[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది రెండవ భాగం. [/box]
3
[dropcap]చీ[/dropcap]ఫ్ యింజనీరుగారి ఆఫీసు ఆవరణలో డ్రాయింగ్ ఆఫీసు పక్కనే ఆపిన జీపులో, ముందుసీటులో, డ్రైవరు పక్కను కూర్చున్న వనితను చూసి చలనం లేకుండా నిలబడి పోయాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
అతనికి ఒక సంగతి తెలుసు – డాక్టర్ మోహన్‌కి ఇంకా వివాహం కాలేదని, ఇప్పటివరకు అతడు ఆర్కియాలజిస్టులంటే మగవాళ్ళే అయి ఉంటారని అభిప్రాయపడ్డాడు.
మరి ఈ బాబ్డ్ హెయిర్ సుందరి ఎవరు? ఆమె కళ్ళకు గాగుల్సున్నాయి.
టీ షర్టు వేసుకుందామె. ఫంట్లాం తొడుక్కుంది. ఒక చేతికి రెండు బంగారు గాజులు, రెండవ చేతికి రిస్టువాచి ఉన్నాయి. పెదవులకు రంగు లేకపోయినా అందంగా కనిపిస్తున్నాయవి. ఆమె యవ్వనాన్ని ఆ దుస్తులు దాచలేకపోతున్నాయి.
డ్రాయింగ్ ఆఫీసులో టేబిలు దగ్గరికి వచ్చి తనను పలకరించిన డాక్టర్ మోహన్‍ను కూడా రావు గుర్తు పట్టలేకపోయాడు. క్రిందటి సారి చూసినప్పుడు అతనికి ఫ్రెంచి గడ్డముంది. నోటిలో ఎప్పుడూ పైపు ఉండేది. ఆవెందుకు లేవని అతడు మోహన్‌ని ప్రశ్నించాడు.
“ఫీల్డులో పని చేసేటప్పుడు చాల సింపిల్‌గా ఉండాలి. పైపుకు టొబాకో ఒకప్పుడు దొరకకపోవచ్చు. చుట్టుపక్కల నాతో పనిచేసే వాళ్ళకు భిన్నంగా నేను గడ్డంతో వాళ్ళ మధ్యను తిరుగుతుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది” అన్నాడు మోహన్.
మగాళ్ళిద్దరూ జీపువేపు నడిచారు. ముందు సీటులో కూర్చున్న మహిళ కిందకి దిగలేదు.
“వీరు డాక్టర్ శశికళగారు. వీరు సుబ్రహ్మణ్యేశ్వరరావుగారు” మోహన్ ఒకరి నొకరికి పరిచయం చేశాడు.
ఆమె నమస్కారం మట్టుకు చేసింది. మరేం మాట్లాడలేదు.
సుబ్రహ్మణ్యేశ్వరరావు వారితో పాటు సైటుకి బయలుదేరాడు. రమారమి వది కిలోమీటర్ల తోవ. రోడ్డు కూడా అంత బాగుండదు. మగవాళ్ళద్దరూ వెనుకసీట్లలో కూర్చున్నారు. జీపుకు తగిల్చి ట్రెయిలరొకటుంది. దానిలో హెల్టాళ్ళు, పుస్తకాల పార్సెళ్ళు నిండి ఉన్నాయి. జీపులో పెట్టిన సామాన్లలో పెద్ద కాంటీన్ నిండి మంచి నీళ్ళున్నాయి.
“ఈ మంచినీళ్ళు దేనికి?” రావు ప్రశ్నించాడు.
“రెండు సంవత్సరాల క్రింద ఈ ప్రాంతాలలో కలరా తీవ్రంగా వ్యాపించింది కదా?” మోహన్ ప్రశ్నించాడు.
“అవునవును – రమారమి ఒక వందమంది శ్రామికులు చనిపోయారు”.
“లోయలో తవ్విన నూతులలో పడ్డ నీరు బాగా ఫ్లోరిన్ కలిసింది కదా?”
“అవును, అదికూడా నిజమే.”
“అందుచేత డాక్టర్ శశికళ కొన్ని షరతులు విధించారు. ఆమె స్నానానికి కూడా నూతినీరు ఉపయోగించనన్నారు. వడబోసి కాచి చల్లార్చిన కృష్ణవేణి జాలాలే తప్ప తాగనన్నారు. ఆవిడ వేరే నీళ్ళు ఉపయోగించరు, బాగానే ఉంది. నన్ను కూడా తాగవద్దని నిషేధించారు.”
“ఎందుచేత?”
“రోగం ఆమెకు వచ్చినా నాకు వచ్చినా ఒకటేనన్నారు. రోగం నాకు వస్తే మరీ ఇబ్బందన్నారు. డాక్టర్ల కోసం మందుల కోసం తను తిరగలేదని చెప్పారు. ఈ షరతులకు ఒప్పుకుంటేనే ఉద్యోగంలో చేరుతానన్నారు.”
“ఉన్న ఇబ్బందులు చాలక ఇవి కూడానా?”
“మరేమనుకున్నారు? త్రవ్వకాల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి.” అంది శశికళ.
ఆమెకు తెలుగు వచ్చునో రాదో అన్న సందేహం రావుకి తీరిపోయింది. టెంట్ల దగ్గరికి చేరేసరికి ముప్పావుగంట పట్టింది.
లోయలో ఎండ ముమ్మరంగా లేదు. జీపు నడుస్తుంటే గాలి చల్లగా తగిలేది.
టెంట్లు చాల పెద్దవి. ఒకొక్కటి పదహారడుగుల పొడవు పధ్నాలుగు అడుగులు వెడల్పు ఉన్న గదిలా ఉంది. ఒక పక్కను మంచం, టేబిలు, కుర్చీలు – మరొక వేపు సామాన్లు పెట్టుకోడానికి ఒక ఎనిమిదడుగుల బెంచి ఉన్నాయి. రెండు టెంట్లకు మధ్యను పన్నెండడుగుల దూరముంది. ఒక పక్కకు బాత్ రూము, సెప్టిక్ లెట్రిన్ ఉన్నాయి. మిగిలిన భాగం సిమెంటు చేసి దారిగా ఏర్పాటు చేశారు.
టెంట్ల దగ్గర ఒక మనిషి కాపలా ఉన్నాడు. వాళ్లు టెంట్లు చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది.
