దివ్యాoగ ధీరులు 2 – ఆమె అంధత్వాన్ని అధిగమిస్తోంది

0
3

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. సంతోషి అనే యువతి తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని ఆమె మాటలలోనే వివరిస్తున్నారు. [/box]

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం కల్లా పరీక్షలన్నీ అయిపోయాయి. అంధ విద్యార్థినులందరూ ఉత్సాహంగా పెట్టెలు సర్దుకున్నారు. సెలవల్లో ఏమి చేయబోతున్నది తమ అమ్మలచేత ఏమేమి వoడించుకునేది చర్చించుకున్నారు.

బిలబిలలాడుతూ హాస్టల్లో వున్నా అమ్మాయిలందరూ వెళ్లిపోయారు. నేను నా తోటి ఇద్దరమ్మాయిలం మిగిలాము. ఆ ఇద్దరమ్మాయిల అమ్మానాన్నలు చాలా పేదవారు. అందుకని వాళ్లకి తమ టికెట్ పెట్టుకుని వూరికి వఛ్చి వెళ్లడం ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయిలకి వొచ్చిన పింఛను డబ్బు కాస్తో కూస్తో వాళ్ళ వాళ్ళు తీసుకుంటున్నా కూడా వారి ఆర్థిక సమస్య తీరడం లేదు. అందుకే ఊళ్ళకి వీళ్ళు వెళ్లరు. ఐనా వారికి దూరంగా వుండినా ఫోన్ లో మాట్లాడుతూ వుంటారు.. అమ్మాయిలు ఒకరి ఆర్థిక సమస్యలు మరొకరికి చెప్పుకుంటూ ఊరట పొందుతూ ఉంటారెప్పుడూ. వారితో నేను కలవలేను.

నా విషయం అది కాదు. నేను అనాథని. నా కెవ్వరూ… ఎవ్వరూ లేరు. అనాథ కావడం ఎంతో బాధాకరం. అంధురాలు కావడం మరింత బాధాకరం. పిల్లలు అంధులైతే తల్లితండ్రులు బాధపడతారని వారిని బాగు చేసుకోడానికి ఎన్నో ఆసుపత్రుల చుట్ట తిరుగుతారని విన్నాను. నేను ఒంటరిని. ఓదార్చే వారు లేక, కాపాడేవారు లేక కలత చెందే దురదృష్టవంతురాలిని. నిజంగా నేను చాలా చాలా దురదృష్టవంతురాలిని.

నేను తెలంగాణాకి చెందిన అమ్మాయిని. నా పేరు సంతోషి. మా నాన్నచిన్న పనేదో చేసేవాడట. చిన్నప్పటినుండి నాన్న ఇల్లు వాకిలి పట్టించుకోకుండా బాధ్యతా రాహిత్యంగా ఉండేవాడట. బాధ్యత తెలియాలని వాళ్ళ అమ్మానాన్న పెళ్లిచేశారట. కానీ మార్పు లేదు. ఎవరెంత చెప్పినా వినలేదట. తాత పంచాయితీ పెట్టించాడట. ఫలితం శూన్యం. ఎవరెన్ని చేసినా ప్రయోజనం ఉండేది కాదట. అమ్మని పట్టించుకునేవాడు కాడట. కడుపుతో వున్నా అమ్మని ఏదో ఒక రకంగా సాధించేవాడట. నేను పుట్టాక కూడా మార్పులేదట.

భార్యాపిల్ల జోలి లేకుండా నాన్న తాగుతూ తిరుగుతూ ఉండేవాడట. ఆ విషయం మీద అమ్మానాన్నలకు పోట్లాటలు అవుతుండేవట. మామూలు పోట్లాటలు కాక యుద్ద్ధంలో శత్రువుల మాదిరిగా భయంకరంగా వాదులాడుకునేవారట. అమ్మమ్మ తాత అమ్మకి తామే అన్యాయం చేశామని బాధ పడేవారట. తాగుడు మాని సంసారo సరిగ్గా చూసుకోమని, పిల్ల బాధ్యత తీసుకోమని అమ్మ చెప్పినా వినని నాన్న అమ్మని చావబాదేవాడట. అమ్మకి అటు పాలుతాగే పసికందునైన నన్ను చూసుకోడం, మరోపక్క కూలికెళ్లి డబ్బుతేవడం, ఆ డబ్బు లాక్కుని చావగొడుతున్న నాన్నతో యుద్ధం చెయ్యడం విసుగ్గా చికాగ్గా ఉండడమే కాదు శక్తికి మించిన భారంగా ఉండేదట.

