[dropcap]అ[/dropcap]నునిత్య పఠనం, పరిశీలనం, సమకాలీన దృష్టితో ఆలోచిస్తూ కొత్త కొత్త సృజనాత్మక కథలను సృజియించడం అచ్చమైన రచయిత ప్రధాన లక్షణం. ఆ ఒరవడిలో కథావస్తువు, శిల్పం, గమనం కూడా అత్యావశ్యకం. అవన్నీ అనుభవంతో రచయిత సాధించుకునే స్వీయ ప్రత్యేక శైలీ రూపమైన ఒక ఉత్తమ కథ.
ఒక కథ చదవడం ప్రారంభం చేశాకా ఆఖరి వరకు ఏకబిగిన ఉత్కంఠగా చదివించడం ఉత్తమ రచయితలకే సాధ్యం.
‘టి.ఎస్.ఎ. కథ 2016’ కథల సమాహారాన్ని చదివేసి మూసేదాకా ఒక రోజు రోజంతా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పుస్తకంలో ఉన్నవి కేవలం ‘6’ పెద్ద కథలే అయినా, అన్నీ ‘ప్రత్యేక’ సందర్భాల కోసం రాయబడిన ‘ప్రత్యేకత’ ఉన్న కథలు. ఏ కథను చదివి ముగించినా కొన్ని పాత్రల ప్రభావం మన మీద అలాగే చాలా సేపు ఉండిపోయి, ఆలోచింపజేసే ఒక మంచి కథ చదివామన్న సంతృప్తి దండిగా కలుగుతుంది. వాక్యాల వెంట పరుగులు తీసే చూపులు మనో సరోవరంలో తెడ్లు వేస్తూ కథా నావలో విహారం చేయించి చివరకు పరిష్కార తీరాన్ని చేరుస్తాయి. అందులోంచి అడుగు బయట పెడుతున్నప్పుడు తనువే కాదు మనసూ ఆర్ద్రమవుతుంది.
70 సంవత్సలరాల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించిన టి.ఎస్.ఎ. కృష్ణమూర్తిగారు గత 50 సంవత్సరాలుగా సాహితీ రంగంలో విశేషకృషి చేస్తూ – యిప్పటికి దాదాపు 250 కథలు, 4 నవలలు, 10 నవలికలు, అనేక వ్యాసాల సంపుటాలు వెలువరించారు.
మదనపల్లె పురపాలక శాఖలో స్థిరపడి గుమాస్తాగా పదవీవిరమణ చేశారు. వీరి కథలు, నవలలోని పాత్రలు సమాజం పట్ల ఎలా బాధ్యతను, ప్రేమను కనబపరుస్తాయో, సమాజ వ్యతిరేకశక్తుల పట్ల అంత తీవ్రంగానూ స్పందిస్తాయి
వారిచే విరచితమైన ఈ తొమ్మిదవ కథాసంపుటిలో ‘వేట’, ‘గమనం’, ‘సామాజిక బాధ్యత’, ‘బాధ అనిపించలేదు నాకు’, ‘గోల్డెన్ డేస్ సెవెన్’, ‘చివరి మజిలీ’ అనే ఆరు కథలు మాత్రమే ఉన్నా వేటికవే ఆణిముత్యాలు అని చెప్పక తప్పదు. దేని ప్రత్యేకత దానిదే అనిపించడమే కాదు, వెంటపడి ఆలోచింప చేస్తాయి కూడా!
ఈ కథల సమాహారంలో మొదటి కథ ‘వేట’.
ఒక రచయిత తన కథకు ‘మకుటం’ నిర్ణయించడంలో చాతుర్యం చూపగలిగితే ఆ కథకు ‘చదివించే గుణం’ ఉన్నట్టే.
