ఎండమావులు-17

0
3

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 17వ భాగం. [/box]

35

[dropcap]సూ[/dropcap]ర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, రాత్రి అవుతోంది. ఆ రాత్రి సమయంలో రాజ్యమేలిన ఆ రజనీ బాలను తరిమివేస్తూ వెలుగు రేఖలు పుడమిపై పుసరిస్తున్నాయి. రోజులు కూడా అలా చక చకా గడిచి పోతున్నాయి.

“సినీమాలో నీకు పాటలు పాడ్డానికి చాన్సు ఇప్పిస్తాను, నీ కంఠమే నీకు ప్లస్ పాయింటు. నీది కోకిల కంఠం, ప్రస్తుతం సినిమాలో పాడుతున్న గాయనీ గాయకులు నీ దగ్గర ఎందుకూ పనికిరారు. కేవలం పాడ్డమే కాదు సినీమాలో నటించే చాన్సు కూడా నా పలుకుబడి ఉపయోగించి ఇప్పిస్తాను. ఇది పొగడ్త కాదు. నిజం, సెంట్ పర్సెంటు నిజం” రాజధాని నగరంలో ఎ.సి. రూమ్‌లో సరస్వతిని తన బాహుబంధంలో బందించి తమకంతో అంటున్నాడు మోహన్.

అతని ఆలింగనంలో మొదట్లో మైమరిచిపోయి ఇదే జీవితం అనుకున్న సరస్వతికి రాను రాను తన్మయత్వం – మైమరపు కలగటం లేదు. అతని తీపి తీపి కబుర్లకి పొంగిపోవడం లేదు. ఇప్పుడు ఆమెకి పట్టుకున్నది తన భవిష్యత్తు గురించి చింత. హోటల్లో ఏ.సి. రూమ్‌లో ఇలా గడుపుతూ నెల రోజులవుతోంది. ఈ నెల రోజులూ తిండి తిన్నప్పుడు తప్ప తలుపులు బిగించి తనను మోహను ఓ ఆట బొమ్మను చేసి తన ప్రమేయం లేకుండానే తన శరీరంతో ఆడుకోడమే అతని పని.

తాను పట్టుకున్నది చింత కొమ్మకాదు. సున్నితమైన మునగ కొమ్మ. ఈ మోహన్ ఎప్పుడు తన చేయి జారపోతాడో, ఎప్పుడు ఆ కొమ్మ విరిగిపోతుందో, తనని ఏకాకిగా చేసి అర్ధాంతరంగా వదిలి ఎప్పుడు అతను ఉడాయిస్తాడోనన్న భయం ఆమెకి.

డైరక్టరు కోదండపాణి దగ్గరకు తీసుకెళ్ళాడు మోహను సరస్వతిని. కోదండపాణి సత్యమూర్తికి స్నేహితుడు.

“ఏంటోయ్ మోహన్! ఇలా వచ్చావు? నీ చదువయిపోయిందా? ఆ మధ్య మీ మామయ్య సుందరికీ నీకూ పెళ్ళి జరిపించి నీచేత ప్రాక్టీసు పెట్టిస్తానన్నాడు. ఏంటి సంగతి? ఎవరీ అమ్మాయి. ఏంటి కథ?” రహస్యం కనిపెట్టిన వాడిలా కళ్ళెగరేసి గలగల నవ్వుతూ అన్నాడు కోదండపాణి.

సరస్వతి ఎదురుగా అతనలా నవ్వేటప్పటికి మోహనుకి చిరాకనిపించింది. సరస్వతి లేని సమయంలో ఇలాంటి ప్రస్తావన వస్తే హాయిగా నవ్వేసి ఎంజాయ్ చేసి ఉండేవాడు. సరస్వతి కోదండపాణి మాటల సారాంశం పసిగట్టేస్తుందనేదే అతని బాధ.

“ఈవిడ మా బంధువుల అమ్మాయి, పేరు సరస్వతి, సంగీత పాఠాలు అందరికీ చెప్తుంది. చక్కగా పాడుతుంది. మీరు తీయబోయే సినీమాలో ఈమెకి పాడ్డానికి చాన్సు ఇస్తారని…” మోహను మాటలు విన్న కోదండపాణి ఆలోచనలో పడ్డాడు.

