[dropcap]ఊ[/dropcap]రు నాలుగు వేల గడప ఉంటుంది. ఆ ఊరిలో రెండు చౌరస్తాలున్నాయి.
ఊరి మొగినున్న పెద్ద చౌరస్తాన, మనకు స్వాతంత్ర్యం వచ్చాక, నాధురామ్ గాడ్సే అనేటోడు ప్రార్థన నుంచి వస్తున్న గాంధీగారికి ఎదురేగి దండం పెట్టి కాల్చి చంపాక ఆయన విగ్రహం వేశారు. చుట్టూరా పది గజాల చోటోదిలి మౌకాలెత్తు కంటె గోడ కట్టారు. అదీ ఎవరో షావుకారి సంస్మరణార్థం. ఆ కూడలి నుంచి పది నిమిషాలు తూర్పుగా నడిస్తే మరో చిన్న కూడలి వస్తుంది. అక్కడి నుంచి ఉత్తర, దక్షిణాలలో దగ్గరగ చిన్న, చిన్న పల్లెటూళ్ళున్నయి. కొన్నింటికి మట్టి రోడ్లు. కొన్నింటికి కాలి బాటలూను. ఉత్తరాన ఇంక యాభై గజాల దూరం నడిస్తే కూరగాయల అంగడి. ఆ పక్కనే ఐదారుగురు షావుకార్ల మిద్దెలు ఉన్నాయి. వీటికి ఎడంగా చివరన పది గల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల వెనక ఒక కాలిబాట, బాటకవతల రోజు వారి కూలీల గుడిసెలు. వీరు వ్యవసాయాన్ని నమ్ముకుని చేసుకుంటున్నవారు. మామూలు పగలు వారి వారి ఇండ్లలో ముసలీ, ముతకా తప్ప దొరకరు. ఆడా, మగా పశువులు, జీవాలతో సహా పొలాల్లోనే ఉంటారు. ఆడవారు మాత్రం పాడిపశువులు ఇండ్లకు వచ్చే వేళకు కాస్త ముందస్తుగా వాళ్ళ గూళ్ళకు చేరుకుంటారు.
ఇక విషయాని కొస్తే ఈ కూడలిలో చిన్న గుడి ఉంది. ఇది రాముడిదో, కృష్ణుడిదో, సాయిబాబాదో కాదు. ఉప్పలమ్మ తల్లిది. దేవుడే లేడనే బాపతు వారు కూడా మురుగుననో, మరుగుననో పుట్టిన తెలుపు చేయాలని తమ దేవతగా కొలుస్తారు, కొలుస్తున్నారు.
ఆ ఊళ్ళో చెలమయ్య అనే సన్నకారు రైతుకు కొద్దిపాటి చెలక ఉంది. అది లొద్దిలో ఉండటాన నీటి వనరు దొరికింది. అందుచేత తన చెలకన ఉన్న ఎగుడు దిగుళ్ళను బాగు చేసుకున్నాడు. ఆ క్రమంలో మురుగు ఉన్న కాడ లోగా ఇటుక బట్టీలు పెట్టిన చోట్ల ఒక రెండు చేతులు మొలిచి కన్పించినయి. వాటిని విరిచి దూరాన ఉన్న వాగున వేసి చెలకను గుల్ల బారేలా దున్ని తోట వేశాడు. పైరుకు రోగం, రొష్ఠు ఆ సాలున సోకకపోవడం మూలాన మంచి ఫలితం వచ్చింది. ఆ సంతోషాన కొంచం సారాయి త్రాగి, నీచు కూర తిని తొంగున్న వేళ కలత నిద్రన కల వచ్చింది. ఆ కలలో విరిచి వాగులో వేసిన చేతులు కన్పించి ‘నేను దేవతన్రా, నన్ను వాగున పారేస్తావా ఈ పంటంలూ ఏడదనుకన్నావ్. అంతా నా చలవే. మొదట నాకు నా స్థానములో బెట్టి నాకు గుడి కట్టి పూజ చెయ్. ఏటా పంటలు ఇండ్లు చేరాక అమావాస్యనాడు ఏటను బలి ఇచ్చి దాని నెత్తురుత నా కాళ్ళు తడుపు. నల్గురి చేయి కడిగిచ్చు. మంచిగుంటవ్. లేకుంటే నీ కుటుంబమే లేకుండా పోతది’ అని మాయమైందట. ఉలిక్కిపడి లేచి కలలో కన్పించిన దానికి భయపడి ఊళ్ళోని పిరికి వెధవలకు చెబితే “గుడి కట్టాల్సిందే. లేకుంటే చాలా కుటుంబాలు ఆరిపోతయ్” అని భయపెట్టడంతో చిన్న గుడి కట్టించి ఏటను కోసి, నూరు మందికి చేతులు కడిగించి తలనున్న బరువును దింపుకన్నాడట. ఆ గుడి చిన్నదే అయనా దానికి నాలుగు వైపులా తోవలున్నాయి.
