తనదాకా వస్తే

14
3

[box type=’note’ fontsize=’16’] ఇతరుల విషయాల్లో ఆత్యాసక్తి కనబరచడం, చుట్టూ జరుగుతున్న సంఘటనల్లో జోక్యం చేసుకోవడం కొంతమందికి అలవాటు. అలాంటి అలవాటును ఆలంబనగా చేసుకున్న రామయ్య అనే పల్లెటూరి వ్యక్తి కథే ఈ నాటిక. రచన తోట సాంబశివరావు. [/box]

ఇతివృత్తం:

[dropcap]ఇ[/dropcap]తరుల విషయాల్లో ఆత్యాసక్తి కనబరచడం, చుట్టూ జరుగుతున్న సంఘటనల్లో జోక్యం చేసుకోవడం కొంతమందికి అలవాటు. ఆ అలవాటు ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. మరెన్నో అవమానాలకు గురి చేస్తుంది. అలాంటి అలవాటును ఆలంబనగా చేసుకున్న రామయ్య అనే పల్లెటూరి వ్యక్తి కథే ఈ నాటిక.

ముఖ్యపాత్రలు:

రామయ్య : వయస్సు 50 సంవత్సరాలు. పంచె, లాల్చీ, పై పంచె.

భూషయ్య : వయస్సు 50 సంవత్సరాలు. పంచె, చొక్కా, కండువా.

జ్యోతిష్కుడు : వయస్సు 40 సంవత్సరాలు. తెల్లపంచె, రంగు లాల్చీ, సంచి, నుదుట విబూధి, మెళ్లో రుద్రాక్షలు.

తోటి ప్రయాణీకుడు : వయస్సు 50 సంవత్సరాలు. పంచె, చొక్కా, కండువా.

సహాయ పాత్రలు:

తండ్రి : వయస్సు 50 సంవత్సరాలు, రైతు.

కొడుకు : వయస్సు 25 సంవత్సరాలు. ఉద్యోగార్థి.

కమల : వయస్సు 20 సంవత్సరాలు. విద్యార్థిని (రామయ్య కూతురు)

కమలాకర్ : ఎదురింటి అబ్బాయి, వయస్సు 22 సంవత్సరాలు. విద్యార్ధి.

***

రామాపురం…. చిన్న పల్లెటూరు. తొలి కోడి కూసినప్పుడే తెల్లవారుతుంది ఆ పల్లెవాసులకు. అప్పట్నుంచే ఎవరి పనుల్లో వారు తలమునకలవుతారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలయింది. పిల్లలు పుస్తకాల సంచులు భుజాన వేసుకుని స్కూలుకు వెళుతున్నారు. టిఫినీలు చేతబుచ్చుకుని పొలం పనులకు బయలుదేరారు ఆడపడుచులు. ఎడ్లబండ్లపై మందు కట్టలు, పురుగు మందులు ఎక్కించుకుని పొలం వెళుతున్నారు రైతన్నలు. కూరగాయలు, ఆకుకూరలు సైకిలుపై పెట్టుకుని వీధుల్లో తిరిగి అమ్ముతున్నాడు ఓ చిరువ్యాపారి. కొంత మంది రచ్చబండ పై కూర్చుని న్యూస్ పేపర్లు చదువుతూ నేటి రాజకీయలపై తీవ్రంగా చర్చిస్తున్నారు. వాళ్లల్లో మన భూషయ్య కూడా ఉన్నాడు. అప్పుడే అల్లంత దూరంలో వున్న బస్‌స్టాప్ వైపు హడావుడిగా నడుస్తున్నాడు మన రామయ్య.

భూషయ్య :

ఏం రామయ్యా! ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నావ్… ఏంటి విషయం?

రామయ్య :

ఆ! ఏం లేదు భూషయ్యా…. పట్నంలో చిన్న పనుంది. అది చూసుకుని సాయంత్రానికి తిరిగి రావాలి. అందుకని తొందరగా వెళ్తున్నాను.

భూషయ్య :

రే…. వెళ్లిరా…. సాయంత్రం కలుద్దాం.

రామయ్య :

అది సరే గాని…. ఏంటి విశేషాలు?

