ముద్రారాక్షసమ్ – షష్ఠాఙ్కః – 1

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

(తతః ప్రవిశతి రజ్జుహస్తః పురుషః)

పురుషః:

ఛగ్గుణసంజో ఆదిఢా ఉవాఅపరివాడి ఘడిఅ పాసముహీ

చాణక్కణితిరజ్జూ రిపుసంజమణుజ్జయా జఅది. (4)

(షడ్గుణసంయోగదృఢా ఉపాయ పరిపాటీ ఘటిత పాశముఖీ

చాణక్యనీతిరజ్జూ రిపుసంయమనోద్యతా జయతి.)

అర్థం:

షట్+గుణ+సంయోగ+దృఢా=రాజనీతి విషయకమైన ఆరు గుణాలు కలిపి పేనడం చేత గట్టిదనం కలది, ఉపాయ+పరిపాటీ+ఘటిత+పాశముఖీ=నాలుగు ఉపాయాల అనుసరణంతో ఉచ్చు కలది (అయిన), చాణక్య+నీతిరజ్జూ=చాణక్యుడి వ్యూహరచన అనే త్రాడు, రిపు+సంయమన+ఉద్యతా=శత్రువును నిగ్రహించే పనికి పూనుకొన్నది, జయతి=అతిశయిస్తోంది.

వృత్తం:

ఆర్య.

అలంకారం:

రూపకం (విషయ్యభేద తాద్రూప్య రఞ్జనం విషయస్య యత్ రూపకం తత్త్రిధాధిక్య న్యూనత్వానుభయోక్తిః అని కువలయానందం). ఇక్కడ చాణక్యనీతిని రజ్జువుగా నిరూపిస్తూ ఆరు గుణాలను పురులుగా, నాలుగు ఉపాయాలను ఉచ్చుగా బావించడం కారణం.

పురుషః:

(పరిక్రమ్య అవలోక్య చ.) ఏసో సో తదేసో అజ్జచాణక్కస్స పురదో ఉదుంపరఏణ కహిదో. జిహిం మఏ అజ్జచాణక్కాణత్తి ఏ అమచ్చరక్ఖసో పేక్ఖిదవ్వో. (విలోక్య) కహం ఏసోక్ఖు అమచ్చ రక్ఖసో కిదసీసావగుంఠణో ఇదో ఎవ్వ ఆగచ్ఛఇ. తా జావ ఇమేహీం ఉజ్జాణ పాదవేహిం అంతరిదసరీరో పేక్ఖామి కహిం ఆసనపరిగ్గహం కరేదిత్తి. (పరిక్రమ్యస్థితః)

(పరిక్రమ్య అవలోక్య చ) ఏష స ప్రదేశ ఆర్య చాణక్యస్య పురత ఉదుమ్బర కేనకథితో, యత్ర మయా ఆర్య చాణక్యాజ్ఞప్త్యా అమాత్య రాక్షసః ప్రేక్షితవ్యః. (విలోక్య) కథ, మేష ఖల్వమాత్య రాక్షసః కృత శీర్షవగుణ్ఠన ఇత ఏవాగచ్ఛతి తద్యావదభి రుద్యాన పాదరపైరంతరిత శరీరః ప్రేక్షే కుత్రాసన పరిగ్రహం కరోతీతి. (పరిక్రమ్యస్థితః)

అర్థం:

(పరిక్రమ్య=ముందుకు నడిచి, అవలోక్య+చ=చూచిన్నీ), యత్ర=ఎక్కడైతే, మయా=నా చేత, ఆర్య+చాణక్య+ఆజ్ఞప్త్యా=పూజ్య చాణక్యుని ఆదేశం పురస్కరించుకొని, అమాత్య+రాక్షసః+ప్రేక్షితవ్యః=రాక్షసమంత్రిని చూడవలసి ఉందో (పసిగట్టవలసి ఉందో), ఏషః+సః+ప్రదేశః=ఇదే ఆ ప్రదేశం. ఆర్య+చాణక్యస్య+పురతః=పూజ్య చాణక్యుని ఎదుట, ఉదుమ్బరకేన+కథితః=ఉదంబరుకునిచే చెప్పబడినది. (విలోక్య=చూచి) ఏషః+ఖలుః+అమాత్యరాక్షసః=ఇతడే రాక్షసమంత్రి కాబోలు! కృత+శీర్ష+అవగుణ్ఠన=తలపై ముసుగు వేసుకుని, ఇతః+ఏవ+ఆగచ్ఛతి=ఇటే వస్తున్నాడు. తత్+యావత్=అందువల్ల, ఏభిః+ఉద్యానపాదరపైః+అంతరిత+శరీరః=ఈ ఉద్యానవనం చెట్లచాటున శరీరాన్ని మరుగుపరుచుకుని, కుత్ర+ఆసనపరిగ్రహం+కరోతి+ఇతి=(ఆయన) ఎక్కడ కూర్చుంటాడనేది, ప్రేక్షే=గమనిస్తాను. (పరిక్రమ్య=ముందుకు నడిచి, స్థితః=నిలిచాడు).

 (తతః ప్రవిశతి యథానిర్దిష్టః సశస్త్రో రాక్షసః)

అర్థం:

తతః=పిమ్మట, యథా+నిర్దిష్టః=ముందు పేర్కొనబడిన విధంగా, స+శస్త్రః+రాక్షసః=ఆయుధం ధరించిన రాక్షసుడు, ప్రవిశతి=ప్రవేశిస్తున్నాడు.

