[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 31వ భాగం. [/box]
[dropcap]గు[/dropcap]డి ఎదురుగా పెంచలయ్య అనే రైతున్నాడు. ఇంటి ముందున్న కౌంపౌండుకు పెద్ద గోడలు పెట్టించాడు వాళ్ళ నాన్న. ఆ గోడల వెంట అరుగులు కట్టించారు వాళ్ళు బాటసారుల కోసం. అయితే అక్కడికి రాత్రి అవగానే రామలింగం అనే పోరంబోకు చేరుతుంటాడు. అట్టాగే ఇంకా నల్గురయిదుగురు కూడా… లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ అర్ధరాత్రి దాక కాలక్షేపం చేస్తుంటారు. అయితే వాళ్ళకు బాటసారులపైన అంత శ్రద్ద ఉండదు. తమ ధోరణిలోనే తాము ఉంటారు. రామలింగం మాత్రం గమనిస్తుంటాడు. తెల్సిన మనిషిని అయితే ఏం లేదు. తెలీని వాడయితే వీళ్ళకు చూపుతాడు.
రామలింగం ఇంటికి వెళ్ళాడు పుష్టిగా తిని నిద్ర కళ్ళతో మంచానికి అడ్డం పడుతూ కనిపించాడు.
‘దీక్షితులుగారేంటి? తన ఇంటికి రావడమేంటి?’ అని కొంచం గాబారాపడి ఎదురొచ్చి కుర్చీ చూపి ఏమిటని అడిగాడు.
“చెపుతాను” అని కూర్చుని “నువ్వు సందకాడ అరుగు దగ్గరకు వెళ్ళావా?” అని అడిగాడు
“ఆఁ”
“కొత్తవాళ్ళెవరైనా ఊళ్ళోకొచ్చారా?”
“వచ్చారు.”
“గుర్తుపట్టగలవా?”
“ఆఁ” అన్నాడు నెమరేసుకుంటూ
“వచ్చారు అంటున్నావు ఎందరు?”
“ఇద్దరు.”
“గుడివెనకునుంచే వచ్చారా?”
“దాదాపు.”
“ఎక్కడికి వెళ్ళి ఉంటారు?”
“తెల్సు.”
“అయితే చెప్పు.”
“మన సత్తెం బాబు లేడు అక్కడికి.”
“నీకెలా తెల్సు?”
“నేను రత్తయ్య ఫ్యాన్సీ షాపులో ఉండగా ఒకడు లోనికెళ్ళాడు.”
“ఇంకొకడు?”
“సత్తెం బాబు ఇంటి తలుపు తడుతున్నాడు.”
“గుర్తుపడతావు గదా?”
“ఆఁ” అన్నాడు రామలింగం
“వాళ్ళు బయటకు వెళ్ళిన జాడ ఏమయినా ఉందా?”
“నేను ఉన్నంత వరకు లేదు, అయినా ఉండండి” అని బయటకు వెళ్ళాడు.
పది నిముషాల తరువాత వచ్చి “ఉన్నారు” అన్నాడు.
“ఎవర్ని కనుకున్నావు?”
“వాళ్ళ చాకలిని.”
“చాకలికి ఎందుకు కనిపిస్తారు వాళ్ళు.”
“కనిపించలేదు కానీ అదనంగా బట్టలు పడ్డాయిట.”
“మంచిది” అని అభినందించి బయటకు నడచాడు దీక్షితులు.
సీదా పటేలు ఇంటికి జేరాడు.
యస్.ఐ కాళీప్రసాదు చొక్కా బొత్తాములు విప్పి విసురుకుంటున్నాడు.
పొలీసు వ్యాను చింత చెట్ల క్రింద ఉంది.
యస్.ఐకి విషయం చెప్పాడు అంతే ఆ బజారుల్లో ఉన్న తోవలు తెల్సుకొని బొత్తములు సరి చేసుకొని పరుగులాంటి నడకతో వ్యాన్ దగ్గరకెళ్ళాడు. వ్యాను స్టార్టయింది. ఊళ్ళ కెళ్ళింది. ఆ రెండిళ్ళను ముట్టడించింది.