భూషయ్య :

ఉండటానికి చాలా వున్నాయ్‌లే గాని, నువ్వెళ్లిరా… సాయంత్రం కలుసుకుంటాం కదా! అప్పుడు మాట్లాడుకుందాం.

రామయ్య :

అది కాదు లేగాని…. రెండు విషయాలన్నా చెప్పరాదూ…

భూషయ్య :

సరే నీ ఇష్టం…. చెప్తా విను. మన డాక్టరుగారుమ్మాయికి పెండ్లి కుదిరిందట! అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం…

రామయ్య :

పోనీలే పాపం… డాక్టరుగారు చాలా రోజుల నుండి కూతురికి సంబంధాలు చూస్తున్నాడు. మొత్తానికి ఇప్పటికి కుదిరిందన్నమాట…. సంతోషం….

భూషయ్య :

ఇకపోతే…. రెండోది….. రంగారావుగారమ్మాయి నెల తప్పిందట! త్వరలోనే తాత కాబతున్నాడు.

రామయ్య :

పోనీలే పాపం…. ఆ ముచ్చటా తీరాలిగా…. అందునా…. అసలుకంటే వడ్డీ ముద్దు కదా! సంతోషం….

భూషయ్య :

ఇక పోతే… రెండోది…. గుర్నాధం కొడుక్కి డాక్టర్ కోర్సులో సీటొచ్చిందట!

రామయ్య :

పోనీలే పాపం… కొడుకుని డాక్టర్‌గా చూడాలనే కోరిక తీరబోతున్నదన్న మాట! సంతోషం….

భూషయ్య :

ఇక పోతే…. రెండోది…. ఈ సారి కూడా మన విశ్వనాధం సర్పంచ్‌గా పోటీ చేస్తాడట!

రామయ్య :

పోనీలే పాపం…. ఆ పదవిని దక్కించుకోవాలని ఎన్ని సంవత్సరాల నుండో పోటీ చేస్తునే వున్నాడు. ఈ సారైనా గెలిస్తే బావుండ్ను…. సంతోషం….

భూషయ్య :

ఇక పోతే…. రెండోది….

రామయ్య :

చాల్ చాల్లే ఆపవయ్యా! ఇకపోతే రెండోది… ఇకపోతే రెండోది… అంటూ నాలుగు విషయాలు చెప్పావ్…. ఆ రెండో విషయమేదో చెప్పకుండానే… నేవస్తా…. బస్సుకు టైం అయింది ( వడి వడిగా అడుగులేస్తూ వెళ్లాడు.)

భూషయ్య :

లేకపోతే… విశేషాలు కావాలట! విశేషాలు…. ఎప్పుడూ అదే యావ…. ఎవరింట్లో ఏం జరుగుతుంది…. ఎవరికేమయింది… హు…. పని లేకపోతే సరి…. (గొణుక్కుంటూ నెమ్మదిగా వెళ్లాడు).

(బస్సురానే వచ్చింది…. టికెట్ తీసుకుని సీట్లో కూర్చున్నాడు రామయ్య… రైట్ రైట్ అన్నాడు కండక్టర్. బస్సు బయలుదేరింది. ప్రక్కసీట్లో వున్న జ్యోతిష్కుడు ఒక అమ్మాయి రెండు అరచేతులు చూస్తూ జ్యోతిష్కం చెప్తున్నాడు. చెప్పడం పూర్తయింది.)

రామయ్య :

ఏవండీ… జ్యోతిష్కులుంగారు… సాధారణంగా మగవారికి కుడి చేయి, ఆడవారికి ఎడమ చేయి చూసి జ్యోతిష్కం చెప్తారు కదా! మరి మీరేంటి…. ఆ అమ్మాయి రెండు చేతులు పట్టుకుని చూస్తున్నారు. ఎందుకలాగా? (మెల్లగా అడిగాడు).

