[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా నందితా దాస్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఫిరాక్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘ఫిరాక్’ (హిందీ /ఉర్దూ /గుజరాతీ)
సమాంతర సినిమాలకి నందితా దాస్ కొత్త స్వరూపాన్నిసంతరింప జేసిన, సామాజిక బాధ్యత గల నటి, దర్శకురాలు. ‘ఫైర్’, ‘ది ఎర్త్’ వంటి సంచలన సినిమాలతో నటిగానూ; ‘ఫిరాక్’, ‘మంటో’ లతో దర్శకురాలిగానూ జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలందుకుంది. ఫ్రాన్స్ దేశం అత్యున్నత పౌర పురస్కారంతో ఆమెని సత్కరించడమే గాక, ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. సత్యజిత్ రే, శ్యాం బెనెగళ్, మృణాల్ సేన్, గోవింద్ నిహలానీ, దీపా మెహతా, నగేష్ కుకునూర్, ఆదూర్ గోపాలకృష్ణన్, మణిరత్నం, ప్రకాష్ ఝాల వంటి ప్రసిద్ధ దర్శకులతో నటనా పటిమ నిరూపించుకుంది. ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, మరాఠీ, రాజస్థానీ, ఒడియా, గుజరాతీ, మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల సమాంతర సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించింది. తెలుగులో నటించిన ‘కమ్లి’కి ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పొందింది. సామాజిక సేవలో ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి మాస్టర్స్ చేసిన తను, ఎక్కువగా బాలల హక్కుల కార్యకర్తగా పనిచేసింది. దర్శకురాలిగా స్థిరపడాలన్న ఆలోచన ఆమెకి లేదు. అందుకే 2008లో ‘ఫిరాక్’కి దర్శకత్వం వహించాక, 2019లో మాత్రమే రెండో ప్రయత్నంగా ‘మంటో’ కి దర్శకత్వం వహించింది. తాజాగా 2019 లోనే ‘ఆల్బర్ట్ పింటోకో గుస్సా క్యో ఆతాహై’ రీమేక్ లో నటించింది.
2002 గుజరాత్ మత హింస మీద రాహుల్ ఢొలాకియా తీసిన ‘పర్జానియా’ (2007) వివాదాస్పదమైంది. మత హింసలో అదృశ్యమైన పదమూడేళ్ళ అజర్ మోడీ అనే పార్శీ బాలుడి కథగా వున్న ఈ సమాంతర సినిమాని విడుదల చేయడానికి థియేటర్ల యాజమాన్యాలు ఒప్పుకోలేదు. అదే 2008లో ఇదే మత హింస మీద నందితా దాస్ తీసిన ‘ఫిరాక్’ ఎలాటి వివాదాలూ ఎదుర్కోలేదు. మత హింస గురించి తీసిన సినిమాలో మత హింసే లేకపోవడం విశేషంగా కనపడింది జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకి. మళ్ళీ మత హింసే చూపడం ఆమె ఉద్దేశం కాదు, మత హింస ముగిసిన నెల తర్వాత జన జీవితమెలా వుందో చిత్రించడమే ‘ఫిరాక్’కి ఆమె తీసుకున్న కథ. నాలుగు కుటుంబాలతో ఈ కథ ఇరవై నాల్గు గంటల్లో జరుగుతుంది.