రాక్షసః:

(సాస్రమ్) కష్టం భోః కష్టమ్

అర్థం:

(సాస్రమ్=కన్నీటితో) కష్టం+భోః+కష్టమ్=అయ్యా, ఎంత కష్టం, ఎంత కష్టమ్…

శ్లోకం:

ఉచ్ఛిన్నాశ్రయకాత రేవ కులటా

గోత్రాన్తరే శ్రీర్గతా;

తా మేవానుగతా గతానుగతికా

స్త్యక్తాను రాగాః ప్రజాః;

ఆప్తైర ప్యన వాప్త పౌరుషఫలైః

కార్యస్య ధూ రుజ్ఝిరహితా;

కిం కుర్వన్త్వథనోత్త మాంగ రహితై

రఙ్గైరివస్థీయతే (5)

అర్థం:

ఉచ్ఛిన్న+ఆశ్రయ+కాతర+ఇవ=చెదరిపోయిన ఆశ్రయం కలదనే భయంతో మాదిరి (నమ్ముకున్న ఆధారం తొలగిపోయినదనే భయం కలిగిన దానివలె) కులటా=రంకుటాలై, శ్రీః=సంపద (రాజ్యలక్ష్మి), గోత్రాన్తరే+ గతాః=ఇతర కులాన్ని చేరుకున్నది. ప్రజాః=సంతానం, త్యక్త+అనురాగాః=ప్రేమను విడిచిపెట్టి, గతానుగతికా=దాని మార్గంలోనే పోయారు. ఆపైః=సన్నిహితులైనవారి చేతకూడా, అనవాప్త+పౌరుష+ఫలైః=తాము ఆశించిన సత్ఫలితాలు దక్కనివారు కావటాన, కార్యస్య+ధూః=పనిలో ఉండే బరువును, ఉజ్ఝితౌ=విడిచివేయబడింది. అథ+వా=కాకపోతే, కిం+కుర్వన్తు?=ఇంకేమి చేస్తారు? ఉత్తమాంగ+రహితై=తలలేని, అంఙ్గైః+ఇవ=ఇతర శరీరాలాంగాల మాదిరి, స్థీయతే=నిలబడ్డారు.

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

ఉపమ – (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని – కువలయానందం). ఇక్కడ రాజ్యలక్ష్మిని ‘కులటా ఇవ’ అని పేర్కొనడం కారణం.

ఇంకా ఉచ్ఛిన్నాశ్రయకాతరా అని, త్యక్తానురాగా అనీ, అనవాప్త పౌరుషఫలైః – అనీ కారణాలను అనుసంధించడం వల్ల కావ్యలిఙ్గం అనే అలంకారం కూడా చెప్పవచ్చునని రామదాసయ్యంగారు.

(సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం).

వ్యాఖ్య:

ఇక్కడ – నందరాజ్యలక్ష్మి కులగౌరవం పోగొట్టుకుని కులటలాగున గోత్రాన్తరుడైన చంద్రగుప్తుణ్ణి పొందడం ఒక దురదృష్టం కాగా – ఆమె సంతానం అనదగిన ప్రజలు (సంతతి) కూడా దాని వెంటనే పోవడం (చంద్రగుప్తుడినే ఆశ్రయించడం) రెండవ దురదృష్టమనీ, ఆప్తులైన (శకటదాసాది మిత్రులు) ఆశించిన ఫలితం దక్కక – బరువైన పనిలో బాధ్యతను విడిచిపెట్టడం మూడవ దురదృష్టమనీ – రాక్షసమంత్రి విలపిస్తున్నాడు. తలలేని మొండెంగా మిగిలాడే అని ఆవేదన!

అపి చ –

పతిం త్యక్త్వా దేవం భువన పతి ముచ్చైరభిజనమ్

గతా ఛిద్రేణ శ్రీ ర్వృషల మవినీ తేవ వృషలీ;

స్థిరీభూతా చాస్మిన్. కిమిహ కరవామ, స్థిరమపి

ప్రయత్నం నో యేషాం విఫలయతి దైవం ద్విష దివ. (6)

అర్థం:

ఉచ్చైః+అభిజనమ్=ఉన్నత వంశంలో పుట్టిన, భువన+పతిమ్=లోకానికంతటికీ ప్రభువైన, దేవం=దేవరను, శ్రీః=రాజ్య సంపద, అవినీతా+వృషలీ+ఇవ=నీతిమాలిన బసివి మాదిరి (తెగబడిన దానివలె), పతిం+త్యక్త్వా=భర్తను విడిచి, ఛిద్రేణ=లొసుగుపడి, వృషలం+గతా=శూద్రుడిని (చంద్రగుప్తుణ్ణి) చేరుకున్నది; అస్మిన్+స్థిరీభూతా+చ=ఇతడియందు స్థిరపడింది కూడా. ఇహ+కిం+కరవామ=ఇట్టి స్థితిలో ఏమి చేయగలం? యేషాం+నః+స్థిరం+అపి+ప్రయత్నం=యే నా ప్రయత్నమేదైతే ఉందో (దానిని), ద్విషత్+ఇవ=ద్వేషిస్తున్నట్టుగా, దైవం=విధి, విఫలయతి=నిష్ఫలం చేస్తున్నది.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

ఉపమ – అవినీతేవ వృషలీ అనీ, దైవమ్ ద్విషదివ అనీ పోలిక చెప్పడం కారణం.

రాక్షసః:

మయా హి…

అర్థం:

మయా+హి=నా చేతనైతే – (నేనేమో)

శ్లోకం:

దేవేగతే దివ మతద్విధ మృత్యు యోగ్యే,

శైలేశ్వరం త మధికృత్య కృతః ప్రయత్నః,

తస్మిన్ హతే, తనయ మస్య, తధా ప్యసిద్ధిర్.