ఒక రోజు నాన్నతో చాలా పెద్ద గొడవ అయ్యిందిట.ఆయన అమ్మ కూలి డబ్బు మొత్తం లాక్కోడమే కాక ఆవిడని చావగొట్టి పోయాడట,. ఆ రోజు తాగి తూలుకుంటూ నాన్న లారీ కింద పడి చనిపోయాడట. తాగుడుకు ఆయన చేసిన అప్పులు కూడా అమ్మని తీర్చమని అప్పులవాళ్ళు అమ్మని వేధించేవారట.

విరక్తిగా కన్నీళ్లు పెట్టుకుంటున్న అమ్మతో ‘మందు తాగు. అటు శరీరమూ ఇటు మనసూ కుదుట పడతాయ’ని చెప్పిందిట స్నేహితురాలు. దాంతో అమ్మ విపరీతంగా కల్లు తాగతాడం ప్రారంభించిందిట. అది ఆమెకి వ్యసనమైందిట. పగలు కూలీకి వెళ్లడం, రాత్రి తాగడం ఆమె జీవితంలో భాగాలయ్యాయట. ఒక రోజు సాయంత్రం ఏడుస్తూ వున్న నన్ను చంకనేసుకుని ఎటో బయల్దేరిందిట. తాతా అమ్మమ్మ అడ్డుకున్నా వినిపించుకోకుండా గబగబా దూసుకుపోయిందిట.

అమ్మ తన తలరాతకు ఏడుస్తూ ఎక్కడెక్కడో తిరిగి మత్తుగా ఒక చోట కూర్చుందిట. వొళ్ళో నేనున్నానట. ఈలోగా నేను ఒళ్ళోంచి జారానో అమ్మ మత్తులో తెలీక నన్ను జారవిడుచుకుందో కానీ నేను ముళ్ళ కంచెల మీద పడ్డానట. ముళ్ళు గుచ్ఛుకుని వున్ననేను ఆసుపత్రిలో కొద్దికాలం ఉన్నానట. ఏదేదో వైద్యం చేయించారట. కానీ చూపులు కోల్పోయానట. అమ్మ తాగుడు మత్తులో ఇంకేమి చేస్తుందో అని నన్నుతాత అనాథ ఆశ్రమంలో చేర్చాడట. నా కళ్ళు చూడ్డానికి కూడా భయంకరంగా తయారయ్యాయిట. ఇవన్నీ ఎవరో దూరం చుట్టం స్కూల్లో చదివే రోజుల్లోనే చెప్పింది. నన్ను పోషించలేనని అంది. తానే పేదది, నలుగురు పిల్లల తల్లి. నన్నేమి పోషిస్తుంది? పైగా నేను మామూలు అమ్మాయిని కూడా కాదుకదా.

తాత అమ్మమ్మ నన్ను ఆశ్రమంలో చేర్చిన కొంత కాలానికీ పోయారట. ఇవన్నీ చెప్పిన దూరపు చుట్టం 20 రూపాయాల నోటును నా చేతికిచ్చి ఇంతకంటే ఇంకేమి ఇవ్వలేనని తననుండి ఏ రకమైన చేయూతని ఆశించవద్దని చెప్పింది. ఆ ఇరవైనోటును నాకివ్వడానికికూడా ఆమె ఏదో ఒక ఖర్చును ఆపుకుందని నా తెలుసు.

