[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]నే[/dropcap]ను కిరణ్ ప్రభ, కాంతిగారి ఇల్లు వదిలి వచ్చేముందు వారింట్లో మెట్ల మీద కూర్చుని చిట్టెన్‌రాజు గారు నన్ను పిలవడం దగ్గర నుంచి వంగూరి సదస్సు విశేషాలన్నీ కూడా ఒక వ్యాసంగా రాసాను. తమాషాగా అనిపించి చదువుతున్నప్పుడు నవ్వొస్తోంది అని కాంతి గారు “ప్రతీ నెలా రాయకూడదు ఒక కాలమ్‌గా?” అని అడిగారు. సరే, ఆ పేరే పెడదాం – ‘కాలమ్ దాటని కబుర్లు’ – అని నేను చెప్పాను. అలా వాళ్ళ మేడ మెట్ల మీద కూర్చుని నేను సరదాగా మొదలుపెట్టిన సాహితీసదస్సు అనే కాలమ్‌తో 2008లో ప్రారంభమైన ‘కాలమ్ దాటని కబుర్లు’ ఇప్పటిదాక 12 సంవత్సరాలుగా ఒక్క నెల కూడా గడువు తప్పకుండా, ప్రతీ నెలా ఇప్పటిదాకా ఇస్తూనే వస్తున్నాను. ఆ ‘కాలమ్ దాటని కబుర్లు’ వల్ల నాకు దేశవిదేశాల్లో ఎంతో మంది అభిమానులు! అందులో మా ఇంట్లో జరిగే సంగతులు, చుట్టూ జరుగుతున్న సంగతులు, ప్రపంచాన్ని నా వంటింటి కిటికీ గుండా చూసి ఆ విశేషాలన్నీ సరదాగా రాస్తూ ఉంటాను. ఆ హాస్యానికి అందరూ కూడా తొందరగా నాకు దగ్గరయి నా కాలమ్‌నీ, నన్ను మరింతగా అభిమానిస్తూ పాఠకులయ్యారు, నా అభిమాన పాఠకులయ్యారు.
నేను భారతదేశం తిరిగొచ్చేటప్పటికీ నేనొదిలి వెళ్ళిన మాటీవీలో క్రియేటివ్ కన్సల్టెంట్ వుద్యోగం బాగానే వుంది. ఇక్కడ ‘అందరి బంధువయా’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కదా! నేను చాలా సందడిగా గడిపాను. చాలా భాగం పోచంపల్లి విలేజ్‌లో చేసారు.
శ్రీమిత్రా రియల్ ఎస్టేట్స్ ప్రసాద్ నాకు బాగా ఫ్రెండ్. అతనికి ‘మౌంట్ ఒపేరా’లో షేర్స్ వుండేవి. అంటే ఓనర్‌షిప్ అన్నమాట. నేను అమ్మని తీసుకుని షూటింగ్‌కి వెళ్తుంటే అక్కడ ఆగి భోజనం చేసి వెళ్ళమనేవాడు. మా డ్రైవర్ కుమార్ కైతే ఇప్పటికీ అక్కడ తిన్న చికెన్ బిర్యానీ రుచి జ్ఞాపకమే అంటాడు. మగధీర రిలీజ్ అయిన కొత్త అది! అస్సలు టికెట్లు దొరక్క జనం తన్నుకుంటుంటే, నాకు మాత్రం అరవింద్ గారు ఎన్ని టికెట్స్ అంటే అన్ని టికెట్స్ ఇప్పించమని ఆయన పి.ఎ.కి చెప్పడంతో మా బంధువులలో చాలామందికి నేను ఐమాక్స్‌లో ఫ్రీగా చూపించాను. అమ్మ మౌంట్ ఒపేరాలో మేం భోంచేస్తుంటే నాతో అంది – “ఇంత పెద్ద పెద్ద వాళ్ళు నీకు స్నేహితులంటావు… నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడ్తారు అంటావ్… నా కూతురివేనా? అని ఆశ్చర్యంగా వుంటుంది” అని.
