‘మట్టిపొరల్లోంచి…’ కవితా సంపుటిపై పుస్తక విశ్లేషణ
[dropcap]ఆ[/dropcap]ధునిక సాహిత్య సృజనా ప్రక్రియలలో వయసు పరిమితి లేకుండా ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే ‘కవి’ అని ముద్ర వేసేస్తున్న ఆధునిక కవిత్వ విశాల పరిధి మన సొంతం ఈవేళ. ఎక్కడో నాలుగు పేజీలు చదివో, పెద్దల ప్రోత్సాహంతోనో తమలోని భావాలను ఒక (అ)పరిపక్వపు కవితగా రాసేసి పత్రికలో పేరు చూసుకోవాలన్న ఆత్రంతోనో, అభిరుచి మొలకెత్తినందువల్లో అతి తక్కువ సమయంలోనే ఇన్‌స్టంట్ కవులు తయారైపోతున్న నవ సమసమాజమిది.
ఈవేళ మహోన్నత స్థానంలో నిలబడి సాహితీ సృజన చేస్తున్న కవుల నిరంతర కృషి వెనుక, తమ బాల్యంలో రోజులో ఎక్కువ భాగాన్ని సాహిత్యం చదవడానికి, అర్థం చేసుకోవడానికి, సారాన్ని ఒంటబట్టించుకోవడానికి, తమ భావవ్యక్తీకరణతో ఎంతో ధైర్యం చేసి చిన్న చిన్న కవితలు రాయడానికే అధిక సమయం వెచ్చించే వారంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఒక పేజీ రాయాలంటే వేయి పేజీలు చదవాలన్న పెద్దల మంచి మాటలు విని నేటి వర్ధమాన రచయితలు తమ ప్రయత్నాన్ని కొనసాగించాలి.
ఈ ప్రపంచంలో యే వ్యక్తి జ్ఞానం చేత పరిపూర్ణుడు కాదు. ఎంత గొప్ప వ్యక్తికైనా ఇంకా ఎంతో తెలుసుకోవలసింది ఉంటూనే ఉంటుంది. తాను నేర్చుకున్నది ఆవగింజంత అని, తెలుసుకోవలసింది ఆకాశమంత అని ఎందరో జ్ఞాన సంపన్నులైన విజ్ఞులే చాలా సందర్భాలలో చెబుతుంటారు. అందుచేత వయసుతో సంబంధం లేకుండా సాహిత్యాభిలాష ఉన్న కవులందరూ పరిణితి గల కవిత్వాన్ని చదవడం మంచిదని సాహితీకారులు చెబుతూ ఉంటారు. అది తెలుసుకుని మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కవిత్వాన్ని ఆశ్రయిస్తే మనమూ కొంతకాలానికైనా ఆ చెట్టుకొమ్మలో ఒక చివురుగా మొలకెత్తే అవకాశం తప్పక లభిస్తుంది.
ముఖ్యంగా యేదైనా రంగంలో జ్ఞానాన్ని సంపాదించిన వారు, ఆ రంగంలో లోతులు తెలిసినవారు సాహిత్యాభిలాషతో కవిగా మారినప్పుడు వారి కవిత్వం కాస్తో కూస్తో పరిణితి చెందిన కవిత్వం అయి ఉంటుంది. అలాంటి కవిత్వాన్ని రాసిన వ్యక్తి విద్యాధికుడై ఇటు ఉద్యోగం చేస్తూ, అటు రైతు బిడ్డగా పుట్టి మట్టితో బాంధవ్యం కలిగిన అనుభూతితో కవిత్వం రాస్తే అది తప్పక పరిణితి చెందిన కవిత్వమే అవుతుంది.
అటువంటి ఒక మంచి కవి శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య. ప్రముఖ సినీ కవి శ్రీ రసరాజుగారు, ప్రఖ్యాత సాహితీ విమర్శకులు, కవి స్వర్గీయ శ్రీ అద్దేపల్లివారి పరిచయంతో కవిత్వం రాయడం ప్రారంభించిన ఈ కవి ఇప్పటికి ‘తొలకరి చినుకులు’, రెప్పల చప్పుడు’, ‘పచ్చని వెన్నెల’ అనే పేరులతో 3 నానీ సంపుటాలు, ‘లోయలో మనిషి’ , ‘చల్ల కవ్వం’, ‘తదేక గీతం’ అనే 3 కవితా సంపుటాలతో పాటు నాల్గవ కవితాసంపుటిగా ”మట్టి పొరల్లోంచి…” అనే కవితా సంపుటిని 2018లో వెలువరించారు.
