[box type=’note’ fontsize=’16’] “అనవసరమైన సొల్లు చాలా తక్కువ, చిత్రం నిడివి రెండు గంటలకంటే కొంచెం తక్కువే అయినా ఉత్కంఠభరితమైన కథనం ఆకట్టుకుంటుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘హెలెన్‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]
ఈ మళయాళ చిత్రం ఈ యేడాదే వచ్చింది. హైదరాబాద్ హాల్లో వచ్చినపుడు నాకు చూడటం వీలు పడలేదు. ఇప్పుడిది అమేజాన్ ప్రైం లో వుంది. మరో మంచి మళయాళ చిత్రం. చూడండి.
హెలెన్ (అన్నా బెన్) ఇంగ్లీషులో మాట్లాడటం అభ్యాసం చేస్తొంది, ఇంటి పని చేస్తూ. నాన్నకి వేళకి మందులివ్వాలి. నానమ్మకు ఇంజెక్షన్. తండ్రి పాల్ (లాల్) దొంగచాటుగా సిగరెట్ కాలుస్తూ వుంటే పట్టుకుని వారిస్తుంది, పొగతాగడం ఎలా హానికరమో అతని చేత వల్లే వేయిస్తుంది. నవ్వుతూ, ఇల్లంతా తిరుగుతూ అందరికీ కావలసినవి చూస్తూ, అందరినీ నవ్వుతూ పలకరిస్తూ హుషారుగా వుండే ఈ పిల్ల, ఇంటిపనయ్యాక తండ్రి బైకు మీద IELTS క్లాసులకు వెళ్తుంది. నర్సుగా తర్ఫీదు పొందిన ఆమె, ఆ తర్వాత వో పెద్ద మాల్లో వున్న చికెన్ హబ్ అన్న రెస్త్రాఁ లో పని చేస్తూ వుంటుంది. చకచకా సాగిపోయే ఈ దృశ్యాల మధ్య క్లుప్త సంభాషణల్లోనే సారం చెప్పేస్తాడు. తల్లి లేని ఆ పిల్ల కష్టపడి, చదివి, కెనెడా కు వెళ్ళి చదువుకోవాలని ఆశిస్తుంది. ఎంద్కంటే ఇక్కడ నర్సుగా చేస్తే జీతం పెద్దగా రాదు, తను కొన్నాళ్ళు ఇంటికి దూరమైనా కూడా కెనెడా లో చదువు తర్వాత బాగా సంపాదించగల పరిస్థితుల్లో వుంటుంది, అది కుటుంబానికి మంచిది కూడా. విని తండ్రి తలైతే ఆడిస్తాడు గాని కూతురు దూరం వెళ్ళిపోతుందంటే అతనికి దిగులు, అయిష్టం.
క్రిస్టియన్ అయిన హెలెన్ ముస్లిం యువకుడు అఝర్ (నోబెల్ బాబు తోమస్) ని ప్రేమిస్తుంది. తన ఇంట్లోవాళ్ళు ఈ మతాంతర వివాహానికి ఇష్టపడరు అని తెలుసు, కాని నెమ్మదిగా నచ్చచెప్పగలనన్న ధైర్యం. అఝర్ కి చెన్నై లో వొక ఉద్యోగం వస్తుంది. ఆ రోజు అఝర్ తన స్నేహితులతో మందు పార్టీ కి సిధ్ధమై వుంటాడు. ఉన్నట్టుండి హెలెన్ అతనితో సరదాగా తిరగాలని ప్లాన్ చేస్తుంది, ఎందుకంటే అతను మర్నాడే చెన్నై వెళ్ళిపోతాడని. అప్పటికే తాగి వున్న అఝర్ హెలెన్ తో సమయం గడిపి, రాత్రి పూట తన బైక్ మీద ఆమె ఇంటికి దిగబెట్టడానికి బయలుదేరుతాడు. దారిలో పోలీసులు ఆపి అతను హెల్మెట్ ధరించలేదనీ, తాగి వున్నాడనీ పట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్తారు. ఆ పోలీసు అధికారి అజు వర్ఘీస్ (రతీష్ కుమార్) మన దగ్గర మోరల్ పోలీసింగ్ చేసే గేంగ్కు లీడర్ లా వుంటాడు. పోలీసు అన్నది వాచ్యార్థము కూడా. ఆ అమ్మాయి