తెలంగాణ సాహిత్య చరిత్ర – నా అనుభవాలు

1
3

[dropcap]సా[/dropcap]హిత్య చరిత్రల రచన లేదా రూపకల్పన ఒక మహానిఘంటువును కూర్చడంతో కూడుకున్న శ్రమతో సమానం. నిఘంటువుల వలెనే సాహిత్య చరిత్రలు కూడా ఆవశ్య పరామర్శ గ్రంథాలుగా మన పుస్తక సంచయంలో ఉండిపోతాయి. సాహిత్య చరిత్రల మార్గదర్శనం లేకుండా ఆయా భాషాసాహిత్యాల సంగతుల్ని అవగతం చేసుకోవడం దాదాపు అసాధ్యం. ఒక భాషా సాహిత్యపు గతవైభవాన్ని గుర్తించేందుకు వర్తమాన క్రమాన్ని అంచనా వేసుకునేందుకు సాహిత్య చరిత్రల తోడ్పాటు అవసరం. ఇంగ్లీషు సాహిత్య చరిత్ర రచనలు వందల సంవత్సరాలుగా వస్తున్నాయి. మరిన్ని వందల ఏళ్ళు ఇవి వెలువడుతూనే ఉంటాయి. ఇంగ్లీషు భాషా సాహిత్య విశేషాలు విశ్వమంతటా పరివ్యాప్తం అయ్యేందుకు ఈ భాషా సాహిత్య చరిత్ర గ్రంథాలు నిరుపమాన రీతిలో తోడ్పడ్డాయి. తెలుగులో కందుకూరి వీరేశలింగం పంతులుతో ప్రారంభమైన సాహిత్య చరిత్ర రచన అంతకంతకూ బాగా ఎదిగింది. అయితే ఎంత చేయితిరిగిన వచన రచయిత అయినాసరే సాహిత్య చరిత్రను రచించాలంటే వెనకా – ముందు అవుతారు. సాహిత్య చరిత్ర రచన మంచిదే అయినా అందులో ప్రామాణికత, నిష్పాక్షికత, సమగ్రత అన్న త్రిసూత్రాలు లోపిస్తే కృషి అంతా వృథా అవుతుంది. అంత చేసీ సాహిత్య విమర్శకుల ప్రతికూల స్పందనల్ని చవిచూడవలసి వస్తుంది. సహజంగానే ఈ పరిణామాన్ని ఏ రచయితా ఇష్టపడడు. అందుకే కందుకూరి వారి నుండి నేటివరకు రెండు డజన్లకు మించి తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలు రాలేదు. అందులోనూ ఆరుద్ర, లక్ష్మీకాంతం, కొర్లపాటి శ్రీరామమూర్తి, జి. నాగయ్య, ఖండవల్లి లక్ష్మీరంజనం రచనలు మినహా మిగతావి అంతగా గుర్తింపును పొందనూలేదు.
ఒకే రచయిత సాహిత్య చరిత్రను రచించడమన్నది ఒకే ఒక ఋత్వికుడు మహాయజ్ఞాన్ని నిర్వహించడం వంటిది. ఇట్లా ఒకే ఒక్కరు యావత్ బాధ్యతల్ని తీసుకోకుండా దాన్ని పదిమందికీ పంచితే సాహిత్య చరిత్ర రచన అయినా మహాయజ్ఞమైనా దిగ్విజయమవుతుంది. ఈ సత్యం నాకు తెలుసు. అందుకే నేను ఒక్కరుగా తెలంగాణ సాహిత్య చరిత్ర రచనకు ముందుకు రాలేదు. పలువురు నిపుణులైన పరిశోధక మిత్రులు వారివారి అభిరుచులున్న అంశాలపై సమగ్ర అధ్యాయాలు రచిస్తే అపుడు మంచి సాహిత్య చరిత్ర వస్తుంది. అందుకే సామూహిక కృషివైపు దృష్టి సారించాను. ఇందుకు గతంలో “తెలంగాణ వైతాళికులు (మూడు సంపుటాలు)” సంపాదకత్వ బాధ్యతల అనుభవం నాకు బాగా ఉపకరించింది. జననేతలు, అక్షరమూర్తులు, ప్రతిభామూర్తులు అనే పేర్లతో­ వచ్చిన ’తెలంగాణ వైతాళికులు’ సంపుటాలకు యావత్ తెలంగాణలోనూ మంచి గుర్తింపు లభించింది. ఇందులో 130 మంది గొప్పవారి జీవన పరిచయాలు ప్రామాణిక వ్యాస రూపంలో ఉన్నాయి. తెలంగాణ వైతాళికులు సంపుటాల రూపకల్పనలో దాదాపు అరవైమంది రచయితలున్నారు. వీరిలో ప్రవర్ధమానులున్నారు. ప్రసిద్ధులూ ఉన్నారు. ప్రతిభావంతులైన వ్యాస రచయితలతో రచనలు చేయించడం ఎట్లా అన్నది తెలంగాణ వైతాళికులు ప్రచురణ నేపథ్యంలో అనుభవపూర్వకంగా అవగతమైంది.