దైవం హి నన్దకులశత్రు, రసౌ న విప్రః. (7)

అర్థం:

అ+తద్విధ+మృత్యుయోగ్యే=అట్టి విధమైన చావుకు తగని, దేవే+దివం+గతే=నా ప్రభువు స్వర్గస్థుడు కాగా,  తం+శైలేశ్వరం=ఆ పర్వతరాజును, అధికృత్య=అధికారిని (ప్రభువును) చేసి, ప్రయత్నః+కృతః=(నేను) ప్రయత్నం చేశాను (నందరాజ్యం నిలపడానికి), తస్మిన్+హతే=అతడు మృత్యువాత పడగా, తస్య+తనయమ్ (అధికృత్య+ప్రయత్నః+కృతః)=అతని కుమారుడి ద్వారా ప్రయత్నించడమైనది, తధా+అపి=అది కూడా ఫలించలేదు. నన్దకులశత్రు+దైవం+హి=నందవంశానికి విధియే శత్రువు, అసౌ+ విప్రః+న=ఈ  బ్రాహ్మణుడు (చాణక్యుడు) కాదు.

వృత్తం:

వసంత తిలక – త- భ – జ – జ – గ గ – గణాలు.

అలంకారం:

అనుమానాలంకారం (సాధ్యసాధన నిర్దేశేత్వనుమానముదీర్యతే – అని ప్రతాపరుద్రీయం).

సాధ్య – సాధనాలు రెండింటినీ (తన ప్రయత్నాలూ – వైఫల్యాలూ) నిర్దేశించడం కారణం.

రాక్షసః:

అహో వివేక శూన్యతా మ్లేచ్ఛస్య!

అర్థం:

అహో=అహా! మ్లేచ్ఛస్య=మ్లేచ్ఛరాజైన మలయకేతుని (యొక్క), వివేకశూన్యతా= బుద్ధిలేమితనం (ఎంతది!)

శ్లోకం:

యో నష్టా నపి బీజనాశ మధునా

శుశ్రూష తే స్వామిన,

స్తే షాం వైరిభి రక్షతః కథ మసౌ

సంధాస్యతే రాక్షసః?

ఏతావ ద్ది వివేక శూన్యమనసా

మేచ్ఛేన నాలోచితమ్.

దైవేనోపహతస్య బుద్ధి రథవా

సర్వా విపర్యస్యతి. (8)

అర్థం:

బీజనాశం+నష్టాన్+అపి=మూలముట్టుగా నాశనమైపోయిన వారినైనా, అధునా=ఇప్పుడు, స్వామినః=ప్రభువులను, యః (రాక్షసః)=ఎవడు, శుశ్రూషతే=సేవిస్తున్నాడో, అసౌ+రాక్షసః=ఆ యీ రాక్షసుడు, అక్షతః=గాయపడకుండా, తేషాం+వైరిభిః=వారి (యొక్క) శత్రువులతో, కథం+సంధాస్యతే=ఏ విధంగా సమాధానపడగలడు? (అని), ఏతావత్+వివేకశూన్యమనసా=ఇంత మాత్రం వివేకం లేని మనస్సుతో, మేచ్ఛేన+న+ఆలోచితమ్+హి=మ్లేచ్ఛుడు మలయకేతువు (చేత) ఆలోచన చేయబడలేదే? అథవా=అదే కాకపోతే, సర్వాబుద్ధిః=బుద్ధి మొత్తంగా, విపర్యస్యతి=తలక్రిందౌతుంది.

వృత్తం:

శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు.

అలంకారం:

అర్థాంతర న్యాసం. (ఉక్తిరర్థాన్తర న్యాసా స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలయానందం). ఇక్కడ మ్లేచ్ఛుడి అనాలోచిత స్థితిని – దైవోపహత స్థితి అనే విశేషంతో కలిపి చెప్పడం కారణం.

త దిదానీ మపి తావ దరాతిహస్తగతో వినశ్యే, న్న తు రాక్షస శ్చన్ద్రగుప్తేన సహ సన్ధధీత. అథవా మమ కామ మసత్యసన్ధ ఇతి వర మయశో, న తు శత్రువఞ్చునపరాభూత ఇతి. (సమన్తాదవ లోక్య సాస్రమ్) ఏతా స్తా దేవపాద క్రమణ పరిచయ పవిత్రీకృత తలాః కుసుమపురో పకణ్ఠభూమయః. ఇహ హి…

అర్థం:

తత్+ఇదానీం+అపి+తావత్=అందువల్ల ఇప్పటికైనా, అరాతి+హస్త+గతః=శత్రువు చేతిలో పడి, వినశ్యేత్=అంతరించిపోతాడే గాని, రాక్షసః=(ఈ) రాక్షసుడు, న+తు+చన్ద్రగుప్తేన+సహ+సన్ధధీత=ఎన్నటికీ చంద్రగుప్తునితో పొత్తు నెరపడు. అథ+వా=అలాగు కాకుంటే, మమ=నాకు, కామం=మిక్కిలి, అసత్య+సన్ధః=సత్యానికి కట్టుబడడు, ఇతి=అనే, అయశః=అపకీర్తి (రానీ), న+తు+శత్రువఞ్చున+పరాభూతః+ఇతి=(అంతేగాని) శత్రువు చేసిన మోసం కారణంగా ఓడిపొవడం అంగీకరించను. (సమన్తాత్+అవలోక్య=చుట్టూ చూచి, స+అస్రమ్=కన్నీటితో), తా+దేవపాద+క్రమణ+పరిచయ+పవిత్రీకృత+తలాః=ప్రభువులు సంచరించిన పాదాల పరిచయంతో పవిత్రమైన ప్రదేశాలు గలవి, ఏతౌః=యీ, కుసుమపుర+ఉపకణ్ఠ+భూమయః=పాటలీపుత్ర సమీపపు నేలలు!

ఇహ+హి=ఇక్కడే కదా!

శ్లోకం:

శార్‌ఙ్గా కర్షావముక్త ప్రశిథిల కవికా

ప్రగ్రహే ణాత్ర దేశే

దేవేనా కౌరి చిత్రం ప్రజవితతురగం

బాణ మోక్ష శ్చలేషు.

