లోకల్ క్లాసిక్స్ – 11: నిహలానీ నిప్పు కణిక!

0
5

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఆక్రోశ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఆక్రోశ్’ (హిందీ/ఆర్ట్)

[dropcap]స[/dropcap]మాంతర – ఆర్ట్ సినిమాల రంగాన్ని పాలిస్తూ బాలీవుడ్ ప్రధాన స్రవంతి సినిమాలకి ప్రమోట్ అయిన దర్శకుడు, రచయితా, ఛాయాగ్రాహకుడు గోవింద్ నిహలానీ, ‘అర్థ సత్య’ అనే ఆర్ట్ సినిమాతో చాలా ప్రసిద్ధుడు. దేశంలో ఇతర ఆర్ట్  సినిమాల దర్శకులు వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాషాల్లో సినిమాలు తీస్తే, నిహలానీ హిందీలో తీస్తూపోయారు. 1980 – 2017 మధ్య 17 సినిమాలూ తీశారు. 1980 లలోనే ఆర్ట్ సినిమాలు అంతరిస్తున్న వేళ రంగప్రవేశం చేసి, 1990 లలో ఆర్ట్ సినిమాలు పూర్తిగా ఆదరణ కోల్పోయి మూతబడ్డ కాలంలోనూ తీస్తూ పోయారు. హిందీలోనే తీయడం వల్ల కలిసి వచ్చింది. ఇక శ్యాం బెనెగళ్ లాగే ఆర్ట్ సినిమాలకి బాలీవుడ్ స్టార్స్ అండదండలు అవసరమని భావించి, 1999 లో అజయ్ దేవగణ్ – టబూలతో ‘తక్షక్’ తీసి, శ్యాం బెనెగళ్ ప్రవేశపెట్టిన కమర్షియలార్ట్ అనే ‘క్రాసోవర్’ సినిమాల బాటలో ప్రధాన స్రవంతిలోకి వచ్చేశారు.

అయితే 1980లో వస్తూనే ‘ఆక్రోశ్’తో బిగ్ బ్యాంగిచ్చారు. ఆర్ట్ సినిమాల ప్రపంచం ఉలిక్కిపడి లేచి కూర్చున్నంత పనైంది. సున్నితమైన కథని ఇంత కటువుగా చెప్పడమన్నది ఆర్ట్ సినిమాల్లో చూడలేదు. ముగింపుని ఇంత కర్కశంగా చూపడమన్నది కూడా మునుపు లేదు. ఈ విజయంతో జాతీయ అంతర్జాతీయ అవార్డు లందుకుని ఇదే పంథాలో ఆర్ట్ సినిమాల్ని విసురుతూ పోయారు. 1983లో తీసిన ‘అర్ధ సత్య’ పోలీసులు- రాజకీయ నాయకుల చదరంగపు ఆటతో ఇంకో సంచలనం. ఏది తీసినా సామాజిక కథలే తీశారు. 2004లో అమితాబ్ బచ్చన్ – కరీనా కపూర్ – ఓంపురి లతో ‘దేవ్’ తీశాక, ఇంతవరకూ మరో రెండు మాత్రమే తీశారు – ఒక యానిమేషన్, ఇంకో చిన్న సినిమా.

‘ఆక్రోశ్’ ఆ కాలంలో నిత్యకృత్యమైన ఫ్యూడల్- నక్సల్- పోలీస్- కోర్టు చతుర్భుజ వికృతపుటాటలో విలవిల్లాడే ఆదివాసీ ఆక్రోశాల ఆర్తనాదం. ఒక చితి మంటతో పంటి బిగువున దాచుకున్న ఆగ్రహం, ఇంకో చితి మంటతో హృదయవిదారక ఆర్తనాదమై అడవితల్లికి విన్పించుకునే అన్యాయం. అడవితల్లి ఇలాటి ఎన్నో కథలు బిక్కచచ్చిపోయి వింటూనే వుంటుంది…

లహణ్య కథ

లహణ్యకి బేడీలేసి చితి దగ్గరికి తీసుకొస్తారు పోలీసులు. భార్య నాగి చితికి నిప్పంటిస్తాడు లహణ్య. చితి మంటల అవతల ముసలి తండ్రి, చెల్లి, తనకి పుట్టిన నెలల కొడుకు. వాళ్ళ కేసే తీక్షణంగా చూస్తాడు లహణ్య. లాక్కెళ్ళి పోతారు పోలీసులు.

