జీవన సౌరభం

1
3

[dropcap]కా[/dropcap]లం కౌగిలిలో కనిపించని ఎన్నెన్నో కథలు, మరెన్నో వ్యథలు. ప్రతి హృదయానిదో కథ. కన్నీళ్ళతో చెప్పేవి కొన్ని, చిరునవ్వుల మాటున దాగేవి కొన్ని.

నిజమే కదా!!! ఈ కవితలు చదువుతూ కూర్చుంటే టైమే తెలీదు. అయ్యబాబోయ్ ఈ కవితలు గోలలో ఈవెనింగ్ వాకింగ్‌కు లేట్ అయ్యింది. ఇవాళ రాజ్యలక్ష్మి గారి బీబీసీ న్యూస్ తప్పేట్టులేదు. పోనీ మానుకుందామా!!! అంటే ఇంట్లో బోర్ కొడుతోంది. సరే ఇవాళ్టి న్యూస్ విందాం, అప్పుడప్పుడు మనచుట్టూ ఏమీ జరుగుతోందో తెలుసుకోవాలి కదా… అని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు వాకింగ్‌కు బయలు దేరాను…

నాపాటికి నేను వాకింగ్ చేస్తున్నాను. వెనక నుండి పిలుపు

“ఏమండోయ్ సరోజా దేవి గారు… బొత్తిగా నల్లపూసైపోయారు” అంటూ కేవలం ప్రశ్నలు మాత్రం వేసే అలవాటువున్న రాజ్యలక్ష్మి దేవిగారు, ప్రశ్న మీద ప్రశ్న సంధించి, జవాబు కోసం ఆగకుండా కాలనీ కబుర్లు, వారి దగ్గరి చుట్టాల నుంచి వేలు విడిచిన చుట్టాల వరకు అందరి విషయాలు చెప్పి చివర్న మా పక్కింటి వాళ్ళ విషయము చెప్పింది. ఇంక చెప్పటానికి ఏమిలేదన్నట్టు నాకు బై చెప్పి మరో స్నేహ బృందం దగ్గరకు వెళ్ళిపోయింది.

జీవితానుభవాలు పరిణితిని కలుగచేస్తాయంటారు. బహుశా అది అందరికి వర్తించదేమో. ఈవిడలాంటోళ్ళకి అస్సలు వర్తించవు. వయసు ఆరుపదులు అయితేనేమి అన్ని విషయాలు అందరి విషయాలు కావాలి. ఎలా తెలుస్తాయో ఏమో. కేవలం వార్తలు మోయడం తప్ప ప్రతిస్పందన ఏమి ఉండదు. మనిషి మంచిదే వున్నవి లేనివి ఏమీ చెప్పదు… ఒక్కోసారి చాలా చికాకు వేస్తుంది…

తను మా పక్కింటి వారి గురించి చెప్పిన విషయం బాగా భాధ పెట్టింది. పోయిన ఏడు వాళ్ళమ్మాయ్ పెళ్లయింది. చాల ఘనంగా చేశారు… అప్పుడే విడాకులకు వెళ్ళింది…. చిత్రంగా అనిపించింది. ఇంటికొచ్చానో లేదో… అదిగో మా పక్కింటి వాళ్ళు నా కోసం వేచి యున్నారు..

విషయం విని చాలా బాధేసింది. ఎన్నిసార్లు ఎన్‌ఆర్‌ఐ సంభంధాల వల్ల మోసపోయినా మన వాళ్లకు ఇంకా అమెరికా మోజు పోలేదు. గొప్ప సంబంధం అంటూ అమెరికా అంటూ గొప్పలకుపోయి అల్లుడి గురించి ఏమి తెలుసుకోకుండా పెళ్లి చేసేస్తారు. తర్వాత ఇదిగో ఇలా బాధపడతారు. అప్పటి కన్నా ఇప్పుడు మేలు. సంతోషం ఏమిటంటే ఫోన్స్ వున్నాయి, అన్ని నిమిషాల్లో తెలుస్తాయి. ఇంకో మంచి విషయం ఏమిటంటే అప్పట్లోలా ఇప్పటి తల్లి తండ్రులు అనవసర మర్యాద, కుటుంబ గౌరవమంటూ అమ్మాయిని బలి పశువును చేయటం లేదు. విడాకులకు ధైర్యంగా ముందుకొస్తున్నారు.

నేను రిటైర్డ్ ఫామిలీ కోర్ట్ జడ్జిని. అందుకే నా సలహా కోసం వచ్చారు. విడాకులు తప్పకుండా మంజూరు కావడమే కాదు వాడికి తగిన శిక్ష కూడా పడుతుంది అని చెప్పా. అమ్మాయీ తెలివిగా వాడి టార్చర్‌ను రికార్డు చేసింది. వాళ్ళు నేను ఇచ్చిన భరోసాతో హాయిగా ఇంటికి వెళ్లిపోయారు. బిడ్డ సంతోషం కోసం అని కొందరు, గొప్పకోసం మరికొందరు ఎంత వద్దన్నా ఎన్‌ఆర్‌ఐ పిచ్చి. ఇక్కడ చెడ్డ వాళ్ళుండరాంటే, నిజమే ఇక్కడా వున్నారు. కానీ ఇక్కడ మనవాళ్లు దగ్గరలోనే వుంటారు కదా.

జీవితం ఒక జూదం. తప్పొప్పులు కాలం నిర్ణయిస్తుంది. అప్పటికి సరిఅయిన నిర్ణయాలు అనుకున్నవి, కాలం గడిచాక తప్పని తేలినవెన్నో…. నా అనుభవంలో చాల భయానకమైన కేసులు చూసా, అంతే తమాషా కేసులు కూడా చూసా…. మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపేప్పుడు మనసు మారి చక్కగా సంసారం చేసుకున్న వాళ్ళు వున్నారు. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా విడిపోయిన వాళ్ళు వున్నారు. ఈ మానవ సంబంధాలు ఇరువైపులా పదునున్న కత్తి. అందులోనూ వివాహం అన్నది రెండు భిన్న ధృవాలు కలిసి ప్రయాణించటమే. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో సర్దుబాట్లు, ఇంకెన్నో త్యాగాలు వీటన్నిటితో సహజీవనమే వివాహము… ఇది సజావుగా సాగాలంటే ‘నేను’ కు చోటు లేకుండా చేసి ‘మన’కు చోటివ్వడమే….

