భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 2: శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్ధానం, గంగాపురం

0
3

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 2” వ్యాసంలో గంగాపురం లోని “శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్ధానం” గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

హైద్రాబాద్ – కర్నూలు`మార్గంలోవున్న జడ్చర్ల మీదనుంచి మీలో చాలామంది చాలాసార్లు తిరిగి వుంటారు. ఆ జడ్చర్ల కి కేవలం 6 కి.మీ. ల దూరంలో పురాణంలో పేర్కొనబడిన ఆలయం ఒకటి వుందని తెలుసా మీకు. అంత పురాతనమైన ఈ ఆలయం మధ్యలో శిధిలావస్థ చెందింది. ప్రస్తుతం వున్న ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మింపబడింది అంటారు.

ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని చంద్రవంశీయుడైన పుణ్యశీల మహరాజు పరిపాలిస్తూండేవాడు. ఆయనకి నలుగురు కుమారులు. ఒక రోజు చెన్నకేశవస్వామి పుణ్యశీల మహారాజు కలలో కనబడి తాను అంతకు పూర్వం గంగాపురంలోనే వుండేవాడిననీ, కారణాంతరాలవల్ల గండకాద్రి వెళ్ళి అక్కడే వుండిపోయాననీ, మరల తనని తీసుకువచ్చి గంగాపురంలోనే ప్రతిష్ఠించమని ఆనతినిచ్చాడు.

ఆ రాజు అతి సంతోషంతో అత్యంత శీఘ్రంగా స్వామిని తన రాజ్యంలో ప్రతిష్ఠించాలని, తన నలుగురు కుమారులనూ పిలిచి, ఒకరికి గండకాద్రి నుంచి స్వామిని తీసుకువచ్చే బాధ్యత, ఒకరికి సత్వరమే ఆలయ నిర్మాణం గావించే బాధ్యత, ఒకరికి ఆలయ ప్రాకారమూ, గోపురాలూ నిర్మించే బాధ్యత, ఇంకొకరికి మిగతా పనులు అప్పజెప్పాడు. వారందరూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి, అద్భుతమైన ఆలయం నిర్మించి అందులో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠించి పూజలు చేయసాగారు.

        

అత్యంత శోభాయమానంగా, అత్యద్భుతమైన శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయ వైభవం గురించి విన్న మహమ్మద్ ఘోరీ దండయాత్ర చేసి ఇక్కడి శిల్ప సంపదని నాశనం చేశాడు. అయినా ఇప్పటికీ ఈ ఆలయాన్ని దర్శించినవారు వెయ్యి సంవత్సరాల క్రింతం నిర్మింపబడిన ఈ ఆలయాన్ని ప్రశంసించకుండా వుండలేరు.

దిన దిన ప్రవర్ధమానమవుతున్న ఈ ఆలయంలో వున్న కళ్యాణ మండపంలో వివాహాలు జరుగుతాయి.

మార్గము

హైదరాబాదునుంచి కర్నూలు వెళ్ళే జాతీయ రహదారి ఎన్.హెచ్. 7 మీదుగా జడ్చర్ల నుండి 6 కి.మీ. ల దూరంలో, కల్వకుర్తి వెళ్ళే మార్గంలో వున్నది.

దర్శన సమయం

ఉదయం 6 గం. లనుంచీ రాత్రి 8 గం. ల దాకా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here