ఎండమావులు-18

0
3

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 18వ భాగం. [/box]

37

[dropcap]స[/dropcap]రస్వతికి ఒక వైపు ఆకలి దహించి వేస్తుంటే మరో వంక తన భవిష్యత్తు ఏంటా అన్న చింత మరింత చిత్రవధ చేస్తోంది. తన చంచల స్వభావాన్ని నిందించుకుంది. ‘మగవాడికి – ఆడదానికి ఉన్న తేడా అదే. మోహను తను ఇద్దరూ తప్పు చేసారు. అతని తప్పుని క్షమించి వదిలి పెట్టిన సమాజంలో అతని పరపతి – పేరు ప్రతిష్ఠ యథా ప్రకారం ఉంటాయి. అయితే ఆడదయిన పాపాన్న తను చేసిన తప్పును సమాజం క్షమించదు. తన చేసిన ఆ తప్పు తన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. తను సమాజంలో సక్రమంగా తల యెత్తుకుని బ్రతకలేదు. తను చేసిన తప్పుడు మార్గానే జీవనబాటగా చేసుకుని దుర్భరమైన జీవితం గడిపే పరిస్థితి వస్తుంది. తనలాంటి ప్రతి ఆడదానికి ఇంతే.

సారధితో మోహన్‌ని సరిపోల్చుతోంది సరస్వతి. తన భర్తకి అందం – ధనం లేకపోవచ్చు. ఈ రెండింటికి మించిన అమూల్యగుణాలు మానవత్వం – మంచితనం మెండుగా ఉన్నాయి. సహనానికి ప్రతిమూర్తి అతను. తన భర్త కాలిగోరికి కూడా సరిపోడు మోహన్. భర్త విలువ తెలియలేదు తనకి ఆనాడు. తెలిసేటప్పటికి సమయం మించిపోయింది.

తను చేసిన తప్పు క్షమించరానిది. భర్త జీవితాన్ని అశాంతి పాలు చేసింది. నవ్వుల పాల్జేసింది. తను ఇలా ఇల్లు వదిలి వచ్చి వేయడం వల్ల అవతల అత్తింటి వాళ్ళు, ఇటు మెట్టినింటి వాళ్ళు తల్లడిల్లిపోతారు. రోగిష్టి తండ్రి ఈ అవమానం భరించలేక ప్రాణాలు విడుస్తాడు. తన కుటుంబ వీధిన పడ్తుంది. ఆ సుందరి శాపనార్థాల వలన తన జీవితం మరింత నాశనం అవుతుంది. అయితే ఆ శిక్ష తనకి తగినదే. తను చేసిన నికృష్ణ పనికి ఆదేవుడు కూడా తనని క్షమించడు’ ఆలోచిస్తుంది సరస్వతి.

తిరిగి కాలింగ్ బెల్లు మ్రోగింది. సరస్వతి ముఖం చిట్లించింది. ‘మళ్ళీ ఎవరు వచ్చి ఉంటారు?’ అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా కోదండపాణి నవ్వుతూ ఎదురుగా నిలబడ్డాడు.

మరో సమయంలో అయితే అతని తీరుకి అసహ్యించుకునేది సరస్వతి. ఆ సమయంలో ఆమెకి అతను ఆపద్భాందవుడులా అగుపడ్డాడు. అతని చేతిలో పొట్లాం ఉంది.

“సరస్వతీ! మనం ఏ పని చేయాలన్నా శక్తి ఉండాలి. శక్తి రావాలంటే బాగా తినాలి. నిన్నటి నుండి నీవు తిండి తినలేదని నాకు తెలుసు. ముందర ఈ టిఫిను తిని ఆకలి తీర్చుకో, తరువాత ఆలోచిద్దాం” అన్నాడు కోదండపాణి.

అతని ఏకవచన సంబోధన – అతి చనువు సరస్వతికి కంపరం కలిగించాయి. అయితే ఆ సమయంలో అతను తప్ప తనని ఆదుకునే నాధుడెవ్వడూ లేడు.

