అందమైన ప్రేమ కథ!

0
3

[dropcap]ప[/dropcap]చ్చటి కొబ్బరి చెట్లు యుద్ధ సైనికుల్లా
ఒకేవైపు తిరిగి చల్లగా వీస్తున్నాయి
ఎత్తైన కొండ ఆ పక్కన ఇంతింతై వటుడింతై
గగనాన్ని అందుకొందామని పెరిగిన ఎత్తైన కొండలు
దానిపై విడవని స్నేహితుల్లా ఏపుగా పెరిగిన చెట్లు
సూరీడు గట్టిగా కాయలని పంతం పట్టినా
వట్టి మూగెండ తో సర్దుకుపోతున్న పొద్దులు
కనుచూపు మేరలో తరంగమధనం చేస్తున్న ఛాయా చిత్రాలు
దూరతీరంలో రాజ నౌకల కిరీట ధూమంతో రాకలు
అలల కెరటాలు మేమూ సై అంటూ
ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి
అక్కడ మెత్తటి మెరక మట్టిలో కూర్చున్న నా మీద
ఆ నీటి తుంపరలు కస్తూరీ గంధపు అత్తరులా చిలకరిస్తున్నాయి
భూమ్యాకాశాలు కలిసిన చోట నా కనులు ఆగిపోయినై
ఆస్వాదిద్దామని కనులు మూసిన నన్ను
ఒక కొంటె అల గట్టిగా కౌగిలించుకుని మేల్కొలిపింది
క్షణం పాటు ఉక్కిరి బిక్కిరి తేరుకుని చూస్తే
తడిసిన నేను, నా ముందు బుడ్డి సీసా, అందులో స్వస్తిముఖం
అంతులేని కుతూహలంతో తెరిచి చూస్తే
అందమైన అక్షరాలు నన్ను కట్టిపడేశాయి
“నిను చూసిన అరక్షణం మరిచిపోయా నా గత జీవితం
నువు లేని ముసలితనం గడపలేను నా శేష జీవితం
మనం కలిసి లేని గడియలు వెన్నెల లేని ఆకాశం
నీ అవును, నాకు ఆనందం
నీ విరహం, కాలంతో చెలగాటం
నువ్వు నువ్వుగా నా అడుగుల్లోకి రా
కలిసి నడుద్దాం, చరిత్ర రాసేద్దాం!”
ముసి ముసిగా నవ్వుకుని నా చెలివైపు నడుస్తున్న
నా ప్రేమ కథని చరిత్ర పుటల్లోకి ఎక్కించడానికి వెడుతున్న!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here