‘వేట’ కథ అంశం చిన్నదే. సుందరి, సావిత్రి అనే యిద్దరు పల్లె పడుచుకును వేరు వేరు సందర్భాలలో ‘దొంగరాముడు’ అనే ఆ ఊరి కేటుగాడు వారి కుటుంబ పరిస్థితులను ఆసారాగా చేసుకుని, మాయ మాటలలో మోసగించి, ముందుగా ‘సుందరి’ని ఊరు దాటించి బొంబాయిలోని వేశ్యాగృహాల వారికి అమ్మేస్తాడు. రెండో విడగతా సావిత్రిని కూడా ‘బలి’కి సిద్ధం చేస్తాడు. అయితే సుందరి తమ్ముడు ఆ విషయాన్ని గమనించి ‘దొంగరాముడి’ని చంపి తన సోదరిని విడిపించడం కోసం, ఆమె జాడ కోసం ‘వేట’ మొదలుపెడతాడు. కథలో వున్న ఏ పాత్ర కోణం నుంచి చూసినా ‘వేట’ అన్న మకుటం సరిగ్గా సరిపోయిన యీ కథ చివరివరకూ ఆసక్తిగా చదివిస్తుంది పాఠకుడిని.
ఈనాటి మధ్యతరగతి తల్లి తండ్రులలో కొంతమంది మంచి విద్యాస్థాయితో పాటు, ఆర్థిక స్థితి కూడా బాగుండడంతో, సాంకేతిక పరిజ్ఞానం అందుకుని విదేశాలలో పనిచేస్తున్న తమ సహ విద్యార్థులతో సంప్రదించి, పరస్పరం సహకరించుకుని, తాము చదువుకున్న గ్రామాలలోని పాఠశాలలకు వెళ్ళి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరితో అనేక పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, ఆర్థికంగా ఎదగని ఎందరో విద్యార్థినీ విద్యార్థులకు ఆలంబనగా నిలుస్తూ, పాఠశాలకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ, తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారి ఆశీస్సులందుకుంటూ, వారిని తగు రీతిని సత్కరించుకునే పూర్వ విద్యార్థుల స్ఫూర్తి సమాచారం మనం అనేక సందర్భాలలో దినపత్రికలలో దర్శిస్తున్నాం.
అదే పాఠశాలలో అందరూ చేసి అలనాటి అనుభవాల ముచ్చట్లు కలబోసుకుంటూ, జ్ఞాపకాల బంతులతో ఆడుకుంటూ గడిపే ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటి అంశాన్ని తీసుకుని రాసిన మరొక మంచి కథ ‘గమనం’. ఈ కథలో మళ్ళీ ఆఖరి వాక్యంలో ‘ఆర్ద్రత’తో మనసు బరువెక్కుతుంది.
ఆ కార్యక్రమానికి బలరామయ్య, సుచిత్రాదేవి సంధానకర్తలుగా వ్యవహరిస్తూ తమ సహాధ్యాయిల బాల్య జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మాట్లాడించినప్పుడు ఆయా పాత్రలు పాఠశాల విడిచినప్పటి నుంచి ప్రస్తుత వర్తమానం వరకూ వారి జీవనగమనాదులను వివరిస్తుంటే ప్రస్తుత సమాజంలో ఎన్నో సజీవ పాత్రలు మన ముందు కదలాడుతాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలు సమాజంలో వ్యక్తులుగా బ్రతకడం కొసం తాము అనుభవిస్తున్న వివక్ష, అవమానాలు, అన్నింటిని సదృశంగా వివరిస్తున్నప్పుడు హృదయమున్న పాఠకునికి మనసు ద్రవించక మానదు.
“ఇరుగు పొరుగు ఇళ్ళల్లోంచి, మృగాళ్ళ వేడి చూపులు, కొన్ని చూపులు కలవరపెట్టినా, ఇంట్లోకి వచ్చి బిడ్డల ముఖం చూసేసరికి నా శరీరం చల్లటి స్నానం చేసినంత చల్లగా అయిపోయేది.”