ముస్లిం, తను క్రిస్టియన్ ఈ సంబంధం ఎలాంటిది వగైరా ఆరా తీస్తాడు. తర్వాత పాల్ ని పిలిపించి అమ్మాయి గురించి కాస్త తక్కువగా మాట్లాడి, ఆమెను సరిగ్గా చూసుకోమని సలహా ఇస్తాడు. అఝర్ మీద కోపం వున్నా పాల్ కి తన కూతురిమీద నమ్మకం, ప్రేమా. కాని ఇప్పుడు ఇలాంటి సంఘటన, ఇలాంటి మాటలు పడటం అతన్ని బాగా బాధిస్తాయి. కూతురిని ఇంటికైతే తీసుకెళ్తాడు కాని మాటలు మానేస్తాడు. ఇప్పుడు బాధలో మునిగిపోయే వంతు హెలెన్ ది. మర్నాడు ఆమె ఆఫీసులోంచి తండ్రికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయడు. ఆమె అపరాధ భావనకు లోనవుతుంది. తండ్రికి ముఖం చూపేదెట్లా? లేట్ దాకా ఆఫీసులోనే పనిచేస్తుంది. ఆమె సామాను కోల్డ్ స్టోరేజీలో పెట్టడానికి వెళ్ళిన సమయంలో అనుకోకుండా యజమాని అన్ని గదులకీ తాళాలు వేసి వెళ్ళిపోతాడు. -17 దాకా చల్లగా వుండేఅ ఆ గదిలో ఆమె అయిదు గంటలపాటు ఎలా గడిపినదీ, మిగతా వాళ్ళు ఆమెను వెతకడంలో ఎన్ని అవస్థలు పడినదీ మిగతా కథ.
ఇది మతుకుట్టి క్సేవియర్ మొదటి చిత్రం. కాని చాలా బాగా తీశాడు. అనవసరమైన సొల్లు చాలా తక్కువ, చిత్రం నిడివి రెండు గంటలకంటే కొంచెం తక్కువ. మొదటి సగంలో ఆ ఇంట్లో సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు, తండ్రీ కూతుళ్ళ బంధం, మనస్తత్త్వాలు చూపిస్తే, రెండో సగంలో ఆ విపత్కర పరిస్థితుల్లో హెలెన్ సాగించిన జీవన పోరాటం. దానికి కావలసింది ఉత్కంఠభరితమైన కథనం. అది చక్కగా చిత్రీకరించాడు. కథ వ్రాసుకున్నది ఆల్ఫ్రెడ్ కురియెన్ జోసెఫ్, నోబెల్ బాబు తోమస్ (ఇందులో అఝర్ గా చేసినతను),దర్శకుడు మతుకుట్టి క్సేవియర్. క్లుప్తంగా గీసుకున్న సన్నివేశాల్లో ప్రభావవంతమైన సంభాషణలు. షాన్ రెహ్మాన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది. కాని ఆ కోల్డ్ స్టోరజీలో వున్న సన్నివేశాలలో కొన్ని చోట్ల ప్రభావవంతంగా లేదు. ఆనంద్ చంద్రన్ చాయాగ్రహణం బాగుంది. వున్న నాలుగు పాటలలో రెండు మెలడీలు చాలా బాగున్నాయి. భాష రాకపోయినా తన్మయంగా అనిపించింది. నేను పాటలప్పుడు సబ్ టైటిల్స్ చదవను, అవి మక్కి కి మక్కీ గా వుండటం చేతనో ఎందుకో నాకు సంతృప్తికరంగా అనిపించదు. ఇప్పటి తెలుగు పాటలకు విసుగెత్తివున్నానేమో, నాకు ఇందులో మెలొడీలు శాంతినిచ్చాయి.
ఇక ముఖ్యంగా ఈ చిత్రం వొంటిస్తంభం మేడ. ఆ స్తంభం అన్నా బెన్. ఈమె ఇదివరకు కుంబళంగి నైట్స్ లో చేసింది. బహుశా ఇది రెండో చిత్రం కావచ్చు. చాలా బాగా చేసింది. ఇక నించి ఈ పేరు చూసినా చిత్రం చూడవచ్చు అనిపిస్తుంది. లాల్ పేరున్న నటుడు, దర్శకుడూ. అతని నటన కూడా బాగుంది. మిగతావాళ్ళు బానే చేశారు.