ఒకసారి మా పరిచయస్తులావిడ తనకూతురిని పిల్చుకొచ్చింది తన సంసారం నిలబెట్టమని అడగడానికి. అమ్మాయే చాల బోళా మనిషి. ఎవ్వరు ఏమీ చెప్పినా నమ్మేస్తుంది. అతనికో స్నేహ బృందం కాస్త ఎక్కువ. ఇంటిపట్టున ఉండేది తక్కువ. మొగుడిని మార్చుకోవడానికి అదేదో పుస్తకంలో చదివి తనుకూడా మొగుడిలాగి ఇంటిపట్టున ఉండకుండా తిరగడం మొదలుపెట్టింది. కథలో హీరో భార్యను అర్థం చేసుకున్నాడు.. సుఖాoతం… కానీ ఇది నిజ జీవితం… అంత త్వరగా మార్పు వస్తుందా!!! అతని పురుషాహంకారం దెబ్బతినింది. విడాకుల నోటీసు జారీ… భయపడి నాదగ్గరకొచ్చారు… అబ్బాయిని పిలిపించి అతనితో మాట్లాడి ఒప్పించేపాటికి తలప్రాణం తోకకొచ్చింది.

అస్సలు ఈ భార్యాభర్తల బంధమే చాల విచిత్రమైనది. ఒక్కోసారి… ఎందుకు గొడవ పడ్తారో, ఎప్పుడు బాగుంటారో ఎవ్వరికి అర్థం కారు. నా అనుభవంలో తేలిందేమిటంటే ఈ కుటుంబం నిలబడడంలో ఆడవాళ్ళ పాత్ర అమోఘం. సర్దుకుపోయే మనస్తత్వం కనీసం ఏ ఒక్కరిలో వున్నా అది నూరేండ్ల బంధమే….

ఈ లోపు నా ఫోన్ మోగింది. ఎవరా అని చూసా… నా స్థానంలో వున్న ప్రస్తుత జడ్జి కామేశ్వరిగారు. ఆవిడ చెప్పిన విషయం విని మనసులో అగ్నిపర్వతం బద్దలైందా అనిపించింది. దేవుడు కూడా ఒక్కోసారి సరిగ్గా న్యాయం చేయడమో అనిపిస్తుంది. అడిగితే ఆ జన్మ ఈ జన్మ అంటూ ఏవో లెక్కలు చెప్తాడు. ఈలోపు ఈ జన్మ కాస్త ముగిసిపోతుంది.

ఇలా జరుగుతుందేమోనని ఒక భయం… జరగదులే అని ఒక దైర్యం ఉండేది. కానీ నా అనుభవమే గెలిచింది. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరి పిల్లలు ఒకరు తూరుపు ఒకరు పడమర అంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది.

నా పెద్దకొడుకు రామ్. భవబంధాలకు అతీతుడు. ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి వాడి నిఘంటువులో దుర్భిణి వేసి వెతికితే ఎక్కడో చిన్నగా కనపడతాయి. వాడికి వాడి వృత్తి జీవితమే ముఖ్యము. పేరు ప్రతిష్ఠ ఇవే వాడికి ముఖ్యం. భార్య పిల్లలు కూడా వాడికి స్టేటస్ సింబల్ అంతే. వాడిది ఏమదృష్టమో కానీ వాడి భార్య సువర్ణ!!! పేరుకు తగ్గ ఇల్లాలు. గుణగణాలలో వాడికి పూర్తిగా విరుద్ధం. మూర్తీభవించిన మంచితనానికి, భావోద్వేగాలకు ప్రతిరూపం. తల్లిగా నేనీ మాట అనకూడదు కానీ తనకు రావాల్సిన భర్త కాదు రామ్. వాడికి టీవీ, ఫ్రిజ్, కార్, భార్య, కొడుకు, కూతురు అన్ని ఒకటే. వాడికి జీవితంలో ముఖ్యమైనది ఏమైనా వుంది అంటే అది వాడి వృత్తి. సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ వుంది. బాగా సంపాదిస్తున్నాడు. బెంగళూరులో లంకంత కొంప కట్టుకొని అక్కడే స్థిరపడ్డాడు.

నా పెద్ద కొడుకు సంసారానికి చుక్కాని వాడి భార్యనే. వాడికి అది ఎప్పటికి అర్థం కాదు. వాడి ఉద్దేశంలో వాళ్ళ సుఖంగా ఉండటం కోసమే తను కష్టపడుతున్నాడు అన్నది వాడి వాదన. ఎలాoటి చెడు అలవాట్లు లేవు. ప్రతియేడు కుటుంబంతో ఏదో ఒక విదేశీ యాత్రకెళ్తాడు. తేడా ఏంటంటే… డ్యూటీలా చేస్తాడు. సువర్ణ తనలాంటి అమ్మాయే అయుంటే ఏ భాద ఉండేది కాదు… అమ్మాయే కొంచం సున్నిత మనస్కురాలు… భర్త పిల్లల ఆనందంలోనే సంతోషాన్ని వెతుకొని ఇంటిని స్వర్గాన్ని చేసుకుంది. వాడింటికి వెళ్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇంటిని చూస్తే చాలు ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు. సంపన్నుల బిడ్డయినా ఆ ఆనవాళ్లు కొంచం కూడా వుండవు. నడక, నడత అంతా సువర్ణమే. ఎలాంటి భావోద్వేగాలు లేని వ్యక్తి తన భర్త అని తెలిసినా ఎంతో ఓర్పుగా తన సంసారం సాగిస్తోంది. అందువల్లే వాడి సంసారం నల్లేరు మీద నడక. కానీ తన గుండెల్లో దాగిన బరువు నా చూపును దాటిపోలేదు. తన ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా హోదా మాటున జరిగిన పెండ్లి. రామ్ చెడ్డవాడేం కాదు. చెప్పగా చెప్పగా ఇప్పుడు కొద్దిలో కొద్దిగా నయం. పెళ్ళాం మాటలకు విలువ ఇవ్వడం మొదలుపెట్టాడు… నిజానికి కూతురు పుట్టాక వాడిలో కాస్త మార్పు మొదలైంది. సువర్ణకు సర్దుకొనిపోవడంలో కొంచం వెసలుబాటు…

ఇక మా రెండోవాడు. అమోఘ్. పేరుకు తగ్గట్టే అమోఘమైనవాడు. చాల మంచి మనసు. ఒక్క మాటలో ‘శ్రీరామచంద్రుడు’. చిన్నప్పటి నుండి నేను వీడు ఒక జట్టు, వాళ్ళ నాన్న పెద్దవాడు ఒక జట్టు. మావి వాళ్లకు నచ్చవు, మాకు వాళ్ళవి నచ్చవు. కానీ ఎప్పుడు ఎక్కడ పొరపొచ్చాలు రాలేదు. నేను లాయర్‌ని, తర్వాత జడ్జ్ అయ్యాను. అయినా సగటు గృహిణిలాగే సర్దుకుపోవడo నానుంచే ఉండేది. అందుకే కాబోలు ఒడుదిడుకులున్నా సాఫీగానే సాగింది నా సంసార నావ.

