జీవన రమణీయం-95

0
9

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

వాళ్ళ ఇంట్లో, బన్నీ, ఆయన రెండో కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కి కూడా నన్ను పిలవలేదు! మేం FICCI అనే మీట్‌లో రెండు రోజులు మేరియట్ హోటల్‌లో కలిసాం. నా పేరు ఆయనే సూచించారని తెలిసింది. కానీ నాతో మాట్లాడలేదు. ఆయనే కీ నోట్ స్పీకర్. చంద్రసిద్ధార్థ, కూచిపూడి వెంకట్, నీలకంఠ, మేం అంతా ఒకే చోట కూర్చుని ఆయన మాట్లాడ్తుంటే విన్నాం. లంచ్ బ్రేక్‌లో అందరికీ ఓపెన్ ఎయిర్‌లో లంచ్ ఏర్పాటు చేసారు. నేను చందూ వాళ్ళతో వెళ్తుంటే, అరవింద్ గారు జనాన్ని తప్పించుకుంటూ నా వైపు వచ్చి, “will you please join us for lunch?” అన్నారు.

నేను ఆశ్చర్యపోయాను. ఆయన రమ్మని తనతో ప్రత్యేకంగా, వి.ఐ.పీస్‌కి ఎరేంజ్ చేసిన చోటుకు తీసుకెళ్ళారు. అక్కడ కమల్‌హాసన్ దగ్గరకి నేరుగా తీసుకెళ్ళి “she is a writer… Ramani… your fan” అని పరిచయం చేసారు. నేను షాక్‌లో నమస్కారం పెట్టాను.

కమల్ హాసన్ కూడా నమస్కారం పెట్టారు. ఆ తర్వాత, “ప్లీజ్ టేక్ సీట్ మేమ్” అంటే అతని పక్కనే కూర్చుని భోం చేసాను… సురేష్ బాబు అయ్యప్పమాలలో వున్నారు. ఆయన “నేనూ, మీరూ వెజిటేరియనేగా… రండి” అన్నారు. అక్కడ వెజిటేరియన్స్‌కి ఫుడ్ చాలా తక్కువగా వుంది! నేనేం తిన్నానో నాకు తెలీదు.. పదో క్లాసు నుండీ చూడాలని కలవరించిన కమల్ హాసన్ నా పక్కనే కూర్చుని భోం చేస్తున్నా పట్టించుకోలేదు! అరవింద్ గారు… జరిగిన గొడవ్ పేచప్ చేసుకుని ఇది వరకులా స్నేహంగా మాట్లాడ్తారా ఇక నుండీ… లేక వూరికే ఇదంతా షో ఆఫా? అని నాలో నేనే తర్కించుకుంటున్నాను. ఇంతలో అరవింద్ గారు లేచి ఆయన కొడుకులతో ఫొటోస్ తీయించుకోవడంలో బిజీ అయిపోగానే, నేను చెయ్యి కడుక్కుని కిందకి వచ్చేసాను… అలా ఒక అపురూపమైన అనుభూతి నా అభిమాన నటుడితో పోగొట్టుకున్నాను… నిజంగా ఆ రోజు ఎందుకో, ఎవరైనా పలకరిస్తే ఏడ్చేట్టు వున్నాను కానీ… అదెంత అపురూపమైన అద్భుతమైన సంఘటన? మాటల మధ్యలో నేనెప్పుడో “నా అభిమాన నటుడు కమల్ హాసన్” అన్నందుకు గుర్తు పెట్టుకుని, అరవింద్ గారు అలా నన్ను తీసుకెళ్ళి, ప్రత్యేకంగా పరిచయం, స్పెషల్ లంచ్ రూమ్‍లో, అతనితో పక్కన కూర్చుని భోం చేసే అదృష్టం కల్పించారు… కింద వందమందికి పైగా సినిమా ఇండస్ట్రీలో చాలా పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళు ప్లేట్ పట్టుకుని బఫెలో నిలబడి తింటుండగా. కాని అప్పటి వయసూ, మానసిక పరిణతీ తక్కువ అవడం వల్ల వుక్రోషం, దుఃఖంతో ఆ సంఘటనని ఎంజాయ్ చెయ్యలేకపోయాను! కనీసం ఒక ఫొటోతో అయినా భద్రపరుచుకోలేకపోయాను.

ఈ సంఘటన అయ్యాకా కూడా అరవింద్ గారు నాతో మాట్లాడలేదు! నా మెసేజ్‌లకి రిప్లై ఇవ్వలేదు. నోరు తూలి మాట జారాను అని, అంత పెద్దవాడ్ని అని… నేను సారీ చెప్పినా మాట్లాడలేదు! కానీ పై సంఘటన వల్ల నా మీద కోపం లేదని తెలిసింది.

