సాధించెనే ఓ మనసా!-1

2
3

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది మొదటి భాగం. [/box]

[dropcap]స[/dropcap]మయం ఉదయం ఐదున్నర దాటింది. సూర్యుడు అప్పుడే ఉదయించాడు. తూర్పున ఆకాశాన్ని ఎరుపెక్కించడం ద్వారా తన ఉనికిని చాటాడు.

విలాసవంతమైన కిల్‌పాక్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న బంగ్లా అది. గ్రానైట్, గాజు మరియు పాలరాయితో కట్టిన 12000 చదరపు అడుగుల ఆ అద్భుతంలో సందడి మొదలైంది.

తోటమాలి మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. పనిమనుషులు ఇటాలియన్ పాలరాయి తాపడం చేసిన గచ్చును తుడుస్తున్నారు.

కర్నాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. స్వరం, సోనీ మ్యూజిక్ సిస్టమ్ యొక్క స్పీకర్ల నుండి సుమారు 8400 యూనిట్ల పిఎంపిఓ (పీక్ మ్యూజిక్ పవర్ అవుట్‌పుట్) తో ఏడు కొండల స్వామిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తోంది.

రెండు నెలల క్రితం 53 ఏళ్లు నిండిన ఇంటి యజమాని రంగనాథన్ ఇంటి వెనుక వైపు ఉన్న విశాలమైన తోటలో ఉదయపు నడక నడుస్తూ చెమటలు చిందిస్తున్నాడు.

సాధారణంగా ధనవంతులను బాధించే రక్తపోటు, మధుమేహం వ్యాధులు అప్పటికే ఆయన శరీరాన్ని లోబర్చుకున్నాయి.

జిఎన్ చెట్టి వీధిలోని ఒక భారీ ఆరంతస్తుల రిటైల్ షోరూమ్‌, ఇంకా కాంచీపురం పట్టణంలో వంద మంది నేత కార్మికులకు విస్తరించిన సమగ్ర ఉత్పాదక వ్యవస్థతో కూడిన విస్తారమైన పట్టు చీరల సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో ఎదురయ్యే ఒత్తిడే రంగనాథన్ ఆరోగ్య పరిస్థితికి కారణమని చాలా మంది భావిస్తారు.

కానీ ఆయన్ని ఎక్కువగా ప్రభావితం చేసినవి తన కుమార్తె వైవాహిక సమస్యలే.

మాల్యకి ఇప్పుడు 29 సంవత్సరాలు. ఆమె నగరంలో పేరు మోసిన ఇంటీరియర్ డెకరేటర్. ఆమెకి సహజమైన సౌందర్య స్పృహ, రీతి ఉన్నాయి, ఇవి ఓ ఇంటీరియర్ డెకరేటర్‌కి గొప్ప ఆస్తులు. ఆమె వృత్తి ఆమెకి గొప్ప ఆదాయాన్నివ్వడంతో పాటు ఆత్మసంతృప్తినీ కల్పిస్తోంది.

మాల్య పెళ్లి ఘనంగా జరిగింది కాని ఆ వివాహం విఫలమైంది. ఆమె వివాహం ఐదేళ్ల క్రితం ఒక మహారాణికి తగిన ఆడంబరంతో జరిగింది.

కానీ ఆమె వైవాహిక జీవితం పూర్తిగా రెండేళ్ళు కూడా కొనసాగలేదు. భర్త రూపంలో ఉన్న మృగం నుండి శారీరకంగా, చట్టబద్ధంగా మరియు మానసికంగా బయటపడే సమయానికి ఆమె అలసిపోయింది.

“దాన్ని ఒక పీడకలగా మర్చిపో. నీ కోసం నేను ఒక చక్కని సంబంధం తెచ్చాను.”

రంగనాథన్ ఇంకా ఆశాజనకంగా ఉన్నాడు కాని మాల్య మాత్రం అలా లేదు.

“ఇంకో పెళ్ళా? దేవుడా! నేను దాని గురించి ఆలోచించడం కూడా భరించలేను, నాన్నా. మొదటి పెళ్ళి తాలూకూ గాయాలు చాలా లోతుగా అయ్యాయి. నయం కావడానికి జీవితకాలం పట్టవచ్చు. మీరు నిజంగా నాకు సహాయం చేయాలనుకుంటే, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.”