ఈ కింది పేరా దాటెయ్యొచ్చు. సినిమా మొదట్లోనే వొక నేపథ్యంలో పాట. నువ్వెవరివి, తెలియని తీరాలు వెతికే కపోతానివా, సీతాకోక చిలుక కన్నువా. జీవితం ఎంతో సుందరమైనది కదా. అని. ఇది తెర మీద వో చీమ రకరకాల వస్తువులను, హెలెన్ వాడేవీ ఆమె ఇంట్లోవీ, తాకుతూ వెళ్తుంది. అలా ఫ్రిజ్ డోర్ మీద వున్నప్పుడ్డు ఫ్రిజ్ తెరుచుకోవడం అది లోన ఐస్ ట్రేలో పడటం, డోర్ మూసుకోవడం చూస్తాం. చివర్న ఆసుపత్రిలో కోలుకుంటున్న హెలెన్ ఎదుటి బల్లమీద వో మందుల డబ్బా పైనుంచి వో చీమను వెళ్తూ చూస్తాం. చాలా కొద్ది సన్నివేశాలలోనే పాటకు అనుగుణంగా, కథకు అనుగుణంగా మంచి చిత్రీకరణ చూస్తాం. తర్వాత కూతురు స్టేషన్లో కూర్చోవలసి రావడం, ప్రియుడి కారణంగా అది తండ్రికి తలవంపులు లాంటి పరిస్థితి కల్పించడం కావాలి. ఆ సందర్భాన్ని పట్టుకుని మన సమాజంలో వున్న ద్వంద్వ నీతి, ఆడా మగా సంబంధించి, చూపించడం; వేలెంటైన్స్ డే లాంటివి వచ్చినప్పుడు చేసే మోరల్ పోలీసింగ్ పేరుతో అత్యాచారాలు వగైరా అన్ని అల్లాడు. దానితో పాటే తండ్రి వొక పక్క అఝర్ ని అసహ్యించుకుంటూనే (రెండు కారణాల వల్ల : అతను ముస్లిం, అతను తాగి బండి నడపడం వల్ల వచ్చిన ఈ ఆపద) తన కూతురి పట్ల నమ్మకం ప్రేమా కలిగి వుంటాడు. ఆ ఎస్సై చీప్ గా మాట్లాడితే కొట్టబోతాడు కూడా. కాని అంత వయసూ, అనుభవమూ వున్నా ఈ సంఘటనకు ఎక్కువగా స్పందించి, తన కోప ప్రకటనగా కూతురితో మాట్లాడడం మానేస్తాడు. మర్నాడు ఆమె ఎన్నో మార్లు ఫోన్ చేసినా తీయడు. మనం కూడా చాలా సార్లు అజ్ఞానంతోనో, అహంకారంతోనో పరస్పరం మాటలు మానుకుని క్షోభ పడుతుంటాము, పెడుతుంటాము. ఈ సినెమాలోనైతే అది చాలా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. తర్వాత మరో కథనం : హెలెన్ మంచు గదిలో బందీ అయిపోయినపుడు వో ఎలుక పిల్లను చూసి జడుసుకుంటుంది, తోసేస్తుంది, అసహ్యపడుతుంది. కొన్ని క్షణాలలోనే అర్థమవుతుంది ఆమెకు ఆ గది అనే ప్రపంచంలో అన్ని చికెన్ వగైరా మాంసం ముద్దల మధ్యన తామిద్దరమే జీవులం, సజీవులం అని. ఆ ఎలుక పిల్లను నిమురుతుంది. దాన్ని వెచ్చగా వుండేలా ఏర్పాటు చేస్తుంది. ఇద్దరికీ ఆకలి. దొరికిన వో కేకులాంటి ముక్కను తను తింటూ, చిన్న ముక్క ఆ ఎలుక పిల్లకు పెడుతుంది. ఇది వొక అదనపు డైమన్షన్. చలి తగ్గే కొద్దీ ఆమె చేతివేళ్ళు కొంకర్లు పోవడం, చెవులూ బుగ్గలూ ఎర్రబడటం వగైరా సహజంగా చూపించాడు. చివర్న ఆ చనిపోయిన ఎలుకను చూసి మనం కూడా ఆలోచనలో పడతాం, హెలెన్ కి కూడా అదే గతి పడుతుందా అని. కాని హెలెన్ చాలా ధైర్యం వున్న పిల్ల, తొందరగా వోటమి వొప్పుకునే రకం కాదు. ఆ మాల్ లో పనిచేసే వో గార్డు చివర్న వో ముఖ్యమైన క్లూ ఇస్తాడు. తాను హెలెన్ ను వెళ్ళటం చూడలేదూ అని. ఎవరూ పట్టించుకోని ఆ గార్డ్ ని రోజూ హెలెన్ నవ్వుతో పలకరిస్తుందనీ, మనిషి తనకు గుర్తింపు దొరికితే అవతలి వ్యక్తిని మరచిపోలేడనీ చెబుతాడు ఆ గార్డు. ఆమెలోని ఆ స్వభావమే ఆమెకు ఇలా సాయపడుతుంది.