కాజాల్లాంటి బాజాలు-43: మరువలేని సంక్రాంతి..

0
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] సంక్రాంతిపండుగ నాకో చక్కటి అనుభవాన్నిచ్చింది.

భోగిరోజు ఉదయాన్నే గేటెడ్ కమ్యూనిటీలో సీనియర్ సిటిజన్స్ అందరితో కలిసి ఒకేచోట ఫ్లాట్స్‌లో వుంటున్ననా ఫ్రెండు సునీత ఫోన్ చేసింది. పండగ శుభాకాంక్షలు చెప్పీ, సాయంత్రం మేమందరం కలిసి భోగిపళ్ళ పేరంటం చేస్తున్నాం రమ్మని ఆహ్వానించింది. నా ఫ్రెండ్ వుండే ఫ్లాట్స్ చాలా దూరం. అయినా సరే వెడదామనుకున్నాను. మా ఇంట్లోవాళ్ళందరూ నన్నస్తమానం ఎవరి గుమ్మానికయినా తోరణం కట్టడం ఆలస్యం, ఈవిడ తయారైపోతుంది అని వెక్కిరిస్తుంటారు. అయినా నేనేమీ వెనకాడను. “పసుపు కుంకుమకి పదామడలు వెళ్ళా”లనే సామెతని కోట్ చేసి వెళ్ళిపోతుంటాను. ఈసారి కూడా అలాగనుకుంటూనే బయల్దేరేను.

దారంతా ఒక అనుమానం నన్ను పట్టుకుని వదల్లేదు. అదేమిటంటే ఆ ఫ్లాట్స్‌లో వున్నవాళ్లంతా అరవైయేళ్ళ పైబడినవారే. పిల్లలందరూ ప్రపంచంలో తలో మూలా వున్నవాళ్ళే. మనవలు కూడా పెళ్ళిళ్ళూ, ఉద్యోగాలతో జీవితంలో సెటిలైనవాళ్ళే. మరలాంటిచోట వీళ్ళకి భోగిపళ్ళు పోయడానికి చంటిపిల్లలు ఎక్కడ దొరికేరా అని నా అనుమానం. ఎక్కడ దొరికితేనేం.. ఎలా తెస్తేనేం.. అక్కడ చంటిపిల్లలుంటారు, అది చాలు నాకు.

ఎంత ముభావంగా వుండే మనుషులైనా కల్మషంలేని పిల్లలతో కాసేపు గడిపితే వాళ్ల మొహంలో నవ్వులు కనిపిస్తాయి. కల్లాకపటం లేని పిల్లలతో గడిపితే నా మటుకు నేను చాలా రిలాక్స్ అయిపోతాను. ఇదివరకు ఏ దంపతులైనా ఇంటికొస్తే వాళ్ల చంకలో ఓ పిల్లా, చేయి పట్టుకుని మరోపిల్లా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ దృశ్యం అంతగా కనిపించటంలేదు. అందుకే చంటిపిల్లలకి మొహం వాచిపోయిన్నట్టయి సునీత పిలవగానే బయల్దేరిపోయేను.

సీనియర్ సిటిజన్స్ ఫ్లాట్స్‌లో అందరూ కలిసి భోగిపళ్ల పేరంటం చేస్తున్నారంటే తప్పకుండా ఓ పదిమంది పిల్లల్ని చేరుస్తారు కదా! వాళ్ళతో ఆటపాటల్తో సంతోషంగా ఆ పూట గడిపెయ్యొచ్చని సంబరపడిపోయేను. నన్ను చూడగానే సునీత “వచ్చేవా. నీకోసమే చూస్తున్నాను.. రా.. రా ..” అంటూ అక్కడ ఫంక్షన్స్ అన్నీ జరుపుకునే పెద్దహాల్లోకి తీసికెళ్ళింది.

నా కళ్ళు పిల్లల కోసం హాలంతా వెతికేయి. “పిల్లలేరీ!” అడిగేను సునీతని.

“వస్తారుండు..” అంది గుంభనగా.

“అదికాదే, ఇక్కడందరూ అరవైయేళ్ళ పైబడినవారే కదా! పక్క డే కేర్ నుంచి ఓ పదిమంది పిల్లల్ని తీసుకొస్తున్నారేంటీ, మీ భోగిపళ్ల పేరంటానికి!” నా తెలివంతా ఉపయోగించేసేను.

“ఎవరింట్లో పిల్లలకి వాళ్ళే పోసుకుంటారు కానీ ఎవరి పిల్లల్ని ఎవరు పంపుతారే నీ పిచ్చికానీ..” అందది.