అస్యా ముద్యాన రాజౌ స్థిత మిహ కథితం

రాజభిస్తైర్వి నేత్థం

సంప్ర త్యాలోక్యమానాః కుసుమపురభువో

భూయసా దుఃఖయన్తి (9)

అర్థం:

శార్‌ఙ్గాకర్షాణ=అల్లెత్రాటిని బాగా లాగి, అవముక్త=విడిచినందువల్ల, ప్రశిథిల+కవికా=సడలిన కళ్ళెం త్రాడు గల, దేవేనా=ప్రభువు చేత, అత్ర+దేశే=ఈ చోటనే, చిత్రం=చిత్రపు నడకలతో, ప్రజవిత+తురగం=మిక్కిలి వేగంగా పరుగిడేలాగా గుఱ్ఱం చేయబడి, చలేషు+ బాణమోక్షః=కదలాడే లక్ష్యాల యందు (వయిపు) బాణాలు వదలడం, అకారి=జరిపించబడింది (కదిలే లక్ష్యాలను ఛేదించడం అనే క్రీడ). అస్యాం+ఉద్యానరాజౌ=ఈ వనాల గుంపులో, ఇహ+స్థితం=ఇక్కడ ఉండినారు. రాజభిః+కథితం=రాజులు సల్లాపించుకునేవారు, తైః+వినా=వారు లేకుండా, సంప్రతి=ఇప్పుడు, ఆలోక్యమానాః=దర్శింపబడుతూ, కుసుమపురః+భువః=పాటలీపుత్ర నేలలు, భూయసా=మిక్కిలిగా, దుఃఖయన్తి=దుఃఖిస్తున్నాయి.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

కావ్యలిఙ్గం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం).

ఇక్కడ – “ఇప్పుడీ పాటలీపుత్రపు నేలలు బాధకలిగిస్తున్నాయి” అంటూ అందుకు గల కారణాలను చెప్పడం గమనించదగినది.

తత్ క్వను గచ్ఛామి మన్దభాగ్యః? (విలోక్య) భవతు. దృష్ట మేత జ్జీర్ణో ద్యానమ్, అత్ర ప్రవిశ్య, కుతశ్చి చ్చన్దన దాసప్రవృత్తి ముపలప్స్యే. అలక్షితనిపాతాః పురుషాణాం సమవిషమదశా పరిణ తయో భవన్తి. కుతః…

అర్థం:

తత్=అందువల్ల, మన్దభాగ్యః (అహం) =దురదృష్టవంతుడనైన నేను, క్వ+ను+గచ్ఛామి=ఎక్కడకని వెళ్ళను? (విలోక్య=చూసి) భవతు=కానియ్యి, ఏతత్+జీర్ణోద్యానమ్+దృష్టం=యీ పాడుపడిన తోట చూడడమైనది, అత్ర+ప్రవిశ్య=ఇందులోకి వెళ్ళి, కుతశ్చిత్=ఎవరిద్వారానైనా (ఏదో విధంగా) చన్దనదాస+ప్రవృత్తిం+ఉపలప్స్యే=చందనదాసు సమాచారం సంపాదిస్తాను.

పురుషాణాం=పురుషులకు, అలక్షిత+నిపాతాః=ఊహించని విధంగా సంభవించేవి,  సమ+విషమ+దశా+పరిణతయో=అనుకూల, ప్రతికూల పరిస్థితులలో మార్పులు, భవన్తి=ఉంటూంటాయి.

కుతః=ఎందుకంటే-

శ్లోకం:

పౌరై రఙ్గుళిభి ర్నవేన్దువ దహం

నిర్దిశ్యమానః శనై

ర్యో రాజేవ పురా పురా న్నిరగమం

రాజ్ఞాం సహస్రై ర్వృతః,

భూయః సంప్రతి సోఽహ మేవ నగరే

తత్రైవ వన్ద్యశ్రమో

జీర్ణోద్యానక మేష తస్కర ఇవ

త్రాసా ద్విశామి ద్రుతమ్ (10)

అర్థం:

యః= ఏ నేను, పౌరైః=నగరవాసుల చేత, నవ+ఇందువత్=పొడుపు చంద్రుడి మాదిరి, అఙ్గుళిభిః+నిర్దిశ్యమానః=వ్రేళ్ళతో చూపబడుతూ (వారే వారే అని నిర్దేశిస్తుండగా), రాజా+ఇవ=రాజు మాదిరి, రాజ్ఞాం+సహస్రైః+వృతః=వేలమంది రాజులతో చుట్టుకొనబడి వుండి,శనై=మెల్లగా, పురాత్+నిరగమం=నగరం నుంచి వెళ్ళానో, సః+అహం+ఏవ=అట్టి యీ నేనే, భూయః=మళ్ళీ, సంప్రతి=ఇప్పుడు, తత్ర+ఏవ+నగరే=అదే నగరంలో, వన్ద్యశ్రమః=వ్య్రర్థమైపోయిన పరిశ్రమ కలిగి, ఏషః+జీర్ణోద్యానకం=యీ పాడు పడిన తోటలోకి, తస్కర+ఇవ=దొంగవలె, త్రాసాత్=భయకారణంగా, ద్రుతమ్=వేగంగా, విశామి=ప్రవేశిస్తున్నాను.

వృత్తం:

శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు.

అలంకారం:

ఉపమ – ‘తస్కర ఇవ త్రాసాద్విశామి’ అని పోలిక చెప్పడం కారణం.

