[dropcap]కొ[/dropcap]న్ని ఆలోచనలనూ
కొన్ని విశ్వాసాలనూ మోస్తూ,
మనశ్శరీరాలు అవిరళంగా రెండు పాత కలలను
కంటుంటూయి.
పద సంయోజన సారూప్యతలకోసం
కవిపాదాలు
పచ్చదనపు సంప్రీత సాయాలకోసం
రైతుపదాలు తరతరాలుగ!
పంటనూ, ఇంటినీ రెప్పల తలుపులవెనుక నుండే కడిగి
శుభ్రపరిచినంత తేలికగ
అదృష్ట దురదృష్టాల్లో ఖాతాగా తనను
వేసుకొంటాడు.
నిందల్నీ, బాధల్నీ మనోహరత్వంగా మార్చుకొని కాయకష్టంలో కాత అవుతాడు.
అంగీజేబులు లేని తన నడిచే శిల్పానికి
అమావాస్యలు పూస్తున్నా
అన్నం అందరికి పంచే కండలు, నరాలుదేరిన చర్మమూ
అతనికై ఎండాకాలాన్ని కాయిస్తున్నా
ప్రయాణ ఉదాత్తత అతని
వ్యక్తీకరణ అవుతుంది.
వేసవిలో నీటి కాంక్షను, చలికాలంలో
వేడి గాఢతనూ మనకెవ్వరు పరిచయం
చేయరు. కానీ….
వానల్లో చుక్కల గీతాల్నిమాత్రం తప్పక
కోరమంటాడు అతడు.
అవి ఆకలి దీర్చే క్షేత్రాలకు కొత్త ప్రణాళికలు రచించేందుకంటాడు.
ఇన్ని నిజాల్ని రచించేకవి ముందు
ఊహాశాలిత్వానికి, ఆశావహ రచనలకు
ప్రేరణౌతాడు.
గుండెపండును కోసుకుతినాలనే మకరకోరికల మానవ సంబంధాలన్నీ
ఆర్థిక సంబంధాలన్న సత్యానికి
నువ్వెంత కాలం కట్టుబడి ఉంటోవో తెలియకున్నా, జీవసహిత భావాలను
మనందరికీ ఒదిలేసి, ఎప్పటిలాగే
రైతు గీతం ఎత్తుకుంటాడు.