భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 7: మద్దిమడుగు

0
3

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–7” వ్యాసంలో మద్దిమడుగు లోని “శ్రీ పబ్బతి వీరాంజనేయస్వామి” ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ పబ్బతి వీరాంజనేయస్వామి, మద్దిమడుగు

[dropcap]అ[/dropcap]నేకమంది భక్తులు నిత్యం మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునుల దర్శనం చేసుకుని సంతృప్తులై తిరిగి వెళ్తుంటారు. ఇది పులుల రక్షిత ప్రాంతమనీ, రాత్రిళ్ళు ఈ దోవలో ఎవరినీ వెళ్ళనివ్వరనీ అటు వెళ్ళేవారందరికీ తెలుసు. మరి వీరిలో ఎవరైనా మన్ననూరు దగ్గర ఎడమవైపు రోడ్డు మొదట్లో శ్రీ పబ్బతి వీరాంజనేయస్వామి ఆలయ మార్గాన్ని సూచించే కమానును గమనించారా? గమనించినవారిలో ఎంతమంది వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వుంటారు?

పబ్బతి అంటే అర్థం నాకు తెలియలేదుకానీ ఆ పేరు నన్ను చాలా ఆకర్షించింది. ఒకసారి దర్శనం చేసుకుని అదేమిటో తెలుసుకోవాలనుకున్నాము. ఎన్నోసార్లు అనుకున్న తర్వాత ఈమారు మాకు ఆ అవకాశం దొరికింది. ఆదివారం, సోమవారం శ్రీ శైలంలో వుందామనుకుని ఆదివారం ఉదయమే బయల్దేరి దోవలో అన్నీ చూసుకుంటూ, మధ్యాహ్నం 1-20కి మన్ననూరు చేరుకున్నాము. పబ్బతి వీరాంజనేయస్వామి మార్గం కనబడగానే, ఈమారు కొంచెం సమయం వుండటంతో, ఈ ఆలయ దర్శనం చేసుకోవాల్సిందే అనుకున్నాము. అక్కడవారిని అడిగితే ఆలయం మూసేస్తారు, తిరిగి సాయంత్రం 3 గం.లకి తీస్తారని చెప్పారు. సమయం పుందికదాని బయల్దేరాము. సొంత వాహనంలో వెళ్తే ఇదొక సౌలభ్యం. మన ప్రయాణ మార్గాన్ని మనకనుకూలంగా మార్చుకోవచ్చు.

దోవలో ఒక చెట్టుకింద ఇంటినుంచి తెచ్చుకున్న భోజనాలు కానిచ్చి, నెమ్మదిగా మన్ననూరునుంచి 52 కి.మీ.ల దూరంలోవున్న ఆలయం చేరుకునేసరికి 3 గంటలయింది. రోడ్డు చాలామటుకు బాగుంది.

ఈ ఆలయం వున్నది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అమ్రాబాద్ మండలంలో. ఆలయం మరీ పెద్దది కాదు. కానీ అపురూప మహిమకలదిట. ఆలయం చేరుకోగానే ముందు కనబడింది ఆలయం వెలుపల పెద్ద ధుని. ఏదైనా యజ్ఞంలాంటిది జరిగిందేమో అనుకున్నాము. కానీ కాదుట. ఆ ధుని అలాగే 365 రోజులూ వెలుగుతూనే వుంటుందిట. పెద్ద వానలవ్వీ వచ్చినప్పుడు కూడా ఏదో తాత్కాలిక ఆచ్ఛాదన వేస్తారుటగానీ మరీ షెడ్డులాగా ఏమీ లేదు. అయినా ఆ ధుని ఇప్పటిదాకా ఎప్పుడూ ఆరలేదుట. అది స్వామి మహత్యం అంటారు.