ఊటీలో నటుడు సాయికృష్ణతో రచయిత్రి

ఆ తర్వాత ఎంతకీ పెళ్ళిమాట తలపెట్టడని, సాయిక్రిష్ణని పెళ్ళి చేసుకోమని చెప్పమని వాళ్ళ అమ్మగారు నన్ను పోరేవారు. అతను ఇంకా సెటిల్ అవలేదు అనే తన నలభైయవ ఏటి దాకా చెప్తూనే వచ్చాడు… సడెన్‌గా ఓనాడు “నేను పెళ్ళి చేసుకుంటున్నాను అండీ” అని ఫోన్ చేసాడు.

నాకు చాలా సంతోషంగా అనిపించింది. “నీ పెళ్ళికి మాత్రం నేను తప్పకుండా వస్తాను సాయీ” అన్నాను.

తనే ఆలోచించి, “మీకు కంపెనీగా వుంటారు, సుమిత్రా పంపన గారిని కూడా పిలుస్తాను.. మీ ఇద్దరికీ హోటల్ రూంలో కూడా టైం పాస్ అవుతుంది” అన్నాడు.

సుమిత్ర, కె.ఎస్. రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్‌లో ఆర్టిస్ట్‌గా అతనికి పరిచయమే కానీ, నా అంత చనువు లేదు! కానీ సుమిత్రలో గొప్పదనం… నేనేం అడిగినా వీలైనంతవరకూ ‘కాదు’ అనదు. నేను తనని ‘నువ్వు’ అంటాను.. తను నన్ను ‘మీరు’ అంటుంది. పెద్ద వయసు తేడా లేదు! ఇద్దరం ఒకే బ్యాచ్‌లో డిగ్రీ చేసాం. ఇండస్ట్రీలో నా కన్నా తను ముందు వచ్చింది… నాకు వీరేంద్రనాథ్ గారి ‘భార్యా గుణవతీ శత్రు’ రాస్తున్నప్పటి నుండీ పరిచయం. పైగా కె.ఎస్. రామారావు గారు నా ‘మొగుడే రెండో ప్రియుడు’ నవలని సినిమా తియ్యలేకపోయాను, కనీసం టీ.వీ. సీరియల్‌గా నయినా తియ్యాలని చాలా ప్రయత్నించారు. అదీ జరగలేదు! అప్పట్లో నేను కాంతిశిఖరా, పంజాగుట్టలో వున్న క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీస్‌కి ఎక్కువగా వెళ్తూ వుండేదాన్ని. అక్కడే మేకప్ ఆర్టిస్ట్ శోభ, సీ.వి.ఎల్. గారి దగ్గర అసిస్టేంట్‌గా చేస్తుండే ఇప్పటి హీరో రవితేజనీ, శివాజీనీ, సుమిత్రనీ, శాయికృష్ణనీ కలవడం, స్నేహంగా మాట్లాడడం జరుగుతుందేది! విధి ఎంత విచిత్రమైనది అంటే, చిన్నప్పటి నుండీ ఎంతో అభిమానించే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ‘డి ఫర్ డెత్’ డైరక్ట్ చేస్తూ పక్క గదిలోనే వున్నా, ‘వెన్నెల్లో ఆడపిల్ల’కి నేను పని చేస్తున్నప్పుడు, ఆయన్ని కలుసుకోలేదు… ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ అంత క్లోజ్ అయ్యారు ఆయానా, ఆయన శ్రీమతి! ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది… విధిని నేను బాగా నమ్ముతాను… డెస్టినీ మనుషులను కలుపుతుందీ, విడదీస్తుందీ, ఇష్టమైతే మళ్ళీ కలుపుతుంది!

సాయికృష్ణ పెళ్ళికి మాకు ఇన్విటేషన్ కార్డ్స్‌తోనే అతని తల్లి తండ్రులు ఇంటికొచ్చి పిలిచి, పట్టుచీరలు కూడా పెట్టి వెళ్ళారు. ఉప్పాడ చీరలు అప్పుడే కొత్తగా పాపులర్ అవుతున్నాయి. ఆ చీర నా దగ్గర ఇంకా వుంది. సాయి పెళ్ళి గురించి నేను ఫొటోలతో సహా కౌముదిలో ఆర్టికల్ రాసాను… కారణం ఆ పెళ్ళిలో పరిచయం అయిన ఓ ఇంట్రెస్టింగ్ కారెక్టర్ రాయలు గారు!

ఊటీలో సాయికృష్ణ తల్లిదండ్రులతో రచయిత్రి

ఆ ముందు సంవత్సరం మా అబ్బాయి అమెరికా వెళ్ళే ముందు సాయికృష్ణ నన్నూ, మా ఆయన్నీ, పిల్లల్నీ ఊటీ తీసుకెళ్ళి, అక్కడ గెస్ట్ హౌస్ బుక్ చేయించి సొంత అక్కా బావల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. వాళ్ళ అమ్మానాన్న, మా కుటుంబం ఎంతో సంతోషంగా ఊటీలో వారం రోజులు గడిపాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here