పిండిన సారం : “జ్యూస్”

4
3

[box type=’note’ fontsize=’16’] “కథ, నవల, కవిత, చిత్రం, సంగీతం వీటన్నిటికీ భిన్నంగా వచ్చిన సినెమా అనే కొత్త కళలో ఆసక్తి వున్నవారు తప్పక చూడతగ్గ లఘు చిత్రమిది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘జ్యూస్’ షార్ట్‌ఫిల్మ్‌ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]క[/dropcap]విత్వంలో హైకు వో ప్రత్యేక తరహా కవిత్వం. ముచ్చటగా మూడు పంక్తులలో గాఢమైన అనుభూతిని కట్టి ఇవ్వడం. సరిగ్గా ఇదే ఆలోచన నా మెదిలో మెదులుతున్నది ఈ మధ్య. రెండున్నర గంటల చిత్రాలలో దొరకని తృప్తి ఏదో ఈ లఘు చిత్రాలలో దొరుకుతున్నది. పెద్ద నిడివి చిత్రాలలో మధ్యలో వంద సార్లు మనసు స్వల్ప కాలం పాటు పలు సార్లుగా ప్రపంచమంతా స్వైర విహారం చేసి వచ్చినా మనం పోగొట్టుకున్నదేమీ వుండదు. సీరియళ్ళలో కొన్ని వారాలపాటు చూడకపోయినా కొనసాగగలిగినట్టు. కాని ఈ లఘు చిత్రాలలో వొ చిన్న nuance మిస్సయినా ఆ కాస్తా వెనక్కు వెళ్ళి మళ్ళా చూస్తాను. పోయిన వారం పరిచయం చేసిన “చట్నీ” అయితే వెంటవెంటనే మూడు సార్లు చూశాను, లేదు లేదు చూడాల్సి వచ్చింది. చూసిన ప్రతిసారీ వో కొత్త కోణం కనబడటం. చివరికి అన్నీ వొప్పించే వ్యాఖ్యానాలుగా కనిపించడం.