“మీ అమ్మా, నేను ఎల్లకాలం జీవించి ఉంటామని అనుకుంటున్నావా? మా తర్వాత నిన్నెవరు చూస్తారు?”

“ఎవరో చూడడం ఎందుకు నాన్నా, తమ్ముడు శివ ఉండగా నాకు ఇంకెవరు అవసరం అవుతారు? నా ‘చిట్టి’ తమ్ముడు నాకు చాలు, నాన్నా. ”

మాల్య ‘చిట్టి’ తమ్ముడు శివ ఆమెకన్నా ఆరేళ్లు చిన్నవాడు. తనకంటే తమ్ముడంటేనే మాల్యకి బాగా ఇష్టం.

ఆమె అతని అక్క మాత్రమే కాదు, అతనికి గురువు, ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కూడా. తోబుట్టువులు ఏ విషయమైనా అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు.

శివ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బాచిలర్స్ పూర్తి చేసి, తన తండ్రితో కలిసి కుటుంబ వ్యాపారంలో చేరాడు.

***

శివ కాంచీపురం నుండి వచ్చిన చీరలను పరిశీలిస్తున్నాడు. ఆ రోజు వాళ్ళు బయట తినాలని అనుకున్నందున అతడిని తీసుకెళ్ళటానికి మాల్య వచ్చింది.

“అక్కా, ఈ చీర చూడు. దీని ధరని వేలాది రూపాయలుగా నిర్ణయిస్తారని నీకు తెలుసు. ఈ చీర రంగేంటో చెప్పగలవా? మొత్తం జరీయే ఉంది, చీర కనబడడం లేదు.

చీరలో ఉండే జరీ నుదుటిపై బొట్టుబిళ్ళలా ఉండాలి. బొట్టుబిళ్ళ చిన్నదీ, పెద్దదీ, సన్నదీ లేదా విశాలమైనదీ కావచ్చు. కానీ భయపెట్టేలా, నుదిటిపై బొట్టును పులుముకోకూడదు కదా.

పట్టు చీర కొనడంలో నా సిద్ధాంతాన్ని ఈ డిజైనర్ నిరూపించారు. మీరు బోల్డన్ని రూపాయల్ని కుమ్మరించి… పరమ చెత్త… ని పొందవచ్చు.

ఈ చీర ధర దాదాపు 45 వేల రూపాయలు ఉంటుందంటే నువ్వు నమ్మగలవా? సాధారణ పసుపు రంగు చీరకి ముదురు గోధుమ రంగు అంచు. బెల్-బాటమ్ ప్యాంటు ఎంత అధునాతనమైనదో, ఈ చీరా అంతే. హిప్పీ హెయిర్ స్టైల్‌లా ఫ్యాషనబుల్ కూడా” అన్నాడు వ్యంగ్యంగా.

మళ్ళీ తనే మాట్లాడుతూ “ఇదీ మరీ దారుణం. దీన్ని పెళ్లి చీర అని అంటున్నారు. ఈ చీరలో అందంగా కనబడాలంటే వధువుకు కనీసం అరవై సంవత్సరాలు ఉండాలి. ఈ డిజైనర్ తహశీల్దార్ ఆఫీసు గుమస్తాలా సృజనాత్మకంగా ఉన్నాడు.”

“అక్కా చెప్పు మనం ఎందుకు ఈ రకమైన చీరలు కొనాలి? నన్ను ఎందుకు డిజైన్ చేయనివ్వరు?”

మాల్య ఆ రోజు రాత్రి శివ భవిష్యత్తు గురించి నాన్నతో పోట్లాడింది.

అతను ‘బార్న్ డిజైనర్’ అని ఆమెకు ఇప్పుడు తెలుసు. కానీ అతన్ని తీర్చిదిద్దాలి.

న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి శివని పంపమని ఆమె తన తండ్రిని ఒత్తిడి చేసింది.

అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే, అలా ఎప్పుడో గాని జరగవు; శివ వచ్చే ఏడాది కోర్సు పూర్తి చేస్తాడు.

