సాధించెనే ఓ మనసా!-2

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది రెండవ భాగం. [/box]

[dropcap]రం[/dropcap]గనాథన్ ముఖం వంకర పోయింది. ఆయన ఎపిలెక్టిక్ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు.

“చేతిలో ఏదన్నా ఇనుప వస్తువు పెట్టండి. రండి. త్వరగా” పరిమళ అరిచింది.

“అది పనిచేయదు.”

“తన నాలుకను కొరుక్కోకుండా దంతాల మధ్య ఏదైనా ఉంచండి.”

“అదింకా ప్రమాదం మాల్య. రండి, మీరిద్దరూ బావని పట్టుకోండి. నేను అపోలో ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తాను” అంది పద్మ.

ఇరవై నిమిషాల్లో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ అంబులెన్స్ గట్టిగా సైరన్ మ్రోగించుకుంటూ వీధిలోకి ప్రవేశించింది.

ఫోన్ చేస్తున్నప్పుడే పద్మ అత్యవసర పరిస్థితి స్వభావాన్ని వివరించింది. న్యూరాలజిస్ట్ నేతృత్వంలో ఓ ఎమర్జెన్సీ వైద్య బృందం రంగనాథన్‌కి చికిత్స చేసింది.

గ్రీమ్స్ రోడ్‌లోని ప్రధాన ఆసుపత్రికి అంబులెన్స్ చేరుకోవడానికి ముందే న్యూరాలజిస్ట్ యాక్టివేస్ బ్రాండ్ పేరుతో విక్రయించబడే 100 ఎంజి/100 ఎంఎల్ టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్‌ ఇంజక్షన్ ఇచ్చాడు. పక్షవాతం యొక్క దాదాపు అన్ని ప్రభావాలను తిప్పికొట్టగల శక్తివంతమైన ఔషధం ఇది.

రంగనాథన్ కవల సోదరులు ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వచ్చారు. రంగనాథన్‌ని మూడు రోజులు ఐసియులో ఉంచారు.

రెండవ రోజు మధ్యాహ్నం రంగనాథన్ స్పృహలోకి వచ్చాడు.

ఆ సమయంలో ఆసుపత్రిలో పరిమళ మాత్రమే ఉంది. పద్మనీ, మాల్యనీ కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి వెళ్ళమని బలవంతం చేసి పంపింది.

రంగనాథన్ కవల సోదరులు పరిమళ వద్దకు వచ్చారు.

ఇంతలో ఒక నర్సు వచ్చింది.

“పేషంట్‌కి ఎంఆర్‌ఐ స్కాన్ చేయవలసి ఉంది. దురదృష్టవశాత్తు మా పరికరాలు పాడయ్యాయి. మేము ఆయన్ని బయటకు తీసుకెళ్ళబోతున్నాం. మీలో ఇద్దరు మాతో రావచ్చు. కానీ ఇప్పుడే కాదు, ఆయన్ని సిద్ధం చేయడానికి మరో గంట లేదా రెండు సమయం పట్టవచ్చు.”

“…”

“మీరు ఈ కాగితాలపై ఆయన భార్యతో సంతకాలు చేయించాలి.”

మురుగేశన్ చాలా వేగంగా ఆలోచించి ప్రణాళిక వేశాడు. అతను, అతని సోదరులు ఒకరినొకరు అర్ధవంతంగా చూసుకున్నారు. తరువాత నర్సుతో చెప్పాడు.

“సరే సిస్టర్. మేమిద్దరం మీతో వస్తాం”

నర్సు వెళ్లిన తర్వాత వారిద్దరు గుసగుసలాడుకున్నారు. ఆపై వారి మొబైళ్ళ నుంచి డజనుకు పైగా ఫోన్లు చేశారు.

ఒక గంట తరువాత ప్రభుత్వ అధికారిలా కనిపించే వ్యక్తి ఆసుపత్రికి వచ్చాడు. మురుగేశన్ పరిమళను సమీపించాడు.

“వదినా, మీరు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. అన్నయ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. చాలా కీలకమైన మెదడు శస్త్రచికిత్స కోసం అతన్ని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వారు యోచిస్తున్నారు.

ఆపరేషన్ కష్టమైనది. బాగయ్యే అవకాశం ముప్పై శాతమే అట. ఆపరేషన్ రిస్క్‌కీ, బాధ్యతకీ అంగీకరించే పత్రాలపై మీరు సంతకం చేయాలని ఆసుపత్రి వాళ్ళు చెబుతున్నారు. మీరు సంతకం చేయకపోతే ఆపరేషన్ జరగదు.”

