[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా అదూర్ గోపాలకృష్ణన్ మలయాళం సినిమా ‘ఎల్లిప్పథయం’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘ఎల్లిప్పథయం’ (మలయాళం)
[dropcap]ఆ[/dropcap]దూర్ గోపాలకృష్ణన్ విరివిగా ప్రతీకాలంకారాలు ప్రయోగించిన సినిమా సృష్టి బహుశా ఇదే. అప్పటికే సమాంతర సినిమా సారధులుగా రంగంలో వున్నసత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్‌ల ముందు తనని నిరూపించుకునేందుకా అన్నట్టు ఈ మూడో సినిమా ప్రయత్నం చేశారు. వస్తువులు, రంగులు, ప్రకృతీ ప్రతీకాలంకారాలయ్యాయి ఈ కథా వస్తువుకి. భూస్వామ్యం అంతరించి ప్రజల ఆర్థిక స్వాతంత్య్రం ఉదయిస్తున్నవేళ మార్పుకి సిద్ధపడని భూస్వామి కథ ఇది. ఇతడి కథ చెప్పడానికి ఎలుక, ఎలుకల బోను, ఇస్త్రీ పెట్టె, పౌడరు డబ్బా, తెల్ల వెంట్రుకలు, కొబ్బరి నూనె, ఫ్యాను, టార్చి లైటు వంటి వస్తువులు; ఆకుపచ్చ, నీలం, ఎరుపు వంటి రంగులు; మురికి గుంట, గాలి, కొబ్బరి మట్ట వంటి ప్రకృతి దృశ్యాలూ సాధనాలుగా కన్పిస్తాయి.
ప్రధాన పాత్ర భూస్వామి ఉన్ని ఎలుక లాంటి వాడు. మార్పుని జీర్ణించుకోలేని వాడు. ఎలుకలా కలుగులో దాక్కుని వుంటాడు. ఈ ఎలుకని బయటికి తీసినా సమాజంలో ఉండడానికి యోగ్యత లేదు. అందుకని బోనులో పట్టి మురికి గుంటలో ముంచి చంపడం. ఈ సింబాలిజం అతడి చిన్న చెల్లెలు శ్రీదేవితో మూడు సార్లు పునరావృత మవుతుంది. శ్రీదేవే ఎందుకంటే ఆమె ఎరుపుకి ప్రతినిధి కాబట్టి. ఆదూర్ భాషలో పెద్ద చెల్లెలు జనమ్మ ధరించే ఆకుపచ్చ రంగు దుస్తులు ఆమె చైతన్యవంతురాలని సూచిస్తాయి. అలాగే రెండో చెల్లెలు రాజమ్మ నీలం రంగు చీరెలు ఆమె సున్నితత్వాన్ని, అణిగివుండే స్వభావాన్నీ తెలుపుతాయి. ఇక శ్రీదేవి ఎరుపు రంగు డ్రెస్సులు తిరుగుబాటు మనస్తత్వాన్ని తెలుపుతాయి. కాబట్టి ఎలుకల్ని పట్టి చంపడంలోని సింబాలిజం ఆమెతో వుంది.
పదేపదే ఎలుకల్ని పట్టి చంపడంలోని అంతరార్ధం ఎన్ని జన్మలెత్తినా ఈ అన్న మారడనే. ఆమె చేయాల్సిన ప్రయత్నం చేసింది. చివరికి వూరి ప్రజలే పూనుకుని ఏకంగా అతడ్నే ఎత్తుకెళ్ళి అదే మురికి గుంటలో విసిరేశారు. మురికి గుంట ఈ కథలో అతడి మురికి మనసుకి నిదర్శనం. కలుగు చీకటి మస్తిష్కానికి గుర్తు. ఒక దృశ్యంలో పొలం దగ్గరికి నడుచుకుంటూ పోతూంటే, దారిలో బాట మీద మురికి నీళ్లుంటాయి. అక్కడాగి పోయి సందేహిస్తూ వుంటాడు. కానీ తన మనసులో వున్న మురికిని చూసుకోడు. ఇంతలో ఒక లేబర్ కుర్రాడు హుషారుగా ఆ మురికి గుంట దాటేస్తాడు. తనలాగా వాడు మురికిని నిల్వ చేసుకునే రకం కాదు. ఉన్ని బయటి నుంచి ఇంటి కొస్తే బావి దగ్గర శుభ్రంగా కాళ్ళు కడుక్కుంటాడు. మనస్సు కూడా కడుక్కోవాలని అనుకోడు.
ఇక వొంటికి నూనె పట్టించి మర్దనా చేసుకునే సింబాలిజం. అసలా తుప్పుపట్టిన మనసుకి నూనె పట్టించి మాలీషు చేసుకోవాల్సిన వాడు. ఇక మీసంలో తెల్ల వెంట్రుక కత్తిరించుకోవడం: దాని వల్ల వయస్సు తగ్గి కుర్ర ఆలోచనలు వస్తాయా, రావు. మనసులో ప్రగతి వుండాలి గాని.