బీచిలో వాకింగ్ చేస్తూంటాడు జడ్జి. కొంత దూరంలో లాయర్ భాస్కర్ కులకర్ణి గబగబా వచ్చి, బట్టలు తీసేసి సముద్రపుటలల్లో ఒక్క దూకు దూకి స్నానించడం చూస్తాడు. ఒక అల తనవైపు వచ్చేస్తూంటే చటుక్కున జరిగిపోయి వెళ్ళిపోతాడు జడ్జి. లహణ్యని కేసులోంచి కాపాడేందుకు భాస్కర్ లాంటి కొత్త లాయర్ ముందూ వెనుకా చూడకుండా న్యాయ ప్రక్రియ అనే మహా సాగరంలోకి దూకేస్తే, న్యాయమూర్తిగా తను అంటీ ముట్టకుండా ఈ కేసుతో వ్యవహరించ దల్చుకున్నాడన్న మాట. చుక్క సముద్రపు నీరు అంటకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు.

బ్రాహ్మణ లాయర్ భాస్కర్ కులకర్ణి (నసీరుద్దీన్ షా), ఆదివాసీ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొసానే (అమ్రిష్ పురి) దగ్గర జ్యూనియర్ గా చేసిన వాడే. నోరు విప్పి ఒక్క మాటా పలకని లహణ్యకి లాయర్ లేక, ప్రభుత్వమే భాస్కర్‌ని న్యాయవాదిగా నియమించింది. ఇలా నిందితుడు లహణ్య కేసులో తను డిఫెన్స్, తనకి వ్యతిరేకంగా గురువు దొసానే ప్రాసిక్యూషన్. కానీ ఎన్నిసార్లు భాస్కర్ జైలుకెళ్ళి మాట్లాడినా లహణ్య పలకడే? నీ భార్యని నువ్వు చంపలేదు, మరెవరు చంపారు, అసలేం జరిగిందో చెప్పమంటే చెప్పకుండా చూస్తూ వుంటాడు. ఆ చూపేమిటో, ఆ మనసులో ఏముందో, ఏం పెట్టుకుని మూగ నోము పట్టాడో అర్థం గావడం లేదు. ఇతడి కేసెలా వాదించాలి? ఎలా కాపాడాలి?

మరో వైపు దొసానేకి ఆకాశరామన్న కాల్స్. శిష్యుడితో కుమ్మక్కై నీ కులపు లహణ్యని కాపాడుకుందా మనుకుంటున్నావా – అంటూ పచ్చి బూతులు తిడుతూ కాల్స్. దొసానే కష్టపడి పైకొచ్చి, ఉన్నత కులాల డాక్టర్, డీఎస్పీ, జెడ్పీ చైర్మన్, ఇంకిద్దరు పోలిటీషియన్లు, ఫారెస్ట్ కాంట్రాక్టర్  తదితరుల ఎలీట్ క్లబ్‌లో మెంబర్‌గా స్థానం పొందాడు. వాళ్లతో కలిసి క్లబ్‌లో కాలక్షేపం చేస్తాడు. వీళ్ళలోనే తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు ఇచ్చిన డాక్టర్, లహణ్య మీద బనాయింపు కేసు పెట్టిన డీఎస్పీ వున్నారు. ఏం చేస్తాడు? పైగా లహణ్య భార్య నాగి మీద సామూహిక అత్యాచారం చేసి చంపిన వాడే ఈ జెడ్పీ చైర్మన్ భోస్లే. వీళ్ళ మధ్య తనకి కష్టంగా వుంది.

