[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
గౌరి కేదారేశ్వర దేవాలయము – కేదార్ ఘాట్:
[dropcap]గౌ[/dropcap]రీ దేవి గురించి చెప్పేటప్పుడు కేదారేశ్వర దేవాలయములో వున్న గౌరి దేవి గురించి తప్పక చెప్పాలి. ఈ కేదారేశ్వరాలయము కేదార్ ఘాట్‌లో వుంది. ఈ కేదార్ ఘాట్ చాలా శుభ్రమైన ఘాట్‌గా పేరు పొందింది. ఈ ఘాట్ తరువాత గంగలో కాశీ నగర డ్రైనేజు కలుపుతారు. ఆ మురికి అందుకే కేదార్ ఘాటు లోని గంగలో వుండదు కాబట్టి అక్కడ నది చాలా శుభ్రముగా కనపడుతూ వుంటుంది.
ఆ ఘాట్ నుంచి మనము డైరెక్టుగా కేదారేశ్వరాలయములోనికి ప్రవేశించవచ్చు. ఈ కేదారేశ్వరుడు స్వయంగా కేదారునాథ్ లోని కేదారుడే అని చెబుతారు. ఈ గుడికి ప్రక్కనే కుమారస్వామి మఠమున్నది. కాశీలో నేను వున్న రోజులలోనే గురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి ప్రవచనములు జరిగాయి. నేను గురువుగారి ప్రవచనాలకు వెళ్ళే ప్రయత్నం చేశారు.
ఆ ప్రవచనాలకు అమెరికా నుంచి వారి భక్తులు కొద్ది మంది వచ్చారు. వారిలో సరసి నాతో స్నేహము కలిపింది. ఆమె నా కూడా వుండి ఈ దేవాలయానికి తీసుకుపోయింది. అక్కడి దేవతలను చూపుతూ స్థల పురాణాము, మూడు కళ్ళ గణపతినీ చూపింది.
కేదారేశ్వర దేవాలయము విశాలమైనది. ఈ దేవాలయములో గౌరి దేవి ఒక ప్రక్కగా వుంటుంది. మనము ఏ విధముగానూ ఆమె సమీపములోకి వెళ్ళలేము. దూరముగా దర్శించుకో వచ్చును. ఇక్కడ వున్న శివుడు స్వయంభూ. ఆయన అర్ధనారీశ్వరుడు. ఆ లింగములో మధ్యన సన్నని పగులు వుంటుంది. అందులో సగము శివుడు, సగము అన్నపూర్ణేశ్వరి.
దీనికి కొంత స్థల పురాణ మున్నది.
పూర్వము శివుడి లింగోద్భవ వేళ అబద్ధం చెప్పినందుకు బ్రహ్మ శిరస్సులలో ఒకటి ఖండించబడుతుంది. బ్రహ్మకూ అబద్ధం చెప్పిన పాపం వస్తుంది. ఆయన శివుడిని ప్రార్థిస్తాడు పాపపరిహారము చెప్పమని.
కాశీలో కొన్ని దినాలుండమని చెబుతాడు శివుడు. బ్రహ్మ ప్రతిరోజు తన నిత్యపూజ చేసి, తన ఆహారములో సగము అతిథికి ఇచ్చి, కేదారేశ్వరము మనోవేగమున వెళ్ళి అక్కడ అర్చన చేసి తిరిగి కాశీ వచ్చేస్తూ వుంటాడు.