పొట్లాం అందుకుని ఆత్రుతగా – టిఫిను తింటున్న సరస్వతిని చూడగానే ఆమె ఎంత ఆకలితో ఉందో గ్రహించగలిగాడు కోదండపాణి. ఆమె తినడం పూర్తి చేసిన వెంటనే పొగలు గ్రక్కుతున్న బ్రూ కాఫీ తెప్పించాడు. టిఫిను తిని కాఫీ త్రాగిన తరువాత సరస్వతికి అతను చెప్పినట్టు శక్తి వచ్చినట్టు అనిపించింది.

“చూడు సరస్వతీ! నీవు ఎలా ఆ మోహను వల్లో పడ్డావు? ఎందుకు పడ్డావు. నిలకడలేని మనస్తత్వం గల వాడిని – పట్టులేని వాడిని పట్టుకునే బదులు చింత కొమ్మలాంటి వాడ్ని పట్టుకోవల్సిందని నేను అనదల్చు కోలేదు. సలహా అంత కంటే ఈయ దల్చుకోలేదు. పెళ్ళయిన దాన్లో అగుపడుతున్నావు. ఇతడ్ని నమ్ముకుని అయిన వాళ్ళనందర్నీ వదిలి వచ్చేసేవు. అని మాత్రం అనిపిస్తోంది” సరస్వతి వంక నిశితంగా చూస్తూ అన్నాడు.

తలవొంచుకుని అతను చెప్పేది వింటోంది సరస్వతి.

“నీవు చేసిన పని మంచిది కాదని నేననను. కొంత మందికి నీవు చేసిన తొందరపాటు పని, మంచిది కాదనిపించవచ్చు. నీవు చేసిన పని సబువే అని నీ కనిపించవచ్చు – మంచిదనిపించవచ్చు. నీవు చేసిన పని మంచిదా చెడదా అని చర్చించుకోడం కాదు. ఈ సమయంలో అంతకన్నా ముఖ్యమైన విషయం గురించి చర్చించడం అతి అవసరం నాకు. ఏ విషయాన్నేనా ముక్కు సూటిగా చెప్పడం నా అలవాటు. ఏ మాట నయినా ముక్కు సూటిగా చెప్తాను, చేస్తాను.

ఎదుటి వాళ్ళకి నా ఈ అలవాటు కష్టమనిపించవచ్చు. కాని నా ఈ అలవాటు నేను మార్చుకోలేనుకదా! నేను ఓ విషయం నీతో చెప్పదల్చుకున్నాను. ఆ విషయం నీకు రుచించకపోవచ్చు. వింటానంటే చెప్తాను” కోదండపాణి సరస్వతి వంక చూస్తూ అన్నాడు.

ఆ సమయంలో సరస్వతి ఏఁ చేయగలదు? ఇష్టమున్నా లేకపోయినా విని తీరాలి.

“సరస్వతీ! నేను తీయబోయే పిక్చరులో నీవు పాడ్డానికి చాన్సు ఇచ్చేకన్నా హీరోయిన్‌గా బుక్ చేద్దామనుకుంటున్నాను.”

కోదండపాణి మాటలకి ఆమె కళ్ళు మిల మిల మెరిసాయి. ఇంకా చెప్పుకు పోతున్నాడు.

“నీవు చాలా అందంగా ఉంటావు. టీనేజ్ గర్లులా ఉంటావు. పెళ్ళయిన దాని వంటే ఎవ్వరూ నమ్మరు. పెళ్ళయిందన్న రహస్యం తెలిస్తే గ్లామర్ పోతుంది. అందుచేత ఈ రహస్యం ఎవ్వరికీ తెలియ చేయవద్దు. నన్ను నమ్ము. అందమైన ఆడపిల్లవు, అందులోనూ హీరోయిన్‌గా నటించబోతున్న నీకు ఈ పేరు కన్నా చాలా అందమైన పేరు – అందర్నీ ఆకర్షించే పేరు ఉండాలి. ఆ…! అంతే ఈ రోజు నుండి నీ పేరు సరస్వతి కాదు సౌందర్య” అతడా గాడు.