అథవా యేషాం ప్రసాదా దిద మాసీత్ త ఏవ న సన్తి. (నాట్యేన ప్రవిశ్య, అవలోక్య చ) అహో జీర్ణోద్యాన స్యారమణీయతా – అత్రహి

అర్థం:

అథవా=కాదంటే, యేషాం+ప్రసాదాత్=ఎవరి అనుగ్రహం వల్ల, ఇదం+ఆసీత్=ఇది ఏర్పడిందో, తే+ఏవ=వారే, న+సన్తి=లేదు (కదా!). (నాట్యేన+ప్రవిశ్య=అభినయ పూర్వకంగా ప్రవేశించి, అవలోక్య+చ= చూసిన్నీ), అహో=అయ్యో! జీర్ణ+ఉద్యానస్య=ఈ పాడుపడిన తోట యొక్క, అ+రమణీయతా=అందహీనత – అత్ర+హి=ఇక్కడైతే…

శ్లోకం:

విపర్యస్తం సౌధం కుల, మివ మహారమ్భ రచనమ్,

సరః శుష్కం, సాధోర్హృదయమివ నాశేన సుహృదాం

ఫలైర్హీనా వృక్షా విగుణనృపయోగా దివ నయా,

స్తృణైశ్ఛన్నా భూమి ర్మతి రివ కునీతై రవిదుషః (11)

అర్థం:

మహారమ్భ+రచనమ్=గొప్ప ప్రయత్నంతో నిర్మింపబడిన, సౌధం=తెల్లని మేడ, కులం+ఇవ=గొప్ప వంశము వలె, విపర్యస్తం=తారుమారైపోయింది (వెనుకటి శుభస్థితి తలక్రిందులైపోయింది).  సుహృదాం+నాశేన=మంచి మిత్రులు అంతరించిపోవడం చేత, సాధోః+హృదయం+ఇవ=మంచివాడి హృదయం లాగున, సరః+శుష్కం+(అభూత్)=చెరువు ఎండిపోయింది, విగుణ+నృప+యోగాత్=గుణహీనుడైన రాజు సంపర్కం వల్ల, నయా+ఇవ=నీతుల మాదిరి, వృక్షా=చెట్లు, ఫలైః+హీనా=పండ్లు లేకుండా పోయాయి. భూమి=ఈ నేల, కునీతై=దుష్టనీతి గల, అవిదుషః=పాండిత్యం లేని మనిషి (యొక్క), మతి+ఇవ=బుద్ధి లాగున, తృణై+ఛన్నా=గడ్ది కప్పివేసి ఉన్నది.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

ఉపమ – ‘కులమివ’, ‘హృదయమివ’, ‘విగుణనృపయోగాదివ’, ‘అవిదుషః మతిరివ’ అంటూ తోట పరిస్థితిలో పోలిక చెప్పడం గమనించదగినది.

అపిచ –

అర్థం:

అపి+చ=ఇంకా (చెప్పాలంటే)

శ్లోకం:

క్షతాఙ్గానాం తీక్ష్ణైః పరశుభి రుదగ్రై క్షితిరుహాం

రుజా కూజన్తీనా మవిరతకపోతోపరుదితైః

స్వనిర్మోకచ్ఛేదైః పరిచిత పరిక్లేశ కృపయా

శ్వసన్తః శాఖానాం వ్రణమివ నిబధ్నన్తి ఫణినః (12)

అర్థం:

ఉదగైః+తీక్ష్ణైః+పరశుభిః=భయంకరమూ, గొప్ప పదునూ గలవి అయిన గొడ్డళ్ళతో, క్షత+అఙ్గానాం=గాయపడిన శరీరభాగాల, రుజా=బాధతో, అవిరత=ఎడములేని, కపోత+ఉపరుదితైః=పావురాల ఏడ్పుల వంటి మూల్గులతో, కూజన్తీనాం=అరుస్తున్న, క్షితిరుహాం=చెట్లకు, ఫణినః=సర్పాలు, పరిచిత+పరిక్లేశ+కృపయా=పరిచయం గల వారి పట్ల సానుభుతితో, శ్వసన్తః=బుస నెపంతో ఊదుతూ, స్వ+నిర్మోకచ్ఛేదైః=తమ కుబుసపు తునకలతో, శాఖానాం+వ్రణం=చెట్ల కొమ్మల గాయానికి(న్ని), నిబధ్నన్తి+ఇవ=కట్టు కడుతున్నట్టుగా (దృశ్యన్తి=కనబడుతున్నాయి).

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

ఉత్ప్రేక్ష – (సంభావనా స్యాదుత్ప్రేక్షా వస్తుహేతు ఫలాత్మనా – కువలయానందం)-

చెట్ల గాయాలకు పాములు తమ కుబుసంతో కట్లు కడుతున్నట్లున్నదనడం వల్ల ఇక్కడ ఫలోత్ప్రేక్ష.

వ్యాఖ్య:

చెట్లకు పాములు కట్లు కడుతున్నట్లున్నాయి – అనే వర్ణన, వాల్మీకి రామాయణంలోని ఆదికవి వర్ణన ‘బద్ధవ్రణమివాంబరమ్’ అనేది ఇక్కడ గుర్తుకువస్తుంది. బహుశః దీనికది ప్రేరణ కావచ్చు. అలాగే – హాలగాథాసప్తశతిలోకి ఒక గాథః శూలం ఎక్కించబడిన ఒక నేరస్థుడు బాధతో మూల్గుతున్న విధంగా గుడిగోపురం, పావురాల మూలుగుల నెపంతో ఏడుస్తున్నట్లుంది అనే వర్ణన కూడా ఇక్కడ గుర్తుకు వస్తుంది.