నా భాగ్యం అదే… మంచి స్నేహం. ఎన్నటికీ స్నేహధనం నిండుతూనే వుంది కానీ ఖజానాలో అది తరగడం వుండదు! మేం వెళ్ళేసరికి మా కెమెరామెన్ జే.కే.గుమ్మడీ, చంద్రసిద్ధార్థ, శర్వానంద్, కోడైరక్టర్ మంజూ, రవీ, గోగూ అంతా మంచి హుషారుగా కనిపించారు.
“నిజం చెప్పండి! ఫ్రెష్ కల్లు తాగేరు కదూ” అంటే, “ఛ… ఛ! అస్సలు లేదు… కావాలంటే చూడండి… ఒంటికాలు మీద నిలబడగాం…” అని జేకే ఒంటి కాలు మీద నిలబడి ఓవర్ ఏక్షన్ చేసి కింద పడడంతో అందరం నవ్వాం. పోచంపల్లి వచ్చాం కదా చీరలు చూద్దాం అంటే, అప్పటికే చీకటి పడిపోయింది, కొట్లు మూసేసారు. ఆ సినిమాలో ఏక్ట్ చేస్తున్న నరేష్ గారూ, సీ.వీ.ఎల్.గారూ అందరం చాలా సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. కృష్ణ భగవాన్ కూడా ఉన్నారు.
ఆ సినిమాలో అనిల్ రావిపూడి ఓ పాట కూడా రాసాడు. ఆ పాట”జామ చెట్టుకీ జామకాయలూ, మల్లె చెట్టుకీ మల్లె కాయలూ… ఛ… ఛ మల్లె పూవులు…” అనే పాట. సరదాగా టేబుల్ మీద తాళం వేసుకుంటూ పాడాడు. మా మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ అలాగే ట్యూన్ చేసేసాడు.
మొట్టమొదటిసారిగా ‘నంద గోపాలా’ అనే పాట మైనంపాటి శ్రీరామ్ అనే అబ్బాయికి పాడ్డానికి ఛాన్స్ ఇచ్చాడు అనూప్. ఆ తర్వాత ఇండియన్ ఐడల్ సెలెక్షన్స్‌లో సోనూ నిగమ్, అనూ మాలిక్, ఫరా ఖాన్‌ల ముందు ఆ అబ్బాయి ఈ పాటే పాడి ఇండియన్ ఐడల్‌కి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత టైటిల్ కొట్టి ఇండియన్ ఐడల్ అయ్యాడు. ఇలా ఆ సినిమాకి ఎన్నో మధురమైన జ్ఞాపకాలే కాదు, ఓ చేదు అనుభవం కూడా ఉంది.
కాంతారావ్ అని నా దగ్గర ఓ డ్రైవర్ చేరాడు. నన్ను చాలా తిప్పలు పెట్టేవాడు. నడత కూడా అంత మంచిగా వుండేది కాదు! సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతూ వుంటే, “చీకటి పడిపోతోంది, ఇంటికి వెళ్దాం” అన్నాడు. పద్మప్రియ హీరోయిన్. నా పక్కనే కూర్చుని వీడి నస వింది. చిరాకెత్తి, “నువ్వు డ్రైవర్‌వి… ఆవిడ నీ మాట వినడమేవిటీ? ఆవిడ మాట నువ్వు వినాలి” అని తిట్టింది కూడా!
అతను కొద్దిగా మెంటల్ కేండిడేట్‌లా బిహేవ్ చేసేవాడు కానీ, నాకు ఎప్పుడైనా పనిమనిషినీ, డ్రైవర్‌నీ మార్చటం అంటే భయం, బద్ధకం… వాడి వాటం చూసి మా ఆయన మొదటి నుండి “వీడిని తీసెయ్యి” అంటూనే వున్నారు.