సత్యం అతని తల్లి ఇంటి ముందే ఉన్నారు.
“లోపల చూడాలి” అన్నాడు యస్.ఐ
“ఏముంది చూడటానికి?” అన్నాడు సత్యం.
మెడ మీద చయ్యి వేసి ‘పద బే’ అంటూ లోనికి నెట్టుకుపోయాడు.
“పడమటింట్లో అల్లుడున్నాడు” అన్నాడు.
“తలుపు తెరవమను.”
“అమ్మాయి ఉంది.”
“నేను ఆగం చెయ్యనులే లేపు” అన్నాడు ఒక్క తోపు తోసి.
అరవబోయాడు. నోటి మీద ఒక్కటిచ్చాడు.
పిల్లవాడు పలకలేదు. తలుపు నెట్డాడు, రాలేదు. గట్టిగా తన్నాడు, బీడం ఎక్కడుందో ఊడివచ్చింది. ఈ చప్పుడుకు చీకట్లో బట్టలు సర్దుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు చిట్లించి చూసాడు యస్.ఐ. అర్దనగ్నంగా ఉన్న ఆడ మనిషి చీర చుట్టుకుంటుంది గబగబా. ఆ పిల్ల మగడు కనిపించాడు. వాడు నాగు కాదని అర్థమైంది. గబుక్కున సత్యాన్ని వదిలి అబ్బయ్య ఇంటికెళ్ళాడు బయట తాళం ఉంది.
తాళం పగలగొట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపల మనుషులు కనిపించారు. బాగా చూసాడు కాళీ ప్రసాదు.
“వాడే వాడే నాగులు” అని అరిచాడు, అంతే. దొరికిపోయాడు పరిస్థితి అర్థం చేసుకని… పోలీసు వ్యానులో ఎక్కించుకొని స్టేషనుకెళ్ళిపోయాడు యస్.ఐ.
D.S.P, C.I అంతా వచ్చారు దొరికిన నాగుల్ని చూసేందుకు. ఆ రాత్రి అక్కడే లాకప్‌లో ఉంచి గట్టి బందోబస్తు పెట్టి వెళ్ళిపోయారు.
కాళీప్రసాదు ఇంటికెళ్ళాడు. వారం రోజుల తిరుగుడు చికాకుగా ఉంది.
“ఏమిటలా ఉన్నారు?” అంది ఇల్లాలు.
“మొదట స్నానం చేయాలి” అని డ్రస్సు పీకేసాడు. స్నానం ముగించుకొచ్చెసరికి భోజనం రడీగా ఉంచింది. రెండు పెగ్గులు మందు వేసుకోవాలనిపించింది.
“114 రాలేదా?” అడిగాడు.
“రాలేదు?”
“షోడాలున్నాయా?”
తల ఊపింది.
“రెండు పట్రా.”
వాటితో పాటు చెగోడీలు తెచ్చిచ్చింది. ఆ కార్యక్రమము అరగంట లోపు పూర్తి చేసాడు. ఆ తరువాత భోజనం చేసాడు. కిళ్ళీ కట్టిచ్చింది. నోట్లో వేసుకొని పక్కెక్కుతుంటే ఫోను….
“హల్లో” అన్నడు.
“స్టేషన్ నుంచి సార్ P.C 441ని.”
“ఎవరైనా వచ్చారా?”
“రాలేదు సార్.”
“మరి?”
“వాడు భోజనం కావాలంటున్నాడు సార్. తెప్పిస్తే పలావు కావలంట.”
“అత్తగారిల్లు కాదని చెప్పు.”
“చెప్పాను సార్.”
“ఏమంటాడేమిటి?”
“పలావు…”
“లేదని చెప్పు, వాడి ఖర్మ మనం ఏం చేస్తాం” అన్నాడు ఫోను పెట్టేసి.
మూడు పూట్ల నిద్ర ముంచుకోస్తుంది. ఇల్లాలు ముస్తాబయి పక్కలోకొచ్చింది. దగ్గరకి గుంజుకుందామని చేయి ఎత్తాడు.