***

రంగనాథన్ భార్య పరిమళ.  తనలా కుటుంబానికి అంకితమైన ఇల్లాలు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఆమె పెద్ద కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టినప్పుడు రంగనాథన్ సోదరులు, కవలపిల్లలైన మురుగేశన్, సెల్వకుమార్‌ల వయసు కేవలం పదేళ్ళు. వాళ్ళు ఆమె మొదటి పిల్లలు.

వివాహ సమయంలో రంగనాథన్ చెన్నైలోని టి.నగర్‌లో ఓ చీరల కొట్లో పనిచేస్తున్నాడు. యజమానికి అత్యంత విశ్వసనీయుడు. వ్యాపారంలోని సూక్ష్మ నైపుణ్యాలను వేగంగా నేర్చుకున్నాడు.

ఒక చిన్న పట్టు చీరల దుకాణం తెరవాలన్న తన చిరకాల వాంఛను వ్యక్తం చేసినప్పుడు, పరిమళ తన ఆభరణాలన్నీ ఇచ్చేసింది. అప్పుడప్పుడు వంటలు చేయడం ద్వారా కొంతకాలం కుటుంబ ఖర్చులను నిర్వహించింది.

భార్య ప్రేమ, ఇంకా ఆమె ఆభరణాలు కొత్త వ్యాపారం కోసం మూలధనాన్ని ఇస్తే, రంగనాథన్ యొక్క నిజాయితీ, కృషి, మృదువుగా మాట్లాడే స్వభావం దాని నాటకీయ పెరుగుదలకు దోహదం చేశాయి. మైలాపూర్‌లోని అరిసిక్కర వీధిలో టెన్ బై టెన్ మేక్-షిఫ్ట్ షాపులో రంగా సిల్క్స్ ప్రారంభించబడింది.

పదిహేనేళ్ళలో అది జిఎన్ చెట్టి స్ట్రీట్‌లోని ఆరు అంతస్తుల ఎయిర్ కండిషన్డ్ షోరూమ్‌గా మారింది. కాంచీపురంలో వందకు పైగా అగ్రశ్రేణి నేత కార్మికుల నియంత్రణలో ఉన్న ఒక సమగ్ర ఉత్పాదక కేంద్రంగా అభివృద్ధి చెందింది, దక్షిణాది అంతటా ప్రీమియం రియల్ ఎస్టేట్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది.

ప్రతి సంవత్సరం పట్టు చీరల వ్యాపారంలో కొత్త పోకడలు, కొత్త ఫ్యాషన్లు మరియు కొత్త పేర్లను ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని రంగా సిల్క్స్ సంవత్సరాలుగా సాధించింది.

తనకు లభించని యూనివర్సిటీ డిగ్రీ కనీసం తన కవల సోదరులకైనా లభించాలని రంగనాథన్ తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే వారు పై చదువులకు నిరాకరించారు; కొట్లోనే కష్టపడటం ప్రారంభించారు.

రంగనాథన్ వారిని వ్యాపారంలో తన సమాన భాగస్వాములుగా చేసుకున్నాడు. వారు చాలా చిన్నతనంలోనే వివాహం చేసుకున్నారు. ధనవంతులైన వ్యాపారవేత్తల మంచి కుటుంబాల నుండి తన మరుదుల కోసం వధువులను ఎంచుకుంది పరిమళ.

“పరీ, తమ్ముళ్ళు ఇప్పుడు పెళ్ళి చేసుకున్నారు. వారి కోసం మరో రెండు గదులు కట్టాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావు?”

“వద్దు. ఈ ఇల్లు మీ పేరు మీద ఉంది. వాళ్ళకి సొంత ఇళ్ళు కట్టించి ఇవ్వండి. వాళ్ళని అక్కడే ఉండనివ్వండి.”

“నీకు ఏమైంది? తమ్ముళ్ళు మనతో ఒకే కుటుంబంగా నివసించాలని నీకు తెలియదా?”

“నాకు తెలుసు. ప్రస్తుతానికి ప్రతిదీ చాలా మధురంగా అనిపిస్తుంది. నేను వారి భార్యలకు ఒక తోటికోడల్నని మర్చిపోవద్దు. కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ తమ్ముళ్ళు ఆడవాళ్ళ కారణంగా తగవులాడాని నేను కోరుకోను. ”

రంగనాథన్ తన భార్య దూరదృష్టిని మెచ్చుకున్నాడు. అతను రెండు ఇళ్ళు కొన్నాడు, ఒకటి బీసెంట్ నగర్‌లో, మరొకటి టి.నగర్‌లో. తను నివసిస్తున్న ఇంటికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఆ ఇళ్ళని రీమోడల్ చేయించాడు. తన సోదరులను ఆ ఇళ్ళల్లో ఉండమన్నాడు.