పరిమళ ఏడుపు ప్రారంభించింది. ఆమెను కొంతసేపు ఏడవనిచ్చారు. అప్పుడు ఆమె కళ్ళు తుడుచుకుని ఉక్కిరిబిక్కిరి అయిన గొంతులో వారిని అడిగింది.

“శస్త్రచికిత్స చేయకపోతే ఏమిటి…”

“అలాగైతే మనం ఇప్పుడే అన్నయ్యని ఇంటికి తీసుకెళ్లవలసి ఉంటుంది. రేపు ఉదయం కల్లా అంతా అయిపోతుంది.”

పరిమళ ఇంకా గట్టిగా రోదించింది. ఈ కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంలో మాల్య, పద్మ తన ప్రక్కన లేనందుకు ఆమె తనను తాను తిట్టుకుంది.

“నేను మాల్యతో ఒక మాట చెప్పనా…”

“దీనికి మాల్యను అడగడం ఎందుకు? ఈ విషయంలో మనకి మరో మార్గం లేదు. వదినా, గుర్తుంచుకోండి… మనకి అన్నయ్య జీవితం చాలా ముఖ్యం.”

“సంతకం చేయడానికి మాకు అనుమతి ఉంటే మేము ఇప్పుడే పెట్టేసేవాళ్ళం. ఆపరేషన్‌కు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.

మా సోదరుడి కోసం కోటి రూపాయలైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. కాని వారు మీ సంతకం లేకుండా ఏమీ చేయలేమని అన్నారు.

ఆలస్యం చేసిన ప్రతి నిమిషం మనం అన్నయ్య జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాము. ఇక మీ ఇష్టం, వదినా.”

“అయితే మాల్య..”

“మీరు సంతకం చేయడం ప్రారంభించండి, వదినా. మీరు చాలా చోట్ల సంతకాలు చేయాలి. మీరు చేస్తూ ఉండండి, నేను మాల్యను పిలిచి ఆమెకు విషయాలు వివరిస్తాను.”

నిర్దేశించిన చోట్ల సంతకాలు చేయడం ప్రారంభించింది పరిమళ. ఆమె మనఃస్థితిని బట్టి, సొంత కొడుకులుగా పెంచిన మరుదులపై ఉన్న నమ్మకాన్ని బట్టి, ఆ కాగితాల్లో ఏం వ్రాసుందో చదవడానికి ఆమె ఒక్క క్షణం కూడా ప్రయత్నించలేదు.

సంతకాల కార్యక్రమం ఇరవై నిమిషాలకు పైగా కొనసాగింది. పూర్తయ్యే సరికి, పరిమళ వెనుక నిలబడి ఉన్న ప్రభుత్వ అధికారి – అంతా సక్రమంగా జరిగినట్టుగా – మురుగేశన్‌కు బ్రొటనవేలు చూపించాడు.

“వదినా, ఇక్కడే ఉండండి. ఎక్కడికీ వెళ్లవద్దు. మేము డబ్బు కట్టేసి వస్తాము” అన్నాడు మురుగేశన్ పరిమళతో.

కాని వాళ్ళు మళ్ళీ రాలేదు.

పరిమళ ముప్పై నిమిషాలు వేచి ఉంది. ఆపై క్యాష్ కౌంటర్ దగ్గరకి వెళ్ళింది. వారు అక్కడ కూడా లేరు. ఆమె క్యాషియర్‌ను అడిగింది.

“పేషంట్ పేరు రంగనాథన్. ఆయన ఐసియులో ఉన్నారు. ఆయన తరఫున డబ్బు చెల్లించడానికి ఇక్కదికి ఎవరైనా వచ్చారా?”

క్యాషియర్ అతని కంప్యూటర్‌ను చెక్ చేసి, “ఎవరూ రాలేదు. అయినా, మీరేం కట్టక్కర్లేదు. ఇప్పటికే డబ్బు కట్టేసారు” అన్నాడు

పరిమళ ఎదురు చూస్తున్న చోటుకి తిరిగి వచ్చింది.

కొద్దిసేపటి తరువాత మాల్య, పద్మ వచ్చారు. ఒక నర్సు వారి వద్దకు వచ్చింది.

“ఇందాక ఇక్కడ నిలబడి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడ?”

“బయటకు వెళ్ళారు.”

“స్కాన్ కోసం రోగితో తాము వెళ్తామని నాకు చెప్పారు.”

పరిమళ ఇప్పుడు అనవసరంగా కంగారు పడింది.

“మాల్య, మీ బాబాయిలు ఎక్కడకి వెళ్ళారు?”

“అమ్మా, కంగారెందుకు? నాన్న షాపులో లేరు. పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉంటాయి. వారు తిరిగి షాప్‌కి వెళ్ళుంటారు.