ప్రకృతి పరంగా ఈదురు గాలి, వర్షం, కొబ్బరి మట్ట రాలి పడ్డం వంటివి రాజమ్మ అవసాన దశలో వున్నప్పుడు వచ్చే సింబాలిజాలు. పెద్ద చెల్లెలు కొడుకుతో వచ్చినప్పుడు వాడితో ఒక సీనుంటుంది: ఫ్యాను కింద పడుకుని చూస్తుంటే కంట్లో నలక పడుతుంది. లేచి అద్దం ముందు నిలబడి అక్కడున్న పౌడరు దట్టంగా మొహానికి రాసుకుంటాడు. దుర్భర పరిస్థితి నుంచి వాడు మేనమామ కంటే వేగంగా విముక్తి కోరుకునే మనఃస్థితి గలవాడన్న అర్ధం ఈ దృశ్యంలో మనకి కనబడుతుంది. మార్పు అనివార్యం. బలహీన మనస్కులే మార్పుని అంగీకరించక ప్రతిఘటిస్తారు. మేనమామ సమస్య ఇదే. ఒక సన్నివేశంలో జనమ్మ కొడుకు ఆక్కడున్న ఇస్తీ పెట్టె అందుకుని చూస్తూంటాడు. దాన్ని మనకి చూపించే కోణంలో అది ఎలుక లాగే కన్పిస్తుంది. టార్చి లైటు చీకట్లో దారి చూపుతుంది. ఆ దారితో పనేలేదు ఉన్నికి.
ఒక చెల్లెలు ప్రేమికుడితో వెళ్ళిపోయి, ఇంకో చెల్లెలు పెళ్లి లేక దిగులుతో చనిపోయీ తలెత్తిన శ్మశాన నిశబ్దంలో పిచ్చి వాడవుతాడు ఉన్ని. ఈ నిశ్శబ్దం మనసులో గూడుకట్టి నన్నాళ్ళూ నిశ్శబ్దం ఎంత భయంకరమో జ్ఞానోదయం కాలేదు, బాహ్యంగా అనుభవంలో కొచ్చేసిరికి పిచ్చెత్తి పోయాడు. ఆ పిచ్చిలో ఏవేవో స్వైర కల్పనలు. శబ్దమైతే భయంతో కేకలేయడం, ఎవరో చంపడాని కొచ్చినట్టు పరుగెత్తడం. ఒంటరి దెయ్యంలా ఇరుగుపోరుగుకి సమస్య కావడం. ఈ దెయ్యాన్ని వదిలించుకోవడానికి మురిగ్గుంటలో ఎత్తేయడం!
దృశ్యాల్లో సింబాలిజం లేకుండా ఏ వస్తువూ లేదు. సింబాలిజం లేకుండా ఏ చర్యలూ లేవు. నిశ్శబ్దమే ప్రధానంగా సింబాలిజాలే ఈ కథ నడుపుతాయి. సంభాషణలు ఎప్పుడోగానీ వుండవు. వుంటే అవి దృశ్యాల్ని డామినేట్ చేయవు. ఇక నేపధ్య సంగీతం ఎప్పుడో గానీ విన్పించదు. విన్పిస్తే లీలగా విన్పిస్తుంది. వెరసి ఇదంతా ఒక కళాఖండాన్నే దర్శిస్తుస్తున్నట్టు వుంటుంది. రవి వర్మ ఛాయాగ్రహణం, ఎంబీ శ్రీనివాసన్ సంగీతం, దేవదాస్ శబ్ద గ్రహణం, ఎం. మణి కూర్పు, శివన్ కళా దర్శకత్వం ఆదూర్ కళా సృష్టికి విశేషంగా తోడ్పడ్డాయి.
ఆదూర్ చెప్పినట్టు ఉన్ని పాత్ర కేరళలోని నాయర్ సామజిక వర్గానికి చెందింది. నాయర్లు, నంబూద్ర్రి బ్రాహ్మణులు భూస్వామ్య వర్గానికి చెందిన వాళ్ళు. గల్ఫ్‌కి ప్రజల వలసలు పెరిగాక కూలీలు తగ్గి పోటీ ఆర్థిక వ్యవస్థ అవతరించింది. దీంతో భూస్వామ్య వ్యవస్థతో బాటు ఉమ్మడి కుటుంబాలు బీటలు వారసాగాయి. ఏకకాలంలో ఈ రెండు పట్టుగొమ్మలు మటుమాయం గావడంతో దిక్కు తోచని స్థితిలో పడ్డాయి ఆ వర్గాలు. మార్పుని జీర్ణించుకోలేని మనసికావస్థ నెదుర్కొన్నారు. ఈ మానసిక స్థితి పరిణామాలే ఈ సమాంతర సినిమా కథ.