[dropcap]“చే[/dropcap]ను దున్నతా చెత్త తీస్తా పంట కొస్తా కూలోళ్లు
రాసులు పోస్తా మూటలు మోస్తా కూలోళ్లు
పని పని పని అని కూలిపని అని తమపని కూలిపని అని
కూతలేసే కూలోళ్లు కుశాలు పడే కూలోళ్లు” అంటా గుట్ట పైన కూకొని కూనిరాగం, తీస్తావుంటాడు అబ్బిగాడు.
గుట్టపక్కలానే పెద్ద ఇంగ్లీషు సదువుల ఇస్కూలు వుంది. ఊర్లాన్ని చిన్నోళ్లంతా తూముడు తూకం (పదికేజీల) వుండే బ్యాగులు తగలేసుకొని ఆ ఇ స్కూలుకి పోతావుండారు.
వీళ్లని చూసిన గబ్బిగాడు. “ఈ చిన్నోళ్లకి వాళ్లు మోసేకి కానంత బరువుండే బుక్కు లేమిటికి ఆ సదువులేమికి” అంటా ఆ అబ్బిగాన్ని అడిగె.
“కూలిపని చేసేకిరా” గబ్బుక్కున అనే వాడు.
“అరె! అబ్బిగా కూలిపని చేసేకి కడుపుకి అంత కూడు వుంటే సాలు కాదా! ఇట్లా ఇస్కూలు సదువులు కావాలనా?” అందాజు చేస్తా అనే వీడు.
“రేయ్! గబ్బిగా వీళ్లు మనట్లా కూలోళ్లు కాదురా, తెల్లదొరల తాకి పనిచేసేకిపోయే కూలోళ్లు, దేశం దాటిపోయే కూలోళ్లు” తిరగా అనె.
ఆ మాట యింటానే గబాలున నోరు తెరచిన గబ్బిగాడు ఆకాశము పక్క చూసే. అబిటికే పొద్దప్పడు (సూర్యుడు) పడమర పక్కకి పయనమవ్వతా వుండాడు.
“రేయ్! అబ్బిగా నీ మాట నిజమేరా పొద్దప్పడు కూడా పడమర పక్కకి పోతావుండాడు కూలిపని చేసేకేమో” అనె.
“గుగ్గునామాలా గబ్బిగా పొద్దప్పడు తనపని తాను చేస్తా పోతావుండాడు. వీళ్లట్లా వాళ్ల తావ కూలిపని చేసేకి కాదు” అని అరిసె అబ్బిగాడు.
*అందాజు – ఆలోచన