[dropcap]అం[/dropcap]దమైన వస్తువుల్నీ
అందాన్ని ఆరాధించడంలో
ఏముంది వింత?
అందుకే నేను అందవిహీనత లోని
అంచాన్ని చూసి, ఆ రూపాల్నీ
ప్రేమించాలనుకుంటున్నాను.
మసకబారుతున్న చూపుని
మందగించిన వినికిడినీ
తూలుతున్న అడుగుల్నీ
పట్టు తప్పిన చేతులని
మడతపు పడ్డ చర్మాల్నీ
మూగబోతున్న గొంతుల్ని
మూలుగుతున్న వృద్ధాప్యాన్ని
నిరాదరణతో, అవమానాలతో
అవహేళనలతో, అనాదరణతో
అనాథలుగా మిగిలిపోతున్న
దిక్కుతోచని ఒకప్పటి దివ్వెల్ని
ప్రతి ఇంటినీ నిలబెట్టిన
పెద్ద దిక్కుల్నీ, ముసలీ ముక్కా జనాల్ని
వారి మౌన రోదనల్నీ ప్రేమిస్తున్నాను.
ప్రతి జీవనారంభం పయనించేది
అదే బాటలోనని ప్రతి ఒక్క బిడ్డకీ
మనసు పొరల్లో గుండె లోతుల్లో
నా ఆలోచన, ఆశయం ముద్రించాలనుకుంటున్నాను.
నేను వృద్ధాప్యాన్ని ప్రేమిస్తున్నాను
బలవంతంగా ఏదో ఒక రోజు నాపై అది
దాడి చేసే లోపే ప్రతి వృద్ధుని
అంతరంగాన్ని ఆవహించుకొని
అందమైన బాల్యమే కాదు
ఆనందమయిన వీడుకోలునూ ఆస్వాదించాలని
చెప్పుకుంటు సాగిపోతున్నా….