“మరీ, బేబీ బొమ్మల్ని పెట్టి వాటికి పోస్తారా!” అనడిగేను. ఎందుకంటే మా ఇంట్లో మా ఆఖరి చెల్లెలికి కూడా పదేళ్ళు దాటాక, అప్పటిదాకా భోగిపళ్ళ పేరంటం చేసే మా అమ్మగారు పేరంటం మానలేక ఒక బేబీబొమ్మకి భోగిపళ్ళు పోసి పేరంటం చేసేరు. ఆ తర్వాత రోడ్డు మీద తెలిసినవాళ్ళు ఎవరు కనిపించినా “మీ ఇంట్లోనే కదా బొమ్మకి భోగిపళ్ళ పేరంటం చేసేరూ!” అనడిగేవారు. అది గుర్తొచ్చి అలా అడిగేను.

“అబ్బ.. కాదే..” అంది.

“మరీ..” అన్నాను.

“ఏం చెయ్యమంటావే.. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అందరం ప్రతి పండుగా కలిసి పాటలు పాడుకుంటూ, డాన్సులు చేసుకుంటూ సరదాగా చేసుకుంటూంటాం. అలాగే ఈ పండక్కి కూడా అందరూ వచ్చి భోగిపళ్ళ పేరంటం చెయ్యాల్సిందేనని కూర్చున్నారు. ఏం చెయ్యడమా అని ఆలోచిస్తుంటే బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది..” అంది.

“ఏంటే అదీ..” అన్నాను కుతూహలంతో..

“ఏవుందీ! చిన్నప్పుడు మా తాతగారు చెప్పేవారు, ముసలివాళ్ళు కూడా చిన్నపిల్లల్లాంటివాళ్ళేననీ.. చిన్నపిల్లల్ని చూసినట్టే వాళ్లనీ చూడాలని అంటూండేవారు.. అందుకని మాలో యెనభైయేళ్ళ పైబడ్డ మగవారినీ, డెభ్భైయేళ్ళ పైబడ్ద ఆడవాళ్లని లెక్కపెడితే ఒక ఆరుగురుదాకా అయ్యేరు. అందులో నేనూ వున్నానులే.. అందుకని వాళ్లనే పిల్లల్లాగ కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసి హారతిచ్చేద్దామని తీర్మానించేసుకున్నాం.”

నాకు నోట మాట రాలేదు. “అలాగెలాగే..” అన్నాను.

“ఏమో చూద్దాం.. ఎలా అవుతుందో..అదిగో అందరూ వచ్చేస్తున్నారు. అటు పద..” అంది.

అప్పటికే చాలామంది వచ్చేసున్నారు. కొంతమంది భోగిపళ్ళ పళ్ళెం తయారు చేస్తుంటే, ఇంకొంతమంది పసుపు, కుంకుమా సద్దుతున్నారు. ఇంకొందరు స్టేజి మీద ఎన్ని కుర్చీలు వెయ్యాలని ఆరాలు తీస్తున్నారు. మగవాళ్లందరూ పంచె కండువాలతో, ఆడవాళ్లందరూ పట్టుచీరల రెపరెపలతో నిజంగానే అక్కడికి పండగని తీసుకొచ్చేరు. అక్కడున్న ప్రతివారూ అరవైయేళ్ళ పైబడినవారే.. కానీ వాళ్లలో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే ఇరవైయేళ్ళవాళ్ళు కూడా ఎందుకూ పనికిరానట్టున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు నాలుగు కుటుంబాలూ కలిసి చేసుకున్న పెళ్ళీ, పేరంటాలూ గుర్తొచ్చేయేమో అందరూ మహా ఉత్సాహంగా తలో పనీ అందుకుంటున్నారు.

“నా ఫ్రెండం” టూ నన్ను వాళ్లకి పరిచయం చేసింది సునీత.

“నీ ఫ్రెండంటే నీ వయసేకదా! ఆవిడకీ పోసేద్దాం భోగిపళ్ళు..” అంది నెమలికంఠంరంగు పట్టుచీర కట్టుకున్నావిడ.

“హా..” అని నేను హాశ్చర్యపడిపోయే లోపలే నన్ను స్టేజి వైపు లాక్కుపోయింది సునీత. స్టేజి మీద ఇద్దరు మగవాళ్ళూ, నలుగురు ఆడవాళ్ళు కుర్చీల్లో కూర్చుని వున్నారు.