జ్యోతిష్కుడు :

మీరు చెప్పింది వాస్తవమే…. అందులో ఏ సంశయం లేదు. ఒక సారేమయిందంటే…. (ఏదో రహస్యం చెప్తున్నట్లుగా) ఒక అమ్మాయి ఎడం చేయి చూస్తూ రేఖలను క్షుణ్ణంగా పరిశీలించడానికి అరచేతిని వత్తుతూ, వ్రేళ్ల చివరన వుండే చక్రాలు చూడ్డానికి వ్రేళ్లను వెనక్కూ ముందుకూ వంచుతూ చూస్తూంటే… ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకుంది. వేరే ఆలోచించకుండా కుడి చేత్తో నా చెంప ఛెళ్లుమనిపించింది. అప్పటి నుండి అమ్మాయిల చేయి చూస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా ఇలా రెండు చేతులు పట్టుకుని చూస్తున్నాను…. అదీ సంగతి…

రామయ్య :

అయ్యో పాపం!…. అదా సంగతి… అయినా… నాకు తెలీకడుగుతా… అలా ఎలా కొట్టిందండీ… మరీనూ….

జ్యోతిష్కుడు :

ఎలా అంటే … ఎలా అంటే… ఇలా… (లాగి రామయ్య చెంప మీద కొట్టాడు.)

రామయ్య :

అయ్యో! ఇదేంటండీ…. ఇలా కొట్టారేంటి?…. మీరు భలేవారే….

జ్యోతిష్కుడు :

నువ్వే కదయ్యా…. ఎలా కొట్టిందని అడిగావ్…. అందుకనే… ఇలా కొట్టిందని కొట్టి చూపించా…. అంతే!

రామయ్య :

ఆ! గొప్పగా చెప్పావులే… నా ఖర్మ ఎరక్కపోయి అడిగాను…. ఛ… ఛ…

(బస్సు పట్నంలోని బస్‌స్టాండ్‌లో ఆగింది. అందరూ బస్సు దిగి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు…. రామయ్య వెళుతుండగా…. ఒక చోట ఐదారుగురు గుంపుగా నిలబడి చూస్తున్నారు… రామయ్య.. వాళ్లను తోసుకుంటూ…. మధ్యలోకి వెళ్లాడు).

రామయ్య :

ఆ! ఆ!… జరగండి… కొంచం జరగండి… అసలేం జరుగుతోందిక్కడ?

తండ్రి :

చూడు బాబూ… వీడు నా కొడుకు…. పట్నం వద్దురా… ఇక్కడ మనం బతకలేం… మనూరెళ్ళి వ్యవసాయం చేసుకుందాం… అంటే వినడం లేదు. కాస్త మీరైనా చెప్పండి… వాడ్ని ఎలాగైనా ఒప్పించి పుణ్యం కట్టుకోండయ్యా…

రామయ్య :

(కొడుకుతో) చూడబ్బాయ్… పెద్దాయన అంతగా చెప్తుంటే వినచ్చు కదా! “పెద్దల మాట చద్ది మూట” అన్నారు. నీ తండ్రి మాట మీద ఆ మాత్రం గౌరవం లేదా? ఇలా అయితే ఎలా? ఒక సారి ఆలోచించు…

కొడుకు:

చూడు… నువ్వెవరో నాకు తెలియదు. మా ఇంటి విషయాలేవీ నీకు తెలియవు. అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకోకుండా వెళ్లి పన్చూసుకో… వెళ్ళూ… చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడిలా (రామయ్యకు తల తీసేసినట్లయింది).

రామయ్య :

ఆ!… అయినా… మీ విషయాలు నా కెందుకులే… నా పనులు నాకున్నాయ్ (మెల్లిగా జారుకున్నాడు).

(రామయ్య పట్నంలో పని పూర్తి చేసుకుని బస్‌స్టాండుకు వచ్చాడు. టికెట్ తీసుకుని బస్సెక్కి కూర్చున్నాడు. అందరూ టికెట్లు తీసుకున్నారని నిర్ధారించుకుని రైట్ రైట్ అన్నాడు కండక్టర్. బస్సు బయలుదేరింది. ప్రక్క సీట్లో వున్న ఇద్దరు ప్రయాణీకులు వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటూ… మధ్య మధ్యలో రామయ్య కేసి చూస్తున్నారు. రామయ్య వాళ్ల మాటలు వింటూ…. చూస్తూ…. నవ్వుతూ… హావభావాలు… ప్రదర్శిస్తున్నాడు)

తోటి ప్రయాణీకుడు :

ఈ రోజుల్లో మనుషుల్ని చూసి ఎవరు ఎలాంటివారో కనుక్కోవడం చాలా కష్టం మండి….. (రామయ్యతో) ఏమంటారు మాష్టారూ… మీరు చెప్పండి.

