కజకిస్తాన్ పర్యటన

1
3

[box type=’note’ fontsize=’16’] మధురమైన అనుభూతులను హృదిలో నింపుకున్న తమ కజకిస్తాన్ పర్యటన విశేషాలు వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]మే[/dropcap]ము చాలాకాలంగా వెళ్ళాలనుకుంటున్న కజకిస్తాన్ లోని అల్మాటికి వెళ్ళాము. అక్కడికి చేరగానే మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్‌పోర్టు నుండి హోటల్‌కి వెళ్ళాము. లగేజి అక్కడ రూములో పెట్టి బయట తినడానికి బయల్దేరాము. మా రిసెప్షనిస్ట్ రెస్టారెంట్ అడ్రస్ చెప్పింది. మేము రెస్టారెంట్‍కి వెళ్లగానే అక్కడ రాజ్‌మాతో చేసి ఉడకబెట్టిన గుగ్గిళ్ళ కూర, కొద్దిగా అన్నం, ఆలుగడ్డతో చేసిన కూరతో తిన్నాము. చాలా చప్పగా వుంది. మేము తీసుకెళ్ళిన కారంపొడి చల్లుకొని తినేశాము.

తిన్న తరువాత మెయిన్ స్ట్రీట్‌కి వెళ్ళి. అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి తింటున్నాము. చాలా రద్దీగా వున్న స్థలం అది. మనసుకు ఎంతో నచ్చిన రాగాన్ని వింటూ ఆ ఐస్ క్రీమ్ తిని రూమ్‌కి వచ్చిపడుకున్నాము.

కజకిస్తాన్ అనే పదము తుర్క పదము. ఆదిమ జాతులైన “Cossack” (కసక్) అనే జాతి నుండి వచ్చింది. ఈ కసక్ ప్రజలు నివసించే స్థలము అని అర్థం. కజకిస్తాన్ ఇంతకు మునుపు రష్యాలో భాగం. ఇప్పుడు 18.3 మిలియన్ల జనభా. 13వ శతాబ్దంలో మంగోలియా రాజు చంగీజ్‌ఖాన్ పరిపాలన. 18, 19 శతాబ్దంలో రష్యా పరిపాలన.

ఇది సిల్క్ రూట్‌లో ఒక దేశం. ఈ సిల్క్ రూట్‌లో వెళ్ళాలని ఎన్ని రోజుల నుండి కోరిక ఇప్పుడు తీరింది. ఈ మార్గంలో అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళినపుడు. “Here real game for a warrior horse rider” అన్నారు. అంటే గుర్రంపై స్వారి చేసే యుద్ధ యోధులకు అనువైన స్థలం అని పేర్కొన్నారు. “బెర్నాడు గ్రెహిమెక్” అనే జర్మనీ యాత్రికుడు కజకిస్తాన్ అని పేర్కొన్నారు.

అలాగే హువాత్సాంగ్ Khagan అనే రాజుని అతని పుస్తకంలో వర్ణించారు. రాజు పచ్చటి రిబ్బన్, సాటిన్ రిబ్బన్‌ని నడుముకి కట్టుకొని తెల్లటి సిల్క్ రిబ్బన్ తలకి కట్టుకున్నాడు అని రాశారు. ఈ గొప్పవారు నడిచిన ప్రదేశంలో తిరుగుతూ వుంటే… వింత అనుభూతి!

మర్నాడు మా టౌన్ పాకేజ్‌లో ఒక అతను, అమెరికా నుండి ఇద్దరు ఆడవారు వచ్చారు. ఇద్దరు ఆడవారిలో ఒకమ్మాయి కెనడా చిట్ట చివరి భాగమైన మంచుతో కూడిన ప్రాంతంలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.