నాకు గారాల పుత్రుడు అమోఘ్. తల్లి తండ్రులకు పిల్లలంతా సమానము అంటారు కాని ఇది నిజం కాదు. ఒకరు కొంచం ఎక్కువ ఇష్టం వుంటారు. దశరథుడికి రాముడిలా మరి… యశోదకు కృష్ణుడిలా. …. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అని త్రికరణశుద్ధిగా నమ్మి అక్షరాలా ఆచరించే మనిషి. అలాని చదువునేమి నిర్లక్ష్యం చేయలేదు చదివినట్టేవుండడు…కానీ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్… ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ పూర్తిచేసాడు. వీడికి కూడా సొంత కంపెనీ వుంది కానీ ఆది ఒక ఎన్‌జిఓ. ఈ ఎన్‌జిఓ ద్వారా ఎన్నో మంచిపనులు చేస్తుంటాడు.

ఒకసారి కృష్ణా నదికి వరదలు వస్తే అక్కడ సహాయ కార్యక్రమాలకు వెళ్ళాడు. ఆ క్రమంలో ఒక అమ్మాయి మీద మనసుపడ్డాడు. పేరు సరిత. ఆ అమ్మాయికి ఆ విషయం చెబితే పల్లెటూరిపిల్ల బెదిరిపోతుందేమో అని మమ్మల్ని ఒప్పించి వారి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు. మావారికి పెద్దోడికి నచ్చలేదు యీ అమ్మాయి… వాళ్ల హోదా కాదు కదా… డిగ్రీ దాకా చదువుకున్న అమ్మాయి. చూడ్డానికి అమ్మాయి బాగుంది. పల్లెటూరి పెడసరితనం, పెంకితనం బాగా కనపడుతాయి. అమాయకత్వమో, అజ్ఞానమే తెలియదు.

ఒక తల్లిగా… నాకు ఈ అమ్మాయి వాడికి సరిజోడి అనిపించలేదు. ఒక జడ్జ్‌గా…. వాడితో సర్దుకుపోవడం కష్టం అనిపించింది. వాడు ఒక మహా సముద్రం లాంటివాడు. సముద్రాన్ని దోసిట్లో బంధించడం కష్టం అని తనకు తెలీదు. అందరికి తెలుసు వాడు ఏదైనా ఒకనిర్ణయం తీసుకున్నాడు అంటే దాన్ని మార్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు అని. అందుకే మావారు అయిష్టంగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. నిజానికి వాడు పుట్టినప్పటి నుంచి నేను విభేదించిన మొదటి నిర్ణయం. వాడి పట్టుదల తెల్సినా ఒక తల్లిగా వాడి నిర్ణయం గురించి వాడితో మాట్లాడాను. తను అమాయకురాలు… తనను దగ్గరనుంచి చూసాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. రాజు మెచ్చింది రంభ అనాలో, ప్రేమ గుడ్డిది అనాలో – నేను జడ్జ్‌మెంట్ ఇచ్చేలోపే వాడి పెళ్ళయిపోయింది.

వాడి పెళ్లైయ్యాక నా మొదటి జడ్జిమెంట్ వారిని విడిగా సంసారం పెట్టమనడం. వాడు నొచ్చుకున్నాడు. నాకు పెళ్లి ఇష్టం లేకపోవడం వల్ల అలా చెప్పానని అనుకున్నాడు. నిజానికి పెళ్ళైన వారానికే నాకు అర్థం అయ్యింది.. అమ్మాయిది అమాయకత్వం, అజ్ఞానంతోపాటు మూర్ఖత్వం కూడా అని. మాతోనే కల్సివుంటే తెల్సో తెలియకో వాడి సంసారంలో కలగచేసుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు. అందుకే కొత్త జంటకు ఏకాంతం పేరుతో మాకు దూరంగా కొత్త కాపురం పెట్టించాను.

ఇప్పటికి మూడేళ్లు అయ్యింది… వాడిలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఒకప్పుడు అలుపన్నది లేని అలలా లాగ తుళ్ళిపడేవాడు. ఇప్పుడు స్తబ్ధంగా ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్యలో దూరం పెరిగిందని అర్థం అయ్యింది. దూరానికి మూలం ఏమిటో తెలుసుకోవాలి అని అనిపించినా వాడి అభిమానం దెబ్బతింటుందేమోనని ఊరుకుండిపోయా. మొదట్లో ఇంటికి నెలకోసారి వచ్చేవాడు ఇప్పుడు అడపాదడపా వస్తూనే వున్నాడు. అప్పుడు భోంచేసి వెళ్ళరా అంటే పెళ్ళాం ఎదురుచూస్తుంటుంది అనేవాడు. ఇప్పుడు “అమ్మా! నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో” అని రోజు మార్చి రోజు చెప్తునే వున్నాడు.

సరితలోనూ బాగా మార్పొచ్చింది. ఇప్పుడు పల్లెటూరి అమాయకత్వం అస్సలు లేదు. ఈ మధ్య మరీ ఎప్పుడు ఫుల్లు మేకప్‌తో. పెద్దింటి ఆర్భాటము పేరు బాగా వంటబట్టాయి… కార్లు, కిట్టి పార్టీలు ఒకటేమిటి డబ్బున్న పనిలేని ఆడవాళ్ళకు వున్న అన్ని అవలక్షణాలు వచ్చాయి. ఒక్క ఈ ఆర్భాటానికి హంగుకు కారణమైన భర్త మీద ప్రేమ తప్ప. నాకర్థమైనంత వరకు తనో అద్భుత సౌందర్యరాశి, అందుకే వాడు తనని వెంట పడి పెళ్లి చేసుకున్నాడు.. ఇది తను బాగా నమ్మింది అనిపించింది….

నా రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు కూడా ఏ మాత్రం హుందాగా నడుచుకోలేదు. తనో అద్భుత సౌందర్య రాశి, అందుకే అడుక్కుని మేము పెళ్లి చేసుకున్నాము అని అడగని వారికి అడిగిన వారికి చెప్పింది. దీంతో వాడు కాస్త ఇబ్బందిగా భావించి మధ్యలోనే వెళ్ళిపోయాడు. నాకర్తమైనంత వరకు అప్పటినుంచి దూరం పెరిగిందని తెలుసు. కానీ దగ్గర కాలేనంత దూరం అని తెలీదు.