ఒడ్డేపు గోడనానుకి పెద్ద సిలికాపరి చెట్టు పెరిగి పెద్దమానైంది. ఎదుటి గోడకు సినిమా పోస్టర్లు అంటిస్తుంటారు. దాని నీడన మన రామదాసు తన కుట్టు మిషన్‌తో గుడ్డలు కుడుతుంటాడు. వచ్చే పోయే వాళ్ళకు తలలో నాలుకలా ఉంటాడు. నోరారా పలకరిస్తుంటాడు. కుశలం అడుగుతాడు (కొద్ది పరిచయం ఉన్నా) తన దగ్గరున్న చింకి చాపను చూపుతాడు కూర్చనేందుకు. ఆ చెట్టు నీడన ఆకులు, పూలూ ఎప్పడూ రాలుతూనే ఉంటయ్. దేవుళ్ళ నెత్తిన ఎప్పుడో పూలు పడతాయ గానీ మన రాందాసు నెత్తిన సిలికాపరి పూలు పడతూనే ఉంటాయి. రామదాసు దానిని అదృష్టంగా భావిస్తాడే తప్ప తనపై రాలిన వాటిని గుంజుకొనే ప్రయత్నం కూడా చేయడు. రామదాసుకి కొంచం ఎడంగా కమ్మరి లచ్చి కుండలు, ముంతలు, పిడతలు పెట్టుకొని కూర్చుని ఉంటది. రెండు గంపల సరుకు తేస్తే పొద్దువాలే సరికి ఒ గంపెడు అమ్ముతుంది ప్రక్క ఊళ్ళ వాళ్ళు వస్తుంటరు కనుక. ఈ లచ్చికి వయసు ముప్ఫై ఏళ్ళుంటయి. రంగు ఛామనఛాయైనా కుదమట్టంగా ఉండి చలాకీగా మాట్లాడుతూ చూసే వాళ్ళకు సూపరిలానే అనిపిస్తది. అదెందుకైనా నవ్వితే చూడముచ్చటగానూ ఉంటది. మరీ పొద్దు పోనపుడు, రామదాసు ఖాళీగా ఉన్నప్పుడూ ఇద్దరూ తమ తమ సాధక బాధకాలు చెప్పకుంటుంటారు. పొద్దున వీరు వచ్చే సరికి గుడి పై మెట్టుపై సన్యాసిలాంటి మనిషి, కూర్చుని కన్పించాడు. నుదట విభూతి రేఖలు, మొలన గోచీ తప్ప అతని ఒంటిపై ఏ ఆచ్ఛాధనా లేదు. ధ్యానముద్రలో ఉన్నట్టు కన్పించలేదు. ఇది క్రిష్ణమందిరమో, రామ మందిరమో కాదు కదా. ఇక్కడున్నాడేమిటి అనుకన్నారు వీరు. ఈ దేవతేమో ఫక్తు మాంసాహారి. ఇక్కడ కొచ్చే భక్త బృందాలూ ఏటలనీ, కోళ్ళనీ తడుపుకని వచ్చి పసుపు, కుంకాలు చల్లి, వాటి ఒంటికి జలదరం వచ్చే దాకా గుడి చుట్టూరా తిప్పి, బలిచ్చి పట్టుకొని వెళ్తారు. ఉన్న వాళ్ళ చంతన ఏదో ఒక రాయిని తెచ్చి కడిగి నాలుగు చదరపు బండలు చుట్టూరా పెట్టి, ఆ రాతి ప్రక్కనే వంటలు చేసుకని, కల్లు, సారాలు తెచ్చుకొని పుటుగా త్రాగి, బైండ్లళ్ళను పిలిచి జముకు కథలు చెప్పించుకొని ఆనందిస్తుంటారు. అక్కడ రిఖాగా వచ్చి కొబ్బరికాయలు కొట్టే జాడ ఉండదు. ఇట్టాటంటి చోట కూర్చున్న ఈ సన్యాసి ఏంటో… అనుకని తన పని తాను చేసుకుంటున్నాడు రామదాసు.