సంకుశల తండాకు నాయకుడు కాలా. అతని కోడలు లంబాడీ గూడెంలో ఉంది. జీపు మీద సుబ్రహ్మణ్యేశ్వరరావు వెళ్లి ఆమెను తీసుకొచ్చాడు. కాలా రెండో కొడుకు భార్య ఆమె. అతని పెద్ద కొడుకు ఆమధ్య చనిపోయాడు. అతని భార్యను రెండో కొడుకు పెళ్ళాడాడు. ఇది వాళ్ళ ఆచారం. పెద్దామె ఇంటి దగ్గర ఉండి తనకన్న చిన్న దానిని పంపించింది.
ఏ సామాన్లు ఎక్కడ పెట్టడమో శశికళ నిర్ణయించింది.
టైపు రైటరు, పుస్తకాలు, స్టేషనరీ ఆమె టెంటులో. డైనింగ్ టేబిలు కుర్చీలు మంచి నీటి ఫిల్టరు, వంట సామానులు, స్టౌలు అతని టెంటులో.
ఆమె వంటకు కుక్కరు తెచ్చింది. హెూటలు భోజనాలు ఆమెకు సరిపడవు. మోహన్ కూడా పైన తినడానికి వీలులేదు.
పొద్దున్న టెంట్లు ఊడ్చి నింపి శుభ్రంగానే ఉంచింది లంబాడీ సుందరి. ఆమె పేరు జావా, ఆమె భర్త పేరు హర్తరామ్. అతడు ఈ మధ్యనే పెళ్ళాడిన, అన్న భార్య పేరు బాలి. వాళ్ళకు నాలుగు ఆవులున్నాయి. రెండు ఎడ్ల జతలున్నాయి. వాళ్ళు సేద్యం చేసుకుంటారు. పాలమ్ముతారు. లంబాడీ గూడెంలో హర్తరామ్, అతని తమ్ముడు మెగ్యా పక్క పక్క యిళ్ళల్లో ఉంటున్నారు. మెగ్యా భార్య పేరు కమలి.
మెగ్యా తవ్వకాలలో పనిచేస్తున్నాడు. అతడు మేటుగా మంచి అనుభవం గడించాడు. తనకు పరిచయమున్న మరొక ఎనమండుగురు పనివాళ్ళను కలిసి, హైదరాబాదు నుంచి వచ్చే దొరకు సహాయం చేయక తప్పదన్నాడు. ఆ విధంగా ఒక యూనిట్ తయారయింది. వాళ్ళు జీతాల గురించి కూడా ఏమీ నిర్ణయం చెయ్యలేదు. హైదరాబాదులో తన మేనత్త మీద గౌరవంతో మెగ్యా ముందుకొచ్చాడు.
తెచ్చిన సామాన్లు ఎవరెవరి టెంట్లలో వారిని పెట్టించింది. శశికళ, ఆవిడ చాల పుస్తకాలు తెచ్చింది. అతడూ చాల పుస్తకాలు తెచ్చాడు. ప్రస్తుతానికి అన్నీ ఆమె టెంటులో వెడల్పుగా ఉన్న బెంచి మీద పెట్టించింది. టైపు రైటరు, తెల్లకాగితాలు, ఫైళ్ళు ఆమె టెంట్లో టేబిలు మీద ఉంచింది.
సర్దుకోడాలయాయి. కాళ్ళు చేతులు కడుక్కోడానికి, స్నానాలకు, మిగిలిన మామూలు పనులకు నూతి నీళ్ళు బాగుంటాయని, వంటకు త్రాగడానికి కృష్ణానదీ జలాలు తెప్పించుకోవచ్చని సుబ్రహ్మణ్యేశ్వర రావు సలహా ఇచ్చాడు. ఆమె చాల సేపు ఆలోచించి చివరకు అంగీకరించింది.
రమారమి రెండు గంటలయింది. సావకాశంగా వాళ్ళు ముగ్గురూ జీపు డ్రైవరూ ముందు టెంటులో లంచికి కూర్చున్నారు. దధ్యోజనం, పులిహోర, కూర, మెంతి కాయ వీటితో భోజనం పూర్తిచేశారు. వీటిని మోహన్ అమ్మగారు తయారు చేసి ఇచ్చారు.
దీపావళి వెళ్ళిన తరువాత బుధవారం ఫైట్లో డాక్టర్ శశికళ హైదరాబాదు వచ్చింది. మోహన్ తన ఇంటికి రమ్మని ఆమెను ఆహ్వానించాడు. కాని, ఆవిడ మోహమాట పడింది. అందుచేత ఆమెను హెూటలుకి దిగబెట్టి, ఏర్పాటులు పూర్తి చేసుకొని మరునాడు ఉదయం ఎనిమిదికే వచ్చి ఆమెను పికప్ చేశాడు. వాళ్ళు హిల్ కాలనీ చేరేసరికి పదకొండు గంటలయింది. అక్కడ కొంచెం సేపుండి టెంట్లకు వచ్చేసరికి పన్నిండయింది.
లంచి అయిన తరువాత శశికళ కొంచెం సేపు నడుము వాల్సి వస్తానని తన టెంటులోకి వెళ్ళిపోయింది.
జావా ప్లేట్లు కడిగి, తుడిచి బల్లమీద అన్నీ సర్దింది. సాయంకాలం పాలు పట్టుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. మంచినీళ్ళు కూడా రాత్రికి తెప్పిస్తానని చెప్పింది.
మోహన్ నర్సారావు పేట కాంపు కాటుమీద హెల్లాలు విప్పుకున్నాడు. మరో కాట్ రావు కోసం వేస్తానంటే అతడు ఒప్పుకోలేదు. మంచంతో సమానమయిన వాలు కుర్చీ మీద అతడు చేరబడ్డాడు.
“మోహన్! కొంచెం సేపు పడుక్కుంటారా?” రావు అడిగాడు.
“నాకు నిద్ర రావడం లేదు” అన్నాడు మోహన్.
“మీరు శశికళగారిని ఎందుకు సెలక్టు చేశారో నాకు అంతు పట్టకుండా ఉంది. ఆమె గురించి అంతకు ముందు మీకు తెలుసా? లేక, ఎవరేనా పెద్దవాళ్ళు రికమెండ్ చేశారా?”
“ఆమె ఎవరో నేనెరుగను. పెద్దవాళ్ళ రికమెండేషన్లు లేనేలేవు.”
“మరేకారణం చేత ఆమెను రిక్రూట్ చేశారు?”