“తెలంగాణ సాహిత్య చరిత్ర” రచన కోసం గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. నాకు తెలిసినంతవరకు ఇటువంటి నాలుగు యత్నాలు ఇప్పటివరకు జరిగాయి. అందులో ఒకటి పరిశోధనాత్మక దృష్టితో రచించినది. అయినా అందులో కవుల తాలూకు విశేషాలు స్వల్పంగాను, వారు రచించిన కావ్య ప్రబంధాలలోని పద్యాలు పదులు – వందలు సంఖ్యలోనూ ఉన్నాయి. ఇద్దరు పేరున్న విమర్శకులు సాహిత్య చరిత్ర గ్రంథాలు రచించినా అందులో సమగ్రత-ప్రామాణికత బాగా లోపించాయి. అచ్చంగా ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఒక సంస్థ తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రచురించినా అందులో పాక్షిక వైఖరి స్పష్టం. ఈ వాస్తవికతల్ని నేను పూర్తిగా అంచనాలోకి తీసుకున్నాను. ఆయా గ్రంథాలలోని లోపాలు ప్రస్తుత సంపుటాలలో ఉండకూడదని గట్టిగా భావించాను. నేను ఒంటరిగాను తెలంగాణ సాహిత్య చరిత్రను రచించవచ్చు. అయితే ఇందుకు సుదీర్ఘ కాలవ్యవధి అవసరమవుతుంది. అంతేకాదు సమగ్రత లోపిస్తుంది.
‘నీల్‍కమల్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును కలిగిన ప్రచురణ సంస్థ. అనేక సంవత్సరాలుగా విద్యా – వైజ్ఞానిక గ్రంథాలను ప్రచురిస్తున్నది. తెలుగు ప్రసిద్ధ సాహితీవేత్తలు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్ పోరంకి దక్షిణమూర్తి రచించిన గ్రంథాలను వెలువరించింది. నీల్‍కమల్ అధినేత సురేశ్ చంద్ర శర్మగారి మాతృభాష తెలుగు కాదు అయినా ఆయనకు తెలుగు భాషా సాహిత్యాల పట్ల అపారమైన అభిమానం. నేను “తెలంగాణ సాహిత్య చరిత్ర” రూపకల్పన కోసం ఆలోచిస్తున్న సమయంలోనే సురేశ్ చంద్ర శర్మ గారు నన్ను సంప్రదించారు. “తెలంగాణ సాహిత్య చరిత్ర”కు సంపాదకత్వం వహించాలని సాదరంగా కోరారు. నేను వెంటనే అంగీకరించాను.