ఆయన ‘ఇలా నడుపుతున్నాడేంటీ?’ అన్నారని ఓసారి, “సార్‌ని ఇంకోసారి మన కార్లో ఎక్కించుకోవద్దు” అన్నాడు నాతో. ఆయనకి చాలా కోపం వచ్చింది కానీ, నేనే, “వాడు మతి లేనివాడు, వాడి మాటలు పట్టించుకోకండి… అసలే నేను చాలా బిజీగా వున్నాను” అన్నాను. ఓసారి మా అత్తయ్య పోయిందని, మా పెద్దమ్మ గారు డెబ్భై ఐదేళ్ళ ఆవిడ్ని తీసుకుని వెళ్తుంటే కార్లో, ఆవిడ కూడా “ఇలా రాష్‌గా నడిపిస్తున్నాడేంటీ? అసలు ఇతనికి కళ్ళు కనిపిస్తున్నాయా?” అందని, “ఈవిడ్ని ఇక్కడ దింపేసి పోదాం” అన్నాడు. నాకు కూడా వాడి వాలకం బాగా లేదు, ఇక మార్చేయాలి అని బుద్ధి పుట్టింది. కానీ రాత బాగా లేకపోవడం వల్ల కంటిన్యూ చేసాను.
ఓనాడు ఓ చిన్న పిల్లాడు రోడ్డు దాటుటుంటే, వాడి మీదకి ఎక్కించేయబోయాడు. “అయ్యో అయ్యో పిల్లాడు” అని నేను అరిచాను. దాంతో కారు ఆపి, “నువ్వు చెప్పకపోతే… ఆ పిల్లాడి ప్రాణం పోయేది తెలుసా?” అన్నాడు. ఆ రోజు ఇంటికెళ్ళి ఈ సంగతి చెప్పి, వాడ్ని తీసేద్దాం అనుకున్నాను. కానీ ఖర్మ కొద్దీ అనిల్ రావిపూడి పాట ఆ మర్నాడు షూటింగ్ పెట్టుకున్నారు ఎయిర్‌టెల్ ఆఫీసులో బేగంపేటలో. నన్ను రమ్మని ఫోన్ చేసాడు చందూ. నేను ‘ఈ ఒక్కరోజూ నడపనీలే, తీసేద్దాం’ అనుకుని వాడితోనే ప్రయాణం అయి వెళ్ళాను. డల్లాస్‌లో పటేల్ బ్రోస్‌లో చీరలు కొన్నాను, సూట్‌కేస్ మిస్సవడం వల్ల. అప్పుడు గొల్లపూడి మారుతీరావుగారు “ఈ చీర కొనుక్కో తల్లీ, నీ ఒంటికి బావుంటుంది” అని ఓ తెల్ల చీర సెలెక్ట్ చేసారు. ఆ చీర కట్టుకుని వున్నాను. బేగంపేట పోలీస్ లైన్స్ దాటుతుంటే, వాటర్ ట్యాంకర్ ఆగి వుంది. రోజూ అక్కడ రోడ్ మధ్యలో వేసిన మొక్కలకి నీళ్ళు పెట్టడానికి వాటర్ ట్యాంకర్స్ ఆగి వుంటాయి. అలాగే ఆ రోజూ ఆగి వుంది. దాని మీదకి రాష్‌గా కాంతారావు తీసుకెళ్ళిపోతున్నాడు. నేను “అయ్యో.. అయ్యో… ఆపు.. ట్యాంకర్ వుంది” అని చెప్తునే వున్నాను. కాంతారావ్ దానికి డాష్ ఇచ్చేసాడు.. నేను ఎగిరి కిందపడ్డాను. తల కారు టాప్‌కి కొట్టుకోవడం నాకు తెలుసు… మరుక్షణం కళ్ళు చీకట్లయ్యాయి… కళ్ళు మూతలు పడ్తుండగా, ఏక్సిడెంట్ అయిందని తెలిసింది. కొద్దిగా కళ్ళు తెరిస్తే, కారంతా రక్తం… కట్టుకున్న వైట్ చీర, రెడ్ చీరలా అయిపోయింది, మొత్తం రక్తంతో. చుట్టూ జనం మూగి వున్నారు.
(సశేషం)