాట్యేనాత్మాన మలఙ్కృత్య, ఉత్థాయ చ) భద్రే. రాజోపగామినం మార్గ మాదేశయ.

అర్థం:

(నాట్యేన+ఆత్మానమ్+అలఙ్కృత్య=తన్ను అలంకరించుకోవడాన్ని ప్రదర్శించి, ఉత్థాయ+చ=పీఠం నుంచి లేచిన్నీ) భద్రే=అమ్మా, రాజ+ఉపగామినం+మార్గం=రాజు వద్దకు వెళ్ళేదారిని, ఆదేశయ=చూపించు.

ప్రతీ:

ఏదు అమచ్చో. (ఏత్వమాత్యః)

అర్థం:

అమాత్యః+ఏతు=మంత్రివారు దయ చేయండి (దయచేతురు గాక)

రాక్షసః:

(ఆత్మగతమ్) అధికారపదం నామ నిర్దోష స్యాపి పురుషస్య మహదాశఙ్కాస్థానమ్। కుతః…

అర్థం:

(ఆత్మగతమ్=తనలో), అధికారపదం+నామ=అధికారి పదవి అంటేనే, నిర్దోషస్య+పురుషస్య+అపి=తప్పు లేని వ్యక్తి విషయంలో కూడా, మహత్+ఆశఙ్కా+స్థానమ్=గొప్ప అనుమానాలకు తగిన స్థితి, కుతః=ఎలాగునంటే –

శ్లోకం:

భయం తావత్ సేవ్యా

దభినివిశతే సేవక జనం,

తతః ప్రత్యాసన్నా

ద్భవతి హృదయే చైవ నిహితమ్,

తతో ఽధ్యారూఢానాం

పద మనుజన ద్వేష జననమ్,

గతిః సోచాయాణాం

పతన మనుకూలం కలయతి. (12)

అర్థం:

సేవ్యాత్=సేవించవలసిన పాలకుని నుంచి, భయం+తావత్=భయమైతే, సేవకజనం+అభినివిశతే=సేవచేసే వారందరినీ గట్టిగా పట్టుకొంటుంది. తతః=ఆ మీదట, ప్రత్యాసన్నాత్+చ=పాలకుడికి దగ్గరగా మసలేవాడి నుంచి కూడా (భయం=భయం తప్పదు), హృదయే+చ+ఏవ+నిహితమ్+భవతి=గుండె లోనే కూర్చుంటుంది. తతః=ఇంకా ఆపైన, అధ్యారూఢానాం+పదం=బాగా పెద్ద పదవికి ఎక్కినవాడి స్థితి, అనుజన+ద్వేష+జననమ్ (భవతి)=తోటి మనుషులకు ద్వేషం పుట్టించేదవుతుంది, స+ఉచ్ఛయాణాం=ఉన్నత స్థానంలో ఉన్నవారి, గతిః=పరిస్థితి, పతనం+అనుకూలం=పడిపోవడానికి వీలుగా, కలయతి=తలుస్తూంటుంది.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

అర్థాంతరన్యాసం. (ఉక్తి రర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలాయనందం).

ఇక్కడ ప్రస్తుతం ఉన్నత పదవిలో ఉన్న రాక్షసమంత్రి అవస్థను, సాధారణంగా రాజాధికారుల అవస్థతో ముడిపెట్టి చెప్పడం కారణం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here