ఎంత దూరం అంటే… మనుషులు విలువలు అని వాటికి తన జీవితాన్ని అంకితం చేసిన నా అమోఘ్ ఎంత విసిగిపోయాడో ఇవాళ విడాకులకు జడ్జి ముందర హాజరయ్యాడు. అదే ఇందాకటి ఫోను సారాంశం. నాకు జూనియర్ ఇప్పటికి వాయిదా ఇచ్చి పంపింది. ఏమి చేయాలో నా సలహా తీసుకొని పాటించడానికి.

ఇదండీ సంగతి. నా పెద్ద కోడలు సువర్ణను చూసినప్పుడు అనుకునేదాన్ని అమోఘ్‌కు ఇలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అని. దైవ లీల నిజంగా విచిత్రం ఎవరికి ముడి వేస్తాడో అర్థం కాదు. సరిత మా పెద్దోడికి బాగా సరిపోతుంది.

ఏది ఏమైనా ఏ బంధం నిలబడాలన్న ఆడదానికి అణకువ ఓర్పు చాలా అవసరం. అప్పుడే సంసారం నిలబడుతుంది. ఎప్పుడు ఆడవాళ్లేనా రాజీ పడాలి అంటే నా దగ్గర సమాధానం లేదు. మన సమాజంలో విడాకుల దాకా వచ్చిన అన్ని కేసులలో నేను ఇదే గమనించాను. భర్త మరీ పనికిమాలినవాడు ఐతే తప్ప భార్య పిల్లల భవిష్యత్తు కోసం సర్దుకుపోవడంలో తప్పులేదన్నది నా భావన. ఒప్పుకోవడానికి కష్టంగా వున్నా మనది ఇంకా పురుషాధిక్య సమాజమే. ఎన్ని తప్పులు చేసినా మొగవాడిని వేలెత్తి చూపదు… అదే అసందర్బంగా చిన్న నవ్వుకు కూడా ఎన్నో వేళ్ళు లేస్తాయి ఆడదాని వైపు. వాడికి చిన్నిల్లు, పెద్దిల్లు స్టేటస్ సింబల్ అదే ఆడదానికి కల్మషం లేని స్నేహం కూడా అక్రమమే. ఇప్పటికిప్పుడు మార్పు రావడం కష్టం కానీ మార్పు దిశగా గమనం మొదలైంది. ఇదో సంతోషం.

ఇప్పుడేమి చేయాలో అర్థం కాలేదు. ఇంత పెద్ద నిర్ణయం కనీసం నాకు చెప్పకుండా తీసుకున్నాడు అంటే ఎంత మథన పడ్డాడో… ఎంత మానసిక సంఘర్షణ జరిగిందో ఒక తల్లిగా అర్థం చేసుకోగలను. ఒక సహనశీలి అయిన ఆడదాని సహనం ముందు సముద్రం కూడా దిగదుడుపే. అదే ఎంత గొప్ప సహనవంతుడైన మగవాడి సహనం ఒక చిన్న నది లాంటిదే.. ఇది నా అనుభవం…

నా చిన్న కొడుకు అమోఘ్ నా పెద్ద కోడలు సువర్ణ విషయంలో ఇదే కనపడుతుంది. ఇద్దరూ గుణగణాలలో ఇద్దరికి ఇద్దరు. అదే సహనం వచ్చేపాటికి మగ ఆడ తేడా బాగా కనపడుతోంది…

నా ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అమోఘ్ నుంచి ఫోన్… నాతో ఏదో మాట్లాడాలని వస్తున్నట్టు చెప్పాడు.

బహుశా విడాకుల గురించే అయుంటుంది. అంత దూరం పోకుండా ముందుగానే ఒకసారి నా సలహా అడిగుంటే బాగుండేదని అనిపించింది. మరి ఎందుకు ఇంత చేసాడో వాడొస్తే కాని తెలీదు.

ఆమోఘ్ వారి నాన్నగారు లేని టైం చూసుకొని వచ్చాడు.

“ఏంట్రా చిన్నా!!! అంత ముభావంగా వున్నావు” అని ఏమీ ఎరుగనట్టే అడిగాను.

“ఏమీ లేదమ్మా!!! నీవు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పాలి. ఇప్పటికే ఆలస్యం చేసాను. అర్థం చేసుకోగలవని అనుకుంటున్నాను” అన్నాడు

” చెప్పరా” అని ఎంతో ప్రశాంతంగా అడిగాను.

” అమ్మా!!! నీవు చెప్పింది నిజమే. సరితది అమాయకత్వం మాత్రమే కాదు మూర్ఖత్వం కూడా… నిజానికి ఇదే ఎక్కువ…. పెళ్ళైన రోజునుంచి ఎందులోను సర్దుకపోయే ధోరిణి లేదు. పైగా మూర్ఖపు పట్టుదల. ఎవ్వరు చెప్పినా వినదు. తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటుంది. అనుభూతులు, ప్రేమ, అనురాగాలు ఇవేమి తెలీదు… చెప్పినా వినదు. ఎవరు తన మెదడులోకి ఎక్కించారో కానీ తనో అద్భుత సౌందర్యరాశి అని అది తెగ నమ్మి మిగతా అంతా తనముందు దిగదుడుపే అన్నది తన భావన. మిగతా కాదు, నేను కురూపి కావడం వల్ల మన స్టేటస్‌కు సరిపోతుందని ఆ పల్లెకు వెళ్లి మరీ మరీ అడిగి పెళ్లిచేసుకున్నామంట. ఇది త్రికరణ శుద్ధిగా నమ్మి నూటికి నూరు శాతం ఆచరణలో పెడుతోంది. తనని మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసాను. కానీ కుదరలేదు” అని నేను ఎలా ఆలోచిస్తున్నానా అని నా కళ్ళలోకి చూసి నిట్టూర్పు విడిచాడు.

” చిన్నా! ఇంత విషయానికే నీవు విడాకుల దాకా వెళ్లావంటే నేను నమ్మలేను” అన్నాను.

వాడు ఒక పేలవమైన నవ్వు నవ్వి, “ఐతే నీకు తెల్సిపోయిందా అమ్మా. అవును నాకు తెలుసు నీకు తెలుస్తుందని” అని అపరాధిలా తలవంచుకున్నాడు.

“వేరే వారి ద్వారా తెలిస్తే నాకు ఎలా ఉంటుందో ఆలోచించావా… అంత దూరం వెళ్లేముందు తల్లిని ఒక సలహా అడుగుదామని కూడా అనిపించలేదా.. తల్లిగా కాకపోయినా ఒక అనుభవం వున్న జడ్జిగా అయినా నన్ను అడిగిండొచ్చుకదా” నాకు తెలీయకుండా స్వరం గద్గదమైంది.

వాడు మౌనాన్ని ఆశ్రయంచాడు. అపరాధిలా తలవంచుకున్నాడు. ఏ క్షణమైనా ఆనకట్ట తెంచుకొని ఉప్పొంగడానికి సిద్ధంగా వున్నాయి కన్నీళ్లు. నేనూ మౌనంగా ఉండిపోయా. కాసేపటికి వాడు తేరుకొని….

