[box type=’note’ fontsize=’16’] “అతనికి చాలా చరిత్ర వుంది. అది ఏమిటో కొంత తెలుసుకుంటే భారతములో అతడు పోషించిన పాత్ర కొంతవరకు అవగాహన అవుతుంది” అంటూ మహాభారతంలో శకుని గురించి వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]
[dropcap]మ[/dropcap]న తెలుగు పౌరాణిక సినిమాల వల్ల మనకు శకుని గురించి చాలా నెగటివ్ సమాచారం తెలుసు. తెలుగు సినిమాలలో సి.ఎస్.ఆర్, ధూళిపాళ వంటి మేటి నటులు ఆ పాత్రకు జీవము పోసి శకుని అంటే ఇలా ఉంటాడు అన్న అభిప్రాయాన్ని కలుగజేశారు. శకుని అంటే మహాభారతములో దుష్ట చతుష్టయముగా పిలబడే నలుగురిలో ఒకడు. వీరిలో ప్రముఖుడు దుర్యోధనుడు అయినా ఆయనకే ప్రధాన సలహాదారుడు, మాయాజూదానికి తద్వారా కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడు శకుని. శకుని దృతరాష్ట్రుడి భార్య గాంధారికి తమ్ముడు. అంటే కౌరవులకు మేనమామ. అతనికి చాలా చరిత్ర వుంది. అది ఏమిటో కొంత తెలుసుకుంటే భారతములో అతడు పోషించిన పాత్ర కొంతవరకు అవగాహన అవుతుంది.
శకుని గాంధార రాజైన సుబల వంద మంది కొడుకులలో చిన్నవాడు శకుని. వంద సోదరులలో ఒకడు. అందుకే శకునికి సౌబల అనే పేరు కూడా ఉంది. భీష్ముడు గాంధారిని అంధుడైన ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహము చేయమని అడిగినప్పుడు అంగీకరించకపోవటం వల్ల భీష్ముడు వారిని జయించి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహము జరిపిస్తాడు. గాంధార సామ్రాజ్య ఆచారము ప్రకారము మొదట గాంధారిని ఒక గొర్రెకు ఇచ్చి వివాహము చేసి ఆ తరువాత గొర్రెను చంపి ధృతరాష్ట్రుని ఇచ్చి వివాహము జరిపిస్తారు. ఆ తరువాత ధృతరాష్ట్రునికి ఈ విషయము తెలిసి తనకు రెండవ వివాహము చేశారని కోపముతో వందమందిని సుబల రాజును జైలులో ఉంచి వారిని ఆహారము లేకుండా మాడుస్తాడు. అందరికి కలిపి ఒక గుప్పెడు అన్నము ఉంచితే అందరు వారి ఆహారాన్నిశకునికి త్యాగము చేసి శకునిని బ్రతికిస్తారు
తండ్రి సుబల శకుని కాలు విరిచి అవిటివాడుగా చేసి ధృతరాష్ట్రుని బ్రతిమాలి అవిటివాడైన శకునికి ఆశ్రయము కోరుతాడు సుబల రాజు. తానూ చనిపోయే ముందు శకుని ధృతరాష్ట్రుని కుమారులను సంరక్షకుడిగా ఉంటాడు కాబట్టి అతని ఆశ్రయము ఇవ్వవలసినదిగా కోరి చనిపోతాడు. దృతరాష్ట్రుడు సుబల రాజు ఆఖరి కోర్కె(వారి పన్నాగము తెలియక) తీరుస్తాడు. ఆ విధముగా శకుని కౌరవులకు సంరక్షుడిగా ఉంటాడు. ఈ అవిటివాడు మనలను ఏమిచేస్తాడులే అన్న ధీమాతో శకునిని వదిలివేయగా, బ్రతికిన శకుని వారిని ఎదిరించే బలము లేకపోవటం వల్ల వారితో మంచిగా ఉండి అంతకన్నా శక్తివంతులైన పాండవులమీదికి ఉసిగొల్పి మాయాజూదం ఆడించి కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడై కురువంశాన్ని సమూలంగా నాశనము కావటానికి కారకుడైనాడు. స్వతహాగా శకుని తనకు గల తెలివితేటలను, కుయుక్తులను కౌరవుల పతనానికి వారితో మంచిగా ఉండి తన పగను తీర్చుకున్నాడు.