ఏతే చ తపస్వినః…  

అర్థం:

ఏతే+చ+తపస్వినః=పాపం, ఈ దీనమైన చెట్లు…

శ్లోకం:

అన్తః శరీరపరిశోష ముదగ్రయన్తః

కీటక్షతి స్రుతిభి రస్రమి వోద్యమన్తః

ఛాయావియోగమలినా వ్యసనే నిమగ్నా

వృక్షాః శ్మశాన ముపగన్తు మివ ప్రవృత్తాః  (13)

అర్థం:

వృక్షాః=చెట్లు, అన్తః+శరీర+పరిశోషం=(నీరు పెట్టి పోషణ చేయడం వంటివి లేని కారణంగా ఏర్పడిన) శరీరపు ఎండుదనాన్ని, ఉదగ్రయన్తః=గాఢంగా తెలియజేస్తూ, కీటక్షతి+స్రుతిభిః=పురుగు కాటుచే స్రవిస్తున్న రసం అనే, అస్రం=కన్నీటిని (లేదా రక్తాన్ని), ఉద్యమన్తః+ఇవ=క్రక్కుతున్న మాదిరి గాను, ఛాయా+వియోగ+మలినాః=నీడనిచ్చే ఆకులు తొలగిపోవడం చేత దుమ్ముబారినవై, వ్యసనే+నిమగ్నా=దుఃఖంతో కూడినవై, శ్మశానం+ఉపగన్తుం=కాటికి చేరడానికి, ప్రవృత్తాః+ఇవ=సిద్ధంగా ఉన్నట్లు (దృశ్యన్తే=కనబడుతున్నాయి).

వృత్తం:

మదన వృత్తం. త-భ-జ-జ-గగ – గణాలు.

అలంకారం:

ఉత్ప్రేక్ష – ‘వృక్షాః శ్మశాన ముపగన్తుం ప్రవృత్తాః ఇవ’ అని భావించడం వల్ల ఇక్కడ హేతూప్రేక్ష.

యావ దస్మిన్ విషమదశా పరిణామ సులభే భిన్న శిలాతలే ముహూర్త ముపవిశామి। (ఉపవిశ్య ఆకర్ణ్య చ) అయే, కి మిద మస్మిన్ కాలే పటుపటహశఙ్ఖమిశ్రో నాన్దీనాదః. య ఏషః…

అర్థం:

అస్మిన్+విషమదశా+పరిణామ+సులభే=ఈ ప్రతికూల పరిస్థితులలో సులభంగా అందుబాటులో ఉన్న, భిన్న+శిలాతలే=(ఈ) పగులుఱాతి పలకమీద, ముహూర్తము+ఉపవిశామి= కొంచెం సేపు కూర్చుంటాను. (ఉపవిశ్య=కూర్చుని, ఆకర్ణ్య+చ=వినిన్నీ) అయే=అరే, అస్మిన్+కాలే=ఈ వేళప్పుడు, ఇదం+కిమ్=ఇదేమి?, పటు+పటహ+శఙ్ఖ+మిశ్రః=తీవ్రమైన పటాహ, శంఖాలు కలగలిసిన, యః+ఏషః+నాన్దీనాదః=యీ, దేనికో ప్రారంభసూచక ధ్వని… (వలె వినిపిస్తోంది?)

శ్లోకం:

ప్రమృద్నన్ శోత్రూణాం

శ్రుతిపథ మసారం గురుతయా,

బహుత్వాత్ ప్రాసాదైః

సపది పరిపీతోజ్ఝీవ ఇవ,

అసౌ నాన్దీనాదః పటు పటహ శఙ్ఖధ్వని యుతో

దిశాం ద్రష్టుం దైర్ఘ్యం

ప్రసరతి స కౌతూహల మివ (14)

అర్థం:

శోత్రూణాం=వినేవారి (యొక్క), అసారం+శ్రుతిపథం=బలహీనమైన చెవులకు(ను), గురుతయా=అధికమైన (ధ్వనితో), ప్రమృద్నన్=బలహీనపరుస్తూ (అణగకొడుతూ), బహుత్వాత్=ఆధిక్యం కారణంగా, ప్రాసాదైః=భవనాల చేత, సపది=అప్పటికప్పుడు, పరిపీత+ఉజ్ఝీవ+ఇవ=(ఆ ధ్వని) త్రాగబడి మళ్ళీ ఉమియబడుతున్నట్లుగా, అసౌ+నాన్దీ+నాదః=ఎందు నిమిత్తమో ప్రారంభమైన యీ ధ్వని, పటుపటహ+శఙ్ఖధ్వని+యుతః=తీవ్రమైన పటాహ శంఖనాదాలతో కూడి – దిశాం+దైర్ఘ్యం= దిక్కుల పొడవును, ద్రష్టుం=చూడదలచి, స+కౌతూహలం+ఇవ=కుతూహలపడుతున్న చందంగా, ప్రసరతి=విస్తరిస్తున్నది.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

ఉత్ప్రేక్ష – (సంభావనా స్యాదుత్ప్రేక్షా వస్తుహేతు ఫలాత్మనా – కువలయానందం)- ఇక్కడ పటాహ, శంఖాల నాదాన్ని నగర భవనాలు త్రాగి, నిలువరించలేక ఉమియగా – అవి దిక్కుల పొడవును చూడడానికా అన్నట్లు ప్రసరించాయని సంభావించడం వల్ల ఫలోత్ప్రేక్ష.

(విచిన్త్య) ఆః జ్ఞాతమ్! ఏష హి మలయకేతు సంయమన సఞ్జాతో రాజకులస్య (ఇత్యర్ధోక్తే సాసూయమ్) మౌర్యకుల స్యాధికపరితోషం పిశునయతి. (సబాష్పమ్) కష్టం భోః కష్టం!   