“వినండి, కొంచెం వివరంగా, ఆంధ్ర దేశమేలిన శాతవాహనుల మీద నాలుగు సంవత్సరాలు పరిశోధన జరిపి 1957లో, నా సిద్ధాంతవ్యాసం విశ్వవిద్యాలయానికి సమర్పించాను. దానికి డాక్టరేటు పట్టం లభించింది. శాతవాహనులతో సంబంధమున్న వాడు ఆచార్య నాగార్జునుడు. ఆంధ్రభృత్యులుగా వ్యవహరింపబడుతున్న దక్షిణ ఇక్ష్వాకులు, శాతవాహనుల తరువాత రమారమి నూట ఏభై సంవత్సరాలు విజయపురి రాజధానిగా నాగార్జున కొండలోయలో పరిపాలించారు. ఈ వంశం గురించి ఈ మధ్య వరకూ ఎవరికీ బాగా తెలియదు. నాగార్జున సాగర్ డామ్ నిర్మాణం ప్రారంభమయింది. కొద్ది సంవత్సరాలలో శాశ్వతంగా కృష్ణానదీ జలాలలో ఈ విజయపురి మునిగిపోతుంది. మహామహులు నడుం కట్టి రంగంలోకి దిగారు.
జల్లెడ పట్టి లోయలో ఒక అంగుళం మేర కూడా విడిచి పెట్టకుండా వారు తవ్వుతున్నారు. మా గురువుగారు, డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యంగారి అకుంఠిత దీక్ష కారణంగా త్రవ్వకాలలో బౌద్ధ మందిరాల శిథిలాలు, మహోన్నతమైన ఆంధ్రుల సంస్కృతి బయట పడుతున్నాయి. రోజు రోజుకి నాలో తవ్వకాల మీద మోజు పెరిగింది”.
“మీరు డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యంగారి నడిగితే తప్పకుండా మిమ్మల్ని తన బృందంలో చేర్చుకునేవారే. చాల మంది యువ ఆర్కియాలజిస్టులకు వీరు శిక్షణ ఇచ్చి తీర్చి దిద్దుతున్నారు కదా!”
“అది నిజమే కాని, నాదంటూ ఒక కొత్త అధ్యాయం ఇక్ష్వాకుల చరిత్రలో వ్రాయాలని తపించాను. సంఘటితంగా అందరూ పరిశ్రమిస్తున్నారు. ఫలితాలను కూడా సమ భావంతో స్వీకరిస్తున్నారు. కాని, ఎవరు దేనిని కనుక్కున్నారో తెలియదు.”
“ఎవరు కనుగొన్నా ఆంధ్రుల దేశ చరిత్రను పటిష్టం చేయడానికే కదా ఈ ప్రయత్నమంతా!”
“చరిత్రకారులలో నావంటి స్వార్థపరులు కూడా ఉంటారు డాక్టర్ మోహన్. కనుగొన్న కొత్త విషయం వాటి కన్న ప్రత్యేకంగా ఉండాలని నేను వాంఛించాను. విశ్వ విద్యాలయం తరపున 1958 జూన్ నెలలో నాగార్జున కొండ లోయలో రెండెకరాల స్థలంలో జవాబు వచ్చింది అటువంటిదేమీ కుదరదని, చాల నిరాశకు లోనయాను. ఒక రోజు మా నాన్నగారి స్నేహితులొకరు విశ్వవిద్యాలయానికి వచ్చారు. వారు ఢిల్లీలో పత్రికా సంపాదకులుగా ఉన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నవారు చాలమంది తెలుసు. ఆయన నన్ను చూడడానికి వస్తే మాటల సందర్భాన వారితో త్రవ్వకాల గురించి ప్రస్తావించాను. ఆయన చాల సేపు ఆలోచించారు. కార్యం అనుకూలించదని అన్నారు. కాని మంత్రివర్గంలో ఒకరు తనకు బాగా తెలిసిన స్నేహితులని, వారితో మాట్లాడిన తరువాత ఏ సంగతి వ్రాస్తానన్నారు”.
“చాల బాగుంది, ఆశకు ఆస్కారం కలిగింది.”
“అన్ని దారులు మూసుకున్నాయని నేను కూడా నిరుత్సాహ పడ్డాను. కాని, ఒక నెల్లాళ్ళ తరువాత వారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆంపీ థియేటరుకు సమీపంలో ఎగుడు దిగుడుగా ఉన్న రెండెకరాల స్థలం ఉందని, అక్కడ త్రవ్వకాలు సాగించడానికి విశ్వవిద్యాలయం ద్వారా అప్లికేషను పంపమన్నారు. రమారమి నేను ప్రయత్నం మొదలు పెట్టిన పదిహేను నెల్లకు, 1959 సెప్టెంబరు మొదటి వారంలో ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. ఒక సంవత్సరం కాలంలో త్రవ్వకాలు పూర్తిచేయాలని, అవుడు లభించిన శిల్పాలను శాసనాలను ఇతర వస్తు సంచయాన్ని మ్యూజియం అధికారులకు అప్పగించాలని ఆర్డరులో ఉంది.”
“మీరు చాల అదృష్టవంతులు!”
“ఫలితం సాధిస్తే నిజంగా అదృష్టవంతుడినవుతాను”.
“ప్రయత్నం చేయడం మీ వంతు, ఇక్కడ ప్రతి రాతికి, ప్రతి శిథిలానికి, ప్రతి అంగుళం భూమికి ఏదో చరిత్ర ఉంది.”
“నాకు కూడా అదే నమ్మకం. ప్రభుత్వం నుండి అనుమతి లభించగానే పత్రికలలో ఒక ప్రకటన వేశాను. హిస్టరీలో పి.హెచ్.డి. చేస్తున్నవారు కాని, డాక్టరేటు పట్టం పొందినవారు కాని చరిత్రకు సంబంధించిన ప్రాజెక్టులో పని చేయడానికి సుముఖులుగా ఉంటే వెంటనే టెలిగ్రాము ద్వారా తెలియ పరచమన్నాను. వేతనం కూడా హెచ్చుగా ఉంటుందని ప్రకటించాను.
ప్రకటన పడిన వారం రోజులకి ముగ్గురి నుండి జవాబు వచ్చింది. వారం రోజులలో ఇక్కడ ఏర్పాటులు చేయడం కోసం వచ్చాను. అది మీకు తెలిసిన విషయమే.”
“చాల తక్కువ వ్యవధిలో ఎన్నో పనులు చేయవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం నుండి ఏభైవేల రూపాయలు గ్రాంటు చేయించుకున్నాను. అన్నిటికి డబ్బే ప్రధానం కదా!”