తమ్ముళ్ళిద్దరికీ ఇద్దరేసి కూతుర్లు పుట్టారు. సహజంగానే వారి వ్యాపార సామ్రాజ్యానికి శివ ఏకైక వారసుడు అయ్యాడు.

తమ్ముళ్ళు రంగనాథన్‌ని ఆరాధించేవారు. మొదట అన్నయ్యని సంప్రదించకుండా ఏ పని చేయరు. ఒకే గదిలో అన్నయ్య పక్కన కూర్చోవడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. కానీ అదంతా సంవత్సరాల క్రితం సంగతి.

ఇప్పుడు వారు ప్రతిదాన్ని వేరే కోణం నుండి చూసే కళను నేర్చుకున్నారు. వారు ఏమనుకుంటున్నారనేది తమలోనే ఉంచుకుంటున్నారు.

రంగనాథన్‌కి తెలియకుండా కవల సోదరులు దాదాపు ప్రతి వారాంతంలో బార్‌లో ఒకరినొకరు కలుసుకుంటున్నారు, గొప్ప ప్రణాళికలు వేస్తున్నారు.

***

రంగనాథన్ తోటలో తన నలభై నిమిషాల నడకను ముగించి, యథా స్థానంలో ఉంచిన సౌకర్యవంతమైన వెదురు కుర్చీలో కూర్చున్నాడు.

ఆయన ముందున్న బల్లపై వార్తాపత్రికలన్నీ అమర్చబడ్డాయి. ఎప్పట్లానే ఆయన ‘ది హిందూ’ దినపత్రికను తీసుకున్నాడు. చివరి పేజీలో ప్రతిరోజూ కనిపించే తన దుకాణం ప్రకటనను మొదట చూశాడు. ఆ తర్వాత వార్తలను చదవడం ప్రారంభించాడు.

“బావా కాఫీ.”

ఆమె పరిమళ చెల్లెలు పద్మ. కుటుంబ ఆచారం ప్రకారం ఆమె ఎప్పుడూ రంగనాథన్‌ను ‘బావా’ అని పిలుస్తుంది కాని తండ్రిలా గౌరవిస్తుంది.

పద్మకి చాలా సంవత్సరాల క్రితం ఓ బ్యాంక్ క్లర్కుతో పెళ్ళయ్యింది. వివాహం అయిన మూడు సంవత్సరాలకు ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయింది.

కారుణ్య కారణాల వల్ల బ్యాంక్ ఆమెకు క్లర్క్ ఉద్యోగం ఇచ్చింది. కానీ త్వరలోనే ఆమె కేవలం ప్రతిభ ఆధారంగా అధికారిగా పదోన్నతి పొందింది.

ఆమె దేశంలోని వివిధ ప్రదేశాలలో పనిచేసింది. ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు యొక్క మైలాపూర్ బ్రాంచ్‌కి మేనేజర్‌గా ఉంది. ఆమె బ్రాంచ్ సుమారు వంద కోట్ల డిపాజిట్ పోర్ట్‌ఫోలియో, ఇంకా లోన్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.

ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మహిళ. 36 ఏళ్ళ వయసులో ఆమె కవిత్వం రాయడం, పోర్చుగీస్ నేర్చుకోవడం, గిటార్ సాధన చేస్తుంది. ఆమె తన పనిని ఇష్టపడింది. కానీ అంతకన్నా ఎక్కువ ఆమె జీవితాన్ని ప్రేమించింది.

ఆమె మాల్యకన్నా ఏడు సంవత్సరాలు పెద్దది. పద్మ, మాల్య ఆప్తమిత్రులు. సాంకేతికంగా పద్మ మాల్య‌కి పిన్ని అయినప్పటికీ, తనను తన పేరుతో మాత్రమే పిలవాలని పట్టుబట్టింది.