ఒక ప్రామాణిక వ్యాస సంకలనం రావాలని గట్టిగా సంకల్పించుకున్నప్పుడు సంపాదకుడు ముందుగా కొన్ని ఖచ్చితమైన మార్గదర్శక సూత్రాలను ఏర్పరచుకోవాలి. వాటినుండి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాకూడదు. రాజీధోరణి అసలు పనికిరాదు. నేనూ తిరుగులేని ఖచ్చితత్వాన్ని పాటించాను. తొలుత వ్యాసాల క్రమాన్ని ఏర్పరచుకున్నాను. ఇందులో సలహా సంప్రదింపులు లేనేలేవు. నేను మాత్రమే ఒంటరిగా కూర్చుని నా ఆలోచనల్ని కాగితం మీద పెట్టడం ద్వారా జాబితా తయారైంది. ఇట్లా మొత్తం 32 అధ్యాయాలతో ఒక వరుస తయారైంది. తొలి వ్యాసం ’తెలంగాణ – తెలుగు వాఙ్మయం – విశేషాలు’ అయితే ముగింపు వ్యాసం ’మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం’ అన్నీ కలిపి మూడు సంపుటాలు – అవి : తెలంగాణ – సంప్రదాయ సాహిత్యం; తెలంగాణ – వివిధ సాహిత్య ప్రక్రియలు; తెలంగాణ – ఆధునిక సాహిత్యం – అంతా వేయిపుటలపైగానే ఉంటాయి. ఈ సంపుటాలు తెలంగాణ సాహిత్య చరిత్రలోని వివిధ ప్రక్రియలు, ఉద్యమాలు; వాదవివాదాలతోపాటు సాంస్కృతిక వికాస క్రమం కూడా ఇందులోని వ్యాసాలలో ఉంటుంది.
వ్యాస రచయితల ఎంపిక అన్నది ఎప్పుడూ కష్టమైన ప్రక్రియే. మనం నామకరణం చేసిన ప్రత్యేకమైన అధ్యాయాన్ని సమర్థవంతంగా రచించే రచయిత కావాలి. అ రచయితకు సదరు అంశం మీద గట్టి పట్టు అవసరం. గతంలో అతడు అ తరహా అంశంపై చిన్న – పెద్ద వ్యాసాలు రచించి ఉంటే మరింత మంచిది! ప్రస్తుత సాహిత్య చరిత్ర కోసం ముప్పై పుటల వరకు (చేతిరాతలో) వ్యాసాల్ని రచించగలిగినవారు కావాలి. గతంలో తెలుగులో ఎంతోమంది సమర్ధులైన వ్యాసరచయితలు ఉండేవారు. అయితే అదంతా గడిచిపోయిన కాలం. ఈ రోజుల్లో ఎవరూ రచనను గొప్పగా సాధన చేయడం లేదు. అందుకే వ్యాసకర్తల్ని గుర్తించడం కొంచెం ఇబ్బందిగా మారింది. ఇందుకు కొంచెం అదనపు సమయం కూడా అవసరమైంది. ఈ ఆలస్యం పట్ల సురేశ్ చంద్ర శర్మగారు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సంపాదకుడిగా నా పట్ల అయనకున్న విశ్వాసం అది. నేనూ తొందరపడలేదు. నాకు అందుబాటులో ఉన్న సమచారం మేరకు ఒక వ్యాసరచయితల జాబితాను తయారుచేసుకున్నాను. అందులో నుండి కొంతమందిని తుదివిడత జాబితాగా తయారుచేశాను. ఆయా రచయితల గత పరిశోధనల నేపథ్యాన్ని పరిశీలించాను. వారికి అవసరమైన అంశాల్ని ఒక చిత్తుప్రతిగా రాశాను. నాకు సంతృప్తి వచ్చేవరకు వీటిలో మార్పులు – చేర్పులు చేశాను. చివరకు ఒక సమగ్రమైన జాబితా తయారైంది. ఆయా అంశాల్లో నైపుణ్యం, రచనా క్రమంలో వారి సమర్థతల్ని ప్రాతిపదికలుగా చేసుకొని అంశాల్ని సూచించగలిగాను. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. కోవెల సంతోష్‍కుమార్, సీనియర్ పాత్రికేయులు, మంచి వ్యాసకర్త. ఇదివరకు తెలంగాణ పత్రిక మీద కొన్ని మంచి వ్యాసాలు రచించారు. ఆయనకు తెలంగాణ పత్రికల అంశాన్ని ఇచ్చాను. అట్లాగే హెచ్. రమేష్‍బాబు, తెలంగాణ సినిమారంగంపై సాధికారికత ఉన్న పరిశోధకులు. ఆయనకు తెలంగాణ సినిమా సాహిత్యాన్ని కేటాయించాను. వివిధ ప్రక్రియలపై నా ఎంపిక ఇదే పద్ధతిలో జరిగింది. డాక్టర్ బి.వి.ఎన్. స్వామి (కథానిక), డాక్టర్ ప్రమోద్ కుమార్ (నాటకం), డాక్టర్ నీహారిణి (నవల). డాక్టర్ కొత్తరెడ్డి మల్లారెడ్డి (గేయం) ఇట్లా జరిగిన ఎంపికలే. పలువురు వర్థమాన వ్యాసకర్తల్లో అపరిమితమైన ప్రతిభ ఉంది. సిద్థిపేటలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉన్న పన్నాల అంజిరెడ్డి ఇదే కోవలోనివారు. ఆయనకు ద్విపద కవిత్వాన్ని సూచించాను. నీల్‍కమల్ సంస్థ తరపున వారందరికీ ప్రాథమిక సమాచారం అందింది.