“అమ్మా!! నీకు చాల సార్లే చెప్పాలనుకున్నా.. కానీ నీ మాటలే నన్ను చెప్పనీయలేదు. సమస్య మనది, దానికి సమాధానం మనమే వెతుక్కోవాలి అని నీవు ఎప్పుడూ చెప్పేదానివి కదమ్మా… అందుకే తన మీద ప్రేమతో, నీ మీదున్న గౌరవంతో ఎన్నోసార్లు, నిజానికి ప్రతిరోజు తనకు నచ్చచెప్పడానికి తనలో మార్పు తీసుకురావడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో నా తప్పు కూడా వుంది. పెళ్ళైన మొదట్లో తనది కేవలం అమాయకత్వం అని అనుకోని.. కొండ మీది కోతిని కూడా తెచ్చి యిచ్చా… ఇదే నా కొంప ముంచింది. తనో అందగత్తె అందుకే నేను కోరిందల్లా చేస్తున్నాను అనుకుంది, కానీ అది ప్రేమ అనుకోలేదు. నేను తన ఈ భావనను పెంచిపోషించకుండా తనకు తెలియపరచివుంటే బాగుండేది. తనలో ఈ భావన పెరగడానికి నేనూ ఒక కారణమయ్యాను… ఇప్పుడు తనలో యీ భావన ఒక వట వృక్షమై కూచుంది. అందుకే” అని చెప్పడం ఆపి నావంక చూసాడు.

“చూడు చిన్నా!!! నాకు నీ గురించి నీకన్నా బాగా తెలుసు. ఇంత మాత్రానికే నీవు విడాకులు తీసుకోవాలనుకోవు. విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నావు” అని సూటిగా అడిగాను.

వాడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నావైపు చూసి అప్రయత్నగా నన్ను మెచ్చుకోలుగా “అమ్మా” అని పిలిచాడు.

నేను చిన్నగా నవ్వి చెప్పు అని అన్నాను. ..

వాడు గుండెబరువు దించుకున్నవాడల్లే ఒక నిట్టూర్పు విడిచి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు.

“అమ్మా! తన అందాన్ని మోహించి పెళ్లి చేసుకున్నా… అన్న భావన తనలో ఎంతగా పెరిగిపోయేందంటే ప్రతిరోజూ బ్యూటీ పార్లర్ వెళ్లడoతో తన దినచర్య మొదలు. అసలు ఎలా పరిచయమయ్యారో ధనవంతుల పనిలేని ఆడవాళ్లు… వారి పరిచయం తనలోని జ్ఞానాజ్ఞాన విచక్షణ, ఇంగితం అన్ని ఎటుపోయాయో. కిట్టి పార్టీలు మొదలయ్యాయి. మోడరన్ డ్రెస్లు, చవకబారు కబుర్లు. వంట వార్పూ అటకెక్కాయి. వంట మనిషి వచ్చి చేరింది. ప్రతి మాటను అపార్థం చేసుకోవడమే. అంబానీల కూతురు కూడా ఇంత పొగరు పోదేమో. ఎవరు ఏమీ నేర్పిస్తున్నారో అర్థం కావడంలేదు” అని నావైపు చూసాడు.

నేను ప్రశాంతంగా ఉండడం చూసి ఏదో ధైర్యం వచ్చినవాడల్లే మళ్ళీ చెప్పాడo కొనసాగించాడు. బహుశా అస్సలు కారణం అనుకుంటే కాస్త గొంతు సవరించుకొని లోగొంతుకతో…

“అమ్మా తనలో ఈ మూర్ఖత్వం పెరుగుతునేపోయింది కానీ తగ్గలేదు. నాకు తెలీకుండానే నాలో ఎప్పుడు సహనం చచ్చిపోయిందో నా మాటలో మార్దవం పోయి కఠినత్వం వచ్చింది. బుజ్జగించే స్థాయినుంచి హెచ్చరించే స్థాయిని చేరింది నా గళం. ఈ విషయాలు ఎవరితో చర్చిస్తుందో తెలిదు… ఎవరేం సలహా ఇచ్చారో తెలీదు… తన మీద తన అందం మీద మోజు తగ్గింది కాబట్టే నేను విసుక్కుంటున్నాను అని నామీద నేరారోపణ చేసింది. ఎప్పుడు మేకప్ గోలే. అందం అన్నది మనసుకు ప్రతిబింబం అంటే అర్థం కాదు. ఇక్కడితో ఆగలేదు. ఎవరు ఏ దిక్కు మాలిన సలహా ఇచ్చారో కానీ… బిడ్డ పుడితే అందం తరిగిపోయి మొగుడు ఇంక చూడడని… తను గర్భవతినని కనీసం నాకు చెప్పకుండా గర్భస్రావం చేయిoచుకుంది. మా ఫ్రెండ్ చూసి చెప్పాడు. లేకపోతే నాకు తెలుసుండేది కాదు” అని చేప్పి కన్నీళ్లను ఆపుకోవడానికి చెప్పడం ఆపేసాడు.

ఇది విన్న తర్వాత నేనుకూడా హతాశురాలినయ్యాను. ఎప్పుడు అనుకునేదాన్ని ఒక బిడ్డ పుడితే తనలో మార్పు వస్తుంది అని. వాడికి సంతాన భాగ్యం కోసం భగవంతుడిని ప్రార్థించేదాన్ని. ఇదా కారణం. హతోస్మి… మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అందమైన పొదరిల్లు లాంటి సంసారం చేచేతుల నరకం చేసుకొంటోంది కదా…. నాకు ఏమీ మాట్లాడాలో అర్థం కాక ఊరుకుండిపోయా…

“అమ్మా! నా బిడ్డ అమ్మ… ఇంకా ప్రపంచం చూడకుండానే పాతిపెట్టేసింది రాక్షసి” అని ఇక కన్నీళ్లను ఆపుకోలేక గట్టిగా ఏడ్చేశాడు. నాకు గుండెను పిండేసినట్టయింది.

సరితకు మంచి చెడు చెప్పడానికి తండ్రి లేడు. అమ్మ, అమ్మమ్మ చాల గారాబంగా పెంచారు. ఇదే పర్యవసానం. ఒకసారి వాళ్ళ అమ్మతో మాటల్లో చెప్పను. ఆవిడకి ఏమీ అర్థం అయ్యిందో కూతురికి ఏమిచెప్పిందో ఆ భగవంతుడికే ఎరుక.