దిల్‌సుఖ్‌నగర్ హాస్టల్లో ఏళ్ళు గడిపాను. చదువుకునే బడి హాస్టల్ తప్ప వేరే ప్రపంచం లేకుండా కాలం గడిపాను. చక్కగా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. నేనెలా ఉంటానో చూసుకోలేను. కానీ తయారయ్యానన్న తృప్తి మనసుకు నిండుగా అనిపిస్తుంది.  పాటలు పడతాను. జానపదగీతాలు నా కంఠానికి నప్పుతాయని అందరూ అంటారు. నా చెవులు అది ఒప్పుకుని మురిసిపోతాయి. నా బిడ్డ మంచి గాయని అని ముద్దాడే వాళ్ళు నాకు లేరుగా. అందుకని నన్ను నేనే అభినందించుకోవాలి. అదే చేస్తూ వుంటాను.

       

ఒకరోజు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు భవానీశంకర్ అనే సర్ మా హాస్టల్‌కి వచ్చారు. నాతో ఎంతో బాగా మాట్లాడారు. తెలియని సంగతులెన్నో చెప్పారు. పాట పాడమన్నారు. పాడాక మెచ్చుకున్నారు.

నేను అనాథనని తెలిసి నా భుజం తట్టారు. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు మా సంస్థ బిడ్డవి అన్నారు. నిన్ను చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలాగా చూస్తామన్నారు.

కన్నీళ్లు జలజలా కారిపోయాయి. ఆయన చదివిస్తానన్నందుకు కాదు. పాటలు నేర్పుతానన్నందుకు కాదు. నా కాళ్ళమీద నిలబడేలాగ చూసే పూచి తీసుకున్నందుకు కాదు. నీకు మేమున్నామన్నoదుకు. ఆ మాట నాకు ప్రాణం పోసినట్టనిపించింది. నిజంగా వాళ్ళు నాకు ఉండనీ లేకుండనీ. కనీసం ఆ మాట కూడా ఇప్పటిదాకా నాతో ఎవ్వరూ అనలేదు. అందుకే అది నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది. ఆ రోజంతా ఆ వాక్యం నా చెవుల్లో మారుమ్రోగుతూనే వుంది.

గైడింగ్ లైట్ ఫౌండేషన్ నా స్వంత ఇల్లు అనిపించింది. హాస్టల్లో అందరూ నన్ను ‘ఎప్పుడూ పడుకుంటుంది. బద్ధకస్తురాలు,బెల్లం కొట్టిన రాయి’ అంటూ వుంటారు. పడుకుంటే కమ్మటి కలలు నా చీకటి నేత్రాలకి కూడా చైతన్య దీపాల్లా కనబడతాయి. కలల్లో అమ్మా నాన్నల మధ్య గారాలపట్టిలాగ నేను ఆడుతూ పాడుతూ వుంటాను. అలకలు పోతూ బ్రతిమాలించుకుంటూ అందరిమధ్య కూర్చుని కబుర్లాడుకుంటూ జోలపాడించుకుంటూ మేలుకొలుపులు పాడించుకుంటూ వుంటాను.

భవానీశంకర్ సర్ వఛ్చిన రోజు నాకు పడుకోవాలనిపించలేదు. ఆయన అన్నమాటలు నెమరువేసుకుంటూ కూర్చుండిపోవాలనిపించింది. ఆయనని నేను చూడలేను. కానీ ఆయన కళ్ళు నాపై అభిమానపు జల్లులు కురిపిస్తున్నాయి. పుత్రికా వాత్సల్యాన్ని అందిస్తున్నాయి. ఆ మాట నేను నా పక్క బెడ్ల మీద పడుకునే అమ్మాయిలతో అన్నాను. వాళ్ళు అభినందించారు. గదిని ఊడుస్తున్న ఆయా మాత్రం మా మాటలు మధ్యలో ఆపింది.

“అతను అభిమానం పంచడం నిజమే కానీ అభిమానంగా చూడడం నిజం కాదు అతను నీలాగే అంధుడు” అని చెప్పింది.

నేను షాక్‌కి గురయ్యాను. అంధులు అందరి సాయం అందుకుంటూ వుంటారు కానీ అందరికి సాయం చేయగలిగి వుంటారా? భవానీశంకర్ సర్ అందుకు ఉదాహరణగా నిలవడం నన్ను ఆశ్చర్యానందాలు ఏకకాలంలో అనుభవించేలా చేసింది. గర్వo కూడా కలిగించింది. భవానీ శంకర్ సర్, మైధిలి ఆంటీ చిన్నూ అన్నల ఇల్లు నిజంగా నా పుట్టిల్లయ్యింది. అక్కడ ప్రేమ పుష్కలంగా లభించింది.