పొద్దుతో పాటు బాటంట మంది పోగవుతున్నారు. ప్రక్క ఊరి నుంచి వచ్చిన ఓ గుడిసె బండి కాస్త ఎడంగా చింత చెట్టు నీడన ఆగింది. దానిలో నుంచి నలుగురు ఆడంగులు, ఇద్దరు మగవారు దిగారు. ఎక్కడి నుంచి వస్తుందో ఒక ముసలావిడ మాత్రం చక చకా రామదాసు వైపు సంచీ పట్టుకొని నడచింది. వచ్చి ఎదురుగా ఆగి “చిరుగులు కుడతావా బంగారం లాంటి బట్ట కొర్రు పట్టింది” అని అడిగింది. పొద్దుటి బేరం కదా, తల ఊపాడు. వెంటనే సంచీ చేతికిచ్చింది. సంచిని బోర్లించాడు. అందున నాలుగు, రవికెలు, పాత శాలువా, రెండు చీరలు ఉన్నాయి. వాటిని విప్పి చూసిన రామదాసు “శాల్తీకి రూపాయి. నాలుగు రూపాయిలైతయి” అన్నాడు. ఆనక శాలువా విప్పి చూపి దీనికి అంచులు పోయినయి. దీనికొక్క దానికే మూడు రూపాయలయితయి” అన్నాడు.
“ఏడు రూపాయలా?” అంది రాందాసును చూస్తూ.
ఆ మాట విని సంచీనీ బట్టల్నీ ప్రక్కన బట్టి అప్పటి దాకా పని చేస్తున్న కొత్త లంగా పని ప్రారంభించాడు.
“ఏంటీ కుట్టవా?”
“కుట్టేందుకే నేను ఇక్కడ కూర్చంది. ఎంతవుద్దో చెప్పాను కదా” అన్నాడు ఆవిడనే చూస్తూ.
“చిల్లరుందా?”
“ఎంతకేమిటి?”
“పది రూపాయల నోటుంది.”
ఉంది అని తల ఊపాడు.
“అయితే కానీయ్.. దూరం వెళ్ళాలి. మొదలు బస్టాండ్‌కి వెళ్ళాలి” అంది.
వాటిని మిషన్ పైకి తీసుకని పని ప్రారంభించాడు. ఇరవై నిమిషాలలో కుట్టి వాటిని సంచీలో వేసి తన మొలో నున్న చిల్లర సంచీ ఇచ్చి, పది జేబులో వేసుకున్నాడు. ఆవిడ చక చకా వెళ్ళిపోయింది.
“నీకు బాగానే బోణీ అయింది” అంది లచ్చి రాందాసుతో
“ఇంకా ఇట్టాంటి బేరాలు నాలుగయితేనే కానీ పొయ్యిన్నున్న పిల్లి లెగవదు నా ఇంట” అనగానే
“అయినా సరిపడా ఒక్కసారే బేరాలు తగిలితే పొద్దస్తమానం ఈ చెట్టు క్రింద పానాశరం ఉండటమెందుకు?” అని నవ్వింది.
లచ్చి నవ్వితే బాగుంటది.