విడ్డూరమైన విషయం విన్నట్లు విస్మయంగా ఆనందంతో తచ్చిబ్బు అవుతూ అతని వంక కృతజ్ఞతా పూర్వకంగా చూస్తోంది. సరస్వతి. ఆ సమయంలో అతడు దేవుడులా అగుపడ్డాడు కోదండపాణి ఆమెకి. తనని ఇంత ఉన్నత శిఖరాలకి తీసుకు వెళ్తానన్న కోదండపాణి మీద గౌరవభావం కలిగింది. అతను ఏఁ చెప్పినా చేయడానికి సిద్ధమే అన్నట్టు చూసింది సరస్వతి.

ఆమెలో కలుగుతున్న మార్పుకి కోదండపాణి చిన్నగా నవ్వుకున్నాడు. పిచ్చిది హీరోయిన్ అయిపోవాలన్న కాంక్షతో తను ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే మంచి అవకాశం తన మనస్సులో కోర్కెను బయట పెట్టడానికి అతను ఆలోచిస్తున్నాడు.

“సౌందర్యా!” పిలిచాడు కోదండపాణి. ఆ పిలుపుకి అప్పుడే తను హీరోయిన్ అయిపోయినట్టు మురిసి పోయింది సరస్వతి. ఆమెలో బలహీనతను కనిపెట్టాడు అతను. “అయితే ఒక్క షరతు.”

ఏంటన్నట్లు అతని వైపు చూసింది సౌందర్యగా మారిన సరస్వతి.

“చూడు సౌందర్యా! నిన్ను నేను ప్రలోభ పెడునానని – మోసం చేస్తున్నానని – వల్లో వేసుకుంటున్నాని అనుకోవద్దు. నేను ఊ… అంటే అందమైన అమ్మాయిలు వచ్చి నా చుట్టూరా చేరుతారు. హీరోయిన్ పాత్ర ఇస్తానంటే తన సర్వస్వం ధార పోయడానికి సిద్ధపడే అమ్మాయిలున్నారు” ముందర కాళ్ళకి బంధం వేసే దోరణిలో అన్నాడు.

తనని ఏంటి కోరుతాడా అన్న సందేహంతో భయం భయంగా అతని వంక చూస్తోందామె. అతను తిరిగి చెప్పడం ఆరంభించాడు.

“సరస్వతీ! నీవూ భర్తని విడిచిపెట్టి పరాయి మగాడుతో వచ్చేసిన దానివి. నేనూ భార్య పరాయి వాడితో పారిపోగా ఒంటరిగా మిగిలిపోయిన వాడ్ని, మనిద్దరి జీవితాలు ఒకే విధంగా ఉండడం విచిత్రంగా ఉంది కదూ! మనిద్దరం ఒకే గూటి పక్షులం. ఆఁ … ! అసలు విషయానికి వస్తున్నాను. నాకు భార్య లేని లోటు నీవు భర్తీ చేయాలి. నీకు భర్తలేని లోటు నేను తీరుస్తాను. నేను అన్న మాటలకి కోపగించుకోకుండా – చెడుగా ఆలోచించకుండా నిదానంగా ఆలోచించు. కోరికలు చంపుకుని బ్రతకడానికి జితేంద్రియులంకాదు. నీకు మగతోడు ఉండాలి. నాకు ఆడతోడు అవసరం. నీకు నాతోడు రక్షణ కూడా, నేను చెప్పినది బాగా ఆలోచించు. తరువాత నీ యిష్టం.