మోహన్ పక్కదార్లు పడున్నట్టు అనిపించింది అతనికి.

“ఓకే! సాయంత్రం ఆరు గంటలకి నన్ను కల్సుకో! నువ్వు ఒక్కడివే వస్తే చాలు. ఆ అమ్మాయిని తీసుకు వచ్చే అవసరం లేదు” అన్నాడు కోదండపాణి.

“థాంక్యూ సార్!” అన్న మోహన్ సరస్వతిని తీసుకుని బయలుదేరాడు .

విషయమంతా ఫోనులో సత్యమూర్తికి వివరించాడు కోదండపాణి.

సత్యమూర్తి అతనికి మోహను సరస్వతిని లేపుకుపోయిన విషయం తెలియజేస్తూ, తాము వచ్చేవరకూ వాళ్ళు అక్కడ నుండి జారిపోకుండా చూడమని చెప్పాడు.

సాయంత్రం మోహన్ తిరిగి కోదండపాణిని కల్సుకోడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కోదండపాణి ఎవర్తోనో మాట్లాడుతున్నారు. మోహన్ని చూసి బయట కుర్చీలో కూర్చోమని చెప్పాడు. కోదండపాణిని మనస్సులో తిట్టుకుని మోహను బయటకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

తను డాక్టరు. అంతే కాకుండా ప్రముఖ న్యాయవాది సత్యమూర్తికి మేనల్లుడుని ఈ కోదండపాణి తనకిచ్చిన విలువ ఇదా?

ఈ గురుడు తన గురించి కనిపెట్టేసి ఉంటాడు. తను ఈ సరస్వతిని లేపుకు రావడం ఎంత తప్పయింది? విస్సుగ్గా కుర్చీలో ఇటు – అటు కదుల్తూ ఆలోచిస్తున్నాడు.

కోదండపాణి వచ్చేప్పటికి చాలా సమయం పట్టింది. కావాలనే ఆలస్యం చేసాడు. ఈలోపున సత్యమూర్తి వస్తాడని మోహాన్ని భద్రంగా అతనికి అప్పగించవచ్చని కోదండపాణి ఆలోచన.

“ఏంటోయ్ మోహన్! నిన్ను ఇలా కూర్చోబెట్టానని కోపం వచ్చిందా? ఆ వచ్చిన వాళ్ళు ఒకంతట వదల్లేదు. ఏఁ చేయగలను. సారీ!” అన్నాడు.

“అబ్బే…! అదేఁ లేదండి.”

“ఆఁ….! ఇప్పుడు చెప్పు. నీవు తీసుకువచ్చిన అమ్మాయికి నేను తీయబోయే సినిమాలో పాట పాడ్డానికి చాన్సు ఇప్పించమంటావు అంతేనా?” అన్నాడు.

“అవునం…” నీళ్ళు నముల్తూ అన్నాడు మోహన్.

“నీవీ అమ్మాయిని ఇక్కడికి తీసుకువస్తున్నట్టు మీ మామయ్యకి తెలుసా?”

కోదండపాణి ప్రశ్నకి గతుక్కుమన్నాడు మోహన్. అతని వాలకం ఓ కంట కనిపెడ్తున్నాడు కోదండపాణి.

“మోహన్”

గంభీరంగా పిల్చాడు కోదండ పాణి ఉన్నట్టుండి. అతని వంక కంగారుగా – ఆందోళనగా దోషిలా చూశాడు మోహన్.

విషయమంతా అర్ధమయింది కోదండపాణికి.