మెట్టుపై కూర్చున్న సన్నాసి వీధిన జరుగుతున్న దానిని అరకొరగా చూస్తున్నాడు. వాని డొక్క ఎండినట్టుగా కన్పించింది.
ఆసలాడెవడు, ఈడికి చేరిండు అడిగింది లచ్చి వాణ్ణి చూస్తూ.
కన్పటంలే, వస్తే వచ్చాడు కానీ వాడికిక్కడ కొబ్బరితునకైనా దొరికి చావదు కదా.
“పిలిచి చెప్పనా?” అంది జాలిగ జూసి.
“ఏం చెప్తవు?”
“ఈడ ఏమీ దొరకదయా, అవతలి వైపు పొమ్మనమని.”
కిసుక్కున నవ్విన రామదాసు. “ఆడ మాత్రమేముందే. గాంధీ గారికి కొబ్బరికాయి కొట్టేదెవరు. ఆయన నెత్తిన కాకులు కూర్చని రెట్టలేస్తుంటే అదిలించే దిక్కు లేదు కానీ” అన్నాడు.
“అట్టయితే పడమటేపు నున్న హన్మంతుని కాడకు పొమ్మంట” అంది.
నాకా మాత్రం తెలుసులే అన్నట్లు చూసి “దానితోని చెప్పడం అంత అవసరమా” అన్నాడు సణుక్కుంటూ.
రామదాసు వాలకం చూసి ఆగింది లచ్చి. పొద్దు ఎగబాకుతున్నది. ఇంకా నడి నత్తికి రాలేదు కానీ దాని నడక ఆగేది కాదుకదా. వీధిన రద్దీ పెరిగింది. లచ్చికీ అడపాదడపా చిన్న చితకా బేరం మొదలైంది. గంట సేపు మిషన్ కుట్టి అలసటగా గుడి మెట్లేపు చూశాడు రామదాసు.
అక్కడ కూర్చున్న సన్యాసి అదోలా అన్పించాడు. అతని చూపునున్న కోరిక గానీ అది తీరదేమోనన్న భావనగానీ కన్పించ లేదు. చెట్టు పూత గాలికి అడపాదడపా రాలుతుంది. ఒక్క చోట అంటే దులుపుకోవచ్చేమో కానీ వచ్చిన దగ్గర్నుంచే ఇంటి దారి పట్టేదాకా రాలుతుంటే చేసేదేముంది. ప్రక్కనున్న లచ్చిని పలకరించాల్సొచ్చి, చెట్టు పూత దాని తలపైన తలంబ్రాలలాగా కన్పించి నవ్వొచ్చింది. ఆవిడకు నన్ను చూసినా అలాగే అనిపించచ్చు. ‘జుట్టు దులుపుకోవే’ అని చెప్పాలనిపిస్తది.
అయినా ఈ పూత శృంగారాన ఉన్న వారిపైన కానీ పడితే ఉపయోగం కానీ బ్రతుకు, భారంగా కదిలించుకొనే వారిపై పడితే ఏముంటది.
‘ఆ ఒక్క సంగతి గుర్తులోకొస్తున్నది. కుండలమ్మే లచ్చి పాత మొగుడిది అటవీ ప్రాంతం (మళ్ళా మనువాడలేదు. కనుక కొత్త మగుడు లేడు). వాళ్ళలో కొందరు ఇలాంటి పూలనే ఏరుకొని ఎండ బెటేటుకొని గంజిలాగా కాచుకని ఆకలి తీర్చుకొంటారట. అదే చెప్పిందొకనాడు. అయినా ఉన్న మాటకేం కానీ. అందరూ వండిందే తింటున్నారా. ఎందరు కాయ కసరలు తిని బ్రతకటం లేదు. కొందరు బతికేందుకు నీరొక్కటే చాలు. కొదంరికి గాలొక్కటే సరిపోద్దట. అయినా ఒకటనిపిస్తేదే మనకున్న పరిసరాలు అందున్న వనరులు మన పూర్వీకులు అనుసరించిన ఆహరవిహారాలు, నియమాలను బట్టి మాత్రమే ఇప్పటి మన బ్రతుకు బాట ఉంది’ అనుకుంటడగా లచ్చి దగ్గరకో వయసు వాడు వచ్చి “ఈ పిడత ఎంత?” అడిగాడు.