“ఈ డబ్బు సరిపోతుందా?”
“ఏం సరిపోతుందో! ఏభైవేల రూపాయల్లో ఆరువేలు అప్పుడే ఖర్చయాయి. అన్ని సదుపాయాలు, బోజనం, బస మొదలయినవన్నీ ఉచితంగా ఏర్పాటే చేసి, వేతనంగా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయమయింది.”
“ఒకవేళ మీరీ పని ఆరునెలల్లో పూర్తి చేయకపోతే?”
“మూడు నెలలు త్రవ్వకాలు జరిపితే ఒక విధమైన అభిప్రాయం కలుగుతుంది. అంతవరకూ అయినపని, అయన ఖర్చులు మొదలయినవి దృష్టిలో ఉంచుకొని, రాబోయే ఖర్చులెలా ఉంటాయో ఎస్టిమేటు చేయవచ్చు. అప్పుడు విశ్వవిద్యాలయాన్ని అదనపు నిధుల కోసం అర్థిస్తాను.”
“చాలా బాగుంది! ఇక చెప్పండి, శశికళ గారిని ఎందుకు రిక్రూట్ చేశారో?”
“ముగ్గురు అభ్యర్థులను రోజుకొకరు చొప్పున ఇంటర్వ్యూకి పిలిచాను. ఇద్దరు పి.హెచ్.డి. కోసం చేస్తున్న స్టూడెంట్లు. ఒకరు పి.హెచ్.డి. పట్టం పొందినవారు. ఒకతను విశాఖ పట్నం నుండి వచ్చారు. అతడు రెండు సంవత్సరాలయి దేశ చరిత్రలో ఆంగ్లేయయుగం గురించి పరిశోధన చేస్తున్నారు. ప్రాచీన భారత చరిత్ర గురించి అతనికి అంతగా తెలియదు. తనకు సంబందించిన విషయంలో పడితే పరిశోధన దెబ్బతింటుందన్నారు.”
“ఎవరయినా మీ నాయకత్వంలో పనిచేయవచ్చుకదా!”
“కాని అతడు అంగీకరించలేదు. రెండో అతడు తిరుపతినుంచి వచ్చాడు. అతడు మోగలాయి యుగం గురించి పరిశోధన చేస్తున్నాడు. అతడు కూడా నాతో పనిచేయడానికి ముందుకు రాలేదు.”
““మరే గత్యంతరం లేక మీరు శశికళ గారిని ఎంచుకున్నారా?”
“అదేంకాదు. ఎస్. చతుర్వేది అని ఆమె ఇచ్చిన టెలిగ్రాములో ఉంది. ఇంటర్వ్యూ కోసం నా ఛాంబరులోకి ఆమె ప్రవేశించేవరకు ఈ చతుర్వేది మహిళ అని తెలియదు.”
“ఈమె తెలుగు ఆడబడుచు కాకపోయినా తెలుగు బాగా మాట్లాడుతున్నారే!”
“అదే విశేషం. హైదరాబాదులో ఆమె పదిహేను సంవత్సరాలున్నారు. ఇక్కడ తెలుగు రెండవభాషగా బి.ఎ. ప్యాసయారు. వారి తండ్రిగారికి ఢిల్లీ బదిలీ అవడంతో వెళ్ళిపోయారు.”
“చాలా బాగుంది.”
“అమె ప్రాచీన గ్రీకు చరిత్రలో పరిశోధన చేసి పి.హెచ్.డి. తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు.”
“మరి వీరిలో ప్రత్యేకత ఏమిటి.”
“పరిశోధన నాలుగు సంవత్సరాలు చేశారు. గ్రీకు దేశంలో ఏథెన్సు విశ్వవిద్యాలయం ఆర్కియాలజీ శాఖ నిర్వహించిన త్రవ్వకాలలో ఒక సంవత్సరం పనిచేశారు. డాక్టర్ శశికళకు గ్రీకు భాషే కాక ఫ్రెంచి, జర్మనీ భాషలు బాగా వచ్చు. ఆమె సమర్పించిన థిసెస్ లండన్ యూనివర్సిటీ ఆచార్యులొకరికి పంపించారు. ఆయన చాలా మెచ్చుకున్నారు.”
“అనుభవంలో ఆమె మీకన్న పైచేయిగానే ఉన్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకి ఆమె అధిపతులా, మీరా?” నవ్వుతూ అడిగాడు రావు.
“ఇందులో ఒకరు గొప్పని, ఒకరు కాదని లేదు. ఈ విజయపురిలో రెండు సంస్కృతులు మేళవించాయి. ఆమె గ్రీకు సంస్కృతి గురించి, నేను భారతీయ సంస్కృతి గురించి విశ్లేషిస్తాం.”
“తనకు తెలియని మగాడితో పనిచేయడానికి ఆమె సులువుగా అంగీకరించారా?”
“లేదు. ఆవిడ కొన్ని షరతులు విధించారు.”
“ఏమిటివి.”
“పురుషాహంకారం ఎటువంటి పరిస్థితులలోను ప్రదర్శించకూడదు. ఆమె పట్ల గౌరవంగా ప్రవర్తించాలి. మితిమీరి చనువుగా తిరగకూడదు. చిలిపి పనులు చెయ్యకూడదు. పాటలు, పద్యాలు, కూని రాగాలు తియ్యకూడదు. ఆరోగ్యం విషయంలోను, భోజనం గురించి ఆమె సలహాలను పాటించాలి. ఎటువంటి పరిస్థితులలోను అపరిశుభ్రంగా ఉండడంకాని, పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం కాని చెయ్యకూడదు. ఏ విషయం రహస్యంగా ఉంచరాదు.”
“వీటన్నిటికి మీరంగీకరించారా?”
“ఇవన్నిటి గురించి ఆమె ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఆమెకు వచ్చిన భయం లేదని హామీ యిచ్చాను.”
“మీరేవీ షరతులు విధించలేదా?”
“త్రవ్వకాలలో పాల్గొని పురాతన హిందూ దేశ చరిత్రలో, నూతనాధ్యా మొకటి వ్రాయడమే నా ఆశయం.”
“మీరు పొరబడుతున్నారు. ఈ యశస్సును మీతో పాటు పంచుకోడానికి…” శశికళ లోపలికి వచ్చింది.
“చాల జోరుగా జరుగుతున్నటుంది సంభాషణ. నేనేం అడ్డురావడం లేదు కద?” ఆమె ప్రశ్నించింది.
