[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
ముద్దుపళని రాధికా సాంత్వనం
రాధాకృష్ణుల ప్రణయతత్వాన్ని అన్ని భాషల కవులు వేనోళ్ళ కొనియాడారు. బ్రహ్మవైవర్త పురాణంలో రాధాతత్వం సంపూర్ణంగా వుంది. రాధాదేవిని శ్రీమహాలక్ష్మి అవతారంగా రాధామాధవ కవియైన చింతలపూడి ఎల్లన్న వర్ణించాడు. లక్ష్మీనారాయణులే రాధామాధవులని ఆయన కల్పన. రాధను పరకీయగా వర్ణించిన కవులు కొందరున్నారు.
సి.పి.బ్రౌను పండితుడు రాధికా సాంత్వనం గూర్చి ఇలా అభిప్రాయపడ్డారు: “స్వాంతనము అనగా ఓదార్పు. యీ కావ్యమందు రాధాదేవి తన పెంపు కూతురైన యిళాదేవిని కృష్ణునికి యిచ్చి, ఆయన మోహం కొన్నాళ్ళ దాక చిన్నదాని మీద ప్రవేశించి వుండగా కడాకు వివేకం కల్గి తిర్గి రాధను వోదార్చినాడు గనుక రాధికా సాంత్వనం అని పేరు వచ్చింది.
ఈ కావ్యం కృష్ణ రాధికల గురించి వుండగా నిజమైన మూలం ఏమంటే – రాజుగారు ముందుగా యీ తంజినాయికను వుంచుకొని వుండి అటు తర్వాత దాని పెంపు కూతురైన ముద్దుపళని అను యీ కవీశ్వరాలును వుంచుకొని అటు వెనుక తిరిగి తల్లితో సమాధానం పరిచినాడు గనుక ఆ సాంత్వనం – అనగా సమాధానమును గురించి యీ కావ్యం రచించినది. యీ కథ తంజావూరులో విననవును.” (సి.పి. బ్రౌన్)
రాధ ఎవరు?
చింతలపూడి ఎల్లన తన కావ్యంలో రాధను శ్రీకృష్ణుడు స్వయంవరంలో పెళ్ళాడినట్లు చెప్పాడు. ధరణిదేవుల రామయ్య రాధ నందుని యింటి ఆడపడుచుగా తొలుత సృష్టించాడు. వెలిదండ్ల వెంకటపతి దానిని ప్రచారం చేశాడు. రాధకు ఒక పెళ్ళి కూడా చేశాడు. వీరి దారిలోనే ముద్దుపళని నడిచింది. శ్రీకృష్ణుని తెలుగువాణ్ణి చేసి ఏ కావ్యం లోనూ లేని విధంగా వారిద్దరికీ మేనరికం కలిపింది. లింగనమఖి తిరుకామయ్య సత్యభామా సాంత్వనం ముద్దుపళని కాలానికి ముందుంది. రాయల కాలం వాడు చింతలపూడి ఎల్లన. దశావతార చరిత్రలో ధరణిదేవుల రామయ్య రాధ కథ చెప్పాడు. వెంకటపతి రాధామాధవ సంవాదం వ్రాశాడు.
ముద్దుపళని పద్యాలకు పోలిక గల కావ్యాలున్నాయి. అవి రాధా మాధవ సంవాదం, పారిజాతాపహరణం, శశాంక విజయం, సారంగధర చరిత్ర. “ఇవి ఆమె చదువును తెలియజేస్తాయే గాని ఘనతను తగ్గించవు” అన్నాడు ఆరుద్ర.