ఆ అమ్మాయి మాకు పరిచయం అయిన తర్వాత తన గురించి అడిగాను. ఆమె అంటార్కిటికాలో వున్న -48° డిగ్రీల చలిలో 3 నెలలు మాత్రమే పనిచేస్తారట. మిగతా 9 నెలలు తనకి ఉద్యోగంలో సెలవులు. 3 నెలలు ఏదైతే సంపాదిస్తుందో ఆ 9 నెలలకి సరిపోయేంత జీతం. అందువలన తను 9 నెలలు ప్రయాణాలు చేస్తూనే వుంటారు. నాకు ఆ అమ్మాయి ఉద్యోగం చాలా నచ్చింది. ప్రయాణాలు ఇష్టమున్న వారికి నచ్చిన ఉద్యోగం. అంటే ఆ 3 నెలలు తను వున్న స్థలంలో ఎవ్వరూ మాట్లాడటానికి కూడా వుండరు. ఆ చోటుకి మనం వెళ్లడానికి కూడ వీలు లేదు. అంతటి కఠోరమైన స్థలం. వెళ్ళడానికి ఒక పడవ నెలకో రెండు నెలలకో ఒకసారి వెళ్తుంది. ఆ వచ్చిన పడవలో వారికి నెలకి సరిపడా ఆహారాన్ని తీసుకుంటారు. ఆ అమ్మాయి ఆ మూడు నెలలు ఒక సన్యాసి జీవితం గడపాలి. చాలా ఆశ్చర్యకరంగా చూశాను ఆ అమ్మాయి ఈ సంఘటనలు చెప్పినప్పుడు.

అయితే తను మాతో పాటు 20 రోజులు ట్రిప్‌లో వున్నారు. ఈ 20 రోజులు తను ప్రతిరోజు 20 కి.మీ. నడిచింది. తనకి ఆ ప్రాంతంలో ఎవ్వరూ మాట్లాడే వారు లేక ప్రతి రోజు అలా నడుస్తూనే వుంటుందట. అది ఒక మంచి అలవాటు. ఆ అలవాటు వల్ల తను యూరప్ మొత్తం కాలినడకన ప్రతిరోజు 25 నుండి 35 కి.మీ. నడుస్తూ; యూరప్ మొత్తాన్ని చుట్టి వచ్చింది.

నేను మావారు ఈ పాకేజ్ లోకి వెళ్ళిన తర్వాత మేము వున్న 20 రోజులు ప్రతిరోజు 15 కి.మీ. నడిచాము. ఒకరు తోడుగా వుండే అందరం అనుసరించాం. చాలా సంతోషంగా గిరగిరా అన్ని పార్కులు చుట్టి వచ్చాము.

మరొక స్త్రీ అంతగా కలగలుపు మనిషి కాదు. చాలా ముభావంగా వుండేది.

లెవరైతే మాతో పాటు వచ్చిన అమెరికా అతను, చాలా బ్రిలియంట్. అతనికి 58 సంవత్సరాలు వుండవచ్చు. చాలా రకాల ఉద్యోగాలు చేశారట. ఒక ఎడిటర్‌గా కూడ పనిచేశారు. అందరం కల్సి రోజూ 12 నుండి 15 కి.మీ. నడిచే వాళ్ళము. వున్న ఆ 20 రోజులు చాలా హాయిగా గడిపేశాము.

మర్నాడు ప్రొద్దుననే మేము సిటీ టూర్‌కి బయల్దేరాము. మేము పాకేజ్ టూర్ టాక్సీలో గైడ్, డ్రైవర్, మేము నల్గురము కల్సి టూర్‌కి బయల్దేరాము.

మేము ఒక సంగీత వాయిద్య మ్యూజియంకి బయల్దేరాము. ఈ సంగీత వాయిద్యాలతో కూడిన ఈ మ్యూజియం ముందుకి వెళ్ళగానే ఆ దేశ భక్తి గీతాలతో ఎంతో మంది సైనికులు బారులు తీరి వున్నారు. వారు వారి జెండాకి జెండా వందనం చేస్తున్నారు. మేము అందరం త్వరగా పరుగెత్తుకుంటూ వెళ్ళి వారి మార్చ్‌ఫాస్ట్ చూశాము. కొన్ని వీడియోలు, ఫొటోలు తీసుకొనివారి జాతీయగీతం విని వారికి శెల్యూట్ చేసి మ్యూజియంకి వెళ్ళాము.