శివ అంటే కూడా ఆమెకి బాగా ఇష్టం. ఆమె శివకి అన్ని రకాల సలహాదారు.

ఒకసారి శివ చదివే కళాశాల ఈజిప్టుకు స్టడీ టూర్ ఏర్పాటు చేసింది. శివ పద్మకి ఫోన్ చేశాడు.

“పిన్నీ, నేను నా పేరు ఇవ్వలేదు. ఈ టూర్‌కి లక్షన్నర ఖర్చవుతుంది.”

“వెధవా. మొదట పేరు ఇవ్వు, నేను చెబుతున్నా కదా! మీ నాన్న, మీ బాబాయిలు అరగంటలోపు ఆ డబ్బు సంపాదిస్తారు.”

“నాకు తెలుసు పిన్నీ, కానీ నేను నాన్న నుండి అంత డబ్బు అడిగితే… ఆయనకి అది నచ్చకపోవచ్చు. ఒక విద్యార్థి పిక్నిక్ కోసం ఎందుకు ఎక్కువ ఖర్చు చేయాలి.. అని ఆయన కలత చెందుతారు.. “

“ఓహ్, అదా నీ సమస్య. దానిని నాకు వదిలేయ్. నేను చూసుకుంటా.”

పద్మ చేతిలో ఉన్న పని ముగించి, రంగా సిల్క్స్‌కి వెళ్ళింది. ఆ సమయంలో తన మరదలిని అక్కడ చూసి రంగనాథన్ ఆశ్చర్యపోయాడు.

“బావా, చాలా ముఖ్యమైన విషయంపై మీ సలహా కోరుకుంటున్నాను.”

“చెప్పు.”

పరిమళను చూడటానికి మొదటిసారి వెళ్ళినప్పుడు, పద్మ పదేళ్ల వయసున్న పాప అనీ, చిరిగిన గౌను ధరించి, ముక్కు కారుతూ ఉండేది అన్న విషయాన్ని రంగనాథన్ మరచిపోలేదు.

పద్మ తన భర్త చనిపోయినప్పటి నుండి వారితో నివసిస్తోంది. ఆమెకి పోస్టింగ్ చెన్నై బయట ఉంటే, కనీసం రెండు వారాలకు ఒకసారి అయినా రంగనాథన్ ఇంటికి వచ్చేది.

“మా బ్రాంచ్ అధికారులు ఈజిప్టు టూర్ నిర్వహిస్తున్నారు.”

“సంతోషం పద్మా.”

“అయితే బావా, దీనికి ఒకటిన్నర లక్షలు ఖర్చవుతుంది. నేను వెళ్ళడానికి నిరాకరించాను. హెడాఫీసు ఒకరకమైన పరోక్ష ఒత్తిడి తెస్తోంది… ”

“సరైన నిర్ణయానికి రావడానికి మీ హెడాఫీసు ఒత్తిడి అవసరమా? డబ్బు మాత్రమే సమస్య అయితే, చింతించవద్దు, పద్మా. నేను మొత్తం టూర్‌ని స్పాన్సర్ చేస్తాను.

అయితే ఈజిప్టులో ఉన్నప్పుడు కొన్ని వస్త్ర దుకాణాలను సందర్శించి డజను ఫొటోలు తియ్యి. కొత్త కస్టమర్లను గుర్తించడం కోసం మేము నిన్ను ఈజిప్టుకు పంపినట్టు ఎకౌంట్స్‌ పుస్తకాలలో ఎంట్రీ వేస్తాను.

ఈ విధంగా నేను నా వ్యాపార వ్యయం ఆ మొత్తంలో పన్ను ఆదా చేస్తున్నానని క్లెయిమ్ చేయవచ్చు. అంటే మీ పర్యటన ఖర్చులలో 30% అంకుల్ శామ్ నుండి, అంటే నా ఉద్దేశంలో భారత ప్రభుత్వం నుంచి వస్తాయి.”

“చాలా థాంక్స్, బావా”

ఆమె అక్కడి నుండి శివకి ఫోన్ చేసింది. శివ మొబైల్ మోగుతుండగా ఆమె మరోసారి రంగనాథన్‌ని అడిగింది.

“బావా ఖర్చులు మీరు భరిస్తున్నారు, అంతే కదా?”

“అవును.”