మరో విషయం మనిద్దరం దంపతులం అవక్కర్లేదు. అలా ఉండడం కూడా నాకు ఇష్టపడదు. సహజీవనం చేద్దాం. ఒకరిమీద మరొకరికి అధికారం లేదు. ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఎవరి జీవితాలు వాళ్ళవి. నాకు జీవితంలో మాధుర్యాన్ని పంచి ఇస్తావు నీవు. నీకు అసలైన ఆనందాన్ని అందించి నిన్ను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తాను నేను. నీకు ఆలోచించుకోవడనికి అవకాశం ఇస్తున్నాను. నా సలహా నచ్చినట్లయితే నేన మరో గంటలో వస్తాను తయారుగా ఉండు. మా ఇంటికి తీసుకు వెళ్తాను. ఇష్టం లేని పక్షంలో నీ కర్మ.”

ఇలా అని బయటకు నడిచాడు కోదండపాణి. సౌందర్యగా మారిన సరస్వతి ఆలోచనలో పడింది. ‘వయసులో ఉన్న ఆడది ఒంటరిగా సమాజంలో మసలడమంటే కత్తి మీద సాము లాంటిది. ఇల్లు వదిలేసి వచ్చిన తనకి ఇంటిలో ఎలాగూ స్థానం లేదు. లేచి వచ్చేసిన ఆడదంటే సమాజంలో అందరికీ లోకువే. బయట ప్రపంచంలో గుంట నక్కలు – తోడేళ్ళ లాంటి లాంటి మనుష్యులు కాచుకుని ఉన్నారు. తను రూము ఖాళీ చేయక తప్పదు ఇటువంటి పరిస్థితిలో, తను ఎక్కడికి వెళ్లగలదు? ఎవర్ని ఆశ్రయించ గలదు? కోదండపాణి ఆశ్రయం కల్పిస్తానంటే తన తిరస్కరిస్తే ఈ హోటల్ మేనేజరు అప్పుడే తనని లేచిపోయి వచ్చిన దానిగా గుర్తించి ఆకలి చూపులు విసురుతున్నాడు తన వైపు.

అధికారం ఎంత చెడ్డది? తనకి పలుకుబడి అధికారం ఉన్నదన్న గర్వంతో తనని వ్యభిచారనేరం క్రింద అరస్టు చేయిస్తానన్నాడు ఆ సత్యమూర్తి. అలాంటి సత్యమూర్తిల పొగరు అణచాలంటే అలాంటి వాళ్ళను తన చుట్టూ తిప్పుకోవాలంటే తను ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఉన్నతంగా ఎదిగిపోవాలి. రెండు చేతులా సంపాదించాలి. ఖర్చు పెట్టి పోయిన పరువు ప్రతిష్ఠల్ని కొనుక్కోవాలి. అటువంటి సమయంలో ఎంత పరువు తక్కువ పని చేసినా ఎవ్వరూ పట్టించుకోరు.

ఒక్కడితో కాదు ఏభది మందితో తిరిగినా తను పతివ్రత, అందరూ తనకి జేజేలు పలుకుతారు, సంపాదించిన డబ్బుతో కీర్తి వస్తుంది. పరపతి పెరుగుతుంది. వందల కొద్దీ మోహన్లు తన చుట్టూరా తిరుగుతారు. అయితే కోదండపాణి కోరికకి తలవొంచాలా? అతని ప్రస్తావన అంగీకరించాలా లేదా? అని ఆలోచించాలి. అలా చేయకపోతే తన బ్రతుకు వీధిన పడ్తుంది. కుక్కలు పీకిన విస్తరాకులా తయారవుతుంది. అలా కాక అతని ప్రస్తావన అంగీకరిస్తే తనకి పోయింది క్రొత్తగా ఏఁ లేదు.. పోతుంది అనుకున్నది ఎలాగు పోయింది. ఆ మోహన్ వల్లో పడగానే అతన్తో లేచి వచ్చేసి నాడే తను పవిత్రత పోగొట్టుకుంది. పతిత అయింది. బజారు మనిషి అయింది. తనకి తిరిగి సమాజం ఈ స్థితిలో తిరిగి ఆ స్థానం కల్పించగలదా? లేదు. తను ఉన్నత శిఖరాలు చేరుకున్న తరువాత ఏ సమాజమయితే తనని అసహ్యించుకుందో అదే సమాజం తనని అందలం ఎక్కిస్తుంది. చెడిపోయిన దాన్ని ఎప్పుడో చెడిపోయాను. తిరిగి చెడిపోవడం అన్న ప్రసక్తే లేదు.

