[dropcap]“ఆ[/dropcap] కాలములా పెద్ద పెద్ద ఆసాములు, బడే సాబులు, యాపారగాళ్లు
బీము, బ్యాళ్లు, రాగుల్లా, సన్నసన్న రాళ్లు కలపడము చేసి జనాలని
ఏమారిస్తావుంట్రి. అట్లా తబుడు కూడా మేము ఏది మంచి సరుకు ఏది
కలపడము అయిండే సరుకు అని చిటికిలా కనిపెట్టి కావల్సింది
కొనుకొంటా వుంటిమి. కాని ఇబుడు జనాలకి అంత పురసత్తు ఏడ
వుంది. అంగళకిపోయి ప్యాకిట్ల సరుకు కొని కండ్లు మూసుకొని
మింగేది తప్పా” ఏత పడతా అనె కాకన్న.
“నీ మాట నిజమే కాకన్న అందరికి అంత పురసత్తు లేకున్నా
కొందరికైనా వుంది. కాని వాళ్లు ఎట్ల దాన్ని కనిపెట్టేది, తాగే నీళ్లలా
పాలలా, పెరుగులా, తినే అన్నంలా, చిరుతిండ్లల్లా, ఉప్పులా, పప్పులా
కారంలా, కాయలా, పండ్లలో ఇట్ల అన్నీ కలపడమే, ఒగ మాటలా
చెప్పాలంటే కలపడము లేనిది ఏదీ లేదు” అంట్ని.
“ఇట్లయితే ఎట్లపా జనాలు బతికేది” అని రవంత సేపు
ఏచన చేసి “పోనీ జనాల ఇద్దీలు, బుద్ధులన్న కలపడము కాకుండా
వుంటే సాలు” ఆశగా అనె అన్న.
“అంత ఆశ పెట్టుకొనొద్దనా, అదీ ఎబుడో కలపడము
అయిపోయా” అని ఆడనింకా లేస్తిని.
- కలపడము = కల్తీ, 2. పురసత్తు = ఓపిక 3. ఇద్దలు – బుద్ధులు = విద్యాబుద్ధులు