[box type=’note’ fontsize=’16’] “‘అప్రధానంగా’ తోచే ఇలాంటి విషయమ్మీద మనల్ని ఆలోచించమని బలవంతపెడుతుందీ చిత్రం” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఛప్పాక్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఒ[/dropcap]క్క క్షణమే ఇక్కడ వున్నది
ఒక్క క్షణం అంతే : పోయింది!
ఒక కంటి కొరివి చూపుకి
ఒక ప్రపంచమే మసైపోయింది
అంతా మండి మసైపోయింది.
గుల్జార్ పాట అరిజిత్ నోట.
మేఘనా గుల్జార్ “తల్వార్” తీసినపుడు అది ఫ్లూక్ గా బాగా వచ్చిందేమో అని సందేహించిన వారు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన “రాజీ” అలాంటి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేసింది. ఇప్పుడు ఈ “ఛప్పాక్” రాజీ అంత కాదు గాని, చాలా శక్తివంతమైన సినెమానే. స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాలలో తక్కువ స్పందన పొందుతున్న “ఆమ్ల దాడుల” మీద తీసిన కథ ఇది. ఈ మధ్య వస్తున్న బయోపిక్కుల లాగే ఇదీ వొక రకంగా బయోపిక్కే. నిజంగా జరిగిన కథకు కావలసినంత కల్పనలు జోడించి అల్లిన కథ. 2005లో తన పదహారో ఏట లక్ష్మి అగర్వాల్ వొక 32 ఏళ్ళ యువకుడి ఆమ్ల దాడికి గురైంది. కారణం అతని ప్రేమను ఆమె అంగీకరించకపోవడమే. అయితే మిగతా వారిలాగా ఊరుకోక లక్ష్మి కోర్టులో కేసు నమోదు చేసి, ఏళ్ళ తరబడి స్థిరంగా ఎదుర్కొని చట్టంలో మార్పును తేగలిగింది. అది పాక్షిక విజయం. ఇదివరకట్లా కాకుండా ఆమ్లమును ఎలాంటి అదుపూ, విధానం, క్రమం లేకుండా అమ్మడానికి లేదు. అయితే ఆమె కోరిన విధంగా పూర్తి బేన్ కాలేదు, పైగా ఇప్పటికీ 30 రూపాయలకే ప్రతిచోటా తేలికగా దొరుకుతుంది.
సినెమా మొదట్లోనే మాలతి (దీపికా పడుకోన్) పడుతున్న ఈతి బాధలు చూపిస్తారు. తన మీద ఆమ్ల దాడి జరిగి ఏళ్ళు గడిచిపోయాయి. తన ముఖము అనాకారిగా మారిపోయి వుంది. అయితే జీవికకోసం ఏదో పని కావాలి. షిరాజ్ (పాయల్ నాయర్) ఆంటీ (ఆమె దగ్గరే తన తండ్రి పనిచేస్తాడు) మాలతి వైద్యానికయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది. ఆమె మీద మరింత భారం పెట్టకూడదని ఇప్పుడీ ఉద్యోగాల వేట. కొన్నాళ్ళు బ్యూటి పార్లర్ లో చేస్తుంది. కాని బ్యూటి పార్లర్ కి వచ్చేవాళ్ళు అందమైన ముఖాలనే చూడాలని ఆశిస్తారు అంటూ ఆమెను వేరే పనేదైనా చూసుకోమంటుంది యజమాని. ఇక ప్రతి చోటా ఆమె అనాకారి ముఖం కారణంగా పని దొరకదు. అలాంటప్పుడు అమోల్ (విక్రాంత్ మాస్సి) పరిచయమవుతాడు. అతను ఆమ్ల దాడులకు గురైన యువతుల న్యాయం కోసం, వారి పునరావాసం గురించీ వొక ఎన్‌జీఓ తరపున పనిచేస్తుంటాడు. మాలతిని కూడా తనతో పనిచెయ్యమంటాడు. ఆమె ఒప్పుకుంటుంది. మాలతి వ్యక్తిత్వం అమోల్ మీద గట్టి ప్రభావాన్నే వేస్తాయి. కారణం ఆమె బేలగా మారకుండా దాడి అనంతరం కూడా వెన్ను నిటారుగా వుంచి తన జీవితాన్ని తన చేతుల్లోంచి జారనివ్వదు. పైగా కోర్టుల్లో PIL వేస్తుంది, ఏసిడ్ అమ్మకాన్ని నిషేధించాలని. కోర్టు కేసులన్నాక ఏళ్ళు గడిచిపోతాయి. ఈ లోగా మాలతి ఎన్నో ఎగుడు దిగుళ్ళను చూస్తుంది. చాలా చోట తన ముఖం చూసి మనుషులు స్పందించే తీరును ఆమె తల ఎత్తుకునే కళ్ళల్లో సూటిగా చూస్తూనే ఎదుర్కొంటుంది. చాలా దీర్ఘమైన ఈ పోరాటంలో ఆమె అనేక రకాలుగా కనిపిస్తుంది. కాని ఆమె ధైర్యం తగ్గిన ప్రతిసారీ అమోల్ ఆమెకు తన శక్తితో పునర్ పరిచయం చేయిస్తాడు. కలిసి పనిచేస్తున్న ఆ ఇద్దరిలో మానసిక దగ్గరితనం కూడా వస్తుంది. ఆమె కోరుకున్నట్టు ఏసిడ్ బేన్ అయితే అవదు కానీ దాని అమ్మకం మీద నియంత్రణ వుండాలని తీర్పు వస్తుంది.