హనీఫ్ కుటుంబం
ఒక కుటుంబం హనీఫ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) అనే ఆటో డ్రైవర్‌ది. ఇతను హింస మొదలవడంతో వేరే వూరెళ్ళి పోయి ఇప్పుడు భార్య మునీరా (షాహెనా గోస్వామి) తో, చంటి బిడ్డతో ఇంటి కొస్తాడు. వస్తే ఇల్లు కాలిపోయి వుంటుంది. ఇంట్లో ఏమీ మిగలదు. ఆ కోపంతో మునీరా మీద అరుస్తాడు. మునీరాకి ఒక గొలుసు దొరుకుతుంది. ఆ గొలుసు మిత్రురాలు జ్యోతి (అమృతా సుభాష్) దని గుర్తు పడుతుంది. జ్యోతి గొలుసు ఇక్కడెందుకుందని ఆమెని అనుమానించడం మొదలెడుతుంది. ఇల్లు తగలబెట్టిన దుండగులతో జ్యోతి వుందా? ఇంత ద్రోహం తలపెట్టిందా? కానీ మునీరా ఇంటి పరిస్థితి చూసి జ్యోతి సాయపడుతూంటుంది. ఒక పెళ్లింట్లో గోరింటాకు పెట్టేందుకు పిలుపొచ్చిందని, ఐదు వేలు ఇస్తారనీ చెప్పి తీసుకు పోతుంది. తీసుకుపోతూ తన బొట్టు తీసి ఆమెకి పెట్టేస్తుంది. ఆ పెళ్లింట్లో హిందువుల అమ్మాయిగా నమ్మించి గోరింటాకు కార్యక్రమం పూర్తి చేస్తుంది మునీరా. అక్కడ ఒక వర్గం గురించి ఆడవాళ్ళు మాట్లాడుకునే మాటలకి ఏమీ అనలేక దిగమింగుకుంటుంది.
బాగా రాత్రయి ఇంటికి పోతూంటే పోలీసులు ఆపుతారు. వాళ్ళ బారినుంచి సురక్షితంగా ఇంటికి తీసుకుపోకుండా, తనింటికి తీసుకుపోతుంది జ్యోతి. మునీరా భర్త కోసం పోలీసులు వెతుకుతున్నారని అంటుంది. మునీరా కంగారు పడుతుంది. ఇక వుండబట్టలేక జ్యోతి మీద తనకున్న అనుమనం వెళ్ళగ్రక్కేస్తుంది. జ్యోతి అవాక్కవుతుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య సంక్షోభం ఎలా ముగిసిందన్నది మిగతా కథ.
అటు ఇల్లు కాలిన హనీఫ్ ఇంకో నల్గురు బాధిత ముస్లిం కుర్రాళ్ళతో కలిసి, హిందువుల మీద పగదీర్చుకోవడానికి పిస్తోలు సంపాదిస్తాడు. అందులో ఒకే తూటా వుంటుంది. కానీ నల్గురికి నాల్గు తూటాలు కావాలి. ఆ ఒక్క తూటా కోసం గొడవపడ్డంతో అది కాస్తా పేలుతుంది. ఈ శబ్దం గస్తీ పోలీసులు విని రావడంతో పారిపోతారు. పారిపోతూ తమ వెంట వున్న మొహిసిన్ (మహ్మద్ సమద్) అనే పదేళ్ళ బాలుడ్ని తీసుకుని పారిపోతారు. ఈ సమస్య ఎలా ముగుస్తుందన్నది మిగతా కథ.
ఆరతి కుటుంబం
ఆరతి (దీప్తి నావల్) మధ్యతరగతి ఇల్లాలు. భర్త (పరేష్ రావల్) తో మానసిక, శారీరక హింస పడుతూ వుంటుంది. ఆమెకో దృశ్యం వెంటాడుతూ వుంటుంది. కిటికీలోంచి చూస్తూ సాయం కోసం అరుస్తున్న ముస్లిం స్త్రీ రూపం. ఆ రోజు తను తలుపు తీసి ఆమెని కాపాడలేదు. ఇది అపరాధ భావంగా మారి వేధిస్తూంటుంది. ఆ స్త్రీ గుర్తొచ్చినప్పుడల్లా వేడి వేడి నూనెతో చేతి మీద వాతలు పెట్టుకుంటూ వుంటుంది.
