[box type=’note’ fontsize=’16’] 30 జనవరి నాడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, వారిని స్మరిస్తూ హిందీలో నరేంద్ర గౌడ్ వ్రాసిన కవితని తెలుగులో అందిస్తున్నారు బి. మురళీధర్. [/box]
[dropcap]దే[/dropcap]శదేశాల పటాల కన్నా ఎంతో పెద్దది
మహాత్మాగాంధీ చిత్రపటం.
ఏ పటం కన్నా, ఏ కొలత కన్నా
ఎంతో ఎత్తైనవాడు మహాత్ముడు.
సత్యం, అహింసాధర్మాల గురించిన
ఆయన సిద్ధాంతాలు
నేటికీ ప్రాసంగికాలే!
ఎందుకంతే లోకం నుండి
హింస ఇంకా మాసిపోలేదు
సత్యం ప్రతి చౌరస్తాలో
అంగడి సరుకులా అమ్మకానికి నిలుచునుంది.
ప్రపంచంలోని పత్రికలన్నీ హింసా వార్తలతోనే
పొంగి పొరలుతున్నాయి.
ఉగ్రవాదం నలుదిక్కులా పరచుకొని వుంది.
ఏ కవిత్వం కన్నా – ఏ కథ కన్నా – ఏ గాథ కన్నా
మహాత్మాగాంధీ చిత్రపటమే ఎంతో పెద్దది.
ఇంకా బాధాకరమేమిటంటే –
మహాత్ముడి సిద్ధాంతాల ప్రాసంగికత
ముగిసిపోతుందన్న జాడే కన్పించడం లేదు!
హింస, బలాత్కారాలు, అత్యాచారాలు
జరగని రోజంటు బహశా ఒక్కటీ లేదు!
కాకపోతే – హింసా అనాచారాలదే
నలువైపులా ప్రాచుర్యం!
అందుకే – మహాత్మాగాంధీ చిత్రపటం
నిరంతరం పెద్దదవుతూ పోతున్నది!
మరోవంక – మనిషీ – మానవత్వాల ఎత్తు కొలతలు
నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి!
బాపూ! మీ ప్రాసంగికతను
ఇలా నిలిపి ఉంచుతున్నందుకు
మమ్మల్ని క్షమించవూ!
బాపూ! మమ్మల్ని క్షమించవూ!!
హిందీ మూలం: నరేంద్ర గౌడ్. తెలుగు సేత: బి. మురళీధర్