మానస సంచరరే-34: నీలాల కన్నుల్లో నిదుర!

9
4

[box type=’note’ fontsize=’16’] “మనిషికి పరిమిత నిద్ర అవసరం, ఆరోగ్యం కూడాను. కానీ మనిషి చురుకుతనం లేకుండా నిద్రపోతున్నట్లు ఉండకూడదు” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]అం[/dropcap]చెలంచెల ప్రయాణం పూర్తిచేసి ఆఫీసుకు నడుస్తున్నాను. దారిలో నైట్ డ్యూటీ చేసి, ఆఫీసులోనే ఉండి వెళుతున్న జోగునాథం నిద్రముఖంతో ఎదురయ్యాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వబోయాడు. ఆవలింత అడ్డువచ్చింది. నేను ఓ చిరునవ్వు నవ్వి ముందుకుసాగాను. షాపులు పూర్తిగా తెరవని వీధి ఇంకా నిద్రబద్ధకంలో ఉన్నట్లే ఉంది. ఒక్క టిఫిన్ బండ్లు మాత్రం కాసింత బిజీగా ఉన్నాయి. ఆ పక్కనే ఇసుకలో ఉన్న గట్టులాంటి నేలమీదే ఓ వ్యక్తి నోరు తెరుచుకు నిద్రపోతున్నాడు…

“ఉన్నవాడికి తిండే అరగదు.. లేని వాడికి తిండే దొరకదు
పరుపులున్నా పట్టదు నిదుర.. కరకునేలను గురకలు వినరా –
హెచ్చుతగ్గులూ తొలగే రోజూ.. ఎపుడొస్తుందో ఏమో…
రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్..”
గుర్తుకొచ్చింది.

ఇంతలో ఆఫీసు వచ్చేసింది. పంచ్ మెషిన్ ముందు నిల్చుంటే ఓ.కే.అనటానికి అది మొరాయించింది. ‘ఇది నిద్రపోతున్నట్లుంది’ అనుకుని నా ‘పంచ్’కు నేనే నవ్వుకుని, మరునిముషంలో ఓ.కే. అనిపించుకుని మా వింగ్‌కు నడిచాను. ఒక్కొక్కరే వస్తున్నారు. రావడం రావడంతోనే రజని మొదలు పెట్టింది.. “ఇవాళ లక్కీగా ఖాళీ బస్ దొరికింది. మంచి నిద్రపట్టింది. సడెన్‌గా మెలకువ వచ్చి ఎక్కడికెళ్లిపోయానో అని కంగారు పడ్డా. తీరా చూస్తే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని ఉంది. అయినవి రెండు స్టాపులే. ఏంచేస్తాం అనుకొని మళ్లీ కళ్లమూసుకున్నా. మంచి నిద్రపట్టింది. కండక్టర్ తెలిసినామే కావడంతో ‘స్టాప్ వచ్చింది మేడమ్’ అంటూ లేపింది. లేకపోతే ఇవాళ నాపని గోవిందా” అంది. ‘నేనయితే బస్సుల్లో చచ్చినా నిద్రపోను’ అంది సరిత. ‘ఆదివారం రోజంతా ఇంటి పనులు సరిపోతాయి. మళ్లీ పొద్దున్నే పరుగులు. సీటు దొరికితే యాహూ అంటూ నిద్ర పరుగెత్తుకొస్తుంది’ అంది రజని. ‘నాకైతే రాత్రి నిద్రే పట్టలేదు’ అంది రాణి. ‘ఏం పాపం’ అడిగింది సరిత. ‘మా ఫ్యాన్ చెడిపోయింది. దాని చప్పుడు ఉంటే కానీ నాకు నిద్ర పట్టదు’ చెప్పింది. అందరం నవ్వాం. ‘నాకు, నాపిల్లలకు ఏ కాలమైనా సరే ఎ.సి.లేకుంటే నిద్ర రాదబ్బా’ గొప్పగా చెప్పింది రమ్య. ‘రావుగారిని చూశావా. ఎప్పుడు చూడు నిద్రలో జోగుతుంటాడు’ అంది సరిత. ‘ఆయనకు ఇంట్లో కంటే ఆఫీసు లోనే బాగా నిద్ర పడుతుందట, చెప్పాడోసారి’ అంది నందిని. హెడ్ రావడంతో అంతా కామ్ అయిపోయారు. నేను పని మొదలు పెట్టాను. కానీ మనసులో సైడ్ ట్రాక్ గా ‘నిద్ర’ సబ్జెక్ట్ నడుస్తూనే ఉంది. నిద్ర ప్రస్తావన వస్తే చాలు నాకు ముందుగా గుర్తొచ్చే పాట లతా మంగేష్కర్ ‘సంతానం’ చిత్రానికి పాడినపాట..