“పిల్లలే లోకంగా వారిని ప్రేమించడంలో ఉన్న అలౌకిక ఆత్మానందం నాకే లోటు లేకుండా చేసింది.”
పాత్రల స్వభావాన్ని తేటతెల్లం చేసే రాబర్టు ఫ్రాస్టు వ్రాసిన ఆలోచనలను ఉటంకిస్తూ –
“అడవులు మనోహరంగా – చీకటిగా మరియు లోతుగా ఉన్నాయి –
కాని నేను కాపాడి నెరవేర్చుకోవాల్సిన వాగ్దానాలు ఉండనే ఉన్నాయి.
నేను నిదురించే లోగా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించాలి.” అన్న వాక్యాలని చదివినప్పుడు పాఠకుడు తనదైన మరో లోకంలో కాసేపు విహరిస్తాడు.
కథ పెద్దదే అయినా ఆలోచింప చేసే మంచి కథ ఇది.
ఇక నాల్గవ కథ పేరు ‘బాధ అనిపించలేదు నాకు’. స్వర్గీయ డా. వేదగిరి రాంబాబుగారి ‘పంచ సప్తతి – కథానికా సంకలనం 2016’ కోసం రాయబడిన కథ.
అతి సాధారణంగా ప్రారంభమైన కథలో ఒక పెద్దాయన ఒక బీద కుటుంబానికి ఆశ్రయం కల్పించడం కోసం పడిన తాపత్రయంలో నిశ్చలమైన లక్ష్యసాధన, నిర్మలమైన మనసు కనిపిస్తాయి.
ఆ పెద్దాయనకు తమ వూరికి దూరంగా ఎక్కడో రైలు పట్టాల మీద అప్పుడప్పుడు వెళ్ళే రైలుని చూడటం ఎంతో యిష్టం. అలా చూసి బయల్దేరుతున్నంతలో ఒక పేద వ్యక్తి అతని, అతని భార్య, సరిగ్గా తన మనుమరాలు వయసుగల పాప కనిపిస్తారు. ఆ పేద వ్యక్తి “ఉదయం నుంచి తినడానికేమీ లేదు బాబయ్యా!” అని చేయి చాపినపుడు, “ఆ పేద వ్యక్తి, అతని భార్య ఒకరి తరువాత ఒకరు చనిపోతే ఆ పసిబిడ్డ గతేమిటి?” అని ఉదయించిన ప్రశ్నకు ఆ పెద్దాయన పరిష్కారం చూపిన తీరు వారికొక బ్రతుకు తెరువు చూపిన విధానం చదివినపుడు సంకల్పం మంచిదయితే ఆ పని చేసే వ్యక్తి ఎన్ని అవరోధాలు వచ్చినా తాను అనుకున్న పని చేయగలడు అని నిరూపిస్తుంది ఈ కథ.
ఇక ఈ పుస్తకానికి మకుటాయమానమైన అద్భుత కథ ‘చివరి మజిలీ’.
బ్రతకాలనే ఆశ, ధ్యాస ఉన్నవాడు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏదో ఒక ఆధారాన్ని చూసుకుని బ్రతికేస్తాడు. అది వ్యాపారాలు మార్చుకుని కావచ్చు – అవకాశాలు సృష్టించుకుని కావచ్చు. ఈ కథలో రచయిత మిత్రుడైన తారానాథ్ అనే వ్యక్తి ఆర్.ఎం.పిగా జీవితాన్ని ఆరంభించి వ్యాపారంలో గెలిచినప్పుదు లక్షలు సంపాదించి, ఓడిపోయినప్పుడు మరో వ్యాపారాన్ని ప్రారంభించి, చివరగా రాజకీయాలలో ప్రవేశిస్తాడు. ప్రపంచీకరణ ముసుగులో ప్రతీదీ వ్యాపారాత్మకంగా మారిపోతున్న ఈ రోజులలో మనిషి కూడా వ్యాపారతత్వాన్ని అవలంబించ తప్పదు అని తేటతెల్లం చేస్తూనే, ఈనాడు రాజకీయాల్లోకి దిగిన ప్రతీ నాయకుడు ధనార్జన కోసమే సుమా అన్న సత్యాన్ని తెలియజేస్తుందీ కథ. రచయితకు మూడేళ్ళ కొకసారి కనిపించే తారానాథ్, కనిపించిన ప్రతీసారి అతను తన జీవన విధానాన్ని వివరిస్తున్నప్పుడు – “అరె! ఇంత తేలికగా జీవితాన్ని తీసుకుని బ్రతికేయవచ్చా!” అనిపిస్తుంది పాఠకునికి. చక్కని ఆలోచనలు రేకెత్తించె అతి చక్కని కథ యిది.