“మేమూ నీ వయస్సులో తొందర పడ్డాం – కక్కుర్తిపడ్డాం. ఇప్పుడు కూడా కక్కుర్తిపడున్నాము. అయితే మనకి సుఖాన్ని ఇచ్చే మనుష్యులే మన సర్వస్వం అనుకుని మెడకి కట్టుకుని తిరగటం లేదు. ఇలాంటి వాళ్ళు శాశ్వతంగా మన దగ్గర ఉంచుకోడానికి తగని వాళ్ళు. సమాజంలో మన విలువ పెరగాలంటే – గౌరవం నిలవాలంటే ఇలాంటి వాళ్ళతో మన సంబంధం గుట్టుగానే ఉండాలి. గడ్డి పువ్వులాంటి ఇలాంటి ఆడవాళ్ళుని గులాబీపూలగా భ్రమించి చేరదీయకూడదు. నేను చెప్తున్నది నీకు విసుగ్గా ఉండవచ్చు. అయితే ఒక్క విషయం. కోరికల వలయంలో చిక్కుకున్న నీవు సుఖాన్ని – వెరైటీ మీదున్న మోజులో ఈ సరస్వతిని లేపుకొచ్చేసేవు బాగానే ఉంది. నీవు చేసిన ఈపని వలన నీ సమస్యలు మరింత జరిలమవుతాయి. ఈ ప్రపంచంలో లక్ష్మి లేకపోతే ఏ సమస్యా పరిష్కారం కాదు. లక్ష్మి ఉంటే సుఖాలు వాటంతట అవే వస్తాయి. అదే ఆ లక్ష్మి అంటే మా సుందరి. ఆమె విషయం ఏం చేయదల్చుకున్నావు? డాక్టరు హోదాలో ఈనాడు ఉన్నావంటే మా లక్ష్మీ అదే ఆ సుందరే కారణం కాదా? నాకూ సుందరి కూతురితో సమానం. ఆ సుందరి ఆశలు అడియాశలు చేయకు. అసలే ఆత్మాభిమానం గల పిల్ల. తట్టుకోలేదు.

అంతే కాదు. నీవు పది కాలాలు సిరి సంపదలో – హోదాతో ఉండాలంటే ఇలాంటి మనుష్యుల్ని వదిలించుకోడమే మంచిది. అయితే శాశ్వతంగా వదిలివేయమని చెప్పను. సుందరితో కాపురం చేస్తూ ఇలాంటి మనుష్యుల్నుండి చాటుమాటుగా సుభాలు కొనుక్కోవచ్చు” కోదండపాణి గలగలమని నవ్వుతూ అన్నాడు. అతని నవ్వుకి అనుకూలంగా అతని బాడీ కూడా క్రిందకి మీదకి ఊగుతోంది. అమోమయంగా అతని వంక చూస్తున్నాడు మోహన్.

ఇలా కోదండపాణి ఉపదేశం చేయడం – ఆ ఉపదేశాన్ని మోహన్ మనన చేసుకుంటున్న సమయంలో తుపాను వచ్చినంత స్పీడులో సత్యమూర్తి సుందరిని వెంట బెట్టుకుని వచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయాడు మోహన్

“ఓరీ అప్రాచ్యుడా! నీకే పోయ కాలంరా! కామంతో కళ్ళు మూసుకుపోయిన నీకు ఉచ్చం నీచం తెలియకుండా పోయిందా? ఆ పెళ్ళయిన బిడ్డ తల్లి, సంగీతం మేష్టరమ్మా నీకు కావల్సివచ్చిందా? ఎంత పన్జేసేవురా? తల్లి పాలు త్రాగి ఆమె రొమ్ము గుద్దిన విధంగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవు గదురా! నీవు ఈనాడు ఈ స్థాయికి ఎదిగా వంటే దానికి కారకు లెవరో తెలుసా….!” చింత నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో ఆవేశంగా అరుస్తున్నాడు సత్యమూర్తి. అపర కాళికావతారం ఎత్తింది సుందరి.

“ఆ జేష్ఠముండ ఏది? చంపేస్తాను. ఏ బాధేనా సహించవచ్చుకాని సవితి పోరు సహించలేము. మిమ్మల్నిద్దర్నీ చంపి నేను చస్తాను. సంగీత పాఠాలు చెప్పడానికి వచ్చింది నా కంటినే పొడుస్తుందా? నా ఆస్తినే కాజేయ చూస్తుందా?” ఆడ నాగులా బుసకొడూ ఊగిపోతూ ఉంటోంది సుందరి.

“శాంతించండి. శాంతించండి” కోదండపాణి వాళ్ళ ఆవేశం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు.. అయితే అతని ప్రయత్నం వృథా అవుతోంది. తలవొంచుకుని కూర్చున్నాడు మోహన్.