రామయ్య :

అవును… ఒక మనిషిని చూసి అతడు ఎలాంటి వాడో తెలుసుకోవడం చాలా కష్టం.

తోటి ప్రయాణీకుడు :

అదే చెప్తున్నా మావాడికి (ప్రక్కన కూర్చున్న వ్యక్తిని చూపిస్తూ) ఇప్పుడూ… మీరున్నారు….. మంచిగా బట్టలు వేసుకున్నారు. చూడ్డానికి పెద్ద మనిషిలా వున్నారు. ఏమో??? మీరు జేబులు కొట్టే దొంగేమో…. ఆ! కాదని గ్యారంటి ఏంటి?

రామయ్య :

ఏమిటయ్యా…. అలా మాట్లాడుతావ్… నీకంటికి నేను జేబులు కొట్టేవాడిలా కనిపిస్తున్నానా?

తోటి ప్రయాణీకుడు :

కోప్పడకండి సార్… ఏదో మాటవరసకన్నాను…. అంతే… అది సరే గాని మాష్టారూ… ఒక విషయం అడుగుతాను చెప్పండి.

రామయ్య :

ఏంటది?

తోటి ప్రయాణీకుడు :

మా ఊళ్లో ఒకాయన పెళ్లీడు కొచ్చిన కూతురిపై చేయి చేసుకున్నాడండీ… ఆలా చేయవచ్చా?… ఆ చెప్పండి? ఇష్టం వచ్చినట్లు చచ్చేటట్లు కొట్టాడండి.

రామయ్య :

చాలా తప్పండి… అలా కొట్టకూడదు.

తోటి ప్రయాణీకుడు :

అదే చెప్తున్నా మావాడికి (ప్రక్క వ్యక్తిని చూపిస్తూ) అసలు నాకు తెలియకడుగుతా (రామయ్యను చూస్తూ) నీకు బుద్దీ… జ్ఞానం… ఉందా అని అడుగుతున్నా… నువ్వు… పెళ్లీడుకొచ్చిన అమ్మాయిని పట్టుకుని కొడతావా… అసలు నువ్వు మనిషివా… పశువ్వా… ఆ!… పోనీ… ఏదో తెలిసో తెలియకో తప్పు చేసిందే… అనుకో…. అయినా కొడతావా… ఆ! కొడతావా? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? (రామయ్య కేసి ఉరుమురిమి చూస్తూ పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడున్న వాళ్లంతా అతను, రామయ్యను ఉద్దేశించి అలా గట్టిగా మాట్లాడుతున్నాడనుకున్నారు)

రామయ్య:

ఏంటండీ ఇది?… ఎవరో వాళ్లమ్మాయిని కొడితే… అనరాని మాటలు నన్నంటారేంటి? ఇదేం బాగోలేదు.

తోటి ప్రయాణీకుడు :

అబ్బే…. మీ గురించి కాదండి… కూతుర్ని కొట్టాడే… వాడి గురించి…. ఆవేశంలో ఏదో మాట్లాడాను. ఏవనుకోకండి…

రామయ్య…

చాల్ చాల్లేవయ్యా… అనాల్సిన మాటలన్నీ అనేసి… పైగా ఇదోటి…. ఏవనుకవోద్దుట… ఏవనుకవద్దు… హు… నా ఖర్మ… ఛ… ఛ….

(“ఆ… రామాపురం… దిగాలి… రావాలి… రావాలి…” అరిచాడు కండక్టర్… రామయ్య బస్సు దిగి ఆ రోజు జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఇంటి వైపు నడుస్తున్నాడు.)