ఈ సందర్భంగా ముందుమాట రాసిన నానీల నాన్నగారు శ్రీ గోపి గారు ”కవి” అనే వాడి గురించి చెప్పిన ఒక అమృత వాక్యాన్ని ఇక్కడ మనం జ్ఞప్తికి తెచ్చుకునితీరాలి.
”ప్రేమతత్వం లేనివాడు, మానవత్వం వెదజల్లనివాడు గొప్ప కవి కాలేడు” అన్నదే ఆ వాక్యం.
నిజమే. సోమేపల్లివారితో పరిచయం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది… ఆయన మాట్లాడే మాటల మధ్య అత్మీయత అడుగు అడుగునా కనిపించి స్నేహబంధం పటిష్టంగా మారుతుంది. ఇక మాటలైతే తేనెలో నానిన బంగినపల్లి ముక్కలంత మధురంగా ఉంటాయి. మనసులో మొగ్గలై తొడిగిన భావాలు పెదవులపై చిరునవ్వుల మొగ్గల్లా పరుచుకుని స్నేహపర్వంలోకి స్వాగతిస్తాయి.
అటువంటి ప్రేమతత్వం ఉన్న వ్యక్తి మానవత్వంతో రాసిన కవితాసంపుటి ”మట్టిపొరల్లోంచి…”
ఇక నిరంతరమూ ప్రవహించే ఈ కవి హృదయంలోకి వెళ్తే…. ‘మనసు మరకాదు.- మమతల పొర ” అని వర్ణిస్తూనే
”ఛాయా చిత్రం మాయా చిత్రమై
మోసం చేయవచ్చునేమోగానీ
మనసెప్పుడూ మానవీయ మల్లె చెండే…” అంటారు ”నాలో నేను” కవితలో…
ఈ కవి రైతు బిడ్డేమో… మట్టివాసన శ్వాసగా చేసుకుని రైతు బ్రతుకు నిఘంటువును ఆసాంతం ఔపోసన పట్టినట్టుగా అన్న వాక్యాలు చదువుతుంటే రైతు తనకు తాను పేగులు పిండుకున్నట్టే ఉంటుంది.
”రైతు నిఘంటువులో
అన్నీ ఉన్నాయి…
పేగు నింపే
గిట్టుబాటు ధర తప్ప” అని వారి జీవనవ్యధని తన వెన్నెముక గోడుగా చెబుతారు.
సాంకేతికత సామ్రాజ్యంలో మానవతామృతం ఆజ్యమైపోయి మనుషుల మధ్య లంకెలు తెగిపోయి అంకెలు మాత్రమే మిగులుతాయేమో అన్న ఆవేదనని వెళ్లగక్కుతూ…
”డాలర్ గాలి
మనసుగదిలోకి చొరబడి
అపుడే పుట్టిన బిడ్డకూడా
లంకెల బిందెలై దర్శనమిస్తోంది” అంటారు ”అంకెలు” కవితలో…
”నేల లేకుండానే
అధిక దిగుబదులు ‘దండు’కునే
మాంత్రికుడు వంటిమీద
బట్టలు నాలగాని మాటల బేహారి” అని రైతుని బతకనివ్వని దళారికీ కితాబు ఇస్తారీయన ”మాటల బేహారి” కవితలో…
పచ్చని పల్లెలు కవులకు కవిత్వపు పుట్టినిళ్ళు. ఈనాడు నిస్తేజంగా మారిపోయిన చిన్నప్పటి పల్లె చిత్రం – నా గుండె పొరల్లో నేటికీ నిక్షిప్తమే అన్న భావంలో పల్లెను సజీవంగా దాచుకున్న ఈ కవి పల్లెలు కనుమరుగైపోతున్నా ”భాషే నా శ్వాస” అన్న కవితలో —
”మాట
మట్టివాసన కోల్పోతోంది
భాష
బండరాయికింద నలిగిపోతోంది…
అమ్మా అని పిలవడానికి కూడా
ఆత్మవంచనే…” అన్న మనోవేదనని కవితా చివరివరకూ ప్రవహింపచేస్తారు.