“నేను ఇంత వరకూ అతనికి చేసిన ఉపదేశాలకి పైత్యం దిగిపోయి ఉంటుంది. యథార్థం తెలుసుకుని ఉంటాడు. చచ్చిన పాముని మరి చంపకండి. ఆవేశం తగ్గించుకోండి” ఆ తండ్రీ కూతుళ్ళని శాంత పరుస్తూ అన్నాడు కోదండపాణి.

36

అంతవరకూ బాల్కనీలో నిలబడి నిలబడి మోహన్ కోసం ఎదురుచూస్తున్న సరస్వతికి విసుగు వచ్చింది. రాత్రి పది గంటలయింది. ఇంకా రాలేదేంటి మోహన్? ఆ కోదండపాణి లేదా? అతనితో ఇంకా మాట్లాడుతూ కూర్చున్నాడా? గడపదాటి వచ్చిన ఆడదానికి సమాజంలో తన స్థానం ఎలా ఉంటుందో తనకి తెలుసు. ముందుచూపు లేకుండా చేసిన పనికి ఫలితం ఇది. ఇప్పటికే తన విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయే ఉంటుంది.

తన భర్త సారధి ఎంత మంచివాడు? అతడ్ని వదిలి వచ్చేక గాని అతని విలువ తనకి తెలియలేదు. మాతృత్వపు విలువల్ని కాలరాచి – వాత్సల్యాన్ని ప్రక్కకి నెట్టేసి – వంశ పరువు ప్రతిష్ఠల్ని మంట గల్పి – కుటుంబాన్ని అప్రతిష్ట పాల్జేసింది. తను చేసిన పనిని తల్చుకుంటూ ఉంటే శరీరం కంపిస్తోంది. హృదయం బాధతో నిండిపోతోంది. ఏ అజ్ఞాత భయమో తనలో ప్రవేశిస్తోంది.

బాల్కనీలో నుండి గదిలోకి పోయి తలుపులు వేసుకుని దిగులుగా కూర్చుంది. ఆ ఏ.సి రూమ్ లో కూడా ఆ సమయంలో అగ్నిగుండం మధ్య ఉన్నట్లనిపించింది. తన కొడుకు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్లు ఊహిస్తున్న దృశ్యం ఆమెలో ఆవేదన మరింత పెంచింది.

కాలింగ్ బెల్లు మ్రోగింది. ఆలోచనలో మునిగి తేలుతున్న సరస్వతి ఉలిక్కిపడి బాహ్య జగత్తులోకి అడుగు పెట్టింది. “మోహను వచ్చి ఉంటాడు” అనుకుంటున్న సరస్వతి తలుపు తీయడానికి వెళ్ళింది.

ఎదురుగా సత్యమూర్తి – అగ్ని కురుపిస్తున్న నేత్రాల్తో సరస్వతిని భస్మం చేద్దామన్నంత కోపంతో చూస్తున్నాడు. బుసకొడున్న ఆడనాగులా కనిపించంది సుందరి. దొంగను పట్టినంతగా సంబర పడుతూ కనిపించాడు కోదండపాణి. వారి మధ్య అపరాధిలా తల వొంచుకుని నిలబడ్డాడు మోహను.

ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి భయ కంపితురాలయింది సరస్వతి. ఆ ఏ.సి.రూమ్‌లో కూడా ఆమె శరీరమంతా చమటలు పట్టడం ఆరంభించింది. కాళ్ళు వణకుతున్నాయి. ఆమె కాళ్ళ క్రింద భూమి కంపిస్తోంది. నాలుక పిడచ కట్టుకు పోయింది.

సరస్వతి కూడా తప్పు చేసినదానిలా తలవొంచుకుని ప్రక్కకి తప్పుకుంది. ఒక్కమారు లోనికి చొరబడ్డారు ఆ బయటనున్న వ్యక్తులు,

“మా అమ్మాయికి సంగీత పాఠాలు చెప్పమని నిన్ను అపాయంట్ చేసాము కాని మా మోహన్‌కి ప్రేమ పాఠాలు చెప్పమని, వాడిని వల్లో వేసుకుని వాడితో లేచి పోవడానికి కాదు. నువ్వెంత? నీ బ్రతుకెంత? ఏ ధైర్యంతో నీవింత పనికి తెగించావు? పరువు ప్రతిష్ఠలు గల కుటుంబం నుండి వచ్చిన ఆడ కూతురువని ఉపేక్షిస్తున్నాను, లేకపోతే వ్యభిచార నేరం క్రింద నిన్ను అరెస్టు చేయించే వాడిని జాగ్రత్త. కాల నాగుని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నావు. కాని ఆ కాల నాగు కాటు వేస్తుందని తెలుసుకోలేక పోతున్నావు. నీ నీడ తిరిగి మా వాడి మీద పడ్డానికి వీల్లేదు” సత్యమూర్తి కంఠం కఠినంగా పలుకుతోంది.