“ఏ విషయం రహస్యంగా దాచకూడదని మీరు విధించిన షరతును రావుగారికి చెప్తున్నాను” అన్నాడు మోహన్.
శశికళ నవ్వింది.
“అయిదు గంటలయింది. రావుగారు టీ త్రాగుతారా, లేక కాఫీయా ప్రస్తుతానికి పౌడర్ మిల్కే! రేపటి నుండి రెండు పూటలా పాలు పోస్తానంది.”
“ఏదయినా అభ్యంతరం లేదు” అన్నాడు రావు.
4
నవంబరు రెండో వారంలో మంచి రోజున భూమి పూజకు ముహూర్తం నిశ్చయించారు. ఆ రోజు సైటులో ఈశాన్యపు మూలను పదడుగులు పొడవు ఐదడుగులు వెడల్పు గల స్థలంలో పొదలను కొట్టించి చదును చేశారు. మాచర్ల నుండి ఒక పురోహితుడు వచ్చి విఘ్నేశ్వరపూజ పుణ్యాహవాచనం జరిపించాడు. డాక్టర్ శశికళ పూజ చేసింది. ఆ నీళ్ళతో భూమిని తడిపారు. ఊదొత్తులు వెలిగించారు. గాలి కొంచెం చల్లగా వీచింది. దీపం ఆరిపోకుండా ఒక చిన్న బుట్టలో పెట్టారు.
ఆ సందర్భంలో మేటుకి, అతనితో ఎనిమిది మందికి బట్టలు పెట్టారు. నూట పదహార్లు, బట్టలు పురోహితుడికి సమర్పించారు. అతిథులు మరెవరూ లేరు, సుబ్రహ్మణ్యేశ్వరరావు తప్ప..
ప్రభుత్వం టీములో ముగ్గురు ఫోటోగ్రాఫర్లున్నారు. వారికి ఉదయం చాల పని ఉంటుంది. అందుచేత శశికళ తన కెమేరాతో కొన్ని ఫొటోలు తీసింది.
ఆనాటి నుండి వాళ్ళు పని మొదలు పెట్టారు. రెండెకరాల స్థలమేమో, పొదలు మొక్కలు, చెట్లు, తీగలు – వాటిని తొలగించడం అనుకున్నంత వేగం అవలేదు. సోమవారం సెలవు రోజు అయినా అరపూట పనిచేశారు.
ఆ స్థలం కొండ దిగువ భాగంలో ఉంది. మిట్ట పల్లాలు చాలా ఉన్నాయి. స్థలాన్ని చదును చేస్తేనేకాని ట్రెంచిలు మార్కు చేయడం, త్రవ్వడం జరగదని శశికళ చెప్పింది. మేట్ కూడా అదే అన్నాడు.
ప్రతి ఉదయం ఆరున్నరకు పనివాళ్ళు వచ్చేవారు. వాళ్ళు రాకముందే ఆర్కియాలజిస్టులు ఇద్దరూ సైటులో ఉండేవారు. తెల్లవారు వేళ నాలుగు గంటలకు అలారం కొట్టేది. స్నానానికి వేడినీళ్లు కాచుకోడానికి సరియైన పాత్ర కొనకపోవడం వలన ఖాళీ కిరసనాయిలు డబ్బాలుపై మూతలు తీసి ఉపయోగించేవారు. బాత్ రూము పక్కను అడ్డుకట్టిన రేకులను దగ్గిర ఇటుకల పొయ్యి సిద్ధంచేసి ఎండు కర్రలు అందుబాటులో జావా ఉంచేది. మోహన్ పొయ్యి ముట్టించి నీళ్ళు కాచేవాడు. నాలుగు గంటలకు బాగా చీకటిగా ఉండేది. ముందు ఈ కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు ముగించేది. తరువాత అతను షేవ్ చేసుకొని స్నానం చేసేవాడు. ఆమె స్టౌ ముట్టించి టిఫిన్, కాఫీ తయారు చేసేది. ఇద్దరూ బట్టలు వేసుకొని తయారయే సరికి పావుతక్కువ ఆరయేది. టిఫిన్ తిని, కాఫీ త్రాగి వాళ్ళు బయలుదేరిపోయారు.
భూమి పూజనాడే శశికళ చీర కట్టుకుంది. మరునాటి నుండి సైటులో ఆమె కాకీ ఫంట్లాం, టీషర్టు వేసుకొని కనిపించేది. ఆమె భుజానికొక బాగ్ ఎప్పుడూ వ్రేలాడుతుండేది. అందులో టార్చిలైటు, వాటర్ బాటిలు, కెమేరా, ఫీల్డు నోట్ బుక్ ఉండేవి.
మోహన్ కూడా బుజానికో సంచి తగిలించుకొని వచ్చేవాడు. కెమేరా తప్ప, శశికళ బాగులో ఉన్నవి అందులో ఉండేవి.
పన్నెండు వరకు పని చేసి వాళ్ళు టెంట్లకు తిరిగి వచ్చేవారు. ప్రొద్దుటి పూట ఎండ చురక్కపోయినా, మధ్యాహ్నం కొంత సేపు వేడిగా ఉండేది. ఈ కళ చిన్న గొడుగు కూడా తనతో తెచ్చుకునేది. ఎండకు అలవాటు పడాలని మోహన్ మాత్రం మరేవీ తలమీద వేసుకునేవాడు కాదు. టెంట్లకు వాళ్ళు చేరుకోగానే ఆమె కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని స్టౌ ముట్టించి కుక్కరు అమర్చేది. అతను కూడా కాళ్ళు చేతులు కడుక్కొని టేబిలు మీద ప్లేట్లు చెంచాలు మొదలైనవి అమర్చేవాడు. మంచినీటి గ్లాసులు, పెరుగు, ఉప్పు, నేయి మొదలైనవి టేబిలు మీద పెట్టేవాడు.