దుర్యోధనుడి వెంట ఉండి ఎప్పుడు దుర్యోధనునికి పాండవుల పట్ల ద్వేషాన్ని పెంచుతూ ప్రతి సందర్భములో బాల్యము నుండి కుట్రల కుతంత్రాలు జరుపుతుండేవాడు. పాండవులను కుంతితో సహా సజీవ దహనము చేయటానికి లక్క గృహాన్ని నిర్మించి దానిని దహింపజేయటం కూడా శకుని వ్యూహమే. శకుని హస్తినాపురం (కౌరవుల రాజధాని) పై తన పగను తీర్చుకోవటానికి తన తండ్రి సుబల శరీరము నుండి తీసిన ఎముకలతో తయారుచేసిన పాచికలను వాడుకున్నాడు. ఆ పాచికల ప్రత్యేకత శకుని మనస్సులో కోరుకున్న విధముగా పడతాయి. అందువల్ల జూదములో ఎప్పుడు శకునియే గెలుస్తాడు. ఈ విషయము తెలియని ధర్మరాజు జూదములో తన రాజ్యాన్ని సోదరులను చివరకు ద్రౌపదిని పణముగాపెట్టి అడవుల పాలవుతాడు. జూదము తరువాత శకుని దుర్యోధన దుశ్శాసనులను రెచ్చగొట్టి ద్రౌపది వస్త్రాపరహాణానికి కారకుడవుతాడు శకుని. తన రాజ్యమైన గాంధార దేశాన్ని కొడుకు ఉలుకకు అప్పజెప్పి తన ఆశయము నెరవేర్చుకోవటానికి దుర్యోధనుని పై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ హస్తినాపురములోనే ఉంటాడు. శకునికి తన సోదరి గాంధారి అంటే విపరీతమైన ప్రేమ. భర్త కోసము కళ్లకు గంతలు కట్టుకొని లోకాన్ని చూడకుండా ఉండటాన్ని సహించలేకపోతాడు. అనేక సార్లు సోదరిని కళ్ళకు గంతలు తొలగించి భీష్ముడు చేసే పనులు కౌరవులకు నష్టము కలిగించేవి చూడమని చెపుతాడు. కానీ గాంధారి ఒప్పుకోదు. కురుక్షేత్ర యుద్దానికి ముందే దుర్యోధనుని ఉసిగొల్పి భీముడి ఆహారములో విషము కలపటము, పురోచనడు అనే వ్యక్తి చేత లక్క గృహము నిర్మించి పాండవులను సజీవ దహనానికి ప్రయత్నించటము, పాండవులను మాయా జూదానికి ఆహ్వానించి వారిని ఓడించటము, పాండవులు అరణ్యవాసములో ఉండగా దుర్వాస మహామునిని వారిపై ఉసిగొల్పటం, దుర్యోధనుడిని శ్రీ కృష్ణుడి దగ్గరకు పంపి కృష్ణుడి నారాయణ సేనను కౌరవ పక్షాన ఉండేటట్లు చేయటం, యుద్దానికి ముందు కృష్ణ రాయబారము విఫలము చేయటము, యుద్దములో అర్జునుడు లేని సమయములో పద్మవ్యూహాన్ని ఏర్పాటుచేసి అభిమన్యుని చావుకు కారణమవటము వంటి పనులలో శకుని పాత్ర ఎంతైనావుంది. అంటే శకుని పాత్ర లేనిదే ద్వాపరయుగము ముగిసేది కాదు.
ద్వాపరయుగములో మంచికి శ్రీకృష్ణుడు, చెడుకు శకుని తార్కాణాలు. మాయాజూదము తరువాత పాండవులలో ఆఖరువాడైన సహదేవుడు శకునిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. అలాగే కురుక్షేత్ర యుద్దములో 18వ రోజున సహదేవుడు శకునిని చంపుతాడు. శకుని పేరు చెడుతో ముడిపడి ఉన్నప్పటికీ అతనిలోని సాత్విక గుణాలు కేరళ లోని కురువర్ తెగవారు గుర్తించి శకునికి వారు కొల్లం జిల్లాలోని పవిత్రేశ్వరములో గుడి కట్టారు. ఆ గుడిలో శకుని ఉపయోగించినదిగా చెప్పబడే సింహాసనము ఉంది. కానీ ఆ గుడిలో లో ఏవిధమైన పూజలు జరుగవు. లేత కొబ్బరి, సిల్క్, తాటి కల్లు ఆ గుడిలో అర్పిస్తారు.
ఈ విధముగా మన దేశములో మంచికి చెడుకు రెంటికి దేవాలయాలు ఉన్నాయి.