కోదండపాణి దగ్గరకి వెళ్ళాలి. కోరికల వలయంలో చిక్కుని వెళ్ళటం లేదు. తన భవిష్యత్తు కోసమేనా వెళ్ళాలి. అతను బంగారు పిచ్చుక. తను చంచల స్వభావం కలది. ఆ స్వభావమే తనని ఈ స్థితికి తీసుకు వచ్చింది.

ఆ స్వభావం వల్లే మోహను ఉన్నతుడుగా అగుపించాడు. ఇప్పుడు ఆ మోహన్ కన్నా ఈ కోదండపాణి ఉన్నతుడుగా కన్పిస్తున్నాడు. భర్తని వదిలి మోహనుతో వచ్చేసింది. ఇప్పుడు మోహన్‌ని వదిలి కోదండపాణిని ఆశ్రయిస్తోంది. ఆత్మాభిమానం ఉన్న మగవాడెవడూ తనని భరించలేరు. అయితే కోదండపాణి మాటలు తనకి నచ్చాయి. ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఎవరి ఆలోచన్లు వాళ్ళవి. ఒకరి మీద మరొకరికి అధికారం ఉండదు. అటువంటి వాతావరణాన్ని తను ఇష్టపడుతుంది.

భవిష్యత్తులో కోదండపాణి కన్నా ఉన్నతుడు అగుపడితే తన మనస్సు చలించవచ్చునేమో? అయితే ప్రస్తుతం ఆ కోదండపాణి అండ తనకి కావాలి. తన ఆశయాలూ – ఆకాంక్షలూ తీరాలంటే’ ఇలా ఆలోచిస్తోంది సరస్వతి.

గడియారం పన్నెండు గంటల్ని సూచిస్తోంది సరస్వతి గబగబా లేచి తయారయింది ఆమె కళ్ళల్లో ఓ స్థిర నిర్ణయం అగుపడుతోంది. ఆమె కళ్ళల్లో మగజాతి మీద అసహ్య భావం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అన్నభావం ఉన్నాయి. ఈ మగవాళ్ళు తనకోసం పిచ్చికుక్కల్లా తన చుట్టూరా తిరిగాలి. త్రిప్పకోవాలి ఆటబొమ్మల్ని చేసి ఆడించాలి అలా వాళ్ళని చూసి కసిగా నవ్వుకోవాలి ఇవే ఆమె ఆలోచన్లు.

కోదండపాణి చెప్పిన విధంగా వచ్చాడు తనతో వచ్చేయడానికి సిద్ధంగా ఉన్న సరస్వతిని చూసి ఆనంద పడ్డాడు. తృప్తిగా హేళనగా నవ్వుకున్నాడు.

“గుడ్! నేను చెప్పినట్టుగా నడుచుకుంటున్నావన్న మాట” ప్రశంసా పూర్వకంగా ఆమె వంక చూస్తూ అన్నాడు. మనస్సులో మాత్రం ఈ చిత్తకార్తి ముండకి ఇటువంటి పరిస్థితిలో తను కాక మరెవరు దిక్కు అన్నట్టుగా మీసం మెలేస్తూ గర్వంగా ఓమారు నవ్వుకున్నాడు. .

సరస్వతి గదిలోకి అతను భోజనం తెప్పించాడు. ఆవురావురు మంటూ తింటోంది.