ఫోను మ్రోగింది.
“దాన్ని తీసి క్రింద పడేయ్” అంటూనే ఎత్తాడు.
“P.C 441 ని సార్. S.P గారొస్తుంన్నారంట మేసేజ్ వచ్చింది సార్.”
“వస్తున్న” అన్నాడు.
భార్య వైపు ఒక సారి ఓరగా చూసి దగ్గరికి తీసుకొని “స్టేషనుకెళ్ళొస్తా” అని లేచి డ్రస్సు వైపు వెళ్ళాడు. మోటారు సైకిలు స్టార్టయింది.
‘ఈ పోలీసోళ్ళకు పెళ్లిళ్ళు బొత్తిగా అనవసరం. కాపురాలకు కూడా తీరి చావదు. డ్యూటీ టైమని లేదు. మరీ మంచి వాళ్ళు తప్ప. కొంచం చికాకు అయిన వాళ్ళయితే వాళ్ళతో ఉండరు’ అనుకుంది దిండును రొమ్ములకు వత్తుకుంటూ.
స్టేషన్‌కి చేరాడు యస్.ఐ. నాగులు పలావు తింటూ కనిపించాడు.
“ఎవరకు తెచ్చారు?” అడిగాడు కోపంగా
“ఇతని బందువులు.”
“అట్లా తీసుకోకూడదు తెల్సు గదా. వాడికేదయిన విషప్రయోగం లాంటిది జరిగితే మన నౌకరీలు పోతాయి. పో” కసిరాడు.
‘నా ప్రాణం పోయినా ఏం లేదు. వాళ్ళ ఉద్యోగాలు పోతాయని బాద’ అనుకున్నాడు నాగులు.
యస్.ఐ రైటర్‌ని పిలిచి ఆరుబయటకు చేరి లోకల్‌గా వచ్చిన కేసులను చూడసాగాడు.
“సార్ మీ అన్న అమెరికాలో ఇంజనీరు కదూ” అన్నాడు నాగులు.
“అయితే ఏంటి?” అన్నాడు వీడికెలా తెల్సు అనుకొని.
“ఆయన దొంగే గదా అరెష్టు చేయించకపోయినవు?” అన్నాడు తాపీగా.
పాప బుగ్గపై కొన గోటితో నిమురుతూ…
“అరేయ్ దొంగ నా కొడకా, పుండాకోరు రాస్కేల్? ఏంటిరా? నువ్వు పేలేది? ఎంత పెద్ద ఇంజనీరు అనుకున్నావురా, ఇవ్వాళ్ళ అమెరికా వాడికి బ్రహ్మరధం పడుతోంది. అట్టాంటోడ్ని ‘దొంగ’ అంటావట్రా, సెల్ తాళం తీయ్యి. నీ తాట వొలవండి నా కొడుక్కు” అంటూ చిందులేసాడు.
“ఇదిగో ఆగు చెప్పింది విను నన్ను చికాకు చేసి నువ్వు చికాకు పడద్దు తెలుసా. ఇక్కడ డాక్టరీ మీద, వాత మామూలు డ్రిగ్రీలపైన, ఇంజనీరుపైనా ప్రభుత్వం ఖర్చెంతా?
“లక్షలు.”
“ఇక మీరు పదిహేనేళ్ళు చదివించారు గదా అదెంత? డొనేషనెంత?”
“అయిదు లక్షలు ప్రభుత్వానికో నాలుగు లక్షలు. వీటిని మీకు గానీ ప్రభుత్వానికి గానీ వాడు తిరిగి ఇచ్చాడా? ఇది బాకీ అని అమెరికా వాళ్ళు గుర్తిచిన పెద్ద ఇంజనీరుగారికి తెలీదు పాపం. ఈ దఫా వచ్చినప్పుడు కనుక్కో.”