అటు భాస్కర్ ఇక లాభం లేదని సైకిలేసుకుని వూరు మీద పడతాడు. చార్జి షీటు సరే, లహణ్య నోరు విప్పకపోతే ఇక తనే ఇన్వెస్టిగేట్ చేసి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అడవికెళ్ళి గుడిసెలో లహణ్య తండ్రిని అడిగినా చెప్పనంటూ మౌనమే. పెళ్లికాని  లహణ్య చెల్లెలు పాలు తాగే అన్న కొడుకుతో అనుభవం లేని పోషణ పాట్లు. ఆమె కూడా పలకదు. పైగా కొందరు ఆదివాసీలు వచ్చి భాస్కర్‌ని బెదిరింపుగా చూడ్డం. వెళ్ళిపొమ్మంటూ సైకిలు బెల్లు మోగించడం. ఖర్మరా అని సైకిలెక్కి భాస్కర్ వెళ్లిపోతూంటే అడవికొచ్చిన అన్న ఆపి,  అంతా తెలుసుకుంటున్నట్టు, తగిన సమాచారం సేకరించి ఇస్తాననడం, అవసరమైతే తమ పద్ధతిలో తగిన న్యాయం కూడా చేస్తామని చెప్పడం. ‘దొర’ మీద దృష్టి వుందని వెల్లడించడం.

ఇక్కడికొచ్చే ముందు భాస్కర్ నాగి హత్యావార్త అచ్చేసిన పత్రికా ఫీసుకి ఫాలోఅప్ న్యూస్ కోసం వెళ్లి, సంపాదకుడ్ని అడిగితే, ఆ తిక్క సంపాదకుడు తిక్కతిక్కగా చెప్పి వెళ్ళ గొట్టాడు. సరేనని ఇప్పుడు రాత్రి ఇంటి కొచ్చి రేడియోలో పాట పెట్టుకుని పడుకుంటే, ఇంటి మీద దుండగుల దాడి! భయంతో లుంగ చుట్టుకుని పడుకున్నాడు. ఇంకో రాత్రి వొంటరిగా వస్తూంటే కత్తితో దాడి! లబోదిబోమని గురువు గారింట్లో జొరబడితే, ఆయన డీఎస్పీకి ఫోన్ చేసి సెక్యూరిటీ ఏర్పాటు. ఆ సెక్యూరిటీతో బీచిలో షికారెళ్తే, ఎవరో అనుమానాస్పదంగా దగ్గరికి రావడంతో అక్కడ్నించీ పరుగో పరుగు! బీచిలోనే అంటీ ముట్టకుండా షికారు చేస్తున్న జడ్జి గారికి తగిలి చెప్పుకుంటే, ఆయన తిట్టి వెళ్ళగొట్టడం. మళ్ళీ రాత్రి గురువుగారు క్లాసు పీకడం. నీ దగ్గరికి వాడెవడో సిగరెట్ కోసం వస్తే ఇంత రభస చేస్తావా అని తిట్టడం. అసలే కొత్తగా కేసు, దీంతో తనెంత మొనగాడో అక్షరాలా బయట పడుతోంది!

కోర్టులో విచారణ ప్రారంభమైనప్పుడూ లహణ్య అదే మౌనం. భార్యని చంపిందెవరో చెప్పకుండా ఉరికంబం ఎక్కాలనుకుంటున్నాడా? కేసు తనకి వ్యతిరేకంగా రుజువు కాబోతోందని  భయం కూడా లేదే? ఏమిటీ వీడు? వీడ్నెలా కాపాడాలి? డాక్టర్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఆయన పొంతన లేని సమాధానాలు. మృతురాలి శరీరం మీద రక్కుళ్ళున్నాయట గానీ అవి లైంగిక దాడి వల్ల అయినవి కాదట, చంపి నీళ్ళు లేని బావిలో పడేయడం వల్ల అయినవి అట. మృతురాలి మీద అత్యాచారమే జరగలేదట.

ఇది విని మండిపోతున్న లహణ్యకి ఆ కాళ రాత్రి కళ్ళముందు ప్రత్యక్షం – గెస్ట్‌హౌస్‌లో ‘దొర’, అతడి దోస్తులు నాగిమీద జరుపుతున్న దమనకాండ. అరుస్తూ తను తలుపులెంత బాదినా ఆగకుండా సర్వనాశనం. ‘దొర’ మూక తన మీద దాడి. హెచ్చరిక. అరెస్టు. తనమీదే నాగిని చంపిన కేసు. తాగుడికి తన దగ్గర డబ్బుల్లేక, నాగిని పడుకుని సంపాదించి తెమ్మని వేధించి చంపాడట…

ఇది గుండెల్లో దాచుకుని ఏం చేయాలానుకుంటున్నాడు లహణ్య? ఈ కేసు ఎలా తేలింది? లహణ్య కథ ఎలా ముగించాడు?

(వచ్చే వారం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here