ఆమె మార్కెట్ కెళ్ళినప్పుడు పదేళ్ళ బాలుడ్ని చూసి, అనుమానం వచ్చి ఇంటికి తీసుకు వస్తుంది. తనింట్లో అందర్నీచంపేశారనీ, తండ్రి ఎటో పారిపోయాడనీ వాడు చెప్పుకుంటాడు. పేరడిగితే మొహిసిన్ (మహ్మద్ సమద్) అని చెప్పుకుంటాడు. ఆమె వెంటనే స్పందిస్తుంది. తను చేసిన తప్పుకి ఇదే ప్రాయశ్చిత్తమనుకుని వాడికి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. భర్తతో సమస్య రాకుండా వాడికి బొట్టు పెట్టి, ‘నువ్వు ఇంట్లో మోహన్‌వి, బయట మొహిసిన్‌వి’ అని నచ్చజెప్పి, ఆహారం పెడుతుంది. కొత్త పని పిల్లాడుగా తీసికెళ్ళి మామకి పరిచయం చేస్తుంది. ఇంతలో భర్త ఆమెని ఏదో వంకతో కొడతాడు. ఏడుస్తున్న ఆమెని చూసి మొహిసిన్ పారిపోతాడు. పారిపోతున్న వాణ్ణి నిస్సహాయంగా చూస్తుంది. పారిపోయిన మొహిసిన్ హనీఫ్‌కి దొరుకుతాడు. వాడి కథ ఏమైందనేది మిగతా కథ. ఇటు అరతి ఇక నిర్ణయం తీసుకుంటుంది. భర్త పిలిస్తే ఇంట్లో వుండదు. బయట ఆటోలో వెళ్ళిపోతూ వుంటుంది…
సమీర్ – అనూరాధల కుటుంబం
సమీర్ షేక్ (సంజయ్ సూరి) రిచ్ బిజినెస్ మాన్. అనూరాధా దేశాయ్ (టిస్కా చోప్రా) అతడి భార్య. ఒక హిందూ మిత్రుడి వ్యాపారానికి పెట్టుబడి పెట్టాడు. మత హింసలో ఆ వ్యాపారం తను ముస్లింగా పెట్టుబడి పెట్టాడు కాబట్టి దోపిడీకి గురైంది. కార్లలో తిరిగే డాబుసరి వ్యక్తులు కూడా దోచుకుని పోయారు. సీసీ టీవీలో ఆరతి భర్త సోదరుడు కూడా దోపిడీ చేస్తూ కనపడ్డాడు. తను కూడా ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితి లేదని భావిస్తాడు సమీర్. తన పేరే తనకి మచ్చలా వుందని బాధ పడతాడు. అపద్కాలంలో ‘సమీర్ దేశాయ్’ అని భార్య ఇంటి పేరు వాడుకుని భద్రత ఫీలవుతాడు. గుడి చందాలు అడుక్కోవడానికొచ్చిన వాళ్ళకి కూడా సమీర్ దేశాయ్ అనే చెప్తాడు. ఇది తనకే అవమానంగా వుందని భార్యతో గొడవ పడతాడు. పరిస్థితులు చక్కబడతాయనీ, ఢిల్లీకి మారాల్సిన అవసరం రాదనీ ఆమె వాదిస్తుంది. ఆ రాత్రి బయట ఏమైనా తినడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆపితే, ‘సమీర్’ అని పేరు చెప్తాడు. భార్య పేరు కూడా చెప్తాడు. పోలీసు అధికారి ఏమీ అనడు. ఇక ధైర్యం చేసి తన పేరు ‘సమీర్ షేక్’ అని పూర్తి పేరు చెప్పేస్తాడు. పోలీసు అధికారి అదోలా చూసి, ‘ఐతే పాకిస్తాన్ కి ఫో!’ అంటాడు. సమీర్ – అనూరాధల పరిస్థితి ఎలా చక్కబడిందన్నది మిగతా కథ.
ఖాన్ సాబ్ కుటుంబం
ఖాన్ సాబ్ (నసీరుద్దీన్ షా) కి కుటుంబం అంటూ ఏమీ లేదు. హిందూస్థానీ సంగీత కారుడైన తనకి శ్రోతలే కుటుంబం. ఈ మధ్య ఆ శ్రోతలు రావడం లేదే అన్న విచారంతో వుంటాడు. ఊరంతా ఏడుస్తూంటే ఈయన సంగీతం అంటాడేమిటాని పనివాడు కరీం (రఘువీర్ యాదవ్) విసుక్కుంటూ సేవలు చేస్తూంటాడు. అసలు శిష్యులుగా ముస్లిములు ఎందుకు రావడం లేదన్న ప్రశ్నతో కూడా వుంటాడు ఖాన్ సాబ్. మతాచార ముస్లిములకి సంగీతం నిషేధమా అనుకుంటాడు. హిందూ శిష్యుడికి రాగాలు నేర్పుతూంటాడు. అతడి కూతురికి తన దగ్గరున్న మాండలిన్‌ని బహుకరించాలనుకుంటాడు. ఈయన రోజంతా ఇంకెలా గడిపాడు, రాత్రి ఏం జరిగి వూళ్ళో వున్న పరిస్థితితో స్పృహలో కొచ్చి, ఏం చేశాడన్నది మిగతా కథ.
