[dropcap]అం[/dropcap]తకంటే హీనమా?
గడ్డిపోచను దర్బ అంటున్నావు,
దానిని ధరిస్తున్నావు,ఆదరిస్తున్నావు,
పుణ్యకార్యాలలో దానిని ప్రతిపాదిస్తున్నావు,
దానికి ఎంతో విలువను ఆపాదిస్తున్నావు.
రంగురాళ్ళను నీ అదృష్టకారకాలంటున్నావు,
వాటిని వేలుపెట్టి కొని వేళ్ళకు ధరిస్తున్నావు,
నీ ప్రయోజనాలకై వాటిని ప్రతిపాదిస్తున్నావు,
నీ అభివృద్దిని వాటికి ఆపాదిస్తున్నావు.
గుడికట్టి పూజించవలసిన తల్లితండ్రులను గద్దిస్తున్నావు,
గడ్డిపోచకన్నాహీనంగా వారిని మర్ధిస్తున్నావు.
నీ వృద్ధికి కారణమైన తల్లితండ్రులను దూషిస్తూ,
గుడిదగ్గర కనిపించే సాధువులను,స్వాములను భూషిస్తున్నావు.
ప్రత్యక్ష దైవాలైన వారిని అకారణంగా ద్వేషిస్తూ,
కనిపించని దైవానికై పుణ్యక్షేత్రాలలో వెదుకుతున్నావు.
పనికిమాలిన ప్రతివాడి కాళ్ళకు నమస్కరిస్తున్నావు,
పవిత్రమైన తల్లితండ్రుల పాదపద్మాలను తిరస్కరిస్తున్నావు.
బ్రతికి ఉన్నప్పుడు వారిని దండిస్తూ,పస్తులుంచుతున్నావు,
చనిపోయాక దండాలు,పిండాలు పెడుతున్నావు.
బ్రతికిఉన్నప్పుడు తల్లితండ్రులను అశ్రద్ధ చేసి ,
చనిపోయాక మాత్రం అత్యంత శ్రద్ధతో
వారికి శ్రాద్ధం పెడుతున్నావు.
నీ తల్లితండ్రులప్రేమ గడ్డిపోచకన్నా హీనమా?
నీ తల్లితండ్రుల విలువ రంగురాళ్ళకన్న తక్కువా?