వ్యాసకర్తలు తమదైన స్వేచ్ఛాప్రవృత్తిలో రచనలు పంపిస్తే గ్రంథ ప్రచురణ లక్ష్యం బలహీనపడే అవకాశం ఉంటుంది. అందువల్ల వారికి వ్యాసాన్ని ఏ రీతిలో రచించాలనే దానిపై ఒక సూచన పత్రాన్ని తయారుచేశాను, సంపాదక బాధ్యతలో నేను చేసిన వినూత్నమైన పని ఇది. ప్రతి రచయితకూ ఒక్కొక్క సూచన పత్రాన్ని పంపించడం జరిగింది. వీటన్నింటిని నేనే రూపొందించాను. అందులో ఆయ వ్యాసాల్ని ఏ రకమైన ఎత్తుగడతో ప్రారంభించాలి? వ్యాసక్రమం ఎట్లా ఉండాలి? ముగింపులో పాటించవలసిన మెళకువలు ఏవి? – ఇట్లా సకల అంశాల్ని నిర్దిష్టంగా సూచించాను. చివరలో వారు విధిగా సంప్రదించవలసిన గ్రంథాల జాబితాను ఇచ్చాను. ఒకవేళ ఆ సూచనల్ని పాటించక వ్యాసాలు పంపితే దాన్ని మా ప్రచురణలకు అనుగుణంగా మార్చుకోవలసి వస్తుందని కూడా తెలియజేశాను. రచయితలు నాపట్ల అభిమానంతో ప్రచురణకర్తలమీద గౌరవంతో సూచన పత్రంలోని మార్గదర్శకాల్ని తు.చ. తప్పకుండా పాటించారు. వారికి నా ధన్యవాదలు తెలియజేయడం నా ధర్మం.
సంపుటాల వ్యాసాలు తొందరగా అందవు. రచయితలు వేరువేరు పనుల ఒత్తిడిలో ఉండవచ్చు లేదా వ్యాసాన్ని రచించడాన్ని వాయిదా వేస్తూ రావచ్చు. వ్యాస సంకలనాలు సజావుగా ముద్రణ అవుతాయా లేదా అన్న సందేహాలు కూడా వారిలో ఉండవచ్చు. ఇవన్నీ సహజమైనవే. ఈ మానసిక కోణం నుండి కూడా ఆలోచించాను. వ్యాసాలను తొందరగా పంపించవలసిందిగా రచయితలకు ఫోన్ కాల్స్ వెళ్ళేవి. ప్రచురణ సంస్థ సిబ్బంది ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. నేను కూడా నా పరిచయాల్ని ఆధారంగా చేసుకొని రచయితలతో సంప్రదింపులు జరిపాను. వారు పలుమార్లు సందేహాలకు సమధానాలు కోరారు. నేను వారికి ఓపికగా జవాబులు చెప్పాను. వ్యాససంకలనాలు తప్పకుండా వెలువడతాయనే విశ్వాసం ఏర్పడిన తరువాత మాత్రమే రచనలు రావడం మొదలైంది. తొలి వ్యాసాన్ని రచించిన వారు నాకు గురుతుల్యులు, ప్రముఖ జానపద విజ్ఞానవేత్త ఆచార్య జి.ఎస్. మోహన్. ఆయన ఏడుపదుల వయసు దాటిన సాహితీవేత్త. బెంగళూర్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ఆచార్యులు. జానపద సాహిత్యం మీద సర్వసమగ్రమైన వ్యాసాన్ని పంపించారు. తెలంగాణ సాహిత్య చరిత్ర ప్రచురణను సంకల్పించిన తరువాత ఏడాది కాలవ్యవధికి తొలి వ్యాసం అందింది. కలకాలం నిలబడే పుస్తకాలు రావాలంటే ఎంత సహనం అవసరమో అనుభవం ద్వారా అర్థమైంది.