మేమున్నాం కదా అమ్మా. స్కాన్‌కి మేం వెళ్తాము. ఈలోపు నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. నువ్వు ఎప్పుడు రావాలో మేం నీకు ఫోన్ చేస్తాము. రా పద్మా, వెళ్దాం.”

అన్ని చోట్ల చేసిన సంతకాల గురించి, కష్టమైన ఆపరేషన్ గురించి, 30% సక్సెస్ రేటు గురించి వాళ్ళకి చెప్పాలనుకుంది పరిమళ. కాని ఎందుకో ఆమె చెప్పలేదు.

దాని గురించి ఆమె చెప్పి ఉంటే బహుశా ఒక ప్రాణం నిలిచేదేమో? కానీ విధి నిర్దేశించిన దానిని ఎవరు మార్చగలరు?

పరిమళ తన కుమార్తె వైపు నిస్సహాయంగా చూస్తుండగా, ఆమె సోదరి రంగనాథన్‍ని స్ట్రెచర్‌లో అంబులెన్స్‌లో ఎక్కించింది. ఆయన స్పృహలోనే ఉన్నాడు, భార్యని చూసి బలహీనంగా నవ్వాడు. పరిమళ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి.

రంగనాథన్ ఇప్పుడు బాగానే ఉన్నాడని ఆమె సంతోషంగా ఉంది. అతను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే సరిపోతుంది.

అధిక సంఖ్యలో చేసిన సంతకాల గురించి, మరుదులు హఠాత్తుగా మాయమవడం గురించి ఇప్పుడు మాట్లాడి వ్యవహారాలను జటిలం చేయడం అనవసరం అనుకుంది.

రంగనాథన్‌ను అంబులెన్స్‌లోకి తీసుకెళ్లగానే పరిమళ ఇంటికి బయలుదేరింది.

***

పరిమళ సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ ఆసుపత్రికి వచ్చింది. అది సందర్శకులను అనుమతించే సమయం కావడంతో ఆ ప్రదేశమంతా జనాలతో నిండిపోయింది.

మాల్య అమ్మని చూడగానే, పరిగెత్తుతూ ఆమె వద్దకు వచ్చింది.

“రా అమ్మా, డాక్టర్ మనకో శుభవార్త చెప్పాలనుకుంటున్నారు.”

న్యూరాలజీ హెడ్ డాక్టర్ మీనాక్షిసుందరం యువకుడు. ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులకు ఎంత ఉత్సాహంగా చెప్తారో, అంతే ఉత్సాహంతో అతను వారితో ఈ వ్యాధి గురించి మాట్లాడాడు.

“ఆయనకి స్ట్రోక్ తగిలింది. పక్షవాతంలో ఇస్కీమిక్, హెమోరేజిక్ అనే రెండు రకాలున్నాయి. అదృష్టవశాత్తూ ఆయనకి సోకింది ఇస్కీమిక్ మాత్రమే. అది మెదడులో సంభవించే ఒక రకమైన ప్రమాదం. అదృష్టవశాత్తూ ఆయనకి ఫిట్స్ కూడా రావడంతో, ఇది ఎమర్జెన్సీ అని మీరు గ్రహించారు.

మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలలో ఒక బ్లాక్ ఉంది. దేవుడి దయవల్ల, స్ట్రోక్ వచ్చిన మూడు గంటలలోపు మేం చూశాం కాబట్టి, ఆయన్ని పూర్తిగా నయం చేయగలిగాము. మీరు ఒక గంట ఆలస్యం చేసి ఉంటే ఆయన మీకు దక్కేవారు కాదు.

అయితే మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అతని రక్తపోటు మరియు చక్కెర స్థాయిలను నిరంతరం చూడవలసి ఉంటుంది. మరియు మీరు అతనితో ఎటువంటి షాకింగ్ వార్తలను పంచుకోకూడదు. ఏదైనా షాక్ ప్రాణాంతకం కావచ్చు. ఇప్పుడు అతని ఆహారం గురించి…” అంటూ డాక్టర్ మరో పదిహేను నిమిషాల పాటు మాల్య, పద్మ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

పరిమళ ఏమీ మాట్లాడలేక పోయింది. డాక్టర్ నిర్ధారణకు భిన్నంగా తన మరుదులు చెప్పినవి ఆమెకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయి.

“ఆయన్ని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం” అనే డాక్టర్ అన్న మాటలు విన్నప్పుడు పరిమళ కుదుటపడి, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

రంగనాథన్ ఇంటికి రాగానే అతని కవల సోదరులు అతనిని చూడటానికి పరుగెత్తుకు వచ్చారు. ముఖ్యమైన వ్యాపార విషయాలపై వారు ఆయనతో రెండు గంటలు గడిపారు.