రామయ్య :

(తనలో) అనవసరంగా ఇతరుల్ల విషయాల్లో జ్యోకం చేసుకుంటే పరువు పోయింది… ఈ రోజు నుండి ఇంకొకళ్ల విషయాల జోలికి పోను అంతే… ఆ!… పక్కా…. (ఇంతలో… భూషయ్య ఎదురుపడ్డాడు.)

భూషయ్య :

ఏం రామయ్యా… పట్నం వెళ్లిన పని అయిందా?

రామయ్య :

ఆ! అయిందేలే… వస్తా… (వెళ్తాడు)

భూషయ్య :

అరరే… ఆగు రామయ్యా… అలా వెళ్లిపోతావేంటి? విశేషాలు ఏమీ వద్దా?

రామయ్య :

ఆ! వద్దులే… ప్రొద్దుట్నించి చాలా విశేషాలు విన్నానులే… ఇవాళ్టికి చాలు… రేపు కలుస్తా.. (వెళ్లబోతాడు).

భూషయ్య :

అది కాదు రామయ్యా… రేపుటికవి మురిగిపోతాయ్…. అందుకే ఈ రోజువి ఈ రోజే తెలుసుకోవాలి. రేపటికి వేరే వుంటాయ్.

రామయ్య :

బాబూ! నీకో దండం…. ఇవ్వాళిటికి నన్నొదిలేయ్.

భూషయ్య :

సరే! నీయిష్టం. వెళ్లు… (భూషయ్యను తప్పించుకుని నడుస్తూ పదడుగులు వేశాడో లేదో… రామయ్యకు తన అలవాటు పునరావృత్తం అయింది.)

రామయ్య :

(తనలో) ఏవో విశేషాలంటున్నాడు కదా… వింటే పోలా… (వెనక్కి తిరిగి భూషయ్య దగ్గరికి వచ్చాడు.) ఆ! భూషయ్య… అవేవో విశేషాలన్నావ్ కదా!! చెప్పు చెప్పు….

భూషయ్య :

(తనలో) నాకు తెలుసు నువ్వు తిరిగి వస్తావని… (రామయ్యతో) సరే చెప్తా విను. మీ అమ్మాయి కమల ఈ రోజు ఉదయం నుంచి కనిపించలేదు.

రామయ్య :

మా అమ్మాయా? (డీలా పడ్డాడు)

భూషయ్య :

మీ ఎదురింట్లో అబ్బాయి కమలాకర్ కూడా ఈ రోజు ఉదయం నుంచి కనిపించ లేదు.

రామయ్య :

అయితే… నేవస్తా… ఏమయిందో తెలుసుకోవాలి. (ఇంటి వైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్లాడు. ఇంట్లకి వెళ్తూనే…)

రామయ్య :

ఏమేవ్? ఎక్కడ చచ్చావ్?? (భార్యను పిలిచాడు)

రామయ్య కూతురు :

ఏంటి నాన్నా… అమ్మ… పక్కింటి పిన్నిగారింటికి వెళ్లిందిలే… కాసేపట్లో వస్తుంది.

రామయ్య :

ఏమ్మా! ఈ రోజు కాలేజీకి వెళ్లావా? (ప్రేమగా)

రామయ్య కూతురు :

వెళ్లలేదు నాన్నా… కొంచ్చం జ్వరం వచ్చినట్లుంటేను… ఇంట్లోనే వున్నా!…

రామయ్య :

అవునా… మరి మందులేమైనా వేసుకున్నావా లేదా? ఇప్పడెలా వుందమ్మా?

రామయ్య కూతురు :

టాబ్లెట్లు వేసుకున్నాను. ఇప్పుడు పరవాలేదు. బాగానే వుంది నాన్నా…

రామయ్య :

ఆ! సంతోషం… అయితే నువ్వు ఉదయం నుంచి ఎక్కడకూ వెళ్లలేదన్నమాట!!

రామయ్య కూతురు :

అదే కదా చెప్పాను. ఎక్కడికీ వెళ్ల లేదు. ఇంట్లనే ఉన్నా…

రామయ్య :

అవునా… ఎక్కడికీ వెళ్ల లేదా… సరేలే… నువ్ వెళ్లి పని చూస్కో…

రామయ్య కూతురు :

ఏంటో… పాపం…. నాన్న… ఒక పట్టాన అర్థం కాడు. (అనుకుంటూ లోపలికెళ్లింది.)