ఏకపక్షమా?
ఈ నాల్గు కుటుంబాల కథలు విడివిడిగా సాగి విడి విడిగానే ముగుస్తాయి. దేనికీ మరోదాంతో సంబంధముండదు. సాధారణంగా నాల్గైదు కథలతో ఆంథాలజీగా వుండే సినిమాల్లో కథలన్నీ చివర్లో ఒక సామాన్యాంశంతో ముగిసేవిగా వుంటాయి. ఇక్కడలాలేదు. ఎందుకంటే సినిమాలు తీయడానికి రూల్సేవీ లేవని దర్శకురాలు చెప్పింది. కాబట్టి రొటీన్ ఆంథాలజీలకి విభిన్నంగా ఇది వుంటుంది. రూల్స్‌ని బ్రేక్ చేసి ఇదే బావుందన్పించేలా వుంటుంది. ప్రతీ కథా సహజత్వం ఉట్టి పడుతూ వుంటుంది. పాత్రలు నిజ వ్యక్తులుగా కళ్ళ ముందుంటాయి. వాటి భాషల్ని బట్టి హిందీ ఉర్దూ గుజరాతీ మాట్లాడతాయి. పాత్రల్లో నటులెవరూ కృత్రిమంగా కన్పించరు. నసీరుద్దీన్ షా, దీప్తీ నావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్, రఘువీర్ యాదవ్, అమృతా సుభాష్, సంజయ్ సూరి, టిస్కా చోప్రా అందరూ… ముఖ్యంగా బాలనటుడు మహ్మద్ సమద్ అత్యంత ప్రతిభావంతంగా నటించి అంతర్జాతీయ ప్రేక్షకుల/విమర్శకుల దృష్టిలో పడ్డారు.
దృశ్య చిత్రీకరణలో దర్శకురాలు అత్యంత సున్నితత్వాన్ని ప్రదర్శించింది. ఆంథాలజీ పరంగా కథలతో రూల్స్ బ్రేక్ చేయడమే కాదు, హింసకి సంబంధించిన సినిమాలో హింస అవసరం లేదన్న కొత్త రూలుతో ఈ సమాంతర సినిమాని సమున్నతం చేసింది. లైటర్ వీన్ సినిమాలంటూ వస్తూంటాయి. ఇది తొలిసారిగా హింసతో లైటర్ వీన్ సినిమా అనుకోవాలి. కొత్త దర్శకులు నేర్చుకోదగ్గ క్రాఫ్ట్.
ఈ సినిమా ఒకవర్గంపై సానుభూతితో ఏకపక్షంగా వుందని విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాస్తవికంగా జరిగిన కల్లోలమే ఏకపక్షంగా వుందని విశ్లేషించింది దర్శకురాలు నందితా దాస్. అలా ఇందులో యంత్రాంగం కూడా ఆ వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరించే దృశ్యాలిందులో వున్నాయి. ఇలాటి పరిస్థితుల్లో అభయమివ్వాల్సిన పోలీసులే బాధ్యత మరచి భయభ్రాంతులకి గురిచేస్తూంటే బాధితులకి దిక్కెక్కడ?
ప్రసిద్ధ రవి కే. చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, పీయూష్ కనోజియా – రజత్ ఢొలాకియాల సంగీతం, గుల్జార్ గీతాలూ ఉన్నతంగా వున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఇరవై అవార్డులు పొందిన ‘ఫిరాక్’కి రచన నందితా దాస్ – శుచీ కొఠారీ. ‘ఫిరాక్’కి వేర్పాటు అనీ, అన్వేషణ అనీ అర్థాలున్నాయి.