బేరం కదా అని చెప్పింది.
‘చవకే’ అని మరొకటి చేతిలోకి తీసుకొని దాన్ని కిందెట్టి మూకుళ్ళూ చూశాడు. చివరకు గురుగులూ చూశాడు. లచ్చి వెనకమాల ఉన్న కుండలను కొడుతూ చూశాడు.
అతని వాలకం చూసి ‘నీకేం కావల్న’ని అడిగింది నిలుచునే.
“చూస్తున్నాను కదా” అన్నాడు వెటకారంగా. లచ్చి వైపు ఆబగా చూస్తూ.
“చూశావు కనకనే అడుగుతున్నా. ఏది కావాలి?” అంది.
“ఇక్కడున్నవన్నీ అమ్మకానికే కదా?” అన్నాడు వెధవ నవ్వు నవ్వుతూ.
“ఊర్నుంటి మొసుకొచ్చి ఎదురుగా ఉంచింది అందుకే” అంది.
లచ్చి వెనక ఉన్న కూర సట్టిని సూపి ‘ఇదీ’ అన్నాడు.
“అన్నీ అమ్మేవే.”
“ఇదెంత?” అన్నాడు లచ్చినో, సట్టినో అర్థం కానట్టు చూస్తూ.
పైగా “రేటు చెప్పవే” అన్నాడు.
లచ్చి కనుగుడ్లు ఎర్రబడినయి.
“తిమ్మిరిగా ఉందా ఒళ్ళు. కొనే బేరం కాదులే పో” అంది.
“అమ్మకానికి పెట్టి బేరమాడబోతే?” అని ఏదో అనబోతుండగా…
“చాల్చాల్లే వెళ్ళు” అని కూర్చుంది.
“బేరానికి కాక సోకుకు కూర్చున్నావా? ఇంకేమైనా పైదేమైనా ఉంటే చెప్పు” అన్నాడు అదోలా చూస్తూ.
“ఏం మాట్లాడుతున్నవయ్యా, ఆడ కూతురితో?” అన్నడు వింటున్న రాందాసు.
“నీ ఇలాఖానా అంత పొడుచుకొస్తున్నవ్?” అన్నాడు వెటకారంగా.
“అస్సలు నువ్వు మనిషివేనా?” అని లేచాడు రామదాసు.
రామదాసు భుజంపై చేయేసి అణిచి పెట్టి కూర్చోపెట్టాడు ఆ తుంటరి.
విదిలించుకొని లేచాడు రామదాసు. మెడపట్టుకొని వంగబెట్టి “ఎవడి పొట్టా ఇక్కడ ఉండదు” అన్నాడు తుంటరి.
పట్టు విదిలించుకొన్న రామదాసు “చంపుతా నా కొడకా! ఏందిరా నీ వీరంగం, నీకు అమ్మా, అక్క చెల్లెళ్ళు లేర్రా?” అని వీపున ఒక్క చరుపు చరిచాడు. ఇంతలో తుంటరి నెత్తిన తల పగిలేలా ఒక్క దెబ్బ పడింది. ఎవరా అని లచ్చి, రాందాసు వచ్చి చూసే సరికి అప్పటిదాకా గోచీపోతతో ఉన్న సన్నాసి. చేతినున్న వంకీ కర్రతో కొట్టాడట్టుంది. వాని వీరంగం చూడలేక. తల పగిలి నెత్తురు బయటికి వచ్చింది. అయినా “ఎవడ్రా?” అని సన్నాసిపై తిరగబడబోయాడు తుంటరి. లచ్చి, రామదాసు చరో వైపు చేతికందింది అందుకొని చితకబాదారు. పడిపోయాడు వెధవ మూలుగుతూ.
అటు ఇటూ పోయే వాళ్ళూ ఆగారు.