ఈ ప్రశ్న కాళీప్రసాదును నిజంగా కలవరపెట్టింది. అసలీలా ఆలోచించలేద్నెడూ. పైగా న్యాయమైన ప్రశ్నే వేసాడు వెధవ అనిపించింది. అవును ఇక్కడ చదివి ఈ దేశానికి ఈ ప్రజలకు ఉపయోగపడక అవకాశం రాగానే వెళ్ళిపోవడం నిజంగా దొంగతనమే అనుకుంటుండగానే…
“యస్.ఐ గారూ ఈ ప్రభుత్వం మీ లాంటి అనేక మందిని వినియగించుకోవడం లేదు. చివరకు అవసర ఉన్నడాక్టరును కూడా వాడుకలేకపోతుంది. ఇక మాములు డిగ్రీల సంగతి సరేసరి. అందుకే ఈ నిరుద్యోగం అంటే… పదిహేనేళ్ళు ఇటు కుటుంబాన్ని అటు ప్రభుత్వాన్ని ఖర్చు చేయించి తీసుకున్న నాలిక గీచుకోవడాని కూడా పనికిరాని డిగ్రీ. ఇది నిరుపయోగం అని ప్రభుత్వానికీ చదివేవానికీ చదివించే వానికీ తెల్సు. అయినా ఈ race ఆగదు. మరి ఈ చదువరులు ఏమవుతారు? మరో పని చేస్తారా? చేయగలరా? వారు చదివిన చదువులో ఈ అంశాలు ఉండవు. వారి చదువుకు ఆదరణా అవకాశం లేదు. అంటే…
చదివినది నిరూపయోగమని తెలిసాక… వీళ్ళు ఏం చేస్తారు? పునుగులు వేసే వాడి దగ్గర గ్లాసులు కడగరు గదా. విడ్డూరంగా నన్ను చూడకండి సార్.
ఓ విషయం చెప్తా కోప్పడకండి. మీకు ప్రభుత్వం జీతమిస్తుంది. ఎందుకు జీతం ఇచ్చి మిమ్మల్ని నియమిస్తుందో మీ ట్రైనింగులో కొంత చెప్తారు. గొఱ్ఱెల్లా అక్కడ విని బయటకొచ్చి ఇక్కడ మీరు చేస్తున్నదేంటి?
ఈ టౌనులో ఎన్ని క్లబ్బులున్నాయి. ఎందరు వ్యభిచారులున్నారు. ఎందరు స్మగ్లరులున్నారు. ఎందరు నకలీ వ్యాపారులున్నారు. ఎందరు దళారులున్నారు. ఎందరు cheaters ఉన్నారు. ఎందరు దొంగలుగా ముద్ర వేయబడిన వారున్నారు. ఇక్కడి నాయకత్వంలో ఉన్నవాళ్ళ అక్రమార్జన ఎంత? వాడి బంధువులు మీ పై చేసే పెత్తనమెంత? ఇదంతా మీకు క్షుణ్ణంగా తెల్సు అయినా ఏ ఒక్కటి ఆగదు. ఆగనందుకు మీకు కానుకలుగా ఏదో ఒకటి వస్తునే ఉంటుంది. మాముళ్ళు వస్తాయి. చచ్చిపోయన ‘మంచి’ని గురించి కొద్దిగా ప్రయత్నించి చూడండి. మీరెక్కడ ఎలా బ్రతుకుతున్నారో అర్ధమవుతది” ఆగి…
“సార్ పైవారి నెవ్వరినీ అరస్టు చెయ్యక దొంగలని అనక అందామన్నా మీకు కోర్టుకు సరిపడే ఆదారాలు దొరక్క జేబులు కొట్టేటోళ్ళన కన్నాలేసెటోళ్ళను మూడు ముక్కలాడేటోళ్ళను మాత్రమే దొంగలు అంటున్నారు గుండె మీద చెయ్య వేసుకని చెప్పండి వీళ్ళేన దొంగలు.