వ్యాసాలు ఒక్కొక్కటిగా అందడం ఆరంభమైంది. నిజం చెప్పాలంటే కొన్ని వ్యాసాలు తీర్చిదిద్దిన శిల్పంవలె ఉన్నాయి. మరికొన్ని వ్యాసాలు చెక్కవలసిన శిల్పం స్థాయిలో కన్పించాయి. మొదటి తరగతి వ్యాసాల్లో పెద్దగా మార్పులు – చేర్పులు అవసరం లేదు. రెండవ తరహా వ్యాసాలను మార్పులు చేయకుండా ప్రచురించడం సాధ్యం కాని పని. అందుకే వీటిని ఒకటికి రెండు-మూడు-నాలుగు సార్లు కూడా సరిచేయవలసి వచ్చింది. వ్యాసాలు మరీ పరిధి పెంచుకుంటూపోవడం, కొన్ని వ్యాసాలు ఊహలకు కూడా అవకాశాన్ని కల్పించడం, ఇంకా కొన్ని వ్యాసాల్లో వ్యావహారిక గ్రాంథిక భాషా సమ్మేళనం వంటి లక్షణాలు కనిపించాయి. వీటన్నింటినీ ఓపికతో సరిచేయవలసి వచ్చింది. కొంతమంది ప్రముఖులు సైతం లోతుగా వ్యాసాలు రచించకపోవడం కొంతమేరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే పలువురు వర్ధమానులు అద్భుత వ్యాసాల్ని రచించడం ఆనందానికి కారణమైంది. కొందరు ఆధార గ్రంథాల సమగ్ర జాబితాను చేర్చారు. ఇంకా కొంతమంది పాదసూచికల్ని కూడా చేర్చారు. వీటిలో ఏవైనా లోటుపాట్లు కనబడితే వాటిని వెతికేందుకు సమయం పట్టింది.
రెండవ దశలో వ్యాసాలలో ఎక్కడా ముద్రణాదోషాలు అంటే అచ్చుతప్పులు లేకుండా చూడడం లక్ష్యంగా మారింది. కొందరు వ్యాసకర్తలు డి.టి.పి చేసి పంపించారు. అయినా ప్రచురణకర్తలు తమ సంప్రదాయానికి అనుగుణంగా వాటిని తిరిగి టైప్ చేయించారు. మరికొందరు చేతివ్రాత ప్రతుల్ని పంపించారు. వీటిని శ్రద్ధగా డి.టి.పి చేయించడం పూర్తి అయింది. అయితే డి.టి.పి ప్రతుల్లో అనేకచోట్ల అక్షరదోషాలు ఉంటాయి. ఇది సహజమే. అనేక పర్యాయాలు ప్రూఫ్ రీడింగ్ చేయించడం ద్వారా అక్షర దోషాల్ని తొలగించాము. దాదాపుగా వీటిని నిర్మూలించగలిగామని కూడా చెప్పగలను. వ్యాసాలు సాహిత్యాభిమానులందరికీ అందుబాటులో ఉండాలి. అందువల్ల అంశాన్ని సూచించే నిర్దిష్టమైన, ఉపశీర్షికలు (subheadings) ఏర్పర్చాను. ఎక్కడైనా అవసరమైతే ‘ఫాంట్’ స్థాయిని పెంచాను. ఈ సాంకేతిక మార్పులవల్ల వ్యాసం భౌతిక స్థితిలోనూ పాఠకుడిని ఆకట్టుకుంటుంది. వ్యాసంలో అవసరమైన అంశాల్ని తొలగించడం ఇదే క్రమంలో జరిగింది. ఇదొక సమగ్ర సాహిత్య చరిత్ర. ఇందులో వివాదస్పద అంశాలకు చోటు ఉండకూడదు. ఏ వ్యాసంలో ఎక్కడా వివదాస్పద విషయం లేకుండా జాగరూకత వహించాను.