   

మ్యూజియం లోకి వెళ్ళగానే అక్కడ టికెట్లు కొని లోపలికి వెళ్ళాము. ఆ మ్యూజియం లోకి వెళ్ళగానే కజక్ భాషలో ఒక గైడ్ వున్నారు. ఇంగ్లీషులో చెప్పడానికి మరొక గైడ్ వున్నారు. ఈ అమ్మాయి గైడ్‌గా మాకు ఆ మ్యూజియం గురించి వివరంగా చెప్పటం మొదలు పెట్టారు. అందులో 7 గదులు వున్నాయి. 2 గదులలో కజకిస్తాన్‌కి సంబంధించిన సంగీత పరికరాలు వున్నాయి. మిగతా 5 హాల్స్ లో వివిధ దేశాలకు సంబంధించిన సంగీత వాయిద్యాలకు సంబంధించిన పరికరాలు వున్నాయి. ఇందులో ఒక పరికరము పేరు Dombra – string – plucked instrument. ఇది డోం రా (Dombra). దీనికి తీగలు వున్నాయి. క్రింద తంబుర లాగ వుంది. దీనినే వారు Dombra అంటున్నారు. ఇది 19వ శతాబ్దానికి చెందినది. ఇది లెక్క, ఎముక, మరియు (gut) అంక్రముతో తయారు చేయబడింది. అలా ఎన్నో వందల పరికరాలు తప్పెట, వీణ, తంబుర,

పిల్లనగ్రోవి (flute), గజ్జెలు, గిటార్, తబల, మంగళవాయిద్యాలు, అలా మేము 700 రకాలు వివిధ దేశాలలో వాడే పరికరాలు 7 హాలులలో భద్రంగా భద్రపరిచారు.

అన్నింటిలో ఆశ్చర్యకరమైన విషయమేమింటంటే ఒకరాజు తన ఏడుగురు కొడుకులు యుద్ధంలో చనిపోతే అతను ఆ ఏడుగురు కొడుకుల పేరుతో 7 తీగలతో ఒక పరికరాన్ని తయారుచేసి అవి పాడుతూ వుంటాడు. వారు చెప్పిన దాని ప్రకారం 7 సరిగమపదని తీగలు 7 శబ్దాలు. ఈయననే సృష్టికర్త అని చెప్పారు. ఇప్పటికీ ఎవరైనా చనిపోతే ఆ పాటనే పాడ్తారట దుఃఖంతో.

ఇలా ఎన్నో రకాల సంగీత వాయిద్యాలతో ఎంతో అందంగా అలంకరించారు. అవన్నీ చూచి హైదరాబాద్ విభాగంలోకి రాగానే మన హైదరాబాదువి కూడ సంగీత పరికరాలను ప్రదర్శించారు. సుమారు 120 వాయిద్యాలని ఇక్కడ ఎంతో శ్రమకోర్చి ఈ పరికరాలను సేకరించారు. చాలా ఆశ్చర్యంగా అన్పించింది. అక్కడ నుండి ఇక్కడి ప్రదర్శన కూడ మన తెలంగాణాకి చెందిన అన్ని వాయిద్య పరికరాలను ప్రదర్శించారు.

అక్కడ్నించి మేము నగరంలో ఉన్న కేబుల్ కార్ దగ్గరకి వెళ్ళాము. అక్కడ మేము ఆరుగురం ఒక కేబుల్ కారులో పైకి వెళ్ళాం. అక్కడ ఎంతోమంది ఒక రెస్టారెంట్‌లో కూర్చుని కాఫీ, స్నాక్స్ తీసుకుంటున్నారు.

పై నుండి క్రిందకి చూస్తే మొత్తం నగరం కనిపిస్తుంది. అక్కడ వారి సాంప్రదాయానికి చెందిన వస్తువులున్నాయి. తప్పెటలు పెయింటింగ్ వేసి అక్కడ దుకాణాలలో అమ్ముతున్నారు.

అక్కడ చిన్న టాయ్ ట్రెయిన్ ఉంది. అందులో కూర్చుని ఫోటోలు దిగి ఒక గంట గడిపి అక్కడి నుంచి క్రిందకి దిగివచ్చాము. వచ్చేదారిలో ‘జిందగీ ఏక్ సఫర్’ అనే పాట పాడాను. దాని అర్థం మావారు ఇంగ్లీషువారికి చెప్పారు. వారు చాలా బాగా పాడుతున్నావు అని మెచ్చుకున్నారు.