“నిదురపో.. నిదురపో.. నిదురపో..
నిదురపోరా తమ్ముడా..
నిదురలోన గతమునంతా
నిముషమైనా మరచిపోరా… కరుణ లేని ఈ జగానా
కలత నిదురే మేలురా..”

పదం, గానం రెండూ మనసును తాకేలా ఉంటాయి. ఎక్కువ గంటలు నిద్రపోయేది శిశువులే. నిద్రించే పసివారిని గమనిస్తే ఎంతో చిత్రమనిపిస్తుంది. అంతలోకే ఎంతో హాయిగా నవ్వుతుంటారు. అంతలోకే బెంగగా ఏడుపుముఖం పెడతారు.

“ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు
సద్దుచేశారంటే వులికులికి పడతాడు…
జుజుజుజుజు.. జుజుజుజుజు
చల్లగా నిదరోయే బాబు నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు..
ఏమి కలలు కంటున్నాడో తెలుసా.. తెలుసా
జన్మకూ ఈ తల్లే కావాలనీ..
ఈ ఒడిలోనే ఆదమరచి వుండాలనీ..
జుజుజుజుజు..”

నిజమే. అమ్మ ఒడిలో పడుకున్న నిశ్చింత ఆ తర్వాత ఇంకెప్పుడూ ఉండదు.

కానీ అమ్మ మాత్రం బిడ్డ ఆలనాపాలనలో నిద్రకు దూరమవుతుంది. రాత్రుళ్లు బిడ్డ ఏడ్చినా తన కంటిమీద కునుకు లేకుండా పాలుపడుతూ, జోలపాడుతూ, ఉయ్యాల ఊపుతూ పక్క తడిపితే పొత్తిళ్లు మారుస్తూ, నీరసాన్ని, నిస్సత్తువను లెక్క చేయకుండా… అమ్మవి అసమాన సేవలు.

ఇంతలో ఎవరో అన్నారు.. “మొన్న ఆఫీసులో కంప్యూటర్ పోయిందట తెలుసా?”. వెంటనే మరొకరు ‘సెక్యూరిటీవాళ్లు నిద్రపోతున్నారేమో’ అన్నారు. నా ఆలోచన వెంటనే నైట్ డ్యూటీల పైకి మళ్లింది. సెక్యూరిటీ గార్డులు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఇలా ఎన్నో రంగాల వాళ్లు నిదురను త్యాగం చేస్తుంటారుకదా. అందరికన్నా ముందుగా చెప్పుకోవలసింది దేశసరిహద్దుల్లో పహారా కాసే సైనికుల్ని.. కుటుంబాలకు దూరంగా ఏళ్ల తరబడి సరిహద్దులను కాపలా కాస్తూ, దేశమంతటికీ నిశ్చింతతో కూడిన నిద్రను ప్రసాదిస్తున్న సైనికులకు జాతిమొత్తం శాశ్వతంగా రుణపడి ఉంటుంది. యాంత్రికంగా పనిచేస్తున్నానే కానీ మనసులో ఆలోచన సాగుతూనే ఉంది. లంచ్ టైమ్ అయినట్లుంది. అంతా లేచారు. నాకు తినాలనిపించక సీట్లోనే ఉండిపోయాను. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చదివిన కవిత మదిలో మెదిలింది.

“కదిలేది కదిలించేది
మారేదీ మార్పించేదీ
పాడేది పాడించేది
పెనునిద్దుర వదిలించేది
మునుముందుకు సాగించేదీ…
కావాలోయ్ నవకవనానికి”

శ్రీశ్రీ ప్రతి అక్షరం చైతన్యంతో తొణికిసలాడేదే.

లంచ్ ముగించారు కొలీగ్స్.

‘అబ్బ! ఎక్కువ తిన్నట్లున్నా. కళ్లు మూతలు పడుతున్నాయి’ అంది రమ్య.