రాధామాధవం:
విష్ణు సంబంధమైన పురాణాలలో, భారతంలో రాధ పేరు కనిపించదు. బ్రహ్మవైవర్త పురాణంలో విష్ణుదేవునకు లక్ష్మీదేవి వలెనే శ్రీకృష్ణునకు ఈ రాధాదేవి నిత్యనపాయినిగా వర్ణింపబడింది. రాధ మూల ప్రకృతి. శ్రీకృష్ణుడు ఆది పురుషుడు. రాధామాధవ కావ్యాన్ని కపిలేశ్వర జమీందారులు నడకుదుటి వీరరాజు పరిష్కరణలో 1936లో ప్రచురించారు. కవినామమే భూషణముగా వెలసిన గ్రంథాలు చాలా ఉన్నాయి గాని గ్రంథ నామమే బిరుద భూషణముగాను, ఆ బిరుదమే తన పేరుగా ధరింపగల కవి రాధామాధవ కవి అయిన చింతలపూడి ఎల్లనార్యుడు. “కామయప్రభు సుపుత్ర శుద్ధ సారస్వత విభవ రాధామాధవ ప్రణీతంబైన…” అని కవి సగర్వంగా చెప్పుకొన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ రాధామాధవ కావ్యం విని ఆనందించి – ‘నానాధృత ప్రతిమాన సత్కవులలోనన్ భూషణశ్రేణితో’ రాధామాధవ బిరుదం ప్రసాదించారు.
ముద్దుపళని:
తంజావూరును పాలించిన నాయకరాజులలో అభినవ భోఝరాజు బిరుదాంకితుడైన రఘునాధ నాయకుడు కవిపోషకుడు. అతని ఆస్థానము ‘ఇందిరా మందిరము’ కవి పండితులను భుజవిజయం వలె పోషించింది. అతని తరువాత మహారాష్ట్ర మహీపతి ప్రతాపసింహుడు ఆ ప్రాంతాన్ని పాలించాడు. అతని ఆశ్రయంలో కవితావైదుష్యంగల ముద్దుపళని రాధికా సాంత్వనం రచించింది.
గీతగోవింద కర్త జయదేవుని వలె ముద్దుపళని రాధామాధవ శృంగార కేళీ విలాసాలను వరీణించింది. సముఖ వేంకట కృష్ణప్పనాయకుడు కూడా రాధికా సాంత్వనం – అనే పేరుతో ఒక ఆశ్వాసం వ్రాశాడు. దానిని నాలుగశ్వాసాలుగా పెంచి ముద్దుపళని వ్రాసిందని ఒక అపప్రథ ప్రచారంలో వున్నది. ముద్దుపళని కవిత్వం ముద్దుల మూటగట్టు కుసుమపేశల సదృశం.
గ్రంథ నిషేధం:
శృంగారం అతివేలంగా వుందని ప్రభుత్వం 70 ఏళ్ళ క్రితం ఈ గ్రంథాన్ని నిషేధించింది. అలాంటి పద్యాలు పాతికకు మించి వుండవు. సాహితీపరులు నిషేధం ఎత్తివేయాలని కోరగా స్వరాజ్యానంతరం ప్రకాశం పంతులు ప్రభుత్వకాలంలో నిషేధం ఎత్తివేశారు. కవయిత్రి వేశ్యాకులం మీద దృష్టితో సాహిత్యకారులు ఈ గ్రంథాన్ని చిన్నచూపు చూశారు.
ముద్దుపళని తంజావూరు నాగవాసంలో తంజనాయకి అనే వేశ్య పెంపుడు కూతురుగా పెరిగింది. విటులే కాక విద్వాంసులు కూడా ఆమె ఇంటికి వచ్చేవారు. ఆమెకు గ్రంథాలు అంకితమిచ్చారు. తంజావూరు ప్రభువు ప్రతాపసింహుడు ఆమెను చేరదీశాడు. ఎన్నో బహుమానాలిచ్చాడు. ఆమె బాలకృష్ణుని భక్తురాలు. బాలకృష్ణునికే కావ్యం అంకితమిచ్చింది.
ఉ:
శ్రీల జెలంగురాధికను – ‘చెల్వరో! నిన్నిల రూపరేఖలన్
పోలుదురే పడంతు?’ లన ‘మోహపురాలిని నిప్పు డెన్నెదో
హాళిని నన్ను గూర్చి? అని అల్గిన అచ్చెలి కౌగిలించు గో
పాలుని చిన్నికృష్ణుని, కృపాళుని గొల్తు నభీష్టసిద్ధికై‘ (రాధికా – పీఠిక -1).