దానాల్లో కెల్లా శ్రేష్టమైన దానం ఈనాటి సమాజంలో…అవయవదానం. మనిషి ”మళ్ళీ బతికేందుకు…” చేసే ప్రయత్నంలో
”కాలేయం కాపాడి
వేరొక శరీరంలో భద్రపరిస్తే
విషానికి విరుగుడౌతుంది…
మనిషికి మనసు తోడైతే
విశ్వం విశాలమౌతుంది” అని విశ్వజనీనతను విశదపరుస్తారు ”మళ్ళీ బతికేందుకు…” అన్న కవితలో…
పూర్వకాలంలో పల్లెల్లో ‘ఉట్టి’ లేని ఇల్లు, ‘చల్ల చట్టి’ లేని గుడిసె ఉండేదే కాదు. అటువంటి ఉట్టి ఉన్న ఇల్లు పాడిపంటలకు పచ్చని నిలయమని చాటిచెప్పిన ”ఉట్టి” – కవితలో-
”అయిదారు తాళ్ళతో
కుండ బరువును మోసే వుట్టి
ఐకమత్యానికి ఓ సూచికే…” అని వ్రాస్తూ అయిదారు తాళ్ళతో కుండబరువునే మోయగలిగిన ఉట్టిని ఆదర్శంగా తీసుకుంటే భిన్నత్వంలో ఏకత్వంలా ఐకమత్యంతో ఎటువంటి సమస్యనైనా ‘మోసేయచ్చు’, పరిస్కారం సాధించవచ్చు అని సూచిస్తారు సోమేపల్లివారు.
నేటి తరానికి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలియచేస్తూ –
”బిందువే కదా అని సరిపెట్టుకుంటే
సింధువు కలే…
జలమే కదాని జాగు చేస్తే
నీల్లకు నీళ్లొదులుకోవాల్సిందే..” అని హెచ్చరిస్తారు ”దాహం బాబోయ్…దాహం …” కవితలో… ఈ కవిత చదివాకా ”’తనకు తాను సుఖపడితే తప్పు గాకున్నా… తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్నా..” అన్న సినీ కవి పాత జ్ఞప్తికి వచ్చి బాధ్యత వెన్ను తడుతుంది.
ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి పేరుతో అల్లిన ఇనుప చట్రంలో తానుకూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న విధంగా ప్రవర్తిస్తున్న ‘మనిషి’ ప్రపంచ మార్కెట్లో ఒక అమ్మకపు సరుకు .. అని హెచ్కరిస్తూనే ”ఉల్టా ఉగాది” కవితలో…
”ప్రపంచమంతా ఒకటే భాష/ద్రవ్య భాష” అని చెబుతూ ”డబ్బుకు లోకం దాసోహం ” అన్న నానుడి అర్ధాన్ని మరింత విస్తృత పరుస్తారు ఈ కవితలో.
ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మనసు ఆర్ద్రత చెందుతూనే మట్టిని నమ్ముకుని బతుకీడుస్తున్న మనిషి ఆకారం కన్నీటి పొరలమద్య మసకబారిపోతూ ఎన్నో కవితలు ఈ కవితాసంపుటి నిండా దర్శనమిస్తాయి.
ప్రభుత్వ ఉన్నత శాఖలో అధికారిగా పనిచేస్తూ కూడా తనకున్న కాస్త స్వల్ప సమయంలో తనలోని కవిని యేడు రూపాలలో కవిత్వీకరీంచి ఆధునిక సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారి కలం నుంచి మర్నెన్నో విభిన్న అంశాలతో కూడిన కవితా సంపుటాలు జాలు వారాలని ఆశిస్తూ… వారి ఈ కవితా సంపుటి నూతనంగా కవిత్వంగా రాసే వర్ధమాన కవులు తప్పక చదువాలని విజ్ఞప్తి చేసున్నాను.
***
మట్టిపొరల్లోంచి… (కవిత్వం)
రచన: సోమేపల్లి వెంకటసుబ్బయ్య
ప్రచురణ: క్రీసెంట్ పబ్లికేషన్స్,
పేజీలు: 56, వెల: రూ.60/-,
ప్రతులకు:
క్రీసెంట్ పబ్లికేషన్స్, 29-25-43ఎ,
వేమూరి వారి వీధి, సూర్యారావు పేట, విజయవాడ-520002
ఈమెయిల్: svsomepalli@gmail.com
ఫోన్: 9000004565