ఆపై వారిద్దరూ వంటగదిలోకి వచ్చారు. అక్కడ వంటవాళ్ళతో కలిసి పరిమళ, రాత్రి భోజనం సిద్ధం చేస్తోంది. మాల్య, పద్మ ఏదో పని మీద బయటకు వెళ్ళారు.

సోదరులు పరిమళకు ఓ నల్ల సూట్‌కేసు ఇచ్చారు.

“వదినా, ఈ పెట్టెలో పది లక్షల నగదు ఉంది. ఆ రోజు మేము వెంటనే డబ్బును ఏర్పాటు చేయలేకపోయాము.

మేము డబ్బు తెచ్చేడప్పటికే, అన్నయ్య కోలుకున్నందున ఇక డబ్బు అవసరం లేదని చెప్పారు. ఆపరేషన్ కూడా అవసరం లేదన్నారు. ఈ డబ్బుని జాగ్రత్తగా ఉంచండి. మీకు ఎప్పుడైనా ఇది అవసరం కావచ్చు.”

“ఇంత డబ్బు నేనేం చేసుకోను? ఆయన మరో పది రోజుల్లో షాప్‌కి వెళ్తారు. ఆపై అన్ని డబ్బు విషయాలను ఆయనే జాగ్రత్తగా చూసుకుంటారు.”

కవలలు ఒకరినొకరు చూసుకున్నారు. మురుగేశన్ మృదువైన, దృఢమైన స్వరంలో – “అది సరే, వదినా. దీన్ని విడిగా ఉంచండి. దీని గురించి ఎవరికీ చెప్పకండి. మీకు ఇది అవసరం కావచ్చు, వదినా” అన్నాడు.

“అది సరే, మురుగేశన్. ఆ రోజు నాతో వాళ్ళు అనేక చోట్ల సంతకాలు చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు, ఇంటికి తిరిగొచ్చారు. వాళ్ళు ఆ కాగితాలను మనకి తిరిగి ఇస్తారా?” అంది పరిమళ.

ఇప్పుడు సెల్వకుమార్ మాట్లాడాడు.

“వాళ్ళు వాటిని తిరిగి ఇవ్వరు. కానీ ఆ పేపర్లతో వారేం చేసుకుంటారు వదినా? అవి టిష్యూ పేపర్లలా కూడా పనికిరావు.”

పేపర్లలో సంతకం చేసిన తరువాత మొదటిసారిగా మనసుకి శాంతి అనిపించింది పరిమళకి.

సోదరులు బయల్దేరి వెళ్ళే ముందు మరికొంత సేపు రంగనాథన్‌తో గడిపారు. పరిమళ పెట్టె నుంచి డబ్బును తీసి భద్రంగా దాచింది. వెయ్యి రూపాయల నోట్ల కట్టలు పది ఉన్నాయి.

పరిమళ తన జీవితంలో ఇంత నగదు ఎప్పుడూ చూడలేదు. కొన్ని అత్యవసర పరిస్థితులకు రంగనాథన్ ఎప్పుడూ యాభై వేల రూపాయలకు మించి బీరువాలో ఉంచడు.

మరుదులు అకస్మాత్తుగా తనకు ఇంత నగదు ఎందుకు ఇచ్చారు? ఆ సంతకాల గురించి మాల్యకు కనీసం ఇప్పుడైనా చెప్పకూడదా? పరిమళ అయోమయంలో పడింది.

తరువాత ఆడవాళ్ళంతా రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు పరిమళ “ఈ విషయం మనం శివకి చెప్పద్దా?” అంది

“అవసరం లేదు, అమ్మా. శివ బెంగ పడతాడు. నాన్నంటే వాడికెంతో ఇష్టం. పైగా వాడికి సెమిస్టర్ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. ఈ విషయం తెలిస్తే వాడు చదువుపై దృష్టి పెట్టలేడు.

పైగా మూడు వారాలలో శాశ్వతంగా ఇక్కడకు వచ్చేస్తున్నాడు. అప్పుడు చెప్దాం వాడికి. ఇప్పుడు వాడిని చదువు తప్ప మరేమీ ఆలోచించనివ్వద్దు” అంది మాల్య.

కానీ విధి ఆడే వింత ఆటలు ఎవరికి తెలుసు? దాని చర్యలు క్రూరమైనవి.

శివ పరీక్షలు రాయడం లేదు. అతను కోర్సు పూర్తి చేయడం లేదు. మీరు అనుకున్నదానికంటే చాలా త్వరగా ఇక్కడకు తిరిగి వస్తాడు. కానీ అప్పటికి మీ ప్రపంచం తలక్రిందులై ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here