సమగ్ర సాహిత్య చరిత్ర మూడు సంపుటాలుగా ఉండాలని నేను – ప్రచురణకర్త ముందుగానే నమూనా పెట్టుకున్నాము. అయితే ఈ సంపుటాల పరిధి ఏమిటి? అన్నది అన్ని వ్యాసాలు అందిన తరువాత అవగహనలోకి వచ్చింది. తొలి సంపుటం సంప్రదాయ సాహిత్యం. ఇందులో మహాకవి పోతనకు సంబంధించిన వ్యాసం ఉండాలన్నది నా సంకల్పం. అందుకు అనుగుణంగా పోతనపై వ్యాసం చేర్చాను. మరే ఇతర తెలుగు కవికీ ఇటువంటి ప్రత్యేక వ్యాసం లేదు. అవధానం ఇటీవలి కాలంలో బాగా ప్రచారాన్ని పొందినా అది మౌలికంగా సంప్రదాయ వాసనలున్న ప్రక్రియ. అందుకే దీన్ని సంప్రదాయ సాహిత్య సంపుటంలో చేర్చాను. సంస్థాన సాహిత్యంలోనూ సంప్రదాయ ముద్ర బలంగా ఉంటుంది. దీనితో అదికూడా ఇందులో చేరిపోయింది.
రెండవ సంపుటం వివిధ సాహిత్య ప్రక్రియల్ని పరిచయం చేసింది. యక్షగానంతో ప్రారంభమై పరిశోధనలతో ముగిసింది. ఇందులో వ్యాసం, నవల, కథ, నాటకం, పత్రికారచన, గేయం, విమర్శ ఇట్లా పలు అంశాలు ఉన్నాయి. నేను రాసిన ఒక వ్యాసంతోపాటు మొత్తం మూడు వ్యాసాలు తెలంగాణ సాంస్కృతిక చరిత్రను గాఢంగా పరిచయం చేశాయి. ఇట్లా సమగ్రత చేకూరినట్లయింది. వ్యాసాలలో ఫుల్‍స్టాప్, కామాల దగ్గర నుండి ప్రతి అంశాన్ని సరిదిద్ది ప్రచురించాము.
ఆధునిక సాహిత్యం మూడవ సంపుటి, ఇందులో అభ్యుదయ, విప్లవ, దిగంబర, చేతనవర్త, దళితవాద, విప్లవ సాహిత్యాల విశ్లేషణ ఉంది. ఆధునిక సాహిత్యాన్ని ఇందులోని వ్యాసాలు ఎంతో లోతుగా విశ్లేషించాయి.
సంపుటాలకు సుప్రసిద్ధ సాహితీవేత్తలతో ముందుమాటలు రచింపజేశాము. ఈ ముందుమాటలు అభినందన మందారలు, మహదాశీర్వచనాలు. సంప్రదాయ సాహిత్యానికి ఆచార్య రవ్వాశ్రీహరి, సాహిత్య ప్రక్రియలకు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆధునిక సాహిత్యానికి ఆచార్య ఎస్వీ రామారావు మంచి ముందుమాటలు రచించారు. మా ప్రయాత్నాన్ని హార్దికంగా అభినందించారు. వారికి వినయపూర్వక నమస్సులు.