మాతో వచ్చినావిడ మా ఇద్దరికీ రెండు కుర్చీలు చూపించి కూర్చోమంది. ఒక పెద్దాయన పాపం మొహమాట పడ్దారేమో దిగి వెళ్ళిపోతున్నారు. ఆయన పక్కనున్నాయన గట్టిగా “నా గోలీలు.. నా గోలీలు..” అంటూ వెళ్ళిపోతున్నాయన్ని చూపిస్తూ ఏడుస్తున్నట్టు యాక్షన్ మొదలెట్టేడు. దిగిపోవాలనుకున్నాయన తెల్లబోయి ఆగిపోయేడు.

వేళ్ళాడిపోతున్నట్టు ముడేసుకున్నొకావిడ దిగిపోతున్నాయన దగ్గరకొచ్చి, “తప్పుకదూ, తమ్ముడి గోలీలు అలా తీసుకోకూడదు, ఇచ్చెయ్యి..” అంటూ చిన్నపిల్లాణ్ణి తీసికెళ్ళినట్టు ఆయన చెయ్యి పట్టుకుని తీసికెళ్ళి మళ్ళీ కుర్చీలో కూచోబెట్టింది. ఇది చూసిన సునీత “నాకూ గోలీలు కావాలీ..” అంటూ ఏడుపు మొదలెట్టింది. ఇటు పక్కనున్న ఇంకో తెల్లటావిడ వచ్చి, “తప్పే, ఆడపిల్లలు గోలీలాడకూడదు.. ఇదిగో, చాక్లెట్ తిను..” అంటూ సునీత చేతిలో ఓ చాక్లెట్ పెట్టింది. ఇదంతా చూస్తున్న నేను ఇంక ఊరికే చూస్తూ ఉండలేకపోయేను. వెంటనే “నాకూ చాక్లెట్ కావాలీఈఈఈఈఈ” అంటూ దీర్ఘం తియ్యడం మొదలెట్టేను.

ఈ పక్కనుంచి పసుపూ కుంకుమా పంచుతున్నావిడ వచ్చి, “అలా ఏడుస్తూ భోగిపళ్ళు పోయించుకుంటారా ఎవరైనా! ఏదీ, నవ్వూ..” అంటూ నా చేతిలో రెండు చాక్లెట్లు పెట్టింది. ఇది చూసిన సునీత కాళ్ళు నేలకేసి బాదుతూ, “నాకూ రెండు కావాలీ..” అని తల అటూ ఇటూ తిప్పడం మొదలెట్టింది.

ఈ ఫార్సంతా చూస్తున్న ఇంకొకాయన లేచి, బుంగమూతి పెట్టి, “నాకు గన్ ఇస్తేనే నేను కూర్చుంతా..” అని దిగి వెళ్ళిపోవడం మొదలెట్టేరు.

ఇటుపక్క సిల్కు లాల్చీ వేసుకున్నాయన వచ్చి, “ఇదయిపోగానే నిన్ను షాప్‌కి తీసికెళ్ళి గన్ కొనిపెడతాగా..” అంటూ ఆయన్ని మళ్ళీ కుర్చీ ఎక్కించేరు.

ఇలా ఎవరి హడావిడిలో వాళ్లం మహా ఆనందంగా చిన్నపిల్లల చేష్టలు చేస్తుంటే ఒక మహా మేధావి ఇదే సందనుకుంటూ నెమ్మదిగా కుర్చీ దిగి జారుకోబోయేరు.

గద్వాల్ చీర కట్టుకున్న పెద్దావిడ అది గమనించి, గబగబా వచ్చి ఆయన్నాపేసింది. బిక్కమొహం పెట్టుకుని చూస్తున్న ఆయనని “నీకు సాయంత్రం క్రికెట్ బేట్ కొనిస్తాగా..” అంటూ మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టేసింది.

ఒకటి తర్వాత ఒకటిగా అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా వస్తున్న ఈ డైలాగుల్నీ, యాక్షన్‌నీ చూస్తున్నవాళ్ళు నవ్వుని ఆపుకోలేకపోయేరు.

కొంతమంది పిల్లల్లాగా ఇంకొంతమంది పెద్దల్లాగా అప్పటికప్పుడు ఒకరినిమించి ఇంకొకరు డైలాగులు చెప్పేసుకుంటుంటే ఆ హాలంతా చిన్నప్పుడు చూసిన సంక్రాంతి పండుగ వైభవం నిండినట్టనిపించింది.

అలాగ సరదాగా ఛలోక్తులతో, ఒకరినొకరు హాస్యాలాడుకుంటూ, అరమరికలు లేకుండా, హాయిగా భోగిపళ్ల పేరంటం జరిగిపోయింది. ఇంత చక్కటి అనుభవాన్ని అందించిన సునీతని జన్మలో మరువలేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here