అర్థం:

(విచిన్త్య=ఆలోచించి) ఆః+జ్ఞాతమ్=ఆఁ! తెలిసింది. ఏషః+హి=ఇదేమంటే, మలయకేతు+సంయమన+సఞ్జాతః=మలయకేతుణ్ణి నిగ్రహించిన కారణంగా పుట్టిన, రాజకులస్య=రాజ సమూహానికి సంబంధించినది! (ఇతి+అర్ధోక్తే=అంటూ వాక్యం సగంలో, స+అసూయమ్=అసహనంగా) మౌర్యకులస్య+పరితోషం=మౌర్యవంశం వారి ఆనందాన్ని, పిశునయతి=సూచిస్తోంది. (స+బాష్పమ్=కన్నీటితో) కష్టం+భోః+కష్టం=అయ్యా, ఎంత కష్టం, ఎంత కష్టం!

శ్లోకం:

శ్రావితోఽస్మి శ్రియం శత్రో, రభినీయ చ దర్శితః

అనుభావయితుం మన్యే యత్నః సంప్రతి మాం విధేః (15)

అర్థం:

శత్రో+శ్రియం+శ్రావితః=శత్రువు సంపదను గురించి వినడమైనది (విన్నాను), అభినీయ=ప్రదర్శించి (ఎదుటకు తెచ్చి), దర్శితః=చూపించడమూ జరిగింది; సంప్రతి=ఇప్పుడు, మాం+అనుభావయితుం=నన్ను అనుభవించే విధంగా చేయడానికి గాను, విధేః+యత్నః+మన్యే=దైవం చేసే ప్రయత్నమే ఇదని తలుస్తున్నాను.

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

పర్యాయాలంకారం. (కారణం గమ్యతేయత్ర ప్రస్తుతాత్ కావ్యవర్ణనాత్ ప్రస్తుతత్వేన సంబద్ధం తత్పర్యాయోక్తముచ్యతే – అని ప్రతాపరుద్రీయం) – ఇక్కడ ‘మాం అనుభావయితు, శత్రోః శ్రియం శ్రావితః’ – అనీ, అభినీయ చ దర్శితః – అనీ పర్యాయత్వేన తనకు జరిగినట్టు రాక్షసుడు భావించుకోవడం ఇక్కడ విశేషం.

పురుషః:

ఆసీణో అఅం. జావ అజ్జచాణక్కాదేసం సంపాదేమి.

(ఆసీనో ఽయమ్. యావ దార్యచాణక్యాదేశం సంపాదయామి)

అర్థం:

యావత్=ఎంతలో, ఆర్య+చాణక్య+ఆదేశం=పూజ్య చాణక్యుని ఆజ్ఞను, సంపాదయామి=పొందగలనో, (తావత్=అంతలో), అయమ్+ఆసీనః=ఇతడు కూర్చున్నాడు (కూర్చోగలడు.)

(రాక్షస మపశ్యన్నివ తస్యాగ్రతో రజ్జు పాశేన కణ్ఠ ముద్బధ్నాతి)

(రాక్షసం+అపశ్యన్+ఇవ=రాక్షసుణ్ణి చూడనట్టుగానే, తస్య+అగ్రతః=అతడి ఎదుటనే, రజ్జుపాశేన=త్రాటి ఉచ్చుతో, కణ్ఠము+ఉద్బధ్నాతి=మెడకు ఉచ్చు బిగిస్తున్నాడు)

రాక్షసః:

(విలోక్య) అయే కథ మాత్మాన ముద్బధ్నా త్యయ మహ మివ దుఃఖిత స్తపస్వీ, భవతు. పృచ్ఛా మ్యేనమ్. భద్ర, కిమిద మనుష్ఠీయతే?

అర్థం:

(విలోక్య=చూసి), అయే=అయ్యో, అయం+అహం+ఇవ+దుఃఖితః+తపస్వీ=పాపం, ఇతడెవరో నా లాగునే దుఃఖంలో ఉన్నట్టున్నాడు! కథం+ఆత్మానం+ఉద్బధ్నాతి=ఏమిటిది? తన కంఠానికి తానే ఉరి బిగించుకొంటున్నాడు, భవతు=కానియ్యి. ఏనమ్+పృచ్ఛామి=వీనినే అడుగుతాను. భద్ర=నాయనా, ఇదం+కిమ్+అనుష్ఠీయతే=ఎందుకిలాగ చేస్తున్నావు? (చేయబడుతోంది?)

పురుషః:

(సబాష్పమ్) అజ్జ, జం పిఅవఅస్స విణాస దుఃఖిదో అంహారిసో మందభగ్గో అణుచిట్ఠది.

(ఆర్య, యత్ ప్రియ వయస్య వినాశదుఃఖితో ఽస్మాదృశో మన్దభాగ్యో ఽనుతిష్ఠతి.)

అర్థం:

(స+బాష్పమ్=కన్నీటితో) ఆర్య=అయ్యా, ప్రియ+వయస్య+వినాశదుఃఖితః=ఆప్తస్నేహితుడి నాశనాన్ని చూసి దుఃఖించే, యత్+అస్మాదృశః=ఏ నా వంటివాడు, మన్దభాగ్యః=దురదృష్టవంతుడు, అనుతిష్ఠతి=చేస్తాడో (అదే చేస్తున్నాను.)

రాక్షసః:

(ఆత్మగతమ్) ప్రథమ మేవ మయా జ్ఞాతం, నూన మహ మి వాయ మార్తస్తత స్వీతి. (ప్రకాశమ్) హే వ్యసన సబ్రహ్మచారిన్, యది న గుహ్యం నాతిభారికం వా, తతః శ్రోతుమిచ్ఛామి

అర్థం:

(ఆత్మగతమ్=తనలో) ప్రథమం+ఏవ+మయా+జ్ఞాతం=మొదటనే నేను తెలుసుకున్నాను; నూనం=బహుశా, అహం+ఇవ+అయం+ఆర్తః+తపస్వీ=పాపం, ఇతడు కూడా నాలాగే దుఃఖితుడై ఉంటాడు – ఇతి=అని. (ప్రకాశమ్=పైకి) హే+వ్యసన+సబ్రహ్మచారిన్=ఓ (మిత్రమా) నా వలెనే దుఃఖంలో ఉన్నవాడా!, యది+న+గుహ్యం=రహస్యం కాకపోతేనూ, న+అతిభారికం+వా=భరింపజాలనంతటిది కాకపోతేనూ, తతః=అయినట్లయితే, శ్రోతుం+ఇచ్ఛామి=వినగోరుతున్నాను.