పుస్తక ప్రచురణ అవసరాన్ని గురించి చెబుతూ “ఈ తరానికి అవసరం మన సాహిత్యం” అనే పేరుతో నేను ముందుమాట రాశాను. గ్రంథ ప్రచురణ లక్ష్యాన్ని ఇందులో నేను సవివరంగా తెలియజేశాననే భావిస్తున్నాను.
ఈ రోజు తెలుగు సాహిత్యం తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నదని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమైన దశలో ఏర్పడిన పట్టుదల వల్ల వివిధ ప్రక్రియల్లో మంచి రచనలు వెలువడ్దాయి. అట్లానే సాహిత్య పరిశోధనలు పెరిగాయి. 2017 నాటి ప్రపంచ తెలుగు మహాసభల స్పూర్తితో తెలంగాణ ప్రాంతంలో తెలుగుభాషా సాహిత్యాలకు పునర్‍వైభవం వస్తున్నదనే అభిప్రాయం వినిపిస్తున్నది. తెలంగాణేతర ప్రాంతాలవారు కూడా ఇక్కడి సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తితో ఉన్నారు. ఈ కీలక దశలో సాహిత్యాభిమానులకు ఒక సమీకృత సాహిత్య చరిత్ర అవసరం. ఈ ఆవశ్యకతను మా పుస్తకాలు తీర్చగలవనే నమ్మకం మాకు ఉన్నది. పుస్తకానికి లభిస్తున్న ప్రశంసలు మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. రెండు సంవత్సరాలు తపోదీక్షగా చేసిన కృషికి మంచి స్పందన లభించడం అమితానందాన్ని కలిగిస్తున్నది.
1990వ దశాబ్ది ప్రారంభంలో ఇంకా ఎవరూ తెలంగాణ సాహిత్యంపై పరిశోధనాత్మక దృష్టి సారించని రోజుల్లోనే నాకు ఈ అంశంమీద ఆసక్తి కలిగింది. 1991లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో “తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యం – పత్రికల పాత్ర” అనే అంశంపై పి.హెచ్‍డి ప్రారంభించాను. నాకు పర్యవేక్షకులుగా ఉన్న గురువుగారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మహోదయులు సదా ఆదరణీయులు. 1996లో నా పి.హెచ్.డి పూర్తి అయింది. ఈ గ్రంథంలోని కీలకాంశాలతో 2004లో “తెలంగాణ పత్రికలు” అనే పుస్తకం ప్రచురణ పొందింది. అట్లాగే “తెలంగాణం – తెలుగు మాగాణం” అనే పేరుతో 2003లో రచించిన గ్రంథం నీల్‍కమల్ ద్వారా 2015లో పునర్ముద్రణ పొందింది. 2008లో ”ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ” పేరుతో నేను రచించిన పరిశోధనాత్మక గ్రంథం నాకు గుర్తింపును తీసుకొని వచ్చింది. రెండు సంవత్సరాలనాటి ”తెలంగాణ వైతాళికులు” మూడు సంపుటాలు సంపాదకుడిగా నాకు మంచి పేరును తీసుకొని వచ్చాయి. ఈ దిశలో వెలువడిన తాజా రచన “తెలంగాణ సాహిత్య చరిత్ర”
ఒక ప్రామాణిక గ్రంథం వెలువడేందుకు ఎంతో నిశితమైన వీక్షణం, అవసరమైనంత సహనం అవసరమని “తెలంగాణ సాహిత్య చరిత్ర” అనుభవాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో గ్రంథాలు వెలువరించేవారు ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను.
‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ సారస్వతాభిమానుల ఆదరాన్ని అందుకోగలదనే నమ్మకం నాకు బలంగా ఉంది.

***

తెలంగాణ సాహిత్య చరిత్ర
(తెలంగాణ – ఆధునిక సాహిత్యం, రూ.350/-),(తెలంగాణ – వివిధ సాహిత్య ప్రక్రియలు – రూ.395/-),
(తెలంగాణ – సంప్రదాయ సాహిత్యం, రూ. 300/-)
ప్రచురణ: నీల్‌కమల్, హైదరాబాద్
ప్రతులకు:
నీల్‌కమల్‌ ప్రచురణలు, కోఠి;
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here