“అమ్మా ఇప్పుడు చెప్పు నేను విడాకులు తీసుకోవడం సబబా కాదా. ఇన్నాళ్ళు తన పిచ్చిని అజ్ఞానమనుకుని, ఈవేళ కాకపోతే రేపైనా మార్పు వస్తుందని క్షమించాను. కానీ అమ్మా అభం శుభం తెలీని బిడ్డను చిదిమేసింది. నా బిడ్డను చంపడానికి తనకు ఏమీ హక్కు వుంది. ఇది తెలిసిన మరుక్షణం దాన్ని కూడా అక్కడే పాతేద్దాం అనుకున్నా!!!… కానీ దాని లాగా నేను పాషాణాన్ని కాదు కదా అమ్మా” అని కింద కూర్చొని నా ఒళ్ళో తలపెట్టుకొని ఏడ్వసాగాడు.

“చిన్నా!!! ఈ విషయాలన్నీ వాళ్ళ అమ్మ వాళ్లకు తెలుసా..” అని అడిగాను

“నాకు తెలీదు… నేనైతే చెప్పలేదు. మరి తను చెప్పిందో లేదో నాకు తెలీదు” అన్నాడు.

“పోనీ నీవు విడాకులు అన్నప్పుడు తన ప్రతిస్పందనేంటి” నాలోని జడ్జి అడిగింది.

“అదే మూర్ఖపు వాదన.. తన అందం మీద మోజు తగ్గింది కాబట్టే నేను విడాకులు తీసుకుంటున్నాను. ఇదే తన భావన, నాతో వాదన…” అన్నాడు.

“మరి ఇప్పుడేమిటి నీ నిర్ణయం. నాకు తెలియపరచడానికి కామేశ్వరి గారు అదే జడ్జి మీ కేసును వాయిదా వేసారు” అని అడిగాను.

“ఏమో అమ్మ!! నా బిడ్డను చంపిన ఆ హంతకురాలు నాకొద్దు. అందుకే నిన్ను అడగకుండా విడాకులకు అప్లై చేశా. నీతో చెప్తే మరి రాజీ అంటావేమో అని. ఇంక ఒక్క క్షణం కూడా తనతో ఉండలేను” అని చాలా స్థిరంగా తన నిర్ణయం చెప్పాడు.

నేను… ఏమీ సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నంతలో మళ్ళీ వాడే అన్నాడు.

“అమ్మా! తనను క్షమించే మనసు నాకు లేదు. ఇప్పుడు చెప్పమ్మా నీతో చెప్పకపోవటం నా తప్పే… కానీ నా మనసు పూర్తిగా విసిగిపోయింది… నన్నేమి చేయమంటావు. నీ నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. ఒక తల్లిగా, జడ్జిగా నీ తీర్పు చెప్పమ్మా” అని చెప్పడం ముగించి నేను ఏమీ చెప్తానా అని నావైపు చూడసాగాడు.

నేను వాడు చెప్పిందంతా విన్న తర్వాత తల్లిగా కాకుండా జడ్జిగా అలోచించి నా నిర్ణయం చెప్పాను.

“చూడు చిన్నా! ఎంతటి కిరాతకులకైనా మార్పుకు ఒక అవకాశం ఇమ్మంటుంది మన న్యాయం. నేను తనను కొద్దిరోజులు దగ్గరగా గమనించాలనుకుంటున్నాను. తన నైజం ఇదే ఐతే మార్పు కష్టమే. కానీ ఇది చెప్పుడు మాటల ఫలితమో లేక మానసిక రోగమో ఐతే ఖచ్చితంగా మార్పు తధ్యం… నీవు ఆవేశంలో వున్నావు. తనకు కొంచం దూరంగా ఉంటే నీవు కుదుట పడతావు. అందుకని ఎలాగు వచ్చేవారం మీ అన్నయ్య ఇంట్లో ఏదో పార్టీ ఉందిగా… నేను సరితను నాతో ముందుగానే పిల్చుకెళ్తాను. ఇంట్లో విడాకుల విషయం ఎవ్వరికి తెలియదు, నీవు చెప్పకు అని సరితకు చెప్పు. లేకపోతే తను సౌకర్యంగా ఉండదు. నీవు ఆ రోజుటికి రా. ఈలోపు నాకు తన గుణగణాలు తెలుసుకొనే అవకాశం వస్తుంది. తర్వాత ఏమీ చేయాలో ఆలోచిద్దాం… భార్యాభర్తల బంధం అంటే ఏడేడు జన్మల బంధం అని నేను గట్టిగా నమ్ముతాను… అందుకే నా దగ్గరకు విడాకుల కోసం వచ్చిన వారిని కౌన్సిలింగ్‌కు పంపుతాను. ఎంతో మంది మనసు మార్చుకుని హాయిగా సంసారం చేసుకుంటున్నారు… సరితకు ఒక అవకాశమిద్దాం. నీ ప్రయత్నం నీవు చేసావు. నా కొడుకు భవిష్యత్తు కోసం నేను ఓ ప్రయత్నం చేస్తాను. తర్వాత అంతా ఆ భగవంతుని దయ” అన్నాను

“అమ్మా! నాకు అస్సలు తనతో వుండాలని లేదు. కానీ నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే. అందుకే నీవెట్లా చెప్తే ఆలా. రేపే తనను ఇక్కడకు పిల్చుకొచ్చి దించుతాను. నీవంటే కాస్త భయం వుంది. నీవు పిల్చావంటే మారు మాట్లాడకుండా వస్తుంది” అని చెప్పి వెళ్ళిపోయాడు.

నేను నా అనుభవాన్నంతా రంగరించి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాను. చూద్దాం ఎంత వరకు సఫలమౌతానో. ఇలాంటి మూర్ఖపు కేసులు చాలా చూసాను… నావరకైతే బంధాలు భాంధవ్యాలకే మొదటి ప్రధాన్యత. నా ఇంట్లోనే విడాకుల కష్టం వస్తుందనుకోలేదు. నా కొడుకుకు విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ తర్వాత మళ్ళీ ఇలా జరగదని నమ్మకం లేదు. మనస్ఫూర్తిగా వాళ్లు కాపురం చేసుకుంటారని నమ్మకం లేదు. అక్కడైనా సర్దుకుపోవడం తప్పదు అదే ఇష్టపడ్డదాంట్లో కాస్త ప్రేమన్నా ఉంటుంది అనిపించింది. చూద్దాం భగవంతుడు వీళ్ళ బంధాన్ని ఆశీర్వదిస్తాడా లేక. … ఎందుకో మనసు చాల భారంగా అనిపించింది.