“నా జీవితంలోనే నిప్పులు పోద్దామనుకున్నావుటే? నీకెన్ని గుండెలే! జాగ్రత్త, నేను తల్చుకుంటే నిన్ను ఇక్కడే నరికేద్దును. అయితే నాలో మిగిలి ఉన్న మానవత్వం నన్ను ఆపని చేయనీయటం లేదు. అందుకే బ్రతికి పోయావ్. లేకపోతేనా…? అయినా నిన్నని లాభమేఁటి? మా బంగారం మందిచి కానప్పుడు.

ఇప్పుడు నీ బ్రతుకేంటయిందో చూడు. అటు కట్టుకున్న వాడి దగ్గర నీ స్థానం పోయింది. ఇక్కడ ఈ మోహనుని నీకు దక్కనీయను. నీ బ్రతుకు దీపానికి ఆకర్షింపబడి దాని చుట్టూరా తిరిగి చివరకు ఆదీపంలోనే పడి నాశనమయిన దీపపు పురుగు విధంగా నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. అయింది కూడా. ఛీ….. ఛీ….. ! ఛండాలురాలా! నీకిదే తగిన శిక్ష అనుభవించు” హేయ భావాన్ని వ్యక్తం చేస్తూ సుందరి సరస్వతి ముఖం మీద తుపుక్కున ఉమ్మేసింది.

“ఇంకా నా కోపం తీరటం లేదే! నిన్ను చంపేద్దామనుకున్నాను. అయితే చెప్పేను కదా నాలో ఆ మిగిలి ఉన్న మానవత్వం వల్లే బ్రతికిపోయావు. నిన్ను శారీరకంగా చంపను. మానసికంగా చిత్రవధకి గురిచేస్తాను. కుళ్ళి కుళ్ళి ఏడ్వాలి. నీవు చేసిన వెదవ పనికి తగిన ఫలితం నీవు అనుభవించాలి. ఎవ్వరూ నీ మీద జాలి చూపరు. నిన్ను అసహ్యించుకుని పిచ్చికుక్కని తరిమినట్లు తరిమేస్తారు. పతనమైన నీ జీవితాన్ని తల్చుకుని కుమిలిపోతూ మానసిక క్షోభతో మనశ్శాంతి లేకుండా; ఏ అందం చూసి నీవు విర్రవీగుతున్నావో ఆ అందమే నీకు శత్రువై నీటి బుడగలా రపున పేలిపోయి పతనమైన నీ జీవితానికి సాక్షిగా రోగాలో పుచ్చిపోయి ఓ రోడ్డు మీద అనాథలా చస్తావు. ఇదే నా శాపం” ఆడ బెబ్బులిలా అరుస్తూ అంటోంది సుందరి.

“చూడమ్మాయ్! ఇన్నాళ్ళూ పరువుగా బ్రతికావు అయితే ఇది నీ తప్పో లేక పోతే మా వాడి తప్పో లేకపోతే మీ ఇద్దరి వయస్సుల తప్పో ఇలా రోడ్డున పడ్డారు. మా వాడ్ని తీసుకుని పోతున్నాము. ఇదుగో ఈ డబ్బు తీసుకుని తగిన అండని వెతుక్కుని పో!” అంటూ వంద రూపాయల నోట్లు సరస్వతి మీద విసరి మోహన్ని తీసుకుని బయలుదేరారు సత్యమూర్తి, సరస్వతికి నవనాడులూ కృంగిపోయాయి. తన బ్రతుకు అంధకారమయింది. ఇప్పుడు తనకి దిక్కెవరు? ఏంచేయాలి? ఇటువంటి విషమ పరిస్థితిలో తనకి చావే తప్ప మరో దారి లేదు. తలుపు గడియ పెట్టి వచ్చిన సరసర్వతి పక్క మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన ఆమెకి మగతగా కునుకు పట్టింది.