ఈ విషయము తెలుసుకొని కొందరు ఋషులు తమనూ కేదారేశ్వరము కొనిపొమ్మని బ్రహ్మను కోరుకుంటారు. బ్రహ్మ అంగీకరిస్తాడు. తన పూజ కానిచ్చి, అతిథి కోసము ఎదురుచూస్తూ వుంటాడు. ఒక భిక్షువు వస్తాడు. బ్రహ్మ తన ఆహారమును సగము చేసి, భిక్షువుకి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఋషులు ఇంతలో తొందర పెడతారు. ఈ హడావిడిలో ఏ ఆహారపు కుప్ప ఎంగిలి కాదో బ్రహ్మ గమనించడు. ఆ హాడావిడిలో ఎంగిలి ఆహారము భిక్షువుకు ఇచ్చేస్తాడు. భిక్షువు తనకు ఎంగిలి ఆహారము అందిందని ఆగ్రహిస్తాడు. బ్రహ్మ చేసేది లేక శివుడ్ని ప్రార్థిస్తాడు. భిక్షువు తన అసలు రూపమగు శివుడిలా ప్రత్యక్షమవుతాడు. ఆహరమంతా కలసి శివుడు అన్నపూర్ణలా మారిపోతారు. అక్కడ స్వయంభూలా శివుడు లింగాకృతిలో దర్శనమిచ్చి బ్రహ్మను అనుగ్రహిస్తాడు.
ఈ దేవాలయములో చేసే అర్చనకు కేదారేశ్వరం లో చేసిన ఫలముంటుందిట.
ఇక్కడ ఈ దేవాలయములో శివుడిని అర్చిస్తే ఏక కాలములో అమ్మవారిని శివుడ్ని అర్చించినట్లు అవుతుందట. అందుకే ఈ దేవాలయము, ఈ ఘాటు కూడా ఎంతో ప్రముఖమైనవిగా విరసిల్లుతున్నాయి.
***
కాశీలో లేని దేవతలు లేరన్నది నిర్వివాదము. మనకు భారతావనిలో కనిపించే అన్ని రకాలైన వామాచారా, కౌళాచార పద్దతులలో పూజలు కాశీలో కనపడుతాయి. అందులో ముఖ్యంగా ‘దశమహావిద్యలు’ కూడా వున్నాయి. అమ్మవారు వేరు వేరు పది రూపాలుగా భక్తులను అనుగ్రహిస్తూవుంటుందని దేవీ మహత్యము చెబుతుంది. ఆ రూపాలనే ‘దశమహావిద్య’లంటారు. ఇవి చాలా మటుకు కౌళాచార పద్ధతులు. వీటిలో తాంత్రికము కూడా భాగము. కాళీ, తారా, త్రిపుర సుందరీ, భువనేశ్వరీ, భైరవీ, చిన్నమస్తా, ధూమ్రవతి, భగళాముఖీ, మాతంగీ, కమల. వీరికి దశమహావిద్యలని పేరు.
దశమహావిద్యలలో కాళీ మాత మహాశక్తి. ఆ తల్లి దుర్మార్గుల మదమణిచి, సన్మార్గులుగా చేసి అనుగ్రహిస్తుంది. శ్రీ రామకృష్ణులు ఈ తల్లిని పూజించి మనలకు అమ్మ కరుణా స్వరూపము కనుల ముందుంచారు. కాశీ లోని బెంగాలి టోలి లో వున్న కాళీ మాతను కుదిరితే దర్శించుకోవచ్చును. ఆ తల్లిని ఆరాధించే బెంగాలి భక్తులు ఎక్కువ. ఈ దేవతా మూర్తులందరూ నవరాత్రులలో విశేష పూజలందుకుంటారు. అది ముఖ్యదేవాలయం ప్రక్కగానే వుంటుంది. ధశాశ్వమేధ్ ఘాటు ప్రక్కనే వుంటుంది. ఈ దశాశ్వమేధ్ ఘాటులో బ్రహ్మ తన పాపము పోగొట్టుకొవటానికి అశ్వమేధాలు చేశాడు కాబట్టి ఆ ఘాటును దశాశ్వమేధ్ ఘాటు అంటారు. ఈ ఘాటులో చేసే స్నానాలకు, జపాలకూ, దానాలకు ఫలము పది అశ్వమేధాల సమానమని చెబుతారు.
(సశేషం)