పూర్వం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బట్టలుతుక్కుంటూ వుండేవారుట. వారు బట్టలు పిండి పక్కనే వున్న బండమీద వేసేవారుట. అలా వేసినప్పుడల్లా వేసినవారికి కాళ్ళు నెప్పులూ వగైరాలతో బాధపడేవారుట. ఏమటా అని ఒకసారి ఆ రాతిని పరిశీలనగా చూస్తే స్వామి ఆకారం కనబడింది. వెంటనే తమ తప్పు తెలుసుకుని, ఆ విగ్రహాన్ని నిలబెట్టి, దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేయసాగారు. వారే అక్కడ దొరికిన సామాగ్రితో నాలుగు గోడలు, పైన కప్పు వేశారు. సరిగా లేకపోవటంవల్ల ఆ గోడలు, కప్పూ కూలినా, స్వామి విగ్రహానికి ఏమీ కాలేదుట. స్వామి మహత్యం అందరికీ తెలియజేయటానికే అలా జరిగిందనుకున్నారు.

ఇంకొక కథనం ప్రకారం స్వామి స్వయంభూ. చెట్టు తొఱ్ఱలోంచి ఉద్భవించారు. నైఋతి దిక్కుగా, కొంచెం వంగినట్లు వుండే స్వామి విగ్రహాన్నినిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నంచేసినా కుదరలేదు. ఇప్పటికీ విగ్రహం కొంచెం ఒరిగినట్లే వుంటుంది. ఈ స్వామి గురించి అందరికీ తెలిసింది శ్రీ మానిసింగ్ బావూజీ వల్ల. ఈయన ఫోటో ఆలయంలో వున్నది. ఈయనే ఆలయం వెలుపల ధుని ఏర్పాటు చేసింది.

    

ఇక్కడ వుండే లంబాడీవారికీ, చెంచులకీ ఈ స్వామి మీద అపరిమితమైన గురి. వారు ఇక్కడ హోమగుండంలో ఒక ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అదేంటో తెలుసా గోధుమ పిండి, బెల్లం కలిపి మలేజా అని తయారు చేస్తారు. దానిని ఇక్కడికొచ్చిన ప్రతివారూ ధునిలో నివేదన చేస్తారు. ఇద్దరు స్త్రీలు ప్రదక్షిణలు చేస్తూ, ఈ మలేజా వుండలు చిన్నవి హోమంలో వెయ్యటం చూశాము. ఇదేకాక స్వామికి పాదుకలు సమర్పించటం కూడా ఇక్కడి భక్తులకు అలవాటు.

శనివారంనాడు ఇక్కడికి భక్తులు బాగా వస్తారు. ఇక్కడే వండుకుని తిని, రాత్రి నిద్ర చేసి మరునాడు వెళ్తారు.

ఇంతకీ పబ్బతి అంటే ఏమిటని అక్కడి పూజారిగారినడిగితే అక్కడి గిరిజనుల భాషలో పబ్బతి అంటే ప్రసన్న, శాంతమూర్తి అని అర్ధమట. ఈ స్వామిని పునః ప్రతిష్టించినవారు శ్రీ హంపీ పీఠాధిపతి. స్వామికి కుడిపక్కన ఎదురుగా శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామిని ప్రతిష్టించారు.

అతులిత మహిమాన్వితుడైన ఈ స్వామి ఆలయానికి ఆదాయం బాగానే వుంటుందట. 6 సంవత్సరాలక్రితం దేవాదాయశాఖ వారు ఈ ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని అభివృధ్ధి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానంలో వేదం చదువుకున్న విద్యార్ధిని రోజూ ఇక్కడ వేదం చదవటానికి నియమించారు. ఆ విద్యార్ధే ఈ ఆలయ వివరాలు చెప్పారు.

అమాయక గిరిజనులు అమిత విశ్వాసంతో కొలిచే ఈ స్వామి ఆలయానికి హైదరాబాదునుంచీ రోజూ మూడు బస్సులు నడుపబడుతున్నాయి. దేవరకొండ, అచ్చంపేటనుంచి కూడా బస్సులున్నాయి.

దర్శన సమయాలు

ఉదయం 4-30 నుంచి 1 గంటదాకా మళ్ళీ సాయంత్రం 3 గంటలనుండీ 9 గంటలదాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here