రాధికా సాంత్వనాన్ని ఎమెస్కీ సంప్రదాయ సాహితీమాలలో ఆరుద్ర ప్రవేశికతో 2009లో ప్రచురించారు.
కథాకథనం:
వ్రేపల్లెలో అందరి ఇళ్ళలో చందమామలా శ్రీకృష్ణుడు ఉన్నాడు. గోపభామల కందరికీ అతను మన్మథుడే గాని, రాధ ఒక్కతకే ప్రాణప్రదం. ఆమె స్వయానా మేనత్త. నందుని చెల్లెలు. చిన్ననాట నుండి చిన్నికృష్ణునితో మరుగున ముచ్చటలాడి ఆడిపాడింది. ‘అమ్మకు చెప్పబోకు’ అని హెచ్చరించేది. రాధకు ఎప్పుడో పెళ్ళయ్యింది. ఆమె భర్త ప్రస్తావన లేదు. మరి కృష్ణునకు మేనరికపు పెళ్ళి అయింది. యశోద తమ్ముడైన కుంభకుని కూతురు ఇళతో పసిపిల్లగా వుండగా పెళ్ళి చేశారు. ఆమె యుక్త వయస్కురాలయ్యే వరకు రాధ చెప్పుచేతలలోనే పెరిగింది. మన్మథుని తోటలో లతకూనను పెంచినట్టు చిన్నదానిని పెంచింది. ఇళ కృష్ణుని వొదిలిపెట్టేది కాదు. రాధాకృష్ణులు ఆమె తమకు అడ్డు వస్తోందని ఎన్నడూ భావించలేదు. రాధ పడకటింటికి దారి తీస్తే ఇళ కూడా వెంటపడేది. రాధాకృష్ణులు పకపకా నవ్వేవారు.
ఇలా వుండగా ఇళ పెద్ద మనిషి అయింది. రాధ సంబరపడి సంప్రదాయబద్ధంగా పండగ చేసింది. తర్వాత శోభనం ఏర్పాట్లు తన చేతి మీదుగా చేసింది. మదన సామ్రాజ్యానికి కృష్ణునికి పట్టాభిషేకం చేసినట్టు తలంటు పోసింది. ఇళను సర్వాంగ సుందరంగా అలంకరించింది. మంచి ముహూర్తంలో ఇళను కృష్ణుని గదిలోకి పంపింది. ఆవిడకు రాధ ఎన్నో బుద్ధులు, కిటుకులు చెప్పింది. కృష్ణుడికి అప్పగింతలు పెట్టింది.
అంతేకాదు, కృష్ణునికి హెచ్చరిక చేసింది.
తే.గీ:
“నీకు సరిపోయినటులేల నేను గాను
పొల మెరుంగని దీ ఇళ ముగ్ధ గాని
తెలిసి ఎటులేలెదో నీలు తెలుపవలెనె?
దేవ! దక్షిణ నాయకాధిపుడ వీవు!”
దక్షిణ నాయకులలో నీవు అగ్రేసరుడవనడంలో రాధ వ్యంగ్యోక్తి స్పష్టం.
ఇళను శోభనం గదిలోకి పంపింది గానీ, రాధకు నిద్ర పట్టలేదు. అది శివరాత్రే! రకరకాలుగా ఇళాకృష్ణుల సరసాలను ఊహించుకుని బాధపడింది. తన ప్రియుని మరొకరి చేతికిచ్చి ఏ స్త్రీ అయినా తాళగలదా?
