[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
అశ్విన్‌కి విపరీతమైన హోమ్‌సిక్ అని చెప్పాగా, కల్చర్ డిఫరెన్స్ కూడా కొట్టింది. మా శిరీషా కుమార్ అంటే మా వదినా వాళ్ళ అక్కయ్య కామేశ్వరి కూతురూ, అల్లుడూ హ్యూస్టన్‌లో వుండేవారు అప్పుడు. నేను శిరీషకి ఫోన్ చేసి అశ్విన్ చిట్టెన్‌రాజు గారి ఇంట్లో వున్నాడు అని చెప్తే, శిరీషా కుమార్ “అయ్యో అత్తా, వాడు మా ఇంటికి రాకుండా అక్కడ వుండడం ఏమిటీ?” అని బయలుదేరి, వచ్చి అశ్విన్‌ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. శిరీష చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి అశ్విన్ హోమ్‍సిక్ కొంత వరకూ తగ్గింది. కుమార్ కూడా మంచి పిల్లాడు. వాడిని క్యాంపస్‍కి తీసుకువెళ్ళి, రూమ్ చూసి, తన కార్డ్ మీదే కావల్సినవీ అన్నీ కొని దింపి వచ్చాడు కుమార్.
అశ్విన్ ఎమ్.ఎస్. చేసిన రెండేళ్ళూ చాలా మంచి రూమ్‍మేట్స్ దొరికారు, నార్త్ ఇండియన్స్. ఇప్పటికీ వాళ్ళతో స్నేహంగా వుంటాడు. కాలేజ్ స్టేషన్ అంటే ఎ ఎండ్ ఎమ్, ఆర్కిటెక్చర్‌కీ, మెడిసిన్‌కీ చాలా ప్రసిద్ధి.
నేను వాడి క్యాంపస్ చూడలేకపోయాను. ఎందుకంటే వాడే ఆ రెండేళ్ళలో రెండు సార్లు వచ్చి వెళ్ళాడు. కాన్వకేషన్ అవగానే డిగ్రీ తీసుకుని ఇండియా వచ్చేసాడు. చాలా ఫర్మ్ డెసిషన్స్ అశ్విన్‌వి. నమ్మిన విషయం మీద ఎంతమంది చెప్పి మనసు మార్చాలని చూసినా వినడు.
నేను చాలా బెంగగా వుండేదాన్ని, వాడు అమెరికా వెళ్ళిన కొత్తల్లో. ఓసారి అరవింద్ గారు వెళ్తుంటే, వాడు అడిగిన బుక్స్ పంపించాను. ఆయన శాన్‌ఫ్రాన్సిస్కో నుండి వాడికి కాల్ చేస్తే, “క్లాస్ రూమ్‌లో వున్నాను అంకుల్” అంటే, “అమ్మ బుక్స్ పంపించింది. కొరియర్ చేశాను… ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు… మొహమాటపడకు” అన్నారట. “మీరు ఇంత టైం స్పెండ్ చేసి కాల్ చేసారు, అదే చాలు… ఏమీ వద్దు” అన్నాడుట వీడు.
తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారూ, పద్మజా వాళ్ళ పెద్దమ్మాయి కావ్య దగ్గరకి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‍లో చదువుతున్న వారి రెండో అమ్మాయి ఊహని తీసుకుని, వీడి అపార్ట్‌మెంట్‌కి చిట్టెన్‌రాజు గారు తీసుకెళ్తే వెళ్ళి చూసి వచ్చారు! ఊళ్ళో వున్న శిరీషా, కుమార్‌లు పండగలు, శలవలూ వస్తే అశ్విన్‌ని పిలుచుకెళ్ళేవారు! పిల్లలు వెళ్ళిన మొదటి ఒకటి రెండు నెలలే హోమ్‌సిక్‌గా వుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాకా, వాళ్ళతోనే బావుంటుంది.
కానీ తల్లి తండ్రులకి మాత్రం వాళ్ళ ఫోన్ కాల్సే లోకం. అప్పట్లో మేజిక్ జాక్ అనే చిన్న పరికరం, నా పీ.సీ.కి అమర్చుకుని, కాల్ చేస్తే, అది ఏదో అమెరికా నెంబర్ డిస్‌ప్లే చేస్తూ వాడికి కాల్ వెళ్ళేది. ఓసారి మా అన్నయ్య కొడుకు ఆర్మీ ఆఫీసర్ రవి ఫోన్ చేస్తే, వీడు “అమ్మా… చెప్పు” అన్నాడట. వాడు “ఇంత అమ్మ బెంగ ఏమిట్రా?” అని తెగ నవ్వాడు. అశ్విన్‌కి అంత అమ్మ బెంగ వుండేది. ఇప్పుడు, ఇది రాస్తున్న సమయానికి ఫామిలీ మేన్ అయ్యాడు… కానీ నేను వారానికి ఓ రోజైనా కనిపించాలి… అంతే.
ఇక్కడ నేను తల గాయం నయం అవగానే మళ్ళీ షూటింగ్‍కి వెళ్ళడం మొదలుపెట్టాను. ముఖ్యంగా మెహెదీపట్నంలో డాగ్ బంగళాలో తీసిన సీన్స్ నాకు చాలా ఇష్టం. సగం షూట్ చేశాక, సెకండ్ హాఫ్ రొటీన్ అయిపోయిందని, మళ్ళీ వేరేలా మార్చాం, నేనూ చంద్రసిద్ధార్థా. ఆ మారిన కథ ప్రకారం ఆర్టిస్ట్‌లు వచ్చారు. బావ ట్రాక్ పడింది పద్మప్రియకి ‘అందరి బంధువయా’లో. అది జనానికి చాలా బాగా నచ్చింది. ఆర్యన్, జీవా, లిరీషా, కృష్ణ భగవాన్, విజయ్.. వాళ్ళందరితో కామెడీ బాగా వచ్చింది.