వాళ్ళు టెంట్లకు వచ్చేవరకు జావా ఉండేది. ప్రాద్దున్న వాళ్ళు సైటుకి వెళ్ళకముందు వచ్చేది. శశికళ ఆమెకు టిఫిను, కాఫీ ఇచ్చిన తరువాతే బయలు దేరేది. జావాకు చాలా నేర్పింది శశికళ. మంచి నీళ్ళు కాచి చల్లార్చి ఫిల్టరులో పాయ్యడం, వంటకు కావలసిన పాత్రలు తోమి సిద్ధం చేయడం, పాలు కాచి జాగ్రత్త పెట్టడం, కాయగూరలు తరిగి సిద్ధం చేయడం మొదలైన వన్నీ మామూలు పనులతో పాటు జావా చేసేది. నేల చిమ్మి తడి గుడ్డతో తుడవడం, వీథి వాకిలిలో నీళ్ళు చల్లి ముగ్గు పెట్టడం వంటి పనులు ఆమెకు ఉండనే ఉండేవి. స్నానానికి నీళ్ళు, కృష్ణనుండి తాగడానికి నీళ్ళు రోజూ ఆమె భర్త బిందెలు నింపి ఎద్దు మీద పెట్టి తెచ్చేవాడు.
సైటు నుంచి శశికళ మోహన్ పన్నెండున్నర వరకు రాగానే జావా ఇంటికి పాయి తిరిగి రెండు గంటలకు, వాళ్ళు సైటుకు వెళ్ళకముందే టెంట్లకు వచ్చేది.
టెంట్లలో దొరలు కాని, జావాకాని, ఎవరో ఎప్పుడూ ఉండేవారు. ఆ ప్రాంతాలలో దొంగల భయం లేదు. అయినా జాగ్రత్త కోసం ఈ ఏర్పాటు చేయక తప్పింది కాదు.
మొదటి సోమవారం నాడు వాళ్ళు సైటు విడిచి టెంట్లకు వచ్చేసరికి రమారమి ఒంటిగంట అయింది. ఆ సరికి సుబ్రహ్మణ్యేశ్వర రావు అక్కడే ఉన్నాడు. అతడు పనిమీద మాచర్లకెళ్ళి వచ్చాడు.
భోజనం తయారయే సరికి రెండయింది. ముగ్గురూ కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నారు.
“మోహన్! మనం త్రవ్వకాలు మొదలు పెట్టాం. నాకు ఈ నాగార్జున కొండలోయ గురించి కాని, ఈ త్రవ్వకాలెందుకు మొదలయాయని కాని తెలియదు. మీరు సూక్ష్మంగా చెప్పారో, విపులంగా చెప్తారో ఆలోచించుకోండి” అంది శశికళ.
“నాకు కూడా తెలుసుకోవాలనే ఉంది. ఇంతవరకు చెప్పే వాళ్ళు దొరకలేదు. లోయలోని స్కాలర్లకు ఊపిరి తీయడానికి కూడా తీరుబడి ఉండడం లేదు. కాబట్టి విపులంగా చెప్పండి” అన్నాడు రావు.
మోహన్ తన మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. సాధారణంగా ఈ విధంగా ఉండే మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ కుర్చీలు కొంచెం దగ్గరగా లాక్కొని కూర్చున్నారు.
మోహన్ చెప్పడం మొదలు పెట్టాడు.
“నాగార్జునకొండ లోయను, అక్కడి విశేషాలను వెలికి తీయడం సరిగా పూర్తి కాకుండానే ఈ మహాసంపదను, సంస్కృతిని కృష్ణవేణమ్మ తన కడుపులో దాచుకోబోతున్నది.”
“గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో కృష్ణానది కుడి గట్టున నాగార్జున కొండ ఉంది. మాచర్ల రైల్వే స్టేషను కిది పదహారు మైళ్ళ దూరం. 1931 సంవత్సరంలో మాచర్ల గుంటూరు రైలు మార్గం తెరిచారు.”
“1926 ప్రాంతాలలో మాచర్ల నుండి నాగులవరం వరకు రోడ్డు ఉండేది. అదేమీ బాగుండేది కాదు. ఈ పది మైళ్ళ దారి రెండెడ్ల బండి ప్రయాణానికి అనుకూలించేది. నాగులవరం చక్కని పంట చేల మధ్య అందంగా అమరి ఉండేది. దానికి ఎదురుగా కొంత దూరంలో ఉత్తర దక్షిణాలకు వ్యాపించిన హరిత వర్ణపు పర్వత శ్రేణి కనిపిస్తుంది. నాగులవరంతో బండి దారి అంతమయేది. కాలి దారి మొదలయేది. అక్కడికి నాగార్జున కొండ ఆరుమైళ్ళ దూరాన్న ఉంది.
“ఆ రోజులలో లోయలోకి పోదలచిన వాళ్ళు నాగుల వరం గ్రామాధికారితో చెప్పి, సామానులను మోయడానికి మనుష్యులను ఏర్పాటు చేసుకునేవారు. మొదటి రెండు మైళ్ళ కాలిదారి పంటచేల మధ్య పోతూ నడవడానికి హాయిగా ఉండేది. అక్కడ నుండి ఆ దారి నిటారుగా కొండల మీదికి పోతుంది. బల్లపరుపుగా ఉన్న పీఠబూమి కొండల పైన ఎదురవుతుంది. ఈ బల్లపరుపు స్థలం దాటిన తరువాత కాలిదారి కొండల నుండి క్రిందికి దిగడానికి ప్రారంభిస్తుంది. రాళ్ళు రప్పలతో ఈ సన్నని దారి ఇరుకుగా ఉండేది. ఈ పక్కను ఆ పక్కను ముళ్ళపాదలు, కంచెలు దట్టంగా ఉండేవి.
“సన్నని గోర్టిలోంచి నడిచినడిచి పూర్తిగా దిగిన తరువాత, దాని దిగువ భాగాన ఎర్రమట్టి ఉన్న విశాలమైన లోయ కనుల పడుతుంది. లోయ వెడల్పు రమారమి మూడు మైళ్ళు, ఆ లోయకు పశ్చిమాన్న కృష్ణానది ఉంది. మిగిలిన అన్ని వేపులా కొండలు కప్పి ఉన్నాయి.”
“కృష్ణానది అరమైలు వెడల్పుంది. అక్కడ ఎన్నో రాతి బండలు, ఇసుక దిబ్బలు నదిలో కనిపించేవి.”
శశికళ, రావు చాల శ్రద్ధతో వింటున్నారు.
“మనం ప్రస్తుతం ఆ లోయలోనే ఉన్నా, మీరు చెప్తుంటే అంతా కొత్తగా తోస్తున్నది” అన్నాడు రావు.
శశికళ ఫిల్టరు నుండి మూడు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి వాళ్ళకిచ్చి తాను తీసుకుంది.
మోహన్ తిరిగి చెప్పడం ప్రారంభించాడు.