***

“రండి అత్తయ్యగారు, రా సరితా” అంటూ ఎంతో సాదరంగా ఆహ్వానించింది సువర్ణ. నా బంగారం. ఎన్నోరోజుల తర్వాత వచ్చామన్న సంతోషంతో ఏవేవో కబుర్లు చెబుతోంది ఏ కల్మషం ఎరుగని ఎటువంటి మేకప్పుఅవసరం లేని సువర్ణ. సువర్ణతో పిల్లలతో మాట్లాడుతూనే సరితను గమనిస్తున్నా. మధ్యతరగతి పిల్ల విడాకులు అంటే కాస్త భయపడ్డట్టే వుంది. మేకప్ తగ్గలేదు కానీ అనవసర ప్రేలాపన లేదు.

నేను కేవలం అత్తగారి లాగే మాట్లాడుతున్నా. ప్రత్యేకంగా ఏమి చెప్పటం లేదు. కానీ ఎప్పుడూ సువర్ణకు దగ్గరగా వుండేట్టు మాత్రం చూసుకుంటున్నాను. మాటలు చేయలేనివి చాలా వున్నాయి. చూసి నేర్చుకోవాలి కొన్ని. మొదటి రెండు రోజులు సరిత, సువర్ణను పట్టించుకోలేదు తన ధోరణే. కానీ ఇప్పుడు మెల్లగా సువర్ణను గమనిస్తూందని అనిపిస్తూంది.

ఈ రోజు నేను కోరుకున్నది జరిగింది. నేను రెండు రోజులుగా ఈ ప్రయత్నమే చేస్తున్నాను. కావాలని సువర్ణ పిల్లలతో ఉన్నప్పుడు సరితను సువర్ణతో ఉంచేదాన్ని. తల్లి!!! ఎంతకాదన్నా ఎన్ని విషయాలున్నా పిల్లల విషయాలు పంచుకోవడానికే మొదటి ప్రాధాన్యత… ఇక్కడా ఇదే జరుగుతోంది… ఈ రోజు పిల్లలు తల్లిని వెతుకుతూ సరిత దగ్గరకొచ్చారు. వారి మాటలను గమనిస్తూ కూచున్నా వారికి కనిపించకుండా.

“పిన్నీ, అమ్మ ఎక్కడికెళ్లింది” అడిగింది నా మనవరాలు.

“బయటకెళ్ళింది బుజ్జి వచ్చేస్తుందిలే” అని అనునయంగా చెపుతోంది. అంతేనా పిల్లలతో కలసిపోయి ఏవేవో కబుర్లు చెబుతోంది. ఈ లోపు సువర్ణ రావడం చూసాను. నా మనసులో ఒక సన్నివేశం అనుకున్నాను. అది అనుకున్న విధంగా జరిగితే సరిత మనసును, మనిషిని చదివే అవకాశం వస్తుంది. నేనకున్నట్టు జరగాలని అనుకున్నాను. అదిగో సరిగ్గా సువర్ణ రావడం పైనుంచి గమనించిన నా మనవరాలు తన తల్లిని చూడగానే తను పిన్నితో మాట్లాడుతున్నా… సరిత చేయి విదుల్చుకొని వెళ్లి తన తల్లిని గట్టిగా కౌగలించుకొని ఏవేవో కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. నేననుకున్న సన్నివేశం అనుకున్నట్టు జరిగింది. ఇప్పుడు సరితా భావాలను చదవాలి అని తనను గమించటం మొదలు పెట్టా. తను పలకరిస్తున్న విన్పించుకోకుండా తల్లిని చూసి పరిగెత్తిన నా మనవరాలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తల్లి బిడ్డలా అనురాగం చూసి అప్రయత్నంగా తన కడుపును నిమురుకోవడం నా చూపుని దాటిపోలేదు. నా మనసు నెమ్మదించింది కాస్త కుదుటపడింది.

నా జీవితానుభవం గెలిచింది. మాటలు చేయలేని పనులు మనసు చేస్తుంది… మౌనం చేస్తుంది…. మన కళ్ళు చేస్తాయి. నేను తనకు ఏ గీతా బోధన చేయదల్చుకోలేదు. కొన్ని సార్లు మాటలు ఆవేశాన్ని పెంచుతాయి. అందుకే నాకు విడాకుల విషయం తెలీనట్టు వుందామన్నాను. చిన్నాతో ఇదే విషయం సరితకు కూడా చెప్పమన్నాను. ఇంక నేను చేయాల్సిన పని నాకర్థం అయ్యింది.. కావాలని సువర్ణ పిల్లలకు అన్నం పెట్టే సమయానికి సరితను అక్కడుండేటట్టు చేసేదాన్ని. నేను తనలోని తల్లిని తట్టి లేపాలనుకుంటుంటే అదనంగా తనలోని భార్య కూడా లేచింది. ఇంకేం మనసుకు కమ్మిన పొరలు తొలగడానికి ఎంతో సమయం పట్టదు… అంతే కదా…

రామ్ నిర్లక్షాన్ని సరిత గమనించడం నా చూపును దాటిపోలేదు. అదొకటేనా రామ్ నిర్లక్ష్యాన్ని చిరునవ్వల మాటున దాచే సువర్ణను చూసింది. ఒకసారి మనసు గమనించటం మొదలు పెడితే అది ఒక దానితో ఆగదు… అంతేకాదు.. ఆడా అయినా మగా అయినా తెలియకుండానే పోలిక మొదలవుతుంది. నాకు తెలిసి ఈ పాటికి అమోఘ్ ప్రేమను రామ్ నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా పోల్చుకోనుంటుంది. తల్లి భావన కలిగాక ఇంకో పెద్ద మార్పు….

పొద్దున్నే లేచి వంట గదిలోకి రావటం మొదలైంది… సువర్ణ చెప్పే కబుర్లు తనకు చాల నచ్చినట్టున్నాయ్. బాగా కలిసిపోయింది. తోబుట్టువులు లేకపోవం కూడా సరిత పెంకితనానికి కారణం అయ్యుండొచ్చనిపించింది.. మేకప్పు!!! రోజు రోజుకు తగ్గుతోంది. ఇంకో సంతోషం ఏమిటంటే సువర్ణ అడుగు జాడల్లో నడవటం. ఇక్కడ పడిపోయా. నిజమే ఇది పుట్టుకతో వచ్చిన నైజం కాదు.

ఇక!!! నా అమోఘ్ సంసారానికి ఏ ఢోకా లేదు. వాడు తొందరపడ్డా కామేశ్వరి గారు అలోచించి నాకు చెప్పటం మేలైంది. ఆవేశంలో విడిపోయుంటే ఎవ్వరు సుఖంగా వుండేవాళ్ళు కాదు. దులుపుకుపోయే వాళ్ళు సరే, సున్నిత మనస్కులకు ఇది మనసుమీద పెద్ద గాయం చేస్తుంది. ఇంకేం మార్పు మొదలవ్వలేకాని ముందుకుపోవడం ఎంతసేపు. నాతో మాట్లాడడానికి జంకే సరిత ఇప్పుడు సువర్ణతో కలిసి ఎన్నో కబుర్లు చెబుతోంది.