రోజూ లాగే తెల్లారింది. కాలింగ్ బెల్ మ్రోగిన శబ్దానికి ఆమెకి మెలుకువ వచ్చింది. నీరసంగా కళ్ళు తెరిచింది. ఆకలి బాధకంటే హృదయం పిండి చేస్తున్న ఆవేధనా భారంతో హృదయం బరువెక్కుతోంది. తడబడ్తున్న అడుగుల్తో లేచి తలుపు తీసింది.

ఎదురుగా హోటల్ యజమాని ఆమెవంక రహస్యం తెలిసిపోయిందన్నట్లు వెకిలిగా చూస్తూ నవ్వాడు. అతని చూపుల్లో తనపై చులకన భావం అగుపడింది. గడపదాటి వచ్చిన ఆడదానికి సమాజంలో గల స్థానం అప్పుడు – ఇప్పుడు ఎప్పుడూ అదే. ముసలాడి దగ్గర నుండి మూతి మీద మీసం మొలుస్తున్న కుర్రాడు వరకూ అందరికీ తన లాంటి వాళ్ళంటే లోకువే. తనలో ఉన్న చంచల స్వభావమే తన పతనానికి నాంది అయింది. అదే తనలో గల బలహీనత,

“నిన్న రాత్రి వరకే మీరు డబ్బు చెల్లించారు. నిన్ను కొట్టుకొచ్చిన వాడు జారుకున్నాడు. ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రూమ్ ఖాళీ చేసి వెళ్ళు” అతని మాటల్లో ఆజ్ఞ – చులకనతనం – వ్యంగం.

అతని తీరు చూసి అతని మీద చాలా కోపం వచ్చింది సరస్వతికి అయితే తనున్న పరిస్థితిలో ఏం చేయలేని నిస్సహాయ స్థితి తనది. తలవొంచుకోడమే తప్ప తనేఁ చేయగలదు?

మర్యాదా లేకుండా అతని ఏకవచన సంబోదన ఆమెను మరింత మన స్తాపానికి గురి చేసింది. ఆమె నిస్సహాయ స్థితి అతనికి ఆనందం కలిగించింది. నిధి దొరికినంతగా సంబర పడిపోతున్నాడు. దిక్కులు చూస్తున్న సరస్వతికి సత్యమూర్తి తనవైపు విసిరిన నోట్లు అగుపించాయి. ఆ డబ్బు తను ముట్టకూడదు అని మొదట అనుకుంది. కాని ఆ సమయంలో ఆమె పాలిట కల్పవృక్షం. కామధేను వయింది. తన మాన మర్యాదలు కాపాడుకోవడానికి ఆ డబ్బే శరణ్యమయింది.

ఆ నోట్లు తీసి తనవైపు అడుగులు వేస్తున్న సరస్వతిని చూస్తున్న అతను గతుక్కుమన్నాడు. ఆమె కనుదోయి ఎర్ర గన్నేరు పువ్వులా ఉంది. ఆవేశంతో ఆమె శ్వాస ఎగిసి పడుతోంది.

“మేనేజర్” గట్టిగా అరిచినట్లు పిలిచింది సరస్వతి. ఆమె వంక బిత్తరి చూపులు చూస్తున్నాడు హోటల్ మేనేజర్.

“నేనేఁ బజారు సరుకుని కాను. ఈ విషయం తెలుసుకో. నా రోజులు బాగులేక – నా కర్మకాలి అడ్డమైన లోఫరు వెదవల చేత నానా మాటలు తినే పరిస్థితి వచ్చింది. నీ ప్రవర్తనలో నాకు సంస్కారం అగుపడలేదు. సంస్కారహీనుడయిన నీవు ఓ ఆడదాని స్థితిగతులు తెలుసుకునిన జాలి చూపించవల్సిన నీవు ఇలా ప్రవర్తిస్తావా? ఇంద డబ్బు. నీకు కావల్సింది డబ్బే కదా! చులకనగా మాట్లాడ్డం మానుకో!” అంటూ అతని వైపు నోట్లు విసిరింది. తలుపులు మూసేసింది. మేనేజరు బిత్తరపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here