[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 33వ భాగం. [/box]
[dropcap]“అ[/dropcap]ల్లుడొచ్చాడట గదా?” అన్నాడు దీక్షితులు గబగబా వచ్చి కూర్చుంటూ.
తల ఊపాడు దశరథం.
“ఏడి?”
“వెళ్ళిపోయాడు.”
“అమ్మాయి వెళ్ళిందా?”
“లేదు.”
“మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్నాడా?”
“నాతో అనలేదు.”
“విజయ ఏది?”
“ఉంది” అనగానే…
“విజయా” అని పిలిచాడు దీక్షితులు.
“వస్తున్నా మామయ్యా” అంటూ బయటకొచ్చింది.
“ఏం చేస్తున్నవమ్మా వంటిట్లో? ఏదో వందల మందికి వండి వడ్డించినట్టూ?” అని “అది సరే అల్లుడేమిటి ఒక్కనాడన్నా ఉండకుండా వెళ్ళిపోయాడు? స్కూటరుంది గదా.”
“ఉంటే మాత్రం ఏంటట ఆడ పొడిచేది?”
“ఈ వ్యవసాయాలతో -“
“వ్యవసాయం ఉన్నా మనకున్న పనేం లేదుగా.”
“అదేంటమ్మా అలా అంటావు?”
“నాకంటే మీకే బాగా తెల్సి ఉండాలి మామయ్యా” అంది కొంచం కటువుగా.
“విజయాఁ ఏం అంటున్నావు?” అన్నాడు దీక్షితులు సాగదీస్తూ అయోమయంగా.
“ఓరేయ్ నే చెప్తాను విను” అన్నాడు దశరథం.
అటుగా మళ్ళాడు. స్కూటరును కొని శ్రీనివాసుకివ్వడం కలిగే సంతోషపు ఛాయలు వారి ముఖాన బొత్తిగా కనిపించకపోవడం విచిత్రంగా అనిపించింది. తను సంతోషంగా వచ్చినందుకు చాలా భిన్నమైన వాతావరణంలోకి ప్రవేశించినట్లుగా అనిపించింది.
“మేమేదో ఇక్కడ కష్టపడి పోతున్నామంట. విజయమ్మ సహకారం, అండా లేంది బ్రతకలేమట. అంచేత మమ్మల్ని తమతోటే తీసుకెళ్లుతుందట. మేం ఇప్పటిదాకా దానికి చేసిన దానికి ఋణం తీర్చుకుంటుదట” అని…
“అరే దీక్షితులూ మన చేతులలోనే మన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మన పిల్లలు గనుక మనకు పిల్లలుగానే కనిపించినా వాళ్ళు ఎదిగినా మనం పెంచిన మమకారం అలా అనిపిస్తుంటుంది. అదీ గాక వాళ్ళకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటి ఆధారంతో బ్రతుకులో వారు నడక ప్రారంభిస్తారనీ మనకు తెల్సిచావదు. మనకున్న దృష్టి ఒక్కటే గదా మన పిల్లలు బావుండాలని. మనమేమైపోయినా పర్వాలేదు. అలాగే వాళ్ళు మనకెదో చేయాలి అనుకవడంలో తప్పు లేదు గదా. కానీ వాళ్ళు తమ సంసారాలను ఫణంగా పెట్టి ఒరగదోసే మంచిని మనం భరించగలమా? ఇది వినడానికే విడ్డూరంగా లేదుట్రా.”
“దశరథా అసలు నువ్వు నాకు ఏ విషయం ఎందుకు చెపుతున్నావో అర్థం కావడం లేదు” అన్నాడు దీక్షితులు.
“నీ తల్లిదండ్రులను నీ దగ్గర ఉంచుకునే బాధ్యత లేక హక్కు నీకెలాగుందో నా తల్లిదండ్రులను నేను చూసుకునే హక్కు నాకు ఉంటుంది గద అని విజయ భర్తను అడుగుతుందిరా.