ఎలానో తెల్లవారు జాము అయింది. ఆగలేక శోభనం గది వద్దకు వెళ్ళి తలుపు తట్టింది. కొత్త దంపతులిద్దరూ అలసిసొలసి పడుకుని నిద్రలేచారు. ఇళ తలుపు తీసింది. రాధ ముందుకు నడిచింది. ఆమె కంటే ముందు ఆమె చేతి చిలుక వచ్చి రాధ ఆ రాత్రి పడ్డ బాధను కృష్ణుడికి చెప్పింది. కృష్ణుడు రాధ చేయి పట్టి లాగి పడక మీదకు చేర్చాడు. ఇళ సిగ్గుతో చాటుకెళ్ళింది. రాధాకృష్ణులు కేళీ విలాసాలలో తేలియాడారు.
చిలక రాయబారం:
రాధ ఇళను తన ఇంటికి తీసుకెళ్ళి ఇళకు ఉపచారాలు చేసింది. కుంభకుడు కొత్త అల్లుని (కృష్ణుని), ఇళను తమ ఊరికి ఆహ్వానించాడు. రాధ ఉదారంగా వాళ్ళ ఇద్దరినీ పంపింది. అలా పంపించింది మొదలు రాధ వియోగ బాధను భరించింది. నిత్యం కృష్ణుని తలచుకొనేది. విరహ బాధ భరించలేక చిలుక రాయబారం పంపింది.
శృంగార నైషధంలో హంసదూత్యం, ప్రభావతీ ప్రద్యుమ్నంలో చిలుక రాయబారం వున్నట్టే రాధికా సాంత్వనంలో చిలుక రాయబారం వుంది. ‘నిముషంలో నీ కృష్ణుని తీసుకువస్తాన’ని చెప్పి చిలుక బయలుదేరింది. వొంటరిగా కృష్ణుడున్నప్పుడు తన బాధ చెప్పమని రాధ హెచ్చరించింది. చిలుక కృష్ణునికి రాధ బాధ మొరపెట్టుకుంది.
కృష్ణుడి దగ్గర నుండి వచ్చిన చిలుక అక్కడి చోద్యాలు చెప్పింది. “కృష్ణుడు ఇళతోనే కాదు చెలికత్తెలతోనూ సరసాలాడాడు. ఆవిడ ఒక కోరిక కోరుతూ – ‘రాధను మరిచిపోవాలి’ అంది సుమా” అంది. రాధ తోక తొక్కిన త్రాచుపాము వలె మండిపడింది.
ఉ:
“ఎల్లజగంబులులున్ మనుచు నేలిక కంజభవాది మౌనిహృ
త్ఫుల్ల సరోజ రాజముల పూని వెలింగని తేజ, మిందిరా
హల్లకపాణి బాహువుల కబ్బని దివ్య సుఖంబు చిత్ర మీ
వల్లవ కామినీచరణవారిజ సేవకు లెస్స చిక్కెగా.” (తృతీయా – 44).
చిలుక రాధకు ఏం చెప్పిందోనని భయపడుతూ కృష్ణుడు రాధను గూర్చి తలచుకున్నాడు. ఇళ తమ్ముడు శ్రీదాముడు ‘రాధను మరిచిపొమ్మ’న్నాడు. కృష్ణు డొక్కడే ప్రయాణమై రాధ యింటికెళ్ళాడు. ఆమె తిట్టిపోసింది. కృష్ణుడు ఏవో సాకులు చెప్పాడు. కాళ్ళ మీద పడ్డాడు. రాధ కాలితో తన్నింది. “నా జన్మ తరించింది” అన్నాడు కృష్ణుడు. రాధ ఏడ్చింది. ‘నన్నేం చేసుకొంటావో చేసుకో’మని కృష్ణుడు రాధను కౌగిలించాడు. రాధకు కోపం పోయింది. గోపాలుడి కౌగిట నలిగిపోయింది.
ముద్దుపళని ముద్దు ముద్దు పలుకుల్లో నాలుగాశ్వాసాల కావ్యం శృంగార మధుకుల్యగా సాహిత్యంలో నిలిచిపోయింది. ప్రణయతత్వానికి ప్రతీకలుగా రాధాకృష్ణులు శాశ్వతమూర్తులు.