అక్కడి నుంచి క్రిందకి దిగి వచ్చిన తర్వాత సిటీ సెంటర్‌లో వున్న ఒక స్తూపం, మరియు ఆ దేశానికి చెందిన శిల్పాలు వున్నాయి. అవి చూస్తున్నప్పుడు మాకు మన భారతీయులు కన్పించారు. ఇలా ఎందుకు వచ్చారని వారిని అడిగాను. కజకిస్తాన్ అమ్మాయిని మన ఇండియన్ అబ్బాయి అమెరికాలో కలిసి పెళ్ళి చేసుకున్నాడట. కజకిస్తాన్‌లో అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఆ దేశం చూడడానికి ఆ వియ్యంకులు ఆ ఇండియన్ అబ్బయిని, అతని తల్లిదండ్రులని ఆహ్వానించారట.

గైడ్ అన్ని ప్రాంతాల గురించి వివరిస్తూ ఉన్నారు. మేము ఉన్న చోట రెండవ ప్రపంచ యుద్ధంలోని సైనికుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ విగ్రహాల గురించి వారు మాకు వివరంగా చెప్పి, చూపించారు.

       

అక్కడ నుంచి మేము మా రూమ్‌కి వెళ్ళి పడుకున్నాము. మర్నాడు మేము అలా ఒక లేక్‌కి వెళ్దామని అడిగితే 300 యుఎస్ డాలర్లని చెప్పారు. అమ్మో, అంత కాస్ట్‌లీనా, వద్దులే అనుకుని అక్కడ ఉన్న ఇతర పర్యాటక ప్రదేశాలు చూశాము.

కజకిస్తాన్‌లో ముఖ్యమైన, పెద్దదైన సిర్దార్యా నది గురించి తెలుసుకున్నాం. దాని తీరంలో వేలాదిమంది నివస్తున్నారట. ఆ నది గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. వరి, పత్తి, కూరగాయలు, పళ్ళు ఈ నదీజలాలతో పండించబడుతున్నాయి.

కజకిస్తాన్ లో 10 నగరాలు వున్నాయి. 1) Almaty, 2) Nursultan, 3) Shymkent, 4 Taraz, 5) Turkestn, 6) Karaganda, 7) Ust-Kamenogorsk, 8) Aktau, 9) Semey, 10) Uralsk

మర్నాడు మేము ‘బిగ్ లేక్’ చూడడానికి బయల్దేరాము అక్కడ ఆ ‘బిగ్ లేక్’ చూడడానికి ఒక అబ్బాయి రోడ్డు మీద లేక్ బొమ్మ పట్టుకొని నిలబడి వున్నాడు. అతనిని ‘బిగ్ లేక్’కి వెళ్ళడానికి అడిగితే సరే అని ఒప్పుకున్నాడు. అక్కడి నుండి ఈ అల్మాటి లేక్ ఆల్ఫైన్ రిజర్వాయరు. ఇది ట్రాన్స్ లి అలటావు పర్వతాలలో వుంది. అల్మాటి నుండి 15 కి.మీ.. ఈ చెరువు (lake) సముద్రపు మట్టం నుండి 2511 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ లేక్‌కి వెళ్ళేటప్పుడు Alpine forest mountains ఎత్తైన కొండలు. కనుచూపు మేరలో లోయలు ఎత్తైన లోయలలో సెలయేరులతో ఎంతో అందంగా వుంది. ఆ దారి పొడుగునా ఈ లేక్-అల్మాటి నగరానికి నీటిని సరఫరా చేస్తుంది.

   

అక్కడికి చేరగానే ఆ చెరువు అందానికి ముగ్ధురాలిని అయిపోయ్యాను. నీలి మేఘాలు క్రిందికి దిగుతూ ఆ ఆల్పైన్ కొండలతో దోబూచులాడుతున్నాయి. మూడు ప్రక్కల ఆ పర్వతాలలో చిక్కని నీలం రంగులో ఆ చెరువు. అందాలు నమ్మశక్యం కాని ఆ చెరువు అందాలు చూడడానికి 4000 మంది వరకు వచ్చారు. కొందరు పిక్నిక్ లాగ అన్ని వండుకొని వచ్చి తింటున్నారు. కొందరు చిన్న పర్వతాలపై ఎక్కి ఫొటోలు తీసుకొంటున్నారు. ఎంత చూచినా తరగని అందం. అబ్బురపడి 3 గంటలు అక్కడే కూర్చుని తనివితీరా చూచి మళ్ళీ వెనక్కి వచ్చేశాము.

మధురమైన అనుభూతులను హృదిలో నింపుకున్న పర్యటన ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here