లక్షలకు లక్షలు కట్నకానుకలు తీసుకున్న వాళ్ళు కట్టుకున్నదానికి ఇంత ‘పిడచ’ వేయడానికి తటపటాయిస్తున్న మన సమాజంలో దిగువ మధ్య తరగతి కుటుంబీకులమైన మనం మీకున్న హక్కులు మాకెందుకుండవు ఆడా మగా ఒక్కటే గదా అని అడగడమేంట్రా?”
“అలా వి…జ..య అడిగిందా? ఇప్పుడు మీకేం అయిదనీ?” అన్నాడు ఆతృతగా.
“దాన్నే అడుగు నీ ఎదురుగానే ఉంది గదా” అన్నాడు ఉక్రోషంగా.
“విజయా ఏంటిది?”
“మామయ్యా స్కూటరు లేంది తాళి కట్టిన నేను పనికి రాలేదు. స్కూటరుంటే చాలు అంటే ఈ ఆనందము భార్యనైన నా వల్లకాదు. నా అందచందాల వల్ల కాదు. స్కూటరు వల్ల” అని నవ్వి “నువ్వు స్కూటరు కొనిచ్చావు బాగానే ఉంది. నా సంసారం సంక్షోభంలో పడకుండా చూసేందుకు మాకు హితుడిగా నువ్వు చేసిన పని ఇది. కానీ మామయ్యా నాన్న నీకు ఎప్పుడో ఒకప్పుడు ఈ పైకం తిరిగి చెల్లించాలి గదా. మరి మా పరిస్థితులు నీకు తెల్సు ఇంటి పైననే ఇప్పటికి అప్పు ఉంది. అది వడి గుర్రాలలా పెరిగిపొతుంది.”
“ఇదీ ఆ అప్పుతో కలిపితే ఈ ఇల్లు సరిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. అందుకని నాన్న ఇల్లు అమ్మసాడే అనుకో, నిలువ నీడ పోయాక వాళ్ళెక్కడ ఉంటారు. ఆడపిల్లనయినా మగవాణ్ణియినా వారికి నేనేగా మరి అలాంటప్పుడు వాళ్ళను గాలికి వదిలేసి పోలేంగదా? అందుచేత ఏవండీ మా వాళ్ళు మీరు కోరిన కోరికలన్నింటినీ తీర్చారు గదా, అలాంటి వాళ్ళను రోడ్డున వదిలేయడం న్యాయం గాదు కనుక వాళ్ళను మనతో తీసుకెళ్దాం అన్నాను. ఇది తప్పుగా నాకు అనిపించలేదు. మనిషిగా ఎవరికి అనిపించదు కూడా. ఇది మనసులో ఉంచుకొని వెళ్ళిపోయాడు. మూడు ముళ్ళ పవిత్ర బంధాన్ని నూరు సంవత్సరాల అనుబంధంగా తలపోస్తారు. ఏడేడు జన్మల బంధంగా కూడా భావిస్తారు. అలాంటిది ఇంత తేలికగా… నేనేం చేయాలో చెప్పు మావయ్యా” అంది.
“అమ్మా విజయా నీ సంసారం సుఖంగా కొనసాగాలనే గదా, మా సర్వస్వం ధారపోసి తిప్పలు పడేది. అది మా బాధ్యత. దీన్ని మనసులో పెట్టుకొని అలా తిరస్కరించడం మంచిది కాదేమో.”
“మామయ్యా పిల్లల్ని కనడం సృష్టి ధర్మం. సకల జీవరాసులు చేస్తున్నదదే. కన్నాక లోకం తెల్సిందాక సాకడం కన్నవారి బాధ్యత. అలాగే తల్లిదండ్రులను చిట్టచివరి దాకా కంటికి రెప్పలా కాపాడుకొనే బాధ్యత పిల్లలకు ఉంది. ఇందులో ఒకటి తప్పు మరొకటి రైటూనా?”
“ఏదేమైనా నువ్వు చేసింది బాగలేదు, మా బాధలు మేం పడతాం లేగానీ నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది.”
నవ్వింది విజయ.
ఆవిడ స్థిరత్వానికి ఆశ్చర్యమనిపించింది.