“మత్తు వదలరా… నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తదువురా…” సరిత అల్లరిగా పాడింది. ‘వదలరా కాదు, వదలవే’ అనాలి’ కరెక్ట్ చేసింది రమ్య. నేను మాత్రం పాటలోకి పయనించాను..
“జీవితమున సగభాగమ్ము నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగమ్ము చిత్తశుద్ధి లేకపోవు
అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు
పరమార్గం గానకుండా వ్యర్ధంగా చెడతాడు..”

ఎంత బాగా రాశాడో కవి..

నిద్రపట్టడం లేదని బాధపడేవారు కొందరు.

‘నీవు రావు నిదురరాదు
నిలచిపోయే ఈ రేయి.. నీవు రావు.. నిదురరాదు..
కలలనైన నిన్ను కనుల చూతమన్న
నిదురరాని నాకు కలలు కూడ రావే’
అని వగస్తుంది ఓ నాయిక.

మరో చెల్లి కలతపడుతున్న అన్నను పాటతో నిద్రపుచ్చుతూ ఇలా..

“నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదురా రావమ్మా రావే
నిండారా రావే..
నెలవంక చలువలు వెదజల్లగా నిదుర
రావమ్మా రావే నెమ్మదిగా రావే..”

ఆత్రేయ ఎంత గొప్పగా రాశారో.

నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఊగింది లాలి.

ఎందుకో పనిచేయాలనిపించటం లేదు. ఇవాళ అంత ముంచుకు పోయే పనికూడా లేదు. అనిపించడమే తరువాయి కొలీగ్స్ కి చెప్పి బయటపడ్డాను.

ఆలోచనల్లో నిద్ర తిరుగాడుతూనే ఉంది. రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు ఆరు నెలలు మేలుకొని, ఆరునెలలు నిద్రపోయేవాడట. కుంభకర్ణుడి నిద్ర అని ఓ మార్క్ పడిపోయింది. ఆ పడుకున్న కాలంలో ఆయన్ను లేపటం ఎవరి తరమూ కాక, చివరకు ఘుమఘుమలాడే భోజనపదార్థాలు దగ్గరుంచడంతో వాటి వాసనలకు కుంభకర్ణుడికి మెలకువ వచ్చినట్లు సినిమాలో చూపించారు. కుంభకర్ణుణ్ని మించిపోయింది ఊర్మిళ. లక్ష్మణుడు అన్నగారితో పాటు పధ్నాలుగేళ్లు వనవాసం చేస్తే ఊర్మిళ పధ్నాలుగేళ్లు నిద్ర దీక్షపట్టింది. దేవుళ్లూ నిద్రపోతారు. అందుకే అన్నమయ్య..

“విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా..”
అన్నాడు.

పన్నగపు దోమతెర.. ఎంత తమాషా ఊహ. అన్నమయ్య అసామాన్యుడు.

అన్నట్లు శ్రీనివాసుడి సోదరుడు గోవిందరాజులుగారు అన్నగారి కొచ్చే ధనాన్ని కొలిచే బాధ్యత నెత్తికెత్తుకొని, కొలిచి కొలిచి అలసిపోయి, ఆ మానికనే తలకింద పెట్టుకొని పవళించాడని, దిగువ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోని మూర్తి అదేననీ అంటారు. మానిక ఒక్కటి తప్పిస్తే, అనంతపద్మనాభస్వామి, శ్రీరంగనాథస్వామి శయనభంగిమలోనే దర్శనమిస్తారు. దేవుళ్లకు పవళింపు సేవలు ప్రత్యేకంగా ఉంటాయి కూడా.

బస్టాప్ వచ్చేసింది, బస్సూ వచ్చేసింది. ఎక్కాను. లేడీస్ సీట్లో నిద్రపోతూ కనిపించాడు ఒకతను. నిద్రపోతున్నాడో, నటిస్తున్నాడో తెలియదు. లేపటం ఇబ్బందే అనుకుని ఊరుకున్నాను.

కానీ ఇంకొకామె ఊరుకోలేదు. భుజం తట్టి మరీ లేపింది. అతను ప్రాణం బాగాలేదన్నాడు. చేసేదిలేక ఊరుకుంది. మరొకసీట్లో ఒకామె నిద్రపోతూ తూలుతూ పక్కనున్న ఆమెపై అ దేపనిగా ఒరుగుతోంది. అవతల ఆమె ‘సరిగ్గా కూర్చోండి’ అన్నది. విన్నట్లే ఉంది కానీ ఒరగటం మాత్రం మానలేదు. ఇంతలో నాకు సీటు దొరికింది..

“వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే
పూవుల తేనెల తేవె
కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ
కనుల పైన కలలు వాలి సోలిపోయే వేళ.. వెన్నెలా. వెన్నెలా..”

భువనచంద్ర పాటను మనసు గుర్తుచేసుకొంది.

నిదురే వేదనను మరిపిస్తుందంటూ ‘ధనమా దైవమా’లో సినారే మంచి పాట రాశారు. అది..

“నీ మది చల్లగా స్వామీ నిదురపో
దేవుని నీడలో వేదన మరిచిపో..”
ఇదిలా ఉంటే కన్నయ్యను బజ్జోమని పాడేపాట..
“కలలుగనే వేళ యిదే కన్నయ్యా
నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా
కలతమాని తీపి నిదురపోవయ్యా..
హాయీ…హాయీ..హాయీ..”

హయి అంటే మరో పాట మనసుముందు నిలిచింది.

“అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మా
ఆదమరచి హాయిగా నిదురపోమ్మా
ఆడుకుని ఆడుకుని అలసిపోతివా
అలుపుతీర బజ్జా మా అందాల బొమ్మా..”

నిజమే. ఓ రకంగా చెప్పాలంటే నిద్ర దేవుడిచ్చిన వరమే. గాఢనిద్రపడితే ఏమీ తెలియదు. చీకూచింతాలేని లోకంలో..

అన్నట్లు హిందీలో ‘నాయక్’లో హిట్టయిన పాట …

‘చలో చలే మిత్వా ఇన్ ఊంచి నిచి రాహోంమే
తెరి ప్యారి ప్యారి బాహోంమె కహి హమ్ ఖో జాయే
కభి నీంద్ సె జాగె హమ్, కభి ఫిర్ సో జాయే..
చలో చలే మిత్వా..’

‘నిద్ర’ మీద ఎందరో కవులు ఎన్నో కవితలు రాశారు.

ఇంగ్లీషులో జాన్ బి టాబ్ ‘స్లీప్’ శీర్షికతో చిన్న తమాషా పొయెమ్ రాశాడు. అది..

వెన్ హి ఈజ్ లిటిల్ ఛాప్
వుయ్ కాల్ హిమ్ నాప్
వెన్ హి సమ వాట్ ఓల్డర్ గ్రేస్
వుయ్ కాల్ హిమ్ డోజ్
వెన్ హిజ్ ఏజ్ బై అవర్స్ వుయ్ నంబర్
వుయ్ కాల్ హిమ్ స్లంబర్!

నిద్రలెన్నో రకాలు. మగతనిద్ర, గాఢనిద్ర, కలత నిద్ర, మొద్దు నిద్ర, దొంగనిద్ర. అనేక కార్యాలయాల్లో ఉద్యోగులు ఫైళ్ల మీదపడి నిద్రించే దృశ్యాలు మామూలే అయినా రాజకీయ ప్రముఖులు సీట్లో నిద్రిస్తే అది వైరల్ కాక ఏమవుతుంది. భారత ప్రధానిగా కొద్దికాలం పని చేసిన హెచ్‌డి.దేవెగౌడ కుర్చీలో కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కటం తెలిసిందే. చాలామంది విద్యార్థులకు పుస్తకం చదవటం మొదలు పెట్టగానే నిద్ర ముంచుకురావటం మామూలే. అలాగే పరీక్ష రోజుల్లోనూ అంతే. నిద్రాదేవత ఆవహిస్తూ ఉంటుంది. పరీక్షల్లో కొంతమంది టీ తాగి రాత్రంతా జాగరణ చేస్తుంటారు. అన్నట్లు శివరాత్రి జాగారం కూడా చాలామంది చేస్తుంటారు. ఏ పండుగకు లేని ఈ ప్రత్యేకత శివరాత్రికే ఉంది. ఉపవాసం ఉండటంతోపాటు రాత్రంతా జాగరణ చెయ్యాలంటారు. అందుకోసం ఏ సినిమాలో చూస్తుంటారు.