ముఖ్యంగా స్త్రీ రేప్ కు గురైతే మన సమాజం స్పందించినంత తీవ్రంగా ఆమ్ల దాడులకు స్పందించదు. ఎందుకంటే ఈ పురుషస్వామ్యంలో ఆడదాని పాతివ్రత్యం కీలకం. దాన్ని అంటిపెట్టుకునే వుంటాయి కుటుంబ మర్యాద, సమాజ మర్యాదానూ. అయితే రెప్పపాటు కాలంలో అమ్మాయి మొహం మీద ఛపాక్ మని (వొక ద్రవాన్ని అలా విసిరినపుడు వచ్చే చప్పుడు అది, మనం రివ్వున ఎగరడం, దబ్బున పడటం లాంటివి వాడతామే అలా) ఏసిడ్ పోస్తే ఆమె జీవితాంతం ఆ అనాకారితనంతో బతకాల్సిందేనా? అది కేవలం ఆమె అందం మీదే కాదు, ఆమె ఆత్మ మీద, ఆమె ధైర్యం మీద, ఆమె సామాజిక పరిస్థితి మీద వొకటేమిటి అనేక రకాలుగా అది దాడి చేస్తుంది. మరి అలాంటప్పుడు ఆ నేరస్థుడికి శిక్ష, వొక వేడి టీ మనిషి మీద పోస్తే ఎంతో అంత. చాలా అన్యాయం కదూ. ఈ చట్టాలలో మార్పును తేవాల్సిన అవసరం గుర్తించే ఆమె పోరాడుతుంది న్యాయం కోసం. మగవాడికి నచ్చిన అమ్మాయి అతన్ని తిరిగి ప్రేమించకపోతేనో, అతనికి లొంగకపోతేనో, అతనికి ఎదురు తిరిగితేనో అతని పురుషాహంకారం ఏం కావాలి? తనకు దక్కని అమ్మాయి మీద ప్రతీకారం ఎలాగైనా తీసుకోవాలి అనుకుంటాడు. అందుకు తేలిక మార్గం వో ముప్పై రూపాయలు ఖర్చుపెట్టి ఏసిడ్ కొని ఆమె మీద వెయ్యడమే. అదీ బాహాటంగా, మనుషుల మధ్యనే, ఎలాంటి భయ సంకోచాలు లేకుండా. ఇలాంటివి మన చుట్టూ ఎన్నెన్నో జరుగుతూనే వున్నాయి. “అప్రధానంగా” తోచే ఇలాంటి విషయమ్మీద మనల్ని ఆలోచించమని బలవంతపెడుతుందీ చిత్రం.
