కొంచెం తీపిగా ఎక్కువ కారంగా “చట్నీ”

0
3

[box type=’note’ fontsize=’16’] “కొత్తగా లఘు చిత్రాలు తీసేవారికి ఇది చూడడం తప్పకుండా ఉపయోగకరంగా వుంటుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషిచట్నీ‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] వారం నేను చూసిన సినెమా “అల వైకుంఠపురంలో”. దాని మీద ఏమీ వ్రాయబుద్ధి కాలేదు. తర్వాత కొన్ని లఘు చిత్రాలు చూశాను. లఘు చిత్రాలు తీసేవారికి బోల్డంత స్వేచ్చ వుంటుంది, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే వీలుంటుంది, చెయ్యాలనుకునే ప్రయోగాలు చెయ్యడానికి వీలు చిక్కుతుంది. కాని ఎందుకో చాలా మంది బాలీవుడ్ కి నకళ్ళుగానే తీస్తున్నారు. ఇక ఈ వారం సినెమా మీద ఏమీ వ్రాయలేనేమో అనుకుంటూ, చూశాను 2016 లో వచ్చిన ఈ లఘు చిత్రం “చట్నీ”.

మోడల్ టౌన్ ఏమాత్రం పెద్దదనీ, ఎవరు ఏం తిన్నారు ఏం… అంటాడు వొకతను ఆ సాయంత్రపు పార్టీలో. వీర్జీ (ఆదిల్ హుసేన్) ష్.. అంటూ అతని నోరు మూయిస్తాడు. మరో పక్క ఆడవారి గుంపు. వీర్జీ భార్యను(టిస్కా చోప్రా) ఘాజియాబాద్ రోజులనుంచీ ఎరుగుదును, మాటకారి, కథలు బాగా చెబుతుంది అంటుంది వొకామె రసికా దుగల్ తో. అంత మంది మధ్య కూడా రసికా, ఆదిల్ దొరికిన క్షణం పాటు కళ్ళతోనే వూసులాడుకుంటారు. ఆదిల్ ఆమె చెవి జుంకాని వేలితో స్పృశిస్తాడు. అది టిస్కా కంట పడుతుంది. రసికాను మర్నాడు తన ఇంటికి పిలుస్తుంది.

రసికా మర్నాడు వెళ్తే కూచోబెట్టి కబుర్లు చెబుతుంది టిస్కా. వంటవాన్ని పకోడీలు, కోలా తెమ్మంటుంది. వాడు ఆ కోలాలలో ఉమ్మి తీసుకెళ్తాడు, మరి వాడికి ఏ విషయంలో కసి వున్నదో? ఇక టిస్కా రసికాతో మాట్లాడుతూ తన భర్త, మరిది, ఇదివరకు పనిచేసిన వంటవాడు, అతని భార్య, తన ఇంటి ముందే పెంచుతున్న కూర ముక్కలు, వాటికి ఎరువుగా వేసే వంటింటి వ్యర్థాలు … అన్నీ చెబుతుంది. ఏ వ్యర్థాన్నీ మేము పారెయ్యం, మట్టికి సమర్పిస్తే సత్తువ కదా అంటుంది. అవతల నిలబడి ఈ కథ వింటున్న వంటవాడి మొహం పాలి పోతుంది. కెమెరా నెమ్మదిగా పైపైకి పోతుంది ఆ ఇద్దరు వ్యక్తులను ఆ వూరిమొత్తంలో కలిసిపోయేదాకా.

ఇది సస్పెన్స్ కథ. కాబట్టి చెప్పను. మీరే చూడండి, యూట్యూబ్ లో. టిస్కా చెప్పిన కథలు అబధ్ధమా? ఆమెకు కథలు చెప్పడం బాగా వచ్చని వొకామె మొదట్లోనే చెప్పినట్టు. కేవలం రసికా ని భయపెట్టడానికే కథను అప్పటికప్పుడు వండిందా? లేదా ఆమె చెప్పినదంతా నిజమా? వంటవాని చొక్కా బొత్తాలు నెమ్మదిగా విప్పుతూ అదేదో బాగా అలవాటైన విషయం అయినట్టు; అలా విప్పుతూనే భర్తతో అంటుంది : ఇంకా లోతు కావాలి, లేకపోతే వాసన వస్తుంది, అదేదో అనుభవానంతరం కలిగిన జ్ఞానం లా. ఏ విధంగా కథను అర్థం చేసుకున్నా దానికి తగ్గట్టే కనిపిస్తుంది కథనం.

ఇది జ్యోతి కపూర్ దాస్ మొదటి ప్రయత్నమట. ఈ పేరు గుర్తు పెట్టుకుని ఇంకా ఏమేమి చిత్రాలు తీసిందో చూడాలి. నాకు ఇది కొత్త పేరే. ఆమె దర్శకత్వం చాలా బాగుంది. ఆమె తర్వాత మెచ్చుకోవాల్సింది టిస్కా చోప్రాని. అందమైన ఆ ముఖాన్ని మేకప్ చేసి అందాన్ని తగ్గించారు. మొట్టమొదటి సీన్ లో ఆమెను గుర్తు పట్టలేనంత. ఆమె మంచి నటి, అయినా నాకు ఫిర్యాదు ఉండేది, ఆమె అన్నిట్లో వొకేలా చేస్తుందని. కాని నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ చిత్రంలో ఆమె అభినయం చాలా ప్రభావవంతంగా వుంది. ఇక్కడ కొంత జ్యోతి గురించి కూడా చెప్పాలి. వొక పక్క టిస్కా చేత మౌఖికంగానే కథ చెప్పిస్తూ, మధ్య మధ్యలో క్లుప్తంగా నైనా ఆయా దృశ్యాల రూపకల్పనలో టిస్కా స్వరం, హావభావాలతో సమాంతరంగా కథను చెప్పడం. వీళ్ళిద్దరి కోసం తప్పకుండా చూడమని చెబుతాను ఈ చిత్రం. సస్పెన్స్ కారణంగా నా చేతులు కట్టేసినట్టు వుంది, ఎక్కువ చర్చ చేయకుండా.

కొత్తగా లఘు చిత్రాలు తీసేవారికి ఇది చూడడం తప్పకుండా ఉపయోగకరంగా వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here