మనకు “మసాన్” అన్న చిత్రం వో పెద్ద landmark చాలా కారణాలుగా. ఆ దర్శకుడు (నీరజ్ ఘాయ్‌వాన్) తీసినదే ఈ “జ్యూస్”. సినెమా మొదలవడమే నల్లటి చీకటి నిండిన తెర. చాలా దూరంగా వో స్త్రీ స్పీచ్ ఇస్తున్నది. ఆడవారి గురించి. బహుశా క్లింటన్ గురించి కూడా. సమాజంలో వొదిగిపోయే స్త్రీలు మాత్రమే స్త్రీలు, మిగతా స్త్రీలు likeable కాదు. కేవలం బలమైన వ్యక్తిత్వం వున్న స్త్రీలే ముందుకెళ్తారు. వగైరా. అసలే క్షీణంగా వినిపించే ఆ మాటలు కూడా క్రమంగా వినపడటం మానేస్తాయి. ఆ చీకటి కూడా వో మధ్య తరగతి ఇంటి డ్రాయింగ్ రూం కు దారి ఇస్తుంది. నలుగురైదుగురు మగవాళ్ళు కూచుని తింటూ, సిగరెట్లు ఊదుతూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంటి యజమాని చెబుతాడు తన ఆఫీసులో కొత్తగా చేరిన అమ్మాయికి తను గంటసేపు వోపికగా పని గురించి వివరించిన తర్వాత కూడా అదేదో మేల్ లో పంపమన్నదని. అందరూ నవ్వుతారు. వొకాయన ఆమె వచ్చినప్పటి నుంచీ ఆఫీసు పధ్ధతిగా క్రమంగా నడుస్తుందటగా అంటాడు. మరొకడు నీ సమస్య మేల్(mail) తో నా ఫీమేల్ తోనా? అని అడుగుతాడు. ఆ ఇంటి గృహిణి బల్ల మీద ఉన్న ఎంగిళ్ళు ప్లేట్లు ఎత్తేస్తూ వుంటుంది. సాటి ఆడదాని మీద జోకును ఆమె ఇష్టపడదేమోనని వొకడు అంటాడు కూడా : మీరు మరోలా అనుకోకండి అని. అంతలో మరో జంట వస్తుంది. భర్త కుర్చీ లాక్కుని కూర్చుంటూ ఆ గృహిణితో అంటాడు, ఈమెను తీసుకెళ్ళండి మీకు సాయం చేస్తుంది, కొత్తగా వంటలు నేర్చుకుంటుంది కూడానూ. ఇద్దరు స్త్రీలు వంటగదిలోకెళ్తే అక్కడ మరో ముగ్గురు స్త్రీలు రకరకాల పనులు చేస్తూ వుంటారు. కడుపుతో వున్న ఈ స్త్రీ వో కుర్చీ లాక్కుని కూర్చుంటుంది. ఎండాకాలం. వంటగది వో కుంపటిలా మాడిపోతున్నది. గాలి ఆడట్లేదు, చెమట్లు పట్టేస్తున్నాయి. వంటల పొగ కి వాసనకీ ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితి. అటక మీద నుంచి వో చిన్న టేబిల్ ఫేన్ ని దించుతుంది ఆమె. అదీ ఆగి ఆగి పనిచేస్తుంది. మరో గదిలో పిల్లలు (ఈ జంటల) వీడియో గేం ఆడుతూ మాట్లాడుకుంటూ వుంటారు. నువ్వు చీటింగ్ చేస్తున్నావని మీ నాన్నతో చెప్పేస్తానంటుంది వో అమ్మాయి అబ్బాయితో. నేను కూడా మీ నాన్నతో చెబుతాను, హోం వర్క్ పేరుచెప్పి వీడియో గేం ఆడుతున్నావని. నువ్వాడట్లేదా అంటే అది నాది కదా అంటాడు. ఆడుతూ ఆడుతూ ఇద్దరు పిల్లలు బయటికి వస్తే ఆ ఇంటాయన విసుక్కుంటాడు, భార్యను కేకేస్తాడు పిల్లలు బయటకు రాకుండా చూడలేవా అని. హాల్లో మగవాళ్ళు తమ జీవితాలకు ఎంతో దూరంలో వున్న అమెరికా రాజకీయాలు -అంటీ అంటకుండా- మాట్లాడుకుంటూ, మధ్య మధ్యలో రకరకాల వివక్షలను జోకులుగా బయటపెట్టుకుంటారు. వంటగదిలో ఆడవాళ్ళ చర్చలు మాత్రం నిజ జీవితంలో వాళ్ళకు మాత్రం అంటే విషయాల గురించి మాట్లాడుకుంటారు. వో జంట పిల్లలు కనలేదు, వాళ్ళు తక్షణం ఆ పని మీద వుండాలని ఇతరుల ఉబోస. గర్భవతి స్త్రీ తన భయాలు బయట పెట్టుకుంటుంది. వో పక్క పిల్లలు లేని స్త్రీని వార్ధక్యంలో అవసరమైన తోడుకోసం పిల్లలని కనమంటుంటే, వాళ్ళు తోడుంటారని గేరంటీ ఏముంది, దాని బదులు భార్యాభర్తలు వొకరినొకరు ఊతమిస్తూ, కలిసుంటూ, స్వతంత్రంగా కూడా వుండొచ్హు అంటుంది. గర్భవతి అయిన స్త్రీ చెబుతుంది తను ఉద్యోగానికి నెల రోజులనించీ వెళ్ళడం లేదనీ, తన భర్త పురుడయ్యాక ఉద్యోగం మానెయ్యమంటున్నాడనీ. పై నుంచి ఫేన్ తీయడం, దాన్ని బాగు చెయ్యడం, ఈ లోగా మాడిపోతున్న చికెనో మటనో చూడబోతూ చెయ్యి కాల్చుకోవడం, పిల్లల్ని కట్టడి చెయ్యడం, మగవాళ్ళకి వడ్డించడం, వంటగది వాతావరణానికి ఉక్కిరి బిక్కిరి అయి మౌనంగా వున్న ఆ గృహిణిలో చలనం వస్తుంది. చెప్పడం మొదలు పెడుతుంది : తన ఇష్టానుసారం ఆడది ఉద్యోగం మానడం అర్థం చేసుకోవచ్చు. కాని వీళ్ళెవరూ నిర్ణయించడానికి? ఉద్యోగమైనా చెయ్యి, పిల్లలనైనా చూసుకో అంటారు. ఇద్దరూ కలిసి చెయ్యకూడదా? పిల్లలు ఒకటికి, రెంటికీ పోతే లంగోటా కూడా ఆడవాళ్ళే మార్చాలి. ఇలా అనర్గళంగా ఆమె చెబుతూ వుంటే మిగతా స్త్రీలు అలా చూస్తుండిపోతారు. బయటి నుంచి ఇంటాయన కేక : మంజూ ఇక వడ్డించేయి అని. వో దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, ఫ్రిజ్ లోంచి జ్యూస్ తీసి గ్లాసులో పోసుకుని, మరో చేత్తో కుర్చీని ఈడ్చుకుంటూ హాల్లో వున్న కూలర్ ముందు వేసుకుని కూర్చుంటుంది. ఆమె ఏమీ చెప్పకుండానే విషయం అర్థమై మగవాళ్ళందరూ మూగవాళ్ళైపోతారు. నెమ్మదిగా టైటిల్స్ మొదలవుతాయి.