“మీరు మీ మాట తప్పరు, అంతేగా?”

“ఎన్నడూ తప్పను.”

ఇంతలో శివ ఫోనెత్తాడు.

“శివ, అభినందనలు. మీ నాన్న నీ ఈజిప్ట్ టూర్‌కి సరే అన్నారు. నేను ఒక గంటలో డబ్బును నీ ఎకౌంట్‌కి పంపిస్తాను.”

“ఏయ్, పద్మ, ఏం జరుగుతోంది?” అడిగాడు రంగనాథన్

“శివా, నేను నీతో తరువాత మాట్లాడతాను” అని ఫోన్ పెట్టేసింది.

“మీకు ఎంత మంచి కొడుకు పుట్టాడు, బావా! శివ కాలేజ్ ఈ టూర్‌ను నిర్వహిస్తోంది. పాపం, పిల్లవాడు, ఇంకా చదువుకునే సమయంలో అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకూడదని అనుకున్నాడు.

కానీ తరువాత అతని స్నేహితులు టూర్ సన్నాహాలలో సంతోషంగా నిమగ్నమవ్వడం చూసి బాధపడ్డాడు. నాకు ఫోన్ చేశాడు.

మీ ఆమోదం పొందడానికి నేను ఒక చిన్న నాటకం ఆడాను. బావా, నేను మిమ్మల్ని బాధపెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించండి.”

“కొంటె పిల్లా! పర్లేదు. ఇప్పుడు మంచి అమ్మాయిగా ఉండి, మీ అబ్బాయిని ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పు. ప్రతిరోజూ ఫోన్ చెయ్యమని చెప్పు. నేను ఇప్పుడే వాడి ఖాతాకు డబ్బు పంపుతాను.”

తండ్రీ కొడుకులు తనపై ఉంచిన నమ్మకానికి పద్మ చలించిపోయింది.

“మీకు తెలుసు బావా, నేను నా ఆలోచనలను దాచలేను. నేను నీకో విషయం చెప్పాలి…”

“చెప్పు పద్మా, సంకోచించవద్దు.”

“ఈ బ్రహ్మాండమైన కాంప్లెక్స్, ఆ అందమైన ఇల్లు, మీ బిఎమ్‌డబ్ల్యూ మరియు బెంజ్ కార్లు, మీకు బ్యాంకులో ఉన్న డబ్బు, దేశవ్యాప్తంగా మీకు ఉన్న ఆస్తులు… ఇవి మీ నిజమైన సంపద కాదు, బావా.

అసలైన ఆస్తి మీ కొడుకు శివ. నేను మీకు చెప్తున్నాను, బావా, వాడు అమూల్యమైన రత్నం.  ఏదో ఒక రోజు గొప్ప వ్యక్తి అవుతాడు, బావా. అలా అయినప్పుడు వాడు మిమ్మల్ని కూడా దాటిపోతాడు.”

ప్రేమ, గర్వం కలగలసిన మిశ్రమ భావాలతో రంగనాథన్ గొంతు మూగబోయింది.

***

“పద్మా, కాఫీ చేదుగా ఉంది.”

“షుగర్ లెస్ కాఫీ అంటేనే చేదుగా ఉంటుంది.”

“నువ్వు కొద్దిగా చక్కెర వేయచ్చుగా?”

“బావా మీరు ఇప్పటికే మీ జీవితకాలపు కోటాను చక్కెర తిన్నారు. ఇప్పుడు మీరు వరుసగా రెండుసార్లు చక్కెర అని అడిగినా మీ రక్తంలో చక్కెర పెరుగుతుంది. గత నెల రీడింగ్ 300 అని మీరు మర్చిపోయారా?”

పద్మ త్వరగా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది.

రంగనాథన్ స్పందన కూడా అంతే హాస్యంగా ఉంటుందని ఆమెకు తెలుసు. ఆయన మాటకు మాట అంటారేమోనని ఎదురు చూసింది. కాని ఆయనలా చేయలేదు.

ఒక బలమైన అంతర్ దృష్టి ఏదో ఆమెను వెనక్కి తిరిగి ఆయన వైపు చూసేలా చేసింది.

“బావా”

ఆమె అరుపు వీధంతా వినబడింది. పరిమళ, మాల్య తోట దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here