“దీక్షితులూ నువ్వు ఒకటి చేయవు, అసలా స్కూటరును నిన్ను ఎవరు కొనిమ్మన్నారనీ?” అని అడిగాడు దశరథం.
“అదా ఆవేళ వచ్చానుగదా మీ సంగతి తెలిసింది. నువ్వు ఈ స్కూటరు కోసం ఇల్లు అమ్ముతున్నట్లుగా అర్థమయ్యాక ఊర్కోలేక నా కర్తవ్యంగా బావించి చేసాను. మీకు తెలిస్తే కుదరనివ్వరని చెప్పకుండా చేసాను. ఆఁ దశరథా నా పొరబాటును సరి చేసుకునే ఉపాయమేదన్నా ఉంటే చెప్పు. అంతకు మించి ఇప్పుడు ఏం చెయగలను” అన్నాడు బాధపడుతూ.
“నిన్ను తప్పు పట్టడం లేదు మామయ్యా. నువ్వు నా కోసం, నా మంచి కోసం, నా సుఖం కోసం చేసావు. నువ్వు మా మంచిని గురించి ఆలోచించే చేస్తావు. నిన్ను తప్పు పట్టడం కాదు. నా కోసం నువ్వు ఏదైనా చేయగలవు. చేస్తున్నావు.”
“మరి?” అన్నాడు దీక్షితులు.
“ఈ తప్పుంతా ఇప్పుడున్న వ్యవస్థది. నేనడిగేది ఒకటే. మగకో న్యాయం ఆడకో న్యాయం ఎందుకుండాలి…. ఆడ పుటుక పుట్టిన మనిషికి తన వాళ్ళకు ఆదుకునే హక్కు లేదా? దానికి భర్త అయిన వాడు సహకరించడా?అయినా ఆ భర్తను గౌరవించి ఆదరించాలా? ఇది నా ప్రశ్న” అంది స్థిరంగా.
ఈ మీమాంస తెగదని తెల్సి మెదలకుండా ఉన్నారు అంతా.
దీక్షితులు మాత్రం అనునయంగా “అమ్మడూ నీకెలా చెప్పాలో తెలీడం లేదమ్మా. ఒక దానికి మరొకదానికి లంకె పెట్టకు” అన్నాడు.
“నాకు న్యాయం కావాలి మామయ్యా. న్యాయమే… నన్ను మరలా అనుకోవద్దు. దీనికి పరిష్కారం దొరికితే ఇది వరవడిగా మారుతుందేమోనన్న ఆశ ఉంది. సమాజం గుర్తించుతుంది కూడా అనే నా భావన.”
“విజయా, విజయా నీకెలా చెప్పాలి? ఎలా?” అని తల బాదుకున్నాడు దీక్షితులు.
విజయలో ఇసుమంత మార్పు కనిపించలేదు.
సీతా దశరథం చూస్తూ ఉండిపోయారు.
***
దీక్షితులు ఇంటికి వచ్చాడే గానీ మనస్సు మనస్సులో లేదు. తోవలో ఒకరిద్దరు ఎదురుపడినా పలకరించినా మాట్లాడక వచ్చేసాడు. అతని మనస్సు నిండా నిండి ఉన్నది ఒక్కటే –
విజయ కాపురం – సీతారాములు కాపురంలా ఎప్పుడూ చూడాలి.
కొద్ది తేడా కనిపించినా విజయ ముందు నిగ్గతీస్తుంది. దీని కసలు ముక్కు సూటిగా వెళ్ళడం తప్ప మరొకటి తెలీదు. ఇంత చదువుకున్న పిల్ల తను మొండిగా వ్యవహరించి తల్లి తండ్రులకు తనకు బాధ కలుగజేస్తున్నానని ఎందుకు తలచదు. ‘మన చుట్టూరా ఒక సమాజం ఉంది. దానిలోనే అంతా బ్రతుకుతున్నాం. ఇక్కడ బ్రతుకు తీరు ఈ రీతిగా ఉంటుంది. ఇది మన మంచి చెడులను గమనిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఎంత దూరం పోలేం’ అనేది అర్థమవదా? భగవంతుడా ఎలారా అనుకున్నాడు.