విషయం చెప్పింది లచ్చి. ఆగినవారు తలా ఒక తన్ను తన్ని వెళ్ళిపోయరు.
సన్నాసి వైపు కృతజ్ఞతగా చూశారు రామదాసు, లచ్చి. మెట్టుపైనున్న వాడు ఎటు వెళ్ళాడో తరవాత కన్పించలేదు. బాహ్య సంబంధం లేకకూర్చున్న అతనికి ఇంత రోషం ఎలా వచ్చంది. తను ఆనుకున్నది చేసి ఎటెళ్ళాడో బొత్తిగా అర్థం కాలేదు. లచ్చి వైపు చూశాడు రామదాసు. ఆవిడా అర్థం కాకుండానే చూసింది. కింద పడి గింజుకుంటున్న తుంటరిని చూస్తూ వెళ్ళేవారే తప్ప లేపే వారే లేరు. వాడు లెగనూ లేక అట్టాగే నేల పై బడి మూలుగుతున్నాడు. రక్తం తల నుంచి కారుతూ నేలపై పడి ఉరుకుతున్నది.
రామదాసు మిషన్ పై కూర్చుని లచ్చిని చూస్తూ “లచ్చీ నువ్వు దేవుణ్ణి నమ్ముతావటే?” అన్నాడు నవ్వుతూ.
‘ఎంత నమ్మినా, నమ్మకున్నా ఇంతలా ఫలితం ఉంటుందని మాత్రం అనుకోలేదు’ అనుకంది మనసులో సన్నాసి గుర్తు రాగా.
లోకంలో ఎక్కువ మంది భక్తులు తమ మొర ఆలకించమని వేడుకంటున్న తరుణాన ఎక్కడైనా దేవుడు ఇలా ఎలా స్పందించగలిగాడు అని గుడి వేపు చూసి మనసారా మొక్కేశాడు రామదాసు.
లచ్చి మనస్సున దైవాన్ని తలుచుకుని దోవన పోతున్న వాళ్ళ ఊరి లచ్చుణ్ణి పిలిచి “ఇగో అన్నా ఈడ నీళ్ళు దొరక్క వీడు చస్తాడు. ఈ దోవన పోయేటోడు. మనసున్నోడు వీడికి సాయం రాడు. అందితసేపట్లో అర్థమైంది. అయినా లచ్చమన్నా మనం మనుషులం. ఎంత వెధవైనా వాడు మనిషే కదనే. కాస్త నువ్వు సాయం రా. పక్కకీడ్చి కూకొబెట్టి కాస్త మట్టి తుడుద్దాం. ఇగో” అంది. వచ్చిన లచ్చూడు, లచ్చీ కలిసి వాణ్ణి జరిపి నెమ్మదిగ కూకోబెట్టి ఒంటి నున్న మట్టిని దులిపి, తుడిచి “ఇగో లచ్చమన్నా ఈ ముంతను తీసుకెళ్ళి నిండా నీళ్ళు పట్రా” అనగానే లచ్చూడు వెళ్ళి, ముంత నిండా నీళ్ళు పట్టుకొచ్చాడు. వీడి ముఖాన కొన్ని నీళ్ళు చల్లి, కాసిని తాగించినాక “ఇక పో” అంది. ఆనక కూడా వాడు లేవలేకుంటే సాయం పట్టి గోడ వారన వాణ్ణి కూర్చోపెట్టింది.
ఇదంతా చూస్తున్న రామదాసుకి లచ్చిపై తెలియని గౌరవం పెరిగింది. దాని వైపు ఆరాధనగా చూశాడు. ఇంత చెడు చేసినా లచ్చిన కన్పించిన మంచి తన రామదాసును అబ్బురపరచింది.
ఆడదంటే అమ్మ. అమ్మ కంటే దేవత లోకాన ఎవరుంటారు? మనిషికి మనం ఎంత చెడు చేసినా అమ్మతనం క్షమిస్తూనే ఉంటుంది. అందుకే ఆడపుటకని దేవత అనేది.