[dropcap]అ[/dropcap]ది ఒక బస్సు డిపో… ఒక్కో బస్సుని తనిఖీ చేసి ఒకే రిపోర్టు ఇచ్చాక డ్రైవరు బస్సుని కాంప్లెక్స్‌లో నిలుపుతున్నాడు.
ఇంతలో సూపర్‌వైజర్ సూర్యారావు డిపోలోకి వచ్చి డిపో మేనేజరుతో “సార్ ఈరోజు ఉదయం 6 గంటలకు అరకు వెళ్లాల్సిన 9797 బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది. 7 గంటల బస్సు ఇంకా విశాఖపట్నం నుంచి రాలేదు. అక్కడ సమ్మె జరుగుతోంది. ఎప్పటికొస్తుందో తెలియదు. ఇప్పుడు సమయం 10 అయ్యింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చెయ్యకపోతే ప్రయాణీకులు ఇబ్బంది పడతారు సర్.” అన్నాడు.
“సరే ఇప్పుడేమి చేద్దాం?”
“అదిగో ఆ మూలని ఉన్న 6969 బస్సుని పంపండి” అన్నాడు సూపర్‌వైజర్.
“ఈ బస్సు కండిషన్ ఎలా ఉందో చూడండి..” అన్నాడు డిపో మేనేజర్.
మేనేజర్ మాటలు వినేసరికి వెన్నులో వణుకు పుట్టింది 6969 బస్సుకి.
‘వీళ్ళు మనుషులా మానులా అర్ధం కావడం లేదు. నాకు నడిచే ఓపిక లేదు. టైర్లు, బ్రేకులు అరిగిపోయాయి. అయినా వీళ్ళ మూర్ఖత్వం కాకపొతే నన్ను పంపడమేమిటి? అది కూడా ఘాట్ రోడ్డులో ప్రయాణం. నా వల్ల కాదు. నేను వెళ్లను కాక వెళ్లను. అయినా నా మాటలు ఎవరూ విన్పించుకోవడం లేదే.. అదేంటి బలవంతంగా తీసుకెళుతున్నారు. నా శరీరం సహకరించదు అంటున్నా వినిపించుకోరేం’ అని తనలో తాను బాధపడింది 6969 నెంబరుగల బస్సు.
“సర్ టైర్లు బాగున్నాయి. ఇంజిన్ కండిషన్‌లో ఉంది. బ్రేకులు పరవాలేదు. మన రాంబాబు ఘాటీ కింగ్. వాడిని పంపండి, బండిని బాగా తోలగలడు” అన్నాడు సూపర్‌వైజర్.
‘నీ బొందేం కాదు.. నిన్ను తగలెయ్య.. నీకు పిండాకూడు పెట్ట. జనాలని మోసి మోసి నడిచే ఓపిక నాకు లేక, తుక్కుగా అమ్మే ధైర్యం మీకు లేక ఈ మూలన పడి ఉన్నానురా… ఇప్పుడు ఉన్న ఫళంగా రెండు బస్సుల జనాలని నేను మోసుకెళ్లాలా? ఎంత దుర్మార్గుడివి. ఇదేంటి వద్దంటున్నా వినకుండా కాంప్లెక్స్‌లో నిలబెట్టారు. ఇక నా పని ఇంతే! ఎన్ని అనుకుని ఏమి లాభం? వీళ్ళు మారరు’ అని ఏడ్చింది 6969 బస్సు.
కాంప్లెక్‌లోకి బస్సు రాగానే అరకు వెళ్లాల్సిన ప్రయాణీకులందరూ సీట్ల కోసం తోసుకుంటూ తోసుకుంటూ బస్సులోకి ఎక్కారు. కొంతసేపటి తర్వాత డ్రైవరు రాంబాబు వచ్చి బస్సును తీసాడు.
6969 నెంబరుగల బస్సు అరకు వైపు కిక్కిరిసిన జనాలతో నెమ్మదిగా నడుస్తోంది. బౌడారా దాటిన దగ్గర నుంచి పచ్చని చెట్లతో కొండ అంచున మలుపులతో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రయాణీకుల మనసుని కట్టిపడేస్తుంది. భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. అన్నిటి కంటే ఘాట్ రోడ్డులో ప్రయాణమే ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. కాశీ పట్నం, జంగిల్ బెల్స్, డముకు వ్యూ పాయింట్, అనంతగిరి కాఫీతోటలు, గాలికొండ, బొర్రా గుహలు, అరకు లోయ, చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికి ఆనందాన్ని వినోదాన్ని పంచుతాయి. వ్యూపాయింట్ చేరుకునేసరికి పిల్లలు పెద్దలు అరుపులు కేరింతలతో బస్సు మారుమ్రోగిపోతోంది..
‘పిల్లల కేరింతలకు, పర్యాటకుల అనుభూతులకు మురిసిపోతూ తాను ఏదో విధంగా వీళ్ళందరినీ క్షేమంగా గమ్యస్థానానికి చేర్చేస్తే చాలు, నేను కాలు చెయ్యి పడిపోయినట్లుగా నటించి అరకులోనే ఉండిపోతాను. తిరిగి కిందికి రాలేను. ఈ ప్రమాదకరమైన మలుపుల్లో ప్రయాణించి వీళ్ళ జీవితాలతో ఆడుకోలేను’ అనుకుంది బస్సు.
చాలా ఎత్తైన పర్వతము మీద ప్రయాణం, పరిమితికి మించి ప్రయాణీకుల భారం, ఎన్నో ఎత్తైన ప్రమాదకరమైన మలుపు (హెయిర్ పిన్ బెండ్)లను దాటుకుని వచ్చింది…. ఇంతలో అరకునుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బ్రేకు విఫలం కావడంతో లోయలో పడిపోయింది.. సహాయక చర్యలు చేపట్టినా ఏ ఒక్కరూ బతికి బట్టకట్టలేదు..
***
మర్నాడు..
అనేక వార్తా చానళ్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ అంటూ పదేపదే చూపించారు.
“బస్సు కండిషన్ లొనే ఉంది” డిపో మేనేజర్.
“డ్రైవర్ చాలా అనుభవజ్ఞుడు” ఉద్యోగులు.
“పరిమితికి మించి ప్రయాణీకులు ఉండబట్టే ప్రమాదం జరిగింది” ప్రజా సంఘాలు.
“ఒక్కో కుటుంబానికి 5 లక్షలు పరిహారంగా ఇస్తాం” ప్రజా ప్రతినిధులు.
బస్సు తునాతునకలై లోయ లోంచి దీనంగా అరుస్తోంది…
‘మనిషి అయినా యంత్రమైనా పనిచేసే సామర్ధ్యం కొంతవరకే ఉంటుంది. మనసుపెట్టి ఆలోచించండి. కళ్ళు తెరవండి..’ అని..
వినిపించేదెవరికి???.