ఆమెతో కూడా అతనూ కార్లో కూర్చున్నాడు. ఆ ఖరీదయిన వాహనం కనుమరుగయ్యే వరకూ చూస్తూ ఉండి పోయాడు హోటల్ మేనేజరు. పిట్ట జారిపోయిందన్న నిరాశ అతని వదనంతో అగుపడుతోంది.

38

ఉదయం పదిగంటలయింది. ఎండ చిక్క బడుతోంది. సౌందర్య ఆ టైమప్పుడు నిద్రనుండి లేచింది. పని మనిషి బ్రెష్ మీద పేస్టు పెట్టి ఇవ్వగా స్నానాల గది వేపు అడుగులేస్తోంది.

అప్పటి సరస్వతి రూపానికి మాట తీరుకి-ఇప్పటి సౌందర్య రూపానికి మాట తీరికి చాలా వ్యత్యాసం ఉంది. ఆమె ప్రతీ కదలికలోనూ నవనాగరికత కళ్ళకి కట్టినట్లు అగుపడుతొంది పెద్ద బంగళాలో ముఖమల్ పరుపుల మీద ఎ.సి.రూమ్‌లో జీవితం ఆమెకి పూలపాన్పులా సుఖమయంగా జరిగిపోతోంది.

నౌకర్లు అడుగడుగునా అడుగులకి మడుగులొత్తుతూ ఉంటే ముఖ్యంగా మగనౌకర్లనందరిని తన చుట్టూరా పిచ్చికుక్కల్లా తిప్పుకుంటోంది. సౌందర్య. ఆమె సౌందర్యానికి అందానికి మైమరిచిపోయి తన చుట్టూ ప్రదక్షణం చేసే మగాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందే కాని తరగటం లేదు.

మోహను అర్ధాంతరంగా తనని వదలి వెళ్ళిన నాడు కోదండపాణితో కలిసి సహజీవనం చేయడానికి ఒప్పుకొని వెళ్తున్న సమయంలో ఈ మగవాళ్ళ నందర్నీ తను ఉన్నత శిఖరాలకి చేరుకున్న తరువాత పిచ్చికుక్కల్లా తన చుట్టూ త్రిప్పుకుంటానని స్థిర నిర్ణయంతో అనుకున్న మాటలు అక్షరాల ఇప్పుడు జరగడం ఆమెకి మరింత ఆనందకరమైన విషయం అయింది.

ఆమె ఈ రోజు ఓ మహానటి. తనకిచ్చిన పాత్రకి న్యాయం చేకూర్చి రక్తి కట్టించడమంటే ఆమెకి వెన్నతో పెట్టిన విద్యయింది.

వైకుంఠపాళీ ఆటలో పాముల్ని తప్పించుకుంటూ నిచ్చెల్నా ఎక్కినట్లు సౌందర్య ప్రముఖ తారల లిస్టులోకి చేరి మహానటిగా అందరి మనస్సులో నిల్చిపోయింది.

ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు సౌందర్యతో మాట్లాడ్డానికి ఫోన్లు అలా మ్రోగుతూనే ఉంటాయి. గుడిలో దైవదర్శనం అవడమేనా సులువేమే కాని సౌందర్య దర్శనం కావడం అభిమానులకి దుర్భరమవుతోంది. గేటు దగ్గర వాచ్‌మేను నెట్టివేస్తున్నా ఓర్పుతో ఓపికతో సౌందర్య అభిమానులు ఆమె కోసం ఎదురుచూస్తూ పడిగాపులు పడ్తూ నిలబడేవారు.

తను ఈనాడు ఈ స్థితిలో ఉండడానికి కారకుడు కోదండపాణి అన్న కృతజ్ఞతతో శారీరకంగా అతని వల్ల తృప్తి లేకపోయినా తృప్తి పడినట్లు నటించి అతడ్ని సంతోషపెట్టేది. అలా కోదండపాణితో గడుపుతున్న సమయంలో సినిమాలో హీరో సుకుమార్‌ని తల్చుకుంటూ మానసిక వ్యభిచారానికి పాల్పడి తృప్తిపడేది సౌందర్య. సుకుమార్ పెళ్ళికాని అందమైన ఆరడగుల అందగాడు, సరసుడు కూడా. వాక్ చాతుర్యం ఉన్నవాడు. సమయాస్పూర్తితో ఏ ఆడదాన్ని ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి బాగా తెలుసు.