రామయ్య :

(తనలో) మరి భూషయ్య అలా చెప్పాడేంటి. ఏమయ్యుంటుంది… ఒకసారి ఎదురింటి కమలాకర్ గురించి కూడా వాకబు చేస్తే పోలా… (ఎదురింటి కెళ్లి తలుపు తడుతూ) ఏవండీ… ఏవండీ…

కమలాకర్ :

(తలుపు తీస్తూ) మీరా… రండంకుల్… రండి… కూర్చోండి…

రామయ్య :

(కూర్చుంటూ) ఏం బాబూ… మీ నాన్న ఇంట్లో లేడా.

కమలాకర్ :

లేరంకుల్… ఊరెళ్లారు.. రాత్రికి వస్తారు.

రామయ్య :

సరే… ఎలా చదువుతన్నావ్…

కమలాకర్ :

బాగానే చదువుతున్నానంకుల్.

రామయ్య :

రోజూ కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్తున్నావా?

కమలాకర్ :

వెళ్తున్నానంకుల్… కాకపోతే… ఈ రోజు ఎసైన్‌మంట్స్ పూర్తి చేద్దామని ఇంట్లోనే వున్నాను. కాలేజీకి వెళ్లలేదు.

రామయ్య :

అయితే నువ్వు ఉదయం నుంచి ఎక్కడకూ వెళ్లలేదన్నమాట!

కమలాకర్ :

ఎక్కడకు వెళ్లలేదంకుల్… ఏమైందంకుల్? ఎందుకలా అడుగుతున్నారు?

రామయ్య:

ఆ… ఏం లేదులే బాబూ… బాగా చదువుకో… నేవస్తా.. (బయటకు వెళ్లాడు)

కమలాకర్ :

ఏంటో ఈ మనిషి… ఏం మాట్లాడాడో… ఎందుకు మాట్లాడాడో… నాకైతే అర్థం కాలేదు. (లేపలికి వెళ్లాడు)

రామయ్య :

(బయటకు వచ్చి ఆలోచనలో పడ్డాడు) (తనలో) మరి భూషయ్య అలా చెప్పాడేంటి?… వెళ్లి నిలదీస్తా… కడిగేస్తా… ఏమనుకుంటున్నాడో ఏమో… (అనుకుంటూ భూషయ్య దగ్గరికి వెళ్లాడు) ఏంటి భూషయ్య…. మా అమ్మాయి, ఎదురింటి అబ్బాయి… ఈ రోజు ప్రొద్దుట్నించి కనిపించలేదని చెప్పావ్…. ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో లేచిపోయినంత బిల్డప్ ఇచ్చావు. ఇది పద్దతేనా… ఆలా చెప్పొచ్చా???….

భూషయ్య :

ఆగాగు రామయ్యా… ఆగు!… అసలు నేనేమన్నాని నీ కోపం. రోజూ కనిపించే వాళ్లు…. ఈ రోజు ఉదయం నుండి కనిపించలేదని చెప్పాను. అంతే!!

రామయ్య:

మరయితే ఇందులో విశేషం ఏముంది?

భూషయ్య :

ఉంది… విశేషం ఉంది… అదే… నువ్ ఆలోచించావ్ చూడు… ఆ ఇద్దరూ లేచిపోయారని… అదే విశేషం… నీ ఆలోచనా విధానమే ఒక విశేషం రామయ్యా!!

రామయ్య :

చెప్పావులే… పెద్ద విశేషం… బుద్ధి లేకపోతే సరి… (రుసరుసలాడుతూ వెళ్లాడు)

భూషయ్య :

(పెద్దగా అరుస్తూ) … ఓ రామయ్యా! అప్పుడప్పడు ఇలాంటి విశేషాలు కూడా వినాలి మరి… ఆ!! (తగ్గు స్వరంతో) అందుకే అన్నారు… “తన దాకా వస్తే కాని తెలిసిరాదు”… అని.

శుభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here