ఈమధ్య కాలంలో సభ్య సమాజంలో అనాలోచితంగా బలవుతున్న ‘ఆశా’ వంటి ఆడపిల్లల గాథలెన్నో! అయితే ‘దిశ’ సంఘటనలో మాత్రం ప్రజలు కోరుకున్న పరిష్కారం నేరస్థులకు జరిగి ఎక్కువ శాతం మంది సంతోషించారన్న విషయం మనకు తెలిసిందే. అదే కోవ కథ ‘సామాజిక బాధ్యత’. అచ్చంగా ‘దిశ’ లాగనే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చెసిన నలుగురు యువకులు కండీషన్డ్ బెయిల్ మీద బయటకు వస్తారు. అయితే ‘సామాజిక బాధ్యత’ను స్వీకరించిన ఒక పౌరుడు సాక్ష్యాలు లేకుండా ఆ నలుగురిని వేరు వేరు సందర్భాలలో చంపేస్తాడు. కథా ప్రారంభంలో మనసులో ఆందోళన, ఆరాటాన్ని కలిగించి, చివరలో “అమ్మయ్య! న్యాయం జరిగింది” అనే సందిగ్ధ స్థితిలో ప్రశాంతతను కలిగించే కథ.
యిక చివరగా ఏనాడు వృత్తిధర్మంలో ఖాళీ లేక ఏడు రోజుల పాటు భార్యతో ఏడుకొండల మీదకు వెళ్ళి తన స్నేహితుని సహాయంతో అక్కడే వారం రోజులు ప్రశాంతంగా హాయిగా గడిపి వస్తాడు రచయిత. వచ్చాక స్నేహితుడు ఎప్పటిలా ‘evening treat’ కి పిలిస్తే “అనుకోకుండా వెళ్ళి మద్యమాంసాలు వదిలి వచ్చాను” అని అబద్ధం చెప్పి తన జీవితానికో పరమార్థం కలిగించుకుంటాడు ‘గోల్డెన్ డేస్ సెవెన్’ అన్న కథలో.
అపార జీవితానుభవం, తార్కిక ఆలోచన, సాంప్రదాయాల పట్ల పవిత్ర భావం ఎన్నుకున్న కథా వస్తువును అత్యంత ఆసక్తిగా ప్రారంభించి అలవోకగా చదివించగల రచనాశైలితో రాణించిన శ్రీ టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి కలం నుంచి మరింత సామాజిక స్పృహ కలిగిన రచనలు ప్రభవించాలని కోరుకుంటూ వారికి నా సాహితీ ప్రణామాలు తెలియజేస్తున్నాను – వర్ధమాన రచయితలు తప్పక చదవాల్సిన పుస్తకమిది.
***
టి.ఎస్.ఎ. కథ 2016 (కథా సంపుటి)
రచన: టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి
ప్రచురణ: కళా ప్రచురణలు, మదనపల్లె
పుటలు: 89, వెల: రూ.75
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, రచయిత
టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి
3-169-16, రామారావు కాలనీ,
బాపూజీ మునిసిపల్ స్కూల్ దక్షిణపు వీధి,
మదనపల్లె 517325
చిత్తూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్
ఫోన్: 08571-221963