వొక నిజ ఘటనని సినెమాగా తీసినపుడు అనివార్యంగా కొన్ని సినెమా ఎలెమెంట్లు కలపాల్సి వస్తుంది. అయితే ఇందులో వాటిని చాలా తక్కువ వుంచి, ఆ సెంటిమెంట్లు కూడా అదుపులో పెట్టి చూపించారు. మనకు కన్నీరు కంటే కోపమే ఎక్కువ వస్తుంది. పాత్రతో తాదాత్మ్యం చెందకుండా వొక వస్తునిష్ట దృష్టితో చూస్తాం. ఆమె బేలగా మారకుండా, ఏసిడ్ పోసింది నా ముఖం పైనే గాని, నా కలల మీద కాదు అన్న ఆత్మస్థైర్యంతో మెలగడాన్ని గర్వంగా చూస్తాం. సమాజంలో రావాల్సిన మార్పులు రెండు : వొకటి చట్టాలకి సంబంధించినది అయితే మరొకటి సామాజిక వర్తన గురించి. ఈ చిత్రం ఆ కోణాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కథనం ఆమె వైపునుంచే వుంది. ఆమె మీద ఏసిడ్ వేసిన వ్యక్తి గురించి, అతని ఆలోచనల గురించి ఎక్కువ చర్చ వుండదు. పిరికిగా వెనక్కు తగ్గిన ఆమె ప్రియుడి గురించీ ఎక్కువ చర్చ వుండదు. అవన్నీ చాలా క్లుప్తంగానే. మరో విషయం ఆమె మీద ఏసిడ్ పొయ్యడానికి అతను తన వదిన సహకారం తీసుకుంటాడు. అంటే పురుషస్వామ్యం స్త్రీలని కూడా తమకు కావలసినవిధంగానే మలచుకున్న రీతిని చూస్తాము. ఆమె 16వ యేట జరిగిన కథంతా చివర్లో అదీ క్లుప్తంగా వుంది.
ఇంత వివరంగా వ్రాయాల్సిన అవసరమున్న సంగతే. దీని గురించి చిత్రంలోని చిన్న చిన్న లోపాలని చూసీ చూడకుండా వెళ్ళొచ్చు. మేఘనా గుల్జార్ దర్శకత్వం, అతికా చౌహాన్-మేఘనా గుల్జార్ ల కథనం, దీపికా పడుకోన్-విక్రాంత్ మాస్సి ల నటన, మలయ్ ప్రకాశ్ ఫొటోగ్రఫీ, దీపికా కు ఆ మేకప్ చేసిన క్లూవర్ వూటన్, శంకర్ ఎహసాన్ లాయ్ ల సంగీతం అన్నీ బాగున్నాయి. అరిజిత్ సింఘ్ కు ఇలాంటి సాహిత్యం, సంగీతం దొరికితే తన సత్తా చూపించగలడు. ఎక్కువగా అరుపులతో వచ్చే అతని పాటల మధ్య ఇందులో “ఛపాక్ సె” పాట చాలా త్రుప్తిని ఇచ్చింది. వ్రాసింది ఎవరో కాదు, గుల్జార్. సినెమా మొత్తం ఘనీభవిస్తే ఈ పాట అవుతుంది. ఒక సారి వ్రాసినా మరోసారి బోల్డ్ అక్షరాల్లో వ్రాయాల్సినది దీపికా నటన, ఆ తర్వాత విక్రాంత్ నటన. వివిధ దశల్లో వివిధ రకాలైన ప్రొథెటిక్స్ తో నటించిన దీపికా ఆ పాత్రలోనే పరకాయ ప్రవేశం చేసింది. ముడతలు పడ్డ ఆ ముఖం లో నవ్వును చూసినపుడు కనపడేది ఆమె అల్లరి,ఆత్మ స్థైర్యం,సంకల్పం. కొద్దిపాటి విజయానికైనా ఆమె పార్టీ చేసుకుంటుంటే విక్రాంత్ వచ్చి అప్పుడే పార్టీలా, మనకింకా పూర్తి గెలుపు రాలేదు అని కోపంగా అంటాడు. అతని వైపు కళ్ళు చికిలిస్తూ, చిరునవ్వుతో అంటుంది ఆ ఏసిడ్ ఏదో నీ మీద పడ్డట్టే మాట్లాడుతావే, నేనైతే పార్టీ చేసుకుని తీరాలి అని. అంటే ఆ పోరాటం తో అతను ఎంతగా మమేకమయ్యాడో తెలుసుంది. ఎక్కువ భాగం కోపం, నిస్ప్రుహ, పోరాట దీక్ష కనబరిచే విక్రాంత్ ఆమె ప్రేమ ప్రకటన విని వొక్కసారిగా సిగ్గూ, చిరునవ్వూ కనబరచడం నాకు “మసాన్” లో విక్కి కౌశల్ ను గుర్తు చేసింది. “ఎ డెత్ ఇన్ గంజ్”, “లిప్స్టిక్ అండర్ బుర్ఖా” లాంటి చిత్రాలలో తన సామర్థ్యం ఇదివరకే చూపించి వున్నాడు విక్రాంత్. ఇది మరో చిత్రం.
ఇలాంటి చిత్రాలు ఇంకా అనేకం రావాలి.