ఇంత చిన్న చిత్రంలో ముఖ్యమైన విషయాలన్నీ ఒక పధ్ధతిగా కూర్చి అల్లిన “జ్యూస్” ఇది. అవును పిప్పిని వేరుచేసిన పండ్ల రసం, సారం. మగవాళ్ళ కోసం జల్సా గది, పిల్లల కోసం జైలు గది, ఆడవాళ్ళకోసం నిప్పుల కుంపటి లాంటి గది. ఇంట్లోనూ సమాజంలోనూ. అక్కడున్న పురుషులు వేరువేరు ప్రవృత్తి గలవారే అయినా అవే కుళ్ళు జోకులు. ఆ వంటింట్లో వున్న ఆడవాళ్ళందరూ ఏదో వొక విధంగా భిన్నగా వున్నా అందరి బాధా వొక్కలాంటిదే. ఇక పిల్లలా, వాళ్ళకు ఆ వయసు నుంచే role play అలవాటు చేస్తారు. ఆ అమ్మాయి తల్లి పిలిచి చెబుతుంది : ఈ ప్లేట్లు తీసుకెళ్ళి అన్నలకు ఇవ్వు పో, అని. మధ్యలో ఆడవాళ్ళు తమ గురించి టీ పెట్టుకుని తాగుతుంటారు. అందరికీ కప్పుల్లో, వొక స్టీల్ గ్లాసులో పనిమనిషికోసం టీ. తన పని కాలం పూర్తి అయిన ఆ పనిమనిషి (ఇల్లాళ్ళకు 24/7 పని గంటలు) ఇక వెళ్తాను, ఆలస్యమవుతుంది అని ఆ టీ కూడా తిరస్కరించి వెళ్ళిపోతుంది.

సినెమా మొత్తం వొకే ఇంట్లో తీసినా ఏ గదికా గది పూర్తిగా వేరేలా వుండడం, హాలు నుంచి వంటగది మధ్య వ్యత్యాసంగా పెద్ద పాసేజి వుండడం. తీసిన ఆ షాట్లు కూడా claustrophobic గా అనిపించేలా తీశాడు. కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకీ, పిల్లలకీ ఊపిరి ఆడనివ్వకుండా. మగవాళ్ళు వదులుతున్న సిగరెట్టు పొగలకు. పిల్లలకు స్వేచ్చగా తిరుగుతూ ఆడుకోలేని బందిఖానా కారణంగా. కథను సంభాషణలతో ఎంత చెప్పబడినదో, కేవలం ఆ దృశ్యాల రూపకల్పన ద్వారా కూడా అంతే బలంగా చెప్పబడింది. మొదట్లో చీకటి తెర అప్పుడు దూరం నుంచి వినవచ్చే స్త్రీ మాటలు (distant cry). చివర్న గృహిణి తన నిర్ణయం తాను తీసుకోవడం, పెద్ద యుధ్ధం చెయ్యకుండానే దాన్ని వ్యక్త పరచడం, తనను తాను assert చేసుకోవడం. అందరూ బాగా చేసినా, శేఫాలీ చాయా షా నటన కళ్ళు తిప్పుకోనివ్వదు. ఆమె నటనను ఇండస్ట్రీ తగినంతగా exploit చెయ్యలేదనిపిస్తుంది.

కథ, నవల, కవిత, చిత్రం, సంగీతం వీటన్నిటికీ భిన్నంగా వచ్చిన సినెమా అనే కొత్త కళలో ఆసక్తి వున్నవారు తప్పక చూడతగ్గ లఘు చిత్రమిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here