ఆఁ మరచాను ఈ జిల్లాలో పుట్టిన ఇద్దరు మంత్రుల సంగతేంటి. రాజకీయాలలోకి వచ్చినప్పుడు వీళ్ళ హైసతేంది. ఇప్పుడున్న కోట్లు ఎక్కడికి పోక ఎలా వచ్చినట్లు. ప్రజాసేవ చేస్తే కోట్లు వస్తాయా, లూటీ చేస్తే వస్తాయా అని నా బోటి పిచ్చోణ్ని అడిగితే ప్రజాసేవ చేస్తేనే ఎక్కువ వస్తాయి. గౌరవంగా ఉంటుంది అని చెప్పి సిగ్గుతో తలదించుకున్నా. జేబులు కొడితే దొంగతనం జాతి జీవనాధారాన్ని దొంగ చాటుగా గడిస్తే ప్రజాసేవ ఇదెక్కడి న్యాయం సార్. ఒక వేళ్ళ ఇట్టాంటి న్యాయశాస్త్రం తెలీక అమలులో ఉంచినా మంచి అర్దమవుతున్నపుడు కూర్చని రాయొచ్చుగదా ఆలోచించండి సార్” అన్నాడు.
“Please shut your mouth ఇక పెదవి విప్పితే పళ్ళు రాలతాయి” అని పిచ్చోనిలా అరచాడు యస్.ఐ కాళీప్రసాదు.
నాగులు ముఖాన నవ్వు ముద్ర చెదరలేదు.
“సార్ న్యాయం ఇట్టా గుంటది తెలుసుకోవడానికే ఇంత బయపడుతుంటే….” అంటున్న సమయంలో దీక్షితులు పోలీసు స్టేషనులో కొచ్చాడు.
కుర్చీ చూపాడు రైటరు. హెడ్, యస్.ఐ కూడా దీక్షితులు దగ్గరికే వచ్చారు.
నమస్కారం చెప్పాడు దీక్షితులు.
“వచ్చారా?” అన్నాడు కూర్చుంటూ యస్.ఐ.
“రమ్మన్నారు గదా.”
“అవును నాగులు అరెస్టులో సాక్షిగా మీరు ఉండాలి” అన్నాడు.
“నేనెందుకు? మీకు వృత్తిపరంగా ఉండే సాక్షులుంటారు గదా సార్” అన్నాడు
“భయపడుతున్నావా?”
“అవును. భయపడాలి. సమాజం అలా ఉంది. ఇది తెలిసి భయపడకపోవడం మూర్ఖం అవుతది కాదంటారా” అన్నాడు నవ్వుతూ.
“మరి మేం?”
“మీరు వేరు కాని మేము మీలా డ్యూటీలు మాత్రం చేస్తునే ఉన్నాం. మా ధశరథం స్కూలు మాస్టారుగా చదువు చెప్పే డ్యూటీ చేసాడు. వృత్తి పరంగా నేను డ్యూటీ చేస్తునే ఉన్నాను. ఇలా చాలా మంది చేస్తున్నారు. కానీ మేం ఇది డ్యూటీగా అనుకోవాలి. మీరు మాత్రమే డ్యూటీ చేస్తున్నట్లుగా అనుకుంటారు. కానీ మీరు అసలు చేసోంది డ్యూటీయేనా అలా అవుతాదా అనవచ్చా. ఒక్కసారి ఆలోచించి చూడండి” అంటుడగా….
నాగులు “సార్ ఒక్క మాట” అన్నాడు.
లేచి నిల్చున్నాడు దీక్షితులు, నాగులు వైపుకు
“Shut up” అరిచాడు యస్.ఐ.
“ఒక్క మాట చెప్పనివ్వండి సార్, ఆనక నోరు తెరవమన్నా తెరవను” అన్నడు.
C.I జీపు వచ్చి స్టేషనుకు ఎదురుగా ఆగింది. యస్.ఐ, హెడ్డూ, P.C లు కూడా హడావిడిగా లేచారు. C.I వచ్చి యస్.ఐ తో చెప్పాడు.
నాగులుని జీపెక్కించుకని వెళ్ళారు.
దీక్షితులు మెట్లు దిగి నడిచాడు.
(ఇంకా ఉంది)