నిద్ర- జడత్వం అర్థంలో కూడా వాడుతుంటాం.

‘లేచింది.. నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం..’

ఇక్కడ నిద్ర లేవటం అంటే జాగృతమవటమే.

శారీరకంగా అలసిపోయినప్పుడు నిద్ర రావటం సహజం. మనిషికి పరిమిత నిద్ర అవసరం, ఆరోగ్యం కూడాను. కానీ మనిషి చురుకుతనం లేకుండా నిద్రపోతున్నట్లు ఉండకూడదు.

కర్తవ్యపాలనలో జడత్వం ఉండకూడదు. మెదడును నిద్ర ఆవరించకూడదు.

నా స్టాప్ వచ్చేసింది..

వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మబ్బుగా మారింది. చల్లగాలి వీస్తోంది. హఠాత్తుగా నీరాజనంలో ఎం.ఎస్.రామారావు గారు రచించి, సంగీతం కూర్చి, గానంచేసిన పాట స్పురణకొచ్చింది.

“విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా.. నిదురించు జహాపనా
తాజ్ మహల్ ధవళకాంతుల్లో
పండువెన్నెల్లో వెండి కొండల్లే
నిదురించు జహాపనా.. ఈ విశాల ప్రశాంత..”

ఇల్లు రానే వచ్చింది. వేరే పనులు చేస్తున్నా తలుపు వెనుక నక్కి మళ్లీ మళ్లీ తొంగిచూసే పిల్లల మాదిరి ఆలోచన సాగుతూనే ఉంది.

కొంతమంది రోగులు హఠాత్తుగా నిద్రలోకి జారతారు. దీన్ని ‘కోమా’ అంటారు. కొంతమంది నిద్రలో లేచి నడుస్తుంటారు. దీన్ని ‘సోమ్నాంబులిజమ్’ అంటారు. కొంతమందికి నిద్రే పట్టదు. అలాంటివారు నిద్రమాత్రలను ఆశ్రయిస్తుంటారు. ఆ మాత్రలు ఎక్కువ వేసుకుంటే ఇంక అంతే సంగతులు. అది శాశ్వత నిద్ర అయిపోతుంది. కొంతమందికి దిండు ఉంటేనే నిద్రపడుతుంది. మరికొందరికి దిండు గిట్టదు. కొందరు అపాదమస్తకం ముసుగేసుకు పడుకుంటారు. కొంతమంది మెడవరకే కప్పుకు పడుకుంటారు. కొంతమంది కళ్లు తెరిచే పడుకుంటారు. ప్రయాణాల్లో ఒక్కోసారి నిద్రలో కూరుకుపోతే, వారి తాలూకు లగేజీ ఇతరులు ఎంచక్కా పట్టుకు ఏ స్టేషన్లోనో దిగిపోయే సంఘటనలూ జరుగుతాయి. ఇలా నిద్ర వైఖరులెన్నెన్నో.

ధ్రువ ప్రాంతాల్లోని ఎలుగుబంట్లు వగైరాలు దీర్ఘకాలం సుషుప్తావస్థలోనే ఉంటాయి. అలసిన శరీరానికి నిద్ర అవసరమే. కానీ మొద్దు నిద్ర కూడదు. నిద్రపై నియంత్రణ ఉండాలి. మెదడును మాత్రం నిద్ర ఆవరించకుండా చూసుకోవాలి. మనిషి ఎప్పుడూ చైతన్యశీలిగా ఉండాలి… అనుకుంటూనే దివాన్‍౬పై నడుం వాల్చాను. వెంటనే ఓ చక్కని పాత పాట గుర్తొచ్చింది. అది..

“నిదురమ్మా నిదురమ్మా..కదలి వేగమే రావమ్మా
బతుకున బాధల బరువు తీర్పగ
మదిలో రగిలే మంటలార్పగ…
పాల మబ్బుల పాన్పువేసి…నీలాల తెర పైన మూసి
గాలి వీవన పూని హాయిగ… జోలలు పాడి పోవమ్మా..
నిదురమ్మా..నిదురమ్మా..”

పిలిచాననుకుందేమో నిద్రాదేవి అలసిన నన్ను తన ఒడిలోకి తీసుకుంటుంటే నా కనురెప్పలతో పాటు, ‘ఆలోచనల అర’ తలుపులూ మూసు..కు..న్నా..య్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here