ఒక మంచి మార్పుకు దేవుని సహకారం కూడా ఉంటుంది అనడానికి… ఇవాళ తలవని తలంపుగా సువర్ణ బంధువులు వచ్చారు. వారు అందరికి పరిచయం వున్న పేరుమోసిన సినీ ప్రొడ్యూసర్. వారు సువర్ణ దగ్గరి బంధువులని తెలిసి ఆశ్చర్యపోయింది సరిత. అంతేనా పార్టీకి రావట్లేదని సారీ చెప్పి సువర్ణకు ఓ వజ్రాలహారాన్ని బహూకరించారు. సువర్ణ వాళ్లకు తన తోడికోడలని సరితను గౌరవంగా పరిచయం చేసింది. మాములుగా తనో అద్భుత సౌందర్యరాశి అని చెప్పుకునే సరిత మిన్నుకుండిపోయింది… ఎందుకంటే ప్రొడ్యూసర్ పెళ్ళాం అలనాటి హీరోయిన్ మరి. అంతే కాదు… కాగల కార్యాలు గంధర్వులు చేసిపెట్టినట్టు… వారు తమ మాటల్లో తమ కూతురిని అమోఘ్ ఇవ్వాలనుకుంది… వాడు వద్దని చెప్పి తనను పెళ్ళి చేసుకుంది విని అవాక్కయింది… హీరోయిన్ కూతురు ఎంత అందగత్తె అందరికి తెలుసు… సరితలో సంభ్రమాశ్చర్యాలు దాగలేనంతగా కనిపిస్తున్నాయి. ఒక సినిమా హీరోయిన్ కూతురిని వద్దని తనను పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసినప్పటినుంచి అహం వెనక్కు వెళుతూ ప్రేమను ముందుకు పంపిందని కనపడుతోంది.

వాళ్ళు వెళ్ళాక ఆ వజ్రలహారం అందరికి చూపింది. నా పెద్ద కోడలు. అంతేనా…. ఈ పార్టీ కానుకగా తోడికోడలికి తనూ ఒక వజ్రాల హారాన్ని కానుకగా ఇచ్చింది.. ఇదిగో సరిగ్గా ఇక్కడే తన అహం పటాపంచలైంది. సువర్ణ పుట్టింటివాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలిసొచ్చింది. అన్నీవున్నా ఎంతో సాధారణంగా వుండే సువర్ణను చూసి ఆశ్చర్యపోయింది. సువర్ణ మానసిక సౌందర్యం ఆమె అందానికి ప్రతిబింబం అని కొద్దికొద్దగా తేట తెల్లమైంది. తను మా ఇంటికి ఏ మాత్రం తూగదు అన్న విషయం బోధపడింది. కేవలం ఇది తన భర్త ప్రేమ అని అర్థం అయ్యింది. నాకు తెలిసి ఈ పాటికి అంతర్మథనం మొదలయ్యుండాలి…. నా మనసు హాయిగా నవ్వింది…

ఇంకో విశేషం ఏమిటంటే వచ్చి వారం గడుస్తున్నా భర్తతో ఫోన్లు లేవు మేసేజ్లు లేవు… కానీ ఇదిగో ఇప్పుడే నా కొడుకు మెసెజ్ పెట్టాడు ‘కుశలమా’ అంటూ మెసెజ్ పెట్టిందిట సరితా. అందుకు ఏమిటి విషయం అని అడుగుతూ నాకు మెసేజ్.

నేను “ఏమని సమాధానం ఇచ్చావు” అని అడిగా.

“బాగున్నాను, నీవేలా వున్నావు అని అడిగాను” అన్నాడు.

ఇంకో విషయం తేటతెల్లమైంది. వాడికి సరితoటే ప్రేమ అలాగే ఉంది. సరిత చేసిన పనికి ఆవేశపడ్డాడు అంతే. ఇది చాలు ఒక బంధం నిలవడానికి. ఇంకేం మార్పు పట్టాలెక్కింది చూస్తుండగానే వేగం పుంజుకుంది. తన స్వభావం, గుణగణాలు తెలుసుకుందామని అనుకున్నా. కానీ దేవుడు మార్పును బహూకరించాడు. బహుశా ఎన్నో వివాహ బంధాలను విడాకుల నుండి కాపాడినందుకు నా కొడుకు జీవితాన్ని కానుకగా ఇచ్చాడు.

ఇంకేం పార్టీ రోజు రానే వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు చాల మంది వస్తున్నారు. ఎంతో సాదాసీదాగా ఎటువంటి మేకప్ లేకుండా నా ఇద్దరికోడళ్లు అచ్చ తెలుగింటి ఆడబిడ్దల్లాగా ముస్తాబయ్యారు. వారిద్దరూ కలిసి మెలిసి పనిచేసుకుంటుంటే చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. నాతో కూడా మరో రెండు కండ్లు ఉంటే బాగుండు అనుకుంటున్నంతలో నా కొడుకు ఆమోఘ్ నన్ను గట్టిగా వాటేసుకున్నాడు…. వాడు చాలాసేపటినుంచి గమనిస్తున్నాడుట అక్క చెల్లెళ్లను. అంతే!!! తన పెళ్ళాం తను కోరుకున్నవిధంగా ఉండడంతో ఆనందం అంబరాన్ని తాకింది…. మరి ఆ కోపం ఎటుపోయిందో. నాకు థాంక్స్ మీద థాంక్స్ చెప్తున్నాడు. భడవ!!! ఇంత ప్రేమ మనసులో పెట్టుకొని విడాకులంట!!! విచక్షణ లేని ఆవేశం కాకపోతే… వాడ్ని గోముగా తలపై రెండు మొట్టికాయలు వేసా…

ఈలోపు సరితా వాడిని చూసి సిగ్గుల మొగ్గయింది.. కళ్ళలో ఉప్పొంగిన ప్రేమ… ఎప్పుడెప్పుడా భర్తను చేరాలని ఆరాటం… దాని సిగ్గును చూసి మావాడు ఈలోకంలో లేడని అర్థం అయ్యింది. ఇంకెందుకు ఈ జంట మధ్య నేను. మనస్ఫూర్తిగా నిండు నూరేండ్లు పిల్లాపాపలతో ఉండమని దీవించి నా ప్రియమైన కోడలి దగ్గరకు చేరుకున్న తనకు సాయంగా…..

వివాహం ఎన్నెన్నో జన్మలబంధం… కాదంటారా!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here