పురుషః:

అజ్జణ రహస్సం, ణాదిగురుఅం, కిందు ణ సక్ణోమి పిఅవఅస్స విణాస దుక్ఖిద

హిఅఓ ఎత్తి అమెత్తం విమరణస్స కాలహరణమ్ కాదుం

(ఆర్య, న రహస్యమ్ నాతిగురుకమ్. కిం తు న శక్నోమి ప్రియస్యవినాశదుఃఖిత

హృదయ, ఏతావన్మాత్ర మపి మరణస్య కాలహరణమ్, కర్తుమ్)

అర్థం:

ఆర్య=అయ్యా, న+రహస్యమ్=రహస్యం ఏమీ లేదు, న+అతి+గురుకమ్=మిక్కిలి భారమైనదీ కాదు; కిం+తు=కానీ, ప్రియస్య=ఇష్టుని యొక్క, వినాశ+దుఃఖిత+హృదయః=నాశం కారణంగా దుఃఖం పాలైన హృదయం గల నేను, ఏతావత్+మాత్రం+అపి=ఈ పాటిగా కూడా, మరణస్య+కాలహరణమ్+కర్తుమ్=చావుకి సంబంధించి ఆలస్యం చేయడాన్ని, న+శక్నోమి=భరించలేకుండా ఉన్నాను.

రాక్షసః:

(నిఃశ్వస్యాత్మగతమ్) కష్టం! ఏతే సుహృద్వ్యసనేషు పర ముదాసీనాః ప్రత్యాదిశ్యామహే వయ మనేన. (ప్రకాశమ్) భద్ర, యది న రహస్యం నాతిగురు తచ్ఛ్రోతు మిచ్ఛామి

అర్థం:

(నిశ్శ్చస్య=నిట్టూర్చి, ఆత్మగతమ్=తనలో) కష్టం=అయ్యో! ఏతే+సుహృత్+వ్యసనేషు=ఈ స్నేహితుల కష్ట సందర్భాలలో, పరం+ఉదాసీనాః=ఎంతో తటస్థంగా ఉండే, వయం=మేము, అనేన=వీనిచే,  ప్రత్యాదిశ్యామహే=తిరస్కరణకు గురి అవుతున్నాను. (ప్రకాశమ్=పైకి), భద్ర=నాయన, యది+న+రహస్యం=రహస్యం కానిదైతేనూ, న+అతిగురు=మరీ పెద్ద సంగతి కాకపోతేను, తత్+శ్రోతుం+ఇచ్ఛామి=దానిని వినాలనుకుంటున్నాను.

పురుషః:

అహో ణిబ్బన్ధో అజ్జస్స! కాగ ఈ। ణివేదేమి। అత్థి దావ ఏత్థణఅరే మణిఆరసెట్ఠీ విష్ణుదాసో ణామ.

(అహో నిర్బన్ధ ఆర్యస్య! కా గతిః। నివేదయామి। ఆస్తి తావ దత్ర నగరే మణికార శ్రేష్ఠీ విష్ణుదాసో నామ.)

అర్థం:

అహో=అయ్యో, ఆర్యస్య+నిర్బన్ధ=అయ్యవారు నిర్బంధిస్తున్నారు (ఈ నిర్బంధం ఎంతటిది!), కా+గతిః=ఏమి దారి?, నివేదయామి=మనవి చేస్తాను. అత్ర+నగరే+విష్ణుదాసః+నామ+మణికారశ్రేష్ఠీ+ఆస్తి+తావత్=ఈ పట్టణంలో విష్ణుదాసు అనే మణుల వర్తకుడు ఉన్నాడు.

రాక్షసః:

(ఆత్మగతమ్) ఆస్తి విష్ణుదాస శ్చన్దన దాసస్య సుహృత్. (ప్రకాశమ్) కిం తస్య?

అర్థం:

(ఆత్మగతమ్=తనలో) విష్ణుదాసః+చన్దనదాసస్య+సుహృత్=విష్ణుదాసు చందనదాసు స్నేహితుడు! (ప్రకాశమ్=పైకి) కిం+తస్య=వానికేమైంది?

పురుషః:

సో మమ పిఅవ అస్నో. (స మమ ప్రియవయస్యః)

అర్థం:

సః=అతడు, మమ+ప్రియవయస్యః=నాకు ప్రియమిత్రుడు.

రాక్షసః:

(సహర్ష మాత్మగతమ్) అయే ప్రియవయస్య ఇ త్యాహ. అత్యన్త సన్నికృష్టః సమ్బన్ధః. హన్త. జ్ఞాస్యతి చన్దనదాసస్య వృత్తాన్తమ్. (ప్రకాశమ్) భద్ర, కిం తస్యః

అర్థం:

(సహర్షం=సంతోషంగా, ఆత్మగతమ్=తనలో) అయే=అరే, ప్రియవయస్యః+ఇతి+ఆహ=ఆప్తస్నేహితుడన్నాడు. అత్యన్త+సన్నికృష్టః+సమ్బన్ధః=ఈ సంబంధం ఏదో చాలా దగ్గరిదిలాగున్నది. హన్త=అయ్యో.  చన్దనదాసస్య వృత్తాన్తమ్=చందనదాసు సమాచారం, జ్ఞాస్యతి=తెలిసి ఉంటాడు. (ప్రకాశమ్=పైకి) భద్ర=నాయనా, కిం+తస్యః=అతడికేమైంది?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here