సౌందర్య ముఖం కడుక్కుని వచ్చేప్పటికి పొగలు గ్రక్కుతున్న కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది వంట మనిషి. ఆ రోజు వచ్చిన వార్తాపత్రిక చదువుతున్నట్టు పేజీలు తిరగేస్తూ కాఫీ చప్పరిస్తోంది సౌందర్య క్రొత్త జీవితంతో పాటు క్రొత్త క్రొత్త అలవాట్లు చేసుకుంది. సీనీ ప్రపంచంలో అలా అలవాటు చేసుకోవాలి చేసుకోక తప్పదు కూడా. అటువంటి వాతావరణంలో మహానటిగా చలామణి అవుతున్న సౌందర్యకి అలా అలవాట్లు చేసుకోడం సహజమే. అప్పుడప్పుడు హాట్‍డ్రింక్స్ కూడా అలవాటు చేసుకుంటోంది.

ఇంతలో ఫోను మ్రోగింది. ఫోను ఎత్తిందామె.

“హలో సౌందర్యా! హౌ ఆర్ యూ!” అవతలనుండి సుకుమార్ కంఠం వినిపిస్తోంది. అతని కంఠం వింటూనే మైమరిచి పోతూ తన్మయత్వంతో “వెరీ ఫైన్!” సమాధానం ఇచ్చింది సౌందర్య అతనికి. ఆమె ఈ మధ్యనే కొద్దికొద్దిగా ఇంగ్లీషు మాటలు మాట్లాడ్డం నేర్చుకుంది.

ఫోనులో అతను ఏదో మాట్లాడేడు. ఆమె సమాధానమిచ్చింది. అతను గలగలమని నవ్విన శబ్దం ఫోనులో వినిపించింది. ఇవతల నుండి ఆమె కూడా అలాగే నవ్విన శబ్దం..

“ఈ రోజు నా హెల్తు బాగులేదు అందునే షూటింగ్ కేన్సిలు చేసుకుని విశ్రాంతిగా ఇంట్లో గడపాలను కుంటున్నాను” అందామె.

“అయితే నీకు కంపెనీ ఈయడానికి నేను అక్కడికి వస్తాను సౌందర్యా! నన్ను చూడగానే నీ బాధంతా పోయి హాయి కలుగుతుంది కదూ!!?” అతను తిరిగి గలగలమని నవ్వుతూ అన్నాడు.

“ఒకే! తప్పకుండా రా! పరమబోరుగా ఉంది. ఈ ముసిలాడు వల్ల నాకు నిజమైన ఆనందం కలగకపోగా మహాబోరుగా ఉంది. తప్పకుండా వచ్చేయ్ సుకుమార్” సౌందర్య కిలకిల నవ్వుతూ అంది.

ఆమె బాషలో కోదండపాణి లైంగికంగా తనకి సంతృప్తి ఈయలేని అసమర్థ మనిషి-ముసిలాడు. ఏ వ్యక్తి వలన ఆమె మహానటి స్థాయికి ఎదగగలిగిందో ఆ వ్యక్తి అంటే ఇప్పుడు ఆమెకి చులకన భావం. సుకుమార్‌తో ఆమె సంబంధం చిక్కబడ్తున్న కొద్దీ కోదండపాణియడల ఆమెలో విముఖత అధిక మవుతోంది.

సౌందర్య లేచి స్నానం చేసి తన సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంది. అద్దంలో తన ప్రతిబింబం పదే పదిసార్లు చూసుకుంటూ తృప్తి పడుతున్న సమయంలో బయటకారు హారను వినబడింది. వాచ్‌మేను గబగబా గేటు బార్లా తెరచిన తరువాత కారులోనికి వచ్చి పోర్టికోలో ఆగింది.