“ఆ రోజుల్లో, మాచర్ల నివాసి అయిన సూరపరాజు వెంకట్రామయ్యగారు నాగులవరంలో బడిపంతులుగా ఉండేవారు. ఆవులు మేపుకునే కుర్రాళ్ళు కొందరు ఆయనను కలిసి, నాగార్జున కొండ అడవిలో రాతి స్తంభాలున్నాయని, ఇటుకలగుట్టలున్నాయని వాటి మీద పొదలు వెలిశాయని చెప్పారు.”
“వెంకట్రామయ్య గారు 1926 సంవత్సరం మార్చినెల 26వ తారీకున లోయ లోకి పోయి ఒక ఇటుకల గుట్టను దర్శించారు. చాల కష్టపడి ఆ గుట్ట మీద ఉన్న రాతి స్తంభాన్ని చేరుకున్నారు. దాని మీద ఒక శాసనం ఉంది. అది ఏమిటో ఆయనకు అర్థం కాలేదు.”
“అక్కడితో ఆయన ఊరుకోలేదు. గురజాలలో వారి స్కూళ్ళ డిప్యూటీ ఇనస్పెక్టరు లింగమళ్ళ ధర్మపురిగారు ఉండేవారు. వారికి వెంకట్రామయ్యగారు తాను కనుగొన్న శాసనం గురించి తెలియజేశారు. వారు కూడా చాల ఆసక్తి కనపరిచారు. నాగార్జున కొండ లోయలో కనుగొన్న శాసనం గురించి స్థానిక పత్రికలలో ప్రకటించారు.”
“ఆ రోజుల్లో ఎ.రంగస్వామి సరస్వతి గారు మద్రాసులో గవర్నమెంటు ఎపిగ్రాఫిస్టు దగ్గిర తెలుగు సమాయకుడిగా పనిచేసేవారు.. బడి పంతులూ, అతని ఇనస్పెక్టరూ, పత్రికలలో ప్రకటించిన వార్త ఆయన వరకు చేరింది. ఆయన నాగార్జున కొండలోయను దర్శించి శాసనాలను కాపీ చేసి తన రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించారు. ఆయనకి నాగార్జున కొండ దగ్గిర చాల ఇటుక దిబ్బలు, నిలువుగా ఉన్న రాతి స్తంభాలు కనిపించాయి. కొన్ని స్తంభాలమీద ప్రాకృత భాషలో శాసనాలు చెక్కి ఉన్నాయి. అవి క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దులకు చెందినవి. (లాంగ్ హర్‌స్ట్ దొర అభిప్రాయం ప్రకారం ).
“ఏ. హెచ్. లాంగ్ హర్‌స్ట్ దొర ఆ కాలంలో ఆర్కెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దక్షిణ విభాగానికి సూపరెండెంటుగా ఉండేవారు. వారు సెలవులో వెళ్ళడం నుంచి ఆయన జాగాలో పనిచేయడానికి హమీద్ కురైషీ గారిని ప్రభుత్వం నియమించింది. త్రవ్వకాలకు ఆ ప్రదేశం ఎంతవరకు యోగ్యమైనదో, నిధినిక్షేపాలు ఏ మేరకు లభించగలవో అపుడు తెలుసుకోడం జరిగింది.”
“కురైషీ గారు రెండు వారాలు లోయలో పనిచేశారు. ఈ తక్కువ కాలంలో ఆయన పద్దెనిమిది స్తంభాలు – శాసనాలు చెక్కబడినవి! రెండు అండాకారపు చైత్య గృహశిథిలాలు, చాల శిల్పాలు కనుగొన్నారు. బౌద్ధ సంస్కృతికి చెందిన అవశేషాలు అక్కడ అధికంగా లభిస్తాయని త్రవ్వకాలు జరిపితే మంచి ఫలితాలు కలుగుతాయని ఆయన నిర్ధారించారు.”
“ఆ సంవత్సరమే గవర్నమెంటు ఎఫిగ్రాఫిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హీరానంద శాస్త్రిగారు లోయను దర్శించి, కనుగొన్న శాసనాలన్నిటికీ నకళ్ళు తయారు చేయించారు. వాటినన్నిటిని జర్మనీలో లెయిడెన్ యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్ వోగెల్ దొరగారికి పంపించారు. ఆ శాసనాలన్నిటికీ ఆయన టిప్పణులు తయారు చేశారు.”
“1927 లో లాంగ్ హర్‌స్ట్ దొర క్రమబద్ధంగా త్రవ్వకాలు మొదలు పెట్టి 1931 ఫిబ్రవరిలో ముగించారు. ఆ త్రవ్వకాలలో శిథిలాలయిన చాల విహారాలు, అండాకారపు చైత్యాలు, స్తూపాలు, శాసనాలు, నాణాలు, శారీరక ధాతువులు, కుండలు, శిలా విగ్రమాలు, నాలుగు వందలకు పైగా ఉబ్బెత్తు కుడ్య శిల్పాలు లభించాయి. ఆ శిల్పాలు అమరావతి శైలికి అదే కాలానికి చెంది ఉన్నాయి.”
“వర్షాకాలంలో కృష్ణానది పడవ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. సముద్రం వరకు నావలలో సులువుగా ప్రయాణం చేయవచ్చు. లోయలోకి రావడానికి పోవడానికి కొండల మధ్యనున్న సన్నపటి దారే శరణ్యం. లోయకు వాయువ్య దిశన నాగార్జునకొండ, కృష్ణానదికి పక్కనే ఉంది. పంచదార బిళ్ళ ఆకారంలో ఉన్న ఈ కొండ ఒక మైలు పాడవుంది. దీని వైశాల్యం రెండు వందల ఎకరాలు. దీని పైభాగం బల్లపరుపుగా ఉంది. దీని చుట్టూ ఉన్న అంచులు శిఖరాల వలె పైకి లేచి సహజమైన కోట గోడల వలె కనిపిస్తాయి. అన్ని విధాల రక్షణ సదుపాయాలున్న ఈ కొండను దుర్గంగా ఉపయోగించుకున్నారు. దానిమీద చిన్న హిందూ దేవాలయాలు రెండు, ఒక ద్వారం మాత్రమే ఉన్నాయి. అవి మధ్య యుగానికి చెందినవి. అడ్డుగా కట్టిన గోడలకు ఉపయోగించిన ఇటుకలు పెద్ద పెంకుల వలెకనిపిస్తాయి. ఇరవై అంగుళాలు పొడవు, పందంగుళాలు వెడల్పు, మూడంగుళాలు మందమున్న ఇటు కలవి. బౌద్ధులు కట్టడాలలో ఇటువంటి ఇటుకలనే ఉపయోగించారు. విజయనగర రాజుల కాలానికి అంటే పదహారో శతాబ్దికి చెందిన సేనా నాయకుడెవరో కొండమీద ఉత్తరాన చాల అడ్డుగోడలు కట్టించాడు.