‘మా నాన్న త్రాగుబోతు. అమ్మను చేయి చేసుకొనడం కళ్ళారా రెండు మూడు సార్లు చూసాను. తనలో తాను బాధపడేది కాని ఆవిడ ఏమిటిది అని అడగడం చూడలేదు. పైగా నాన్నని అమ్మ ఎంతగా ప్రేమించేది. ఏమిటమ్మా ఇదీ అని నేనుగా ఒకనాడు అడిగితే మీ నాన్నకు కోపం వస్తే అంతేరా కానీ నిన్నూ నన్నూ వదిలి బ్రతకలేడు, అంత ప్రేమ అనేది. నా బ్రతుకు మొత్తంలో ఆవిడ నాన్నను ఒక్క మాట పరుషంగా అనడం ఎఱుగను. ఎంత హాయిగానో సంసారం తీర్చుదిద్దింది. మగ అహంకారం ఇవ్వాళ్టిది కాదు. ఎన్ని తరాలనుంచో ఇలా వస్తుంది. దానిని ఛేదించడం ఒక్కసారి సాధ్యమా? మగవానికి శారీరక దారుఢ్యం ఉంది గనుక అతనికి కనే స్థితి లేదు గనుక పై చేయిగా నడుపుతూ వచ్చాడు. అతని వెంట నడచారు ఆడవాళ్ళు. ఆ అనుసరణలో అనేక కష్టాలు జరిగి ఉండచ్చు. అందుకని మనం వాళ్ళని ఇప్పుడేం చేద్దాం.
మీరు చేస్తున్నది తప్పు మీ నడతను మార్చుకోవాలి అందామా? వినరుపో అనుభవించేలా చేద్దామా’ … ఇలా అనేకానేక ఆలోచనలు… మంచం పై కూలబడ్డాడు.
కాఫీ అని చేతిలో కప్పు పెట్టింది శాంతమ్మ.
“శాంతా విజయ వచ్చిందా?” అడిగాడు పరధ్యానంగా
“ఇవ్వాళ్ళ రాలేదు?”
“రోజూ వస్తుంది గదా?”
“ఆఁ”
“ఏమంటుది?”
“నాతో ఏమి అనలేదు” అని “అల్లొడొచ్చారట గదా?” అడిగింది.
“వచ్చి వెళ్ళాడు.”
“అందేంటి?”
“అతని కోరికలు తీర్చాలి గదా, కొత్త అల్లుడాయే.”
“అందుకు ఇది ఆయుధమా?”
“అనే గదాఁ?”
“చదువుకు వ్యక్తిత్వానికి సంస్కారానికీ పూర్తిగా సంబంధం కనిపించలేదు. ఎంత చదివినా వ్యక్తిత్వపు తత్వం పెద్దగా మారడం లేదు. మన వాళ్ళు చాల కాలం నుంచి అంటున్న అనుభవ సారం పుట్టిన నాటి బుద్ది పుడకలతో గాని పోదు అని. చదువు వల్ల తెలుసుకున్న విషయాలు మూల వస్తువును మార్చవుగానీ లౌక్యంగానో తెలివిగానో వ్యవహరించడానికి మాత్రం ఉపయోగపడేలా” ఉంది అంది.
“అంటే నువ్వు అనదల్చుకున్నదేమిటి?” అన్నాడు దీక్షితులు శాంతమ్మను చూస్తూ.