సుకుమార్‌కి ఎదురుగా వెళ్ళి అతడ్ని ఆహ్వానించింది. ఆమె అతను ఆమె భుజం మీద చేయి వేసి నడుస్తూ ఉంటే ఆమె అతని భుజం మీద తల ఆన్చి కబుర్లు చెప్తూ నడుస్తోంది. ఆమె కబుర్లకి అతను పడిపడి నవ్వుతూ ఉంటే అతని మాటలకి ఆమె కిలకిలమని నవ్వుతోంది.

అలా చెట్టాపట్టా లేసుకొని నవ్వుతూ తృళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న వాళ్ళద్దర్నీ ఆ స్థితిలో చూస్తూ ఉంటే కోదండపాణికి చాలా అసూయగా ఉంది. అతను వచ్చిన కోపాన్ని అణచుకోవడానికి విశ్వపయత్నం చేస్తున్నాడు కాని సాధ్యపడటం లేదు. ఆ కోపాన్ని సూచిస్తూ అతను పళ్ళు పటపట కొరుకుతున్నాడు. తన గది కిటికీ లోనుండి వాళ్ళిద్దర్నీ చూస్తున్నాడు.

దిక్కూ మొక్కూ లేకుండా అసహాయ స్థితిలో ఉన్న సరస్వతికి ఆశ్రయమిచ్చి మహానటిని చేసి తనెంత తప్పు చేసాడు. చిత్తకార్తి కుక్కని బంగారు సింహాసనం మీద కూర్చోబెడ్తే అది తన నీచగుణం మానెయ్యగలదా? ఈ సరస్వతీ అంతే. ఈమెది నడమంత్రపు సిరి. సౌందర్య అని పేరు మార్చినంత మాత్రాన్న మొదట్నించీ ఉన్న బుద్ధులు ఒక్కసారి పోతాయా? చపల చిత్తురాలు, చంచల మనుష్కురాలు. తనకన్నా మెరుగ్గా ఉన్న, వయస్సులో ఉన్న కుర్ర హీరో కనిపించేప్పటికల్లా వాడి వెంటపడింది. రేపొద్దున్న ఆ సుకుమార్ కన్నా ఉన్నతుడు కనిపిస్తే వీడ్ని వదిలి వాడ్ని పడుతుంది. ఆ చపల చిత్తురాలి స్వభావమే అంత. అయితే ఈ కుర్ర హీరోకి పెళ్ళి కాలేదు. కాబట్టి కక్కుర్తి పడుతున్నాడు. రేపు పెళ్ళయిన నాడు లేకపోతే మరో కుర్ర హీరోయిన్ దీనికి పోటీగా వస్తే ఈ సౌందర్యని ఎంగిలాకుని గిరాటు వేసినట్టు – వాడిన పువ్వుని విసిరేసినట్టు విసిరేస్తాడు. కోదండపాణి తన మనస్సులో వాళ్ళిద్దరి మీద ఉన్న అసహ్యాన్ని వ్యక్తం చేస్తూ కసిగా అనుకున్నాడు.

సౌందర్యా-సుకుమార్ గది తలుపులు బిగించుకుని కూర్చున్నారు. లోపలనుండి వాళ్ళ పకపకలు, గ్లాసుల చప్పుడు వినిపిస్తోంది.

మొదట్లో సుకుమార్‌ని తృప్తి పర్చడానికి హాట్ డ్రింక్సు ఇంట్లో ఉంచిన సౌందర్య అతని కోసం – అతనికి కంపెనీ ఆయడానికి తనూ అలవాటు చేసుకుంది. ఇలా పతనమయినపోతున్న సౌందర్యను చూస్తూ ఉంటే కోదండపాణికి ఒక వైపు జాలి-అసహ్యం అయితే మరో వైపు కోపం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here