“లోయ మధ్య భాగంలో పుల్లారెడ్డి గూడెముంది. ఆ రోజుల్లో కొద్ది మంది తెలుగు హిందువులు, లంబాడీలు, చెంచులు అక్కడ ఉండేవాళ్ళు. లంబాడీలకు పెద్ద పశువుల మందలుండేవి. వాళ్ళు సేద్యం చేసేవాళ్ళు. చెంచులు వేటాడేవారు, పట్టులనుండి తేనె తీసేవారు. వంట చెరకు అడవులనుండి కొట్టి తెచ్చేవారు, కర్ర బొగ్గు తయారు చేసేవారు. వాళ్ళు గుడిసెలలో ఉండేవారు. ఇళ్ళ చుట్టూ బలమైన దడులు కట్టుకునేవారు. విలువిద్యలో మంచి ప్రవీణత గలవారు. విషం పూసిన బాణాలతో పెద్దపులులను కూడా చంపేవారు.”
“గ్రామ ముఖ్యుడిని రెడ్డి అని పిలుస్తారు. స్థానిక విషయాలలో అతని మాటకు తిరుగులేదు. అతనికి చాల పశువులుంటాయి. గ్రామంలో అన్నిటికన్న ఉత్తమమైన ఇంట్లో అతడుంటాడు. ఊళ్ళో పాలు, గుడ్లు, కోళ్ళు మాత్రమే దొరికేవి. మరేవి కావలసినా పైనుండి తెచ్చుకోవలసిందే.”
“లోయ మధ్య భాగం మాత్రం వ్యవసాయానికి ఉపయోగపడేది. మిగిలిన భూమి సేద్యానికి పనికి రాకుండా పోయింది. రాళ్ళూ రప్పలూ, ముళ్ళ పొదలూ అడవీ వ్యాపించి ఉండేవి. చక్రాకారంలో పర్వత శ్రేణులు లోయను మూడు పక్కలా మూసి వేయడం చేత సంవత్సరంలో చాల నెలలు ఈ లోయ విపరీతంగా వేడిగా ఉంటుంది. మహమ్మారిలా మలేరియా ఈ లోయను రాజ్యమేలింది. కొండలమీద అడవుల్లో చిరుతపులులుండేవి. అవి లోయలోని పశువుల మందల మీద పడేవి. ఎప్పుడో ఓసారి శ్రీశైల ప్రాంతపు టడువులనుండి పెద్దపులి ఒకటి లోయలోకి దిగి అవునో గేదెనో చంపి వెళ్ళిపోయేది.
లాంగ్ హర్‌స్ట్ దొర 1927 నుండి 1931 వరకు ఈ లోయలో త్రవ్వకాలు జరిపారు. నాలుగు సంవత్సరాలలోను పదినెలలు ఈ లోయలో గడిపారు.”
“ఆ కాలంలో ఆయన ఆరు చిరుతపులులను చంపారు. గ్రామవాసులు చాల సంతోషించారు. చెంచులు చిరుత పులి మాంసం తింటారు. వాళ్ళు మరీ సంతోషించారు.”
“లాంగ్ హర్‌స్ట్ దొర చుట్టుపక్కల కొండలపై ఉన్న పీఠభూమి మీద మైళ్ళ కొలది తిరిగివచ్చారు. అక్కడ ఎటువంటి ఇళ్ళుకాని, కట్టడాలు కాని ఆయనకు కనిపించలేదు, ఆ ప్రదేశాలన్నీ రాళ్ళతో నిండి ఉన్నాయి. మొక్కలు చెట్లూ తక్కువ. నీలులేని చోట్లవి. బీడు భూములు మానవులకు వాసయోగ్యం కాని స్థలాలు.”
“అందమైన లోయలో రాతి మిట్టలు, పొదలు మొలచిన కృత్రిమమైన దిబ్బలు చాల కనిపించేవి. ఇవన్నీ బౌద్ధుల విహారాలో, ఆలయాలో అయి ఉంటాయని లాంగ్ హర్‌స్ట్ భావించారు. వరుసల కొద్ది ఉన్న సున్నపు రాతి స్తంభాలు లోయలో చాల చోట్ల కనిపించేవి. ఇవి ఏవో మండప స్తంభాలని ఆయన అనుకున్నారు.”
“మూడు ప్రక్కల పర్వతాలు, ఒక పక్క కృష్ణానది సహజమైన సరిహద్దులుగా ఈ లోయకు ఉండడంచేత రక్షణ విషయాలలో ఈ లోయ మహత్తరమైనది.”
“లోయలోకి వాహనాలు రాలేవు. సన్నని కొండ దారిలో బళ్ళు నడవలేవు. త్రవ్వకాలలో వస్తువులు మోయడానికి రెండెడ్ల బళ్ళు కావలసి వచ్చాయి. లాంగ్ హర్‌స్ట్ దొర చాల ప్రయత్నం చేసి రెండుబళ్ళు లోయలోకి పట్టుకెళ్ళారు. కాని బళ్ళుగా వాటిని నడిపించుకొని పోలేదు. వాటి విడిభాగాలను మోసుకుపోయి లోయలో బళ్ళుగా బిగించారు.”
“ఇక్ష్వాకుల కాలంలో కృష్ణానది చాల వెడల్పుగా ఉండి సంవత్సరం పొడుగున లోయనుండి సముద్రం వరకు నౌకాయానానికి అనుకూలంగా ఉండి ఉండవచ్చు. కృష్ణానది తీరాన్న ఉన్న గోలి, అమరావతి, ఘంటసాల, గుమ్మడిదుర్రు, బెజవాడలకు నదీ ప్రయాణమే ఉండేది. గ్రీకులు కృష్ణానదిని మైసోలస్ అని పిలిచేవారు. డెల్టాను మైసోలియా అనేవారు. అదే యిప్పటి మచిలీపట్నం”.
మోహన్ అక్కడితో కథ ఆపాడు.
ఆ సరికి బాగా సాయంకాలమైంది.
శశికళ లేచి స్టౌ ముట్టించి కాఫీ తయారుచేసి తెచ్చింది.
మోహన్ దీపాలు వెలిగించాడు.
(సశేషం)