సినిమా పూర్తి అయి సెన్సార్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చాకా, మా ఇంట్లో వినాయక హోమం చేయించి క్రూని పిలిచాను. శర్వానంద్ తప్ప, అంతా వచ్చారు. నరేష్ గారూ, పద్మప్రియా, అనూప్ రూబెన్స్, కోడైరెక్టరూ, అసిస్టెంట్ డైరక్టర్లు, చంద్రసిద్ధార్థ అంతా వచ్చారు. ఆరోజు పద్మప్రియ బర్త్‌డే. పెద్ద కేక్ తీసుకొచ్చారు. కేక్ కట్ చెయ్యగానే అది తీసి ఆమె మొహానికి పూసి నానా హడావిడీ చేసారు.
హోమంకి వచ్చిన మా బంధువులు అంతా షాక్ అయి వీళ్ళని చూస్తుండిపోయారు. పద్మప్రియ చాలాసేపు మళ్ళీ తలస్నానం చేసినంత పని చేయ్యాల్సొచ్చింది ‘వోక్స్’లో తెచ్చిన ఆ కేక్ తలకి వదలడం కోసం. నరేష్ గారికి మా ఇంట్లో చేసిన కందాబచ్చలి కూర ఆ రోజు చాలా నచ్చింది. ఇప్పటికీ కలిసినప్పుడు చెప్తుంటారు.
‘అందరి బంధువయా’ ఆడియో ఫంక్షన్‌కి రామానాయుడు గారినీ, అల్లు అరవింద్ గారినీ ఇద్దర్నీ పిలిచారు. ఆ ఇద్దరూ కూడా నా మిద అభిమానంతో పిలవగానే వచ్చారు. మా కెమెరామాన్ గుమ్మడి జయకృష్ణకి నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడే. ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీధర్ గారు మా చంద్రసిద్ధార్థకి క్లాస్‌మేట్. ఆయన కూడా వచ్చారు. “చందూని నిజామ్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడే మేం డైరక్టర్ సాబ్ అని పిలిచేవాళ్ళం” అని మినిస్టర్ గారు చెప్పడం విశేషం.
“రమణీగారు నా ఫ్రెండ్, చాలా కావలసిన మనిషి” అని అరవింద్ గారు చెప్పారు. “మా రమణి కథ అంటే, ఈ సినిమా చాలా బావుంటుంది” అని రామానాయుడు గారు చెప్పారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆ ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. ఆడియో రిలీజ్ చేసిన మధురా శ్రీధర్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారూ అంతా వచ్చారు. పాటలు చైతన్యప్రసాద్ గారు రాసారు. అనూప్ రూబెన్స్ ఆ తర్వాత పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అయిపోయారు. ‘సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయ్యా’ అనే పాట నాకు చాలా ఇష్టం!
ఆ తరువాత నేను టీవీ సీరియల్స్‌లో బిజీ అయిపోయి, సినిమాలకు ఎక్కువ ట్రై చెయ్యకపోవడం నా తప్పే అనిపిస్తుంది, ఇప్పుడు ఆలోచిస్తే. మొత్తానికి ‘అందరి బంధువయా’ ప్రివ్యూకి నన్ను పిలిచాడు చంద్రసిద్ధార్థ. మా గిరిధర్ గోపాల్, సుమిత్రా పంపనా నాతో వచ్చారు… సినిమా చూసిన నేను ‘చందూ’ చేతిని పట్టుకుని “ఎంత బాగా తీసారంటే, నేను మనోనేత్రంతో చూస్తూ ఏం రాసానో, అదే తీసారు… అంత బావుంది” అని చెప్పాను. అందరూ అదే మాట! రిలీజ్‌కి ముందే సిరాశ్రీ, హాసం రాజా మొదలయినవాళ్ళూ, ఐడిల్ బ్రెయిన్ జీవీలు గొప్ప సినిమా అని రివ్యూలు రాసేసారు! మేం సూపర్ హిట్ అనుకున్నాం.
సత్యానంద్ గారు మన సత్యనారాయణ గారి తమ్ముడు కైకాల నాగేశ్వరరావుగారితో చూసి ఇంటికి వెళ్తూ వుంటే, కారు ఆగినప్పుడుట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఓ కుంటి బిచ్చగాడు అడుక్కుంటున్నాడట, అతనికి ఒక చెయ్యే వుంది. ఇంతలో పక్కన ఏదో ఏక్సిడెంట్ అయితే, ఈ బిచ్చగాడు అడుక్కోవడం ఆపేసి అటు పరిగెడ్తే, నాగేశ్వరరావు గారు సత్యానంద్ గారితో అన్నారట, “మనం చూసిన సినిమా ‘అందరి బంధువయా’లో ఇదే పాయింట్ కదూ! మొదట సాయం చెయ్యి… తర్వాత ఎవరికి చేసాం అని ఆలోచించు” అని! కాళ్ళూ చేతులు సరిగ్గా లేవు, తనని తాను సాయం చేసుకోలేడు! అయినా అటు పరిగెత్తాడు… ఏమైనా చెయ్యగలనేమోనని!…
సత్యానంద్ గారు నాకు ఫోన్ చేసి ఈ మాట చెప్తూ, “మీ సినిమా సక్సెస్ అమ్మా… ఓ మనిషి థియేటర్ లోంచి వెళ్తూ అంత ప్రభావితం అయ్యాడంటే… ఇంకేం కావాలీ?” అన్నారు.
నాకూ, చందూకీ వరుసగా మొదటి రోజు మార్నింగ్ షో అవగానే చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇండస్ట్రీ అందరికీ నచ్చింది.
(సశేషం)