“అనడానికి వేరేముంది? చెప్పుకింద తేలులా పడి ఉంటేనే ఆడది మంచి మనిషిగా మనకు కనిపిస్తుంది. మీ గుట్టును రక్షించితేనే పతివ్రత, స్వాధ్వి. మీరు మీదిగా ఉందనుకునే వ్యక్తిత్వానికి మాకు వ్యక్తిత్వం ఉంది అన్నది కనిపిస్తే మీరు భరించలేరు. ముక్కోపి మగడయినా, ముప్పొద్దులా తంతున్నా ఎట్టా నెట్టుకొస్తుందో చూడు ఆ ఇల్లాలు? ముగ్గురు ముండల నెట్టుకున్నా తాళి కట్టించుకున్న ఇల్లాలై ఉండి పల్లెత్తు మాట అని ఎఱగదు ఆ తల్లి! మగడు తాగి తందనాలాడుతు అపరాత్రి కొంప కొచ్చి ఆరడి పెట్టి నములుకుతింటున్నా ఆ సీతమ్మ చూడు మగడ్ని ఎలా చూసుకుంటుందో? ఆ పిల్లదే ఆస్థి అంతా పైగా నౌకరి చేస్తుంది అయినా మగాడి మాట గీటు దాడదు. అలా ఉండాలి ఇల్లాలంటే…. ఇవేగా మీరు ఆడాళ్ళకిచ్చే సర్టిఫికెట్లు.
ఒక్క సారైనా ఆడ మనిషి కూడా రక్తమాంసాలున్న మనలాటి మనిషే… మనకున్నట్లుగా దానిక ఒక మనస్సుంది. మనలా ఆలోచిస్తుంది, మైనపు ముద్దగాదు, సహధర్మచారిణి అని ఇవ్వాల్టి ప్రపంచంలో ఎందరు మగవాళ్ళు ఆలోచించ గలుగుతున్నారు? నాకా పిల్ల నచ్చలేదు? అని చెప్పే ఎందరు పెళ్ళి కొడుకులు తమ మొఖాన్ని అద్దంలో చూసుకొని తామెలా ఉన్నాం అని ప్రశ్నంచుకొని ఉంటారు. అలా ప్రశ్నించుకుంటే అసలు బ్రతుకగలరా మరి ఎందుకా అహం? ఆడపిల్ల అతిలోక సౌందర్యవతి అయి ఉండి కూడా ఈ పింజారీ గాళ్ళ సెలక్షనేమిటి వాడి అర్హతేమిటి?”
“మగాడిగా పుట్టడమేగా? అంటే ఆడగా పుట్టడమే బలహీనతా? ఎవరు ఈ భావనను ఇంతలా కల్గజేసింది? ఇది ఎంత తప్పుడు భావన! మగ దర్పాన్ని అదో ధర్మంగా అధికారానికి హక్కుకు పర్యాయపదంగా మనస్సులకెక్కించిందిదెవరు? మీరే కదా, కాదా ఏమిటి మీరే మీరే మగాళ్ళే.
ఆలోచన ఉండి ఇలాంటి ధూర్తపు స్థితిని గమనించాక ఎంత ఆడదయినా మగ వాళ్ళకు ఎలా చూస్తుందో మనస్సులో వాళ్ళకెలాంటి స్థానాన్నిస్తారో ఒక్కసారి ఆలోచించుకోని చూడండి. ఆ పిల్లవాడు నాకు నచ్చలేదు అని ఎవతైనా ధైర్యం చేసి అని ఉంటే అది ఎంత పెద్ద తప్పు ఈ సమాజంలో.”
“ఎందుకట?”
“మనసులోని మాట చెప్పకూడదా? కోతిని కోతి అనరాదా? ఏమిటీ న్యాయం. ఆడది అయినందుకు ఇవన్నీ చచ్చినట్లు భరించాలా? ఇదెక్కడి స్థితి? ఎంత హేయమైనదో ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించి చూడండి. వీటన్నింటికీ మీ అహంకారం డబ్బు ఈ రెండేనా కొలబద్దలు? అసలు మనిషి అన్న జీవికి ఉన్నది అని చెప్పుతున్న మనస్సు ఎక్కడ చచ్చింది. ఆడ శాల్తీకి అవేవీ తెలీవా? మట్టిబొమ్మేనా? మగాడి ఆట బొమ్మేనా? అసలు న్యాయం అంటే ఏమిటి? నరనరానికి ఈ భావన ఎక్కించి ఈ హేయమైన స్థితిని కలిగించి… ఛ…” అని కళ్ళు వత్తుకుంటూ మాటాడలేకపోయింది.
(ఇంకా ఉంది)