భవానీశంకర్ సర్ ద్వారా శోభా మామ్ పరిచేయమయ్యారు. ‘నన్ను మీ అమ్మలా అనుకోండి’ అన్నారు, ఆమే నాకూ నా తోటి అంధ విద్యార్థినులకు మంచి చెడు చెప్పారు. కష్ట సుఖాలు పాలుపంచుకున్నారు. అప్పుడే నేను నా సమస్యని బిడియంగా విప్పి చెప్పాను. నాకు 18 ఏళ్ళు వచ్చినా అందరు ఆడపిల్లల్లా నెలసరి రాలేదు. అలా రాకపోవడం మంచిది కాదని అన్నారు మామ్.

వెంటనే మా ఆడపిల్లలందరికి మెడికల్ క్యాంపు కండక్ట్ చేశారు. ఇంచుమించు అందరమ్మాయిలకీ రక్త హీనత వుంది. కాల్షియమ్ డెఫిషియన్సీ వుంది. ఎక్స్‌పర్ట్ లేడీ డాక్టర్, డాక్టర్ మంగళ అన్ని చెక్ చేసి ఉచితంగా టానికులూ టాబిలెట్లూ ఇచ్చారు. నా కోసం స్పెషల్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. శోభా మామ్ మాకందరికి వంటచేసి తినిపించారు. పళ్ళు, స్నాక్స్ కూడా ఇఛ్చి ఆటోల్లో ఎక్కించి పంపారు. నా ట్రీట్మెంట్ జరిగిన మూడు నెలలకి నేను పెద్దమనిషినయ్యాను.

ఆడపిల్లలు లేని మామ్ నేను రజస్వల అయినా ఫంక్షన్ని ఘనంగా చేశారు. వాళ్ళ చుట్టాలు మిత్రులూ శ్రేయోభిలాషులూ వచ్చారు. నాకు బట్టలు ఇతర వస్తువులు కానుకగా ఇచ్చారు. మామ్ ముత్యాల సెట్టూ, బట్టలూ ఇచ్చారు. అందరం భోజనాలు చేసాము. ఆ రోజు సంతోషంతో నాకు నిద్రపట్టలేదు.

నాకు అందరూ వున్నారు. ఆదుకుంటారు. ఆనందం పంచుతారు. అపురూపంగా చూసుకుంటారు అనుకున్నాను. డాక్టరుగారు చెప్పిన చోట్లకి మామ్‌‌తో కలసి చెకింగ్‍లకి వెళ్ళాము. రిపోర్టులవల్ల వైద్యం జరిగి అందరం ఆరోగ్యాన్ని పుంజుకున్నాము. మామ్ ద్వారా నాకు ఉచిత ఫీస్లు, బట్టలు, ఇతర వస్తువులు అయిన ఎంపీ త్రీ ప్లేయర్ వగైరాలెన్నో లభించాయి. ఒక అన్న పూర్తిగా నా ఫీస్లు కట్టే సాయం దొరికింది.

భవానీశంకర్ సర్ నాకు ఇతర అమ్మాయిలకి పాటలు నేర్పారు. నాకు ఆధార్ కార్డు, డిసేబుల్డ్ సర్టిఫికెట్ ఇప్పించారు. అన్నింటికంటె ముఖ్యంగా ఆయనొక మాట చెప్పారు. “ఎవరో రావాలని, చెయ్యందుకుని నడిపించాలని మనం ఎప్పుడూ ఆశించకూడదు. మనకి మనమే ధైర్యం తెచ్చుకుని ముందుకు నడవాలి. దార్లో కాలుకి ఏదో తగిలి కింద పడినా నడక ఆపకూడదు. ఒంటరిగా వెళ్లే అలవాటు చేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఒంటరిగా వెళ్లి గాయాలు తగిలించుకున్నాను. చివరికి గట్టిపడ్డాను. ఇప్పుడు వేరే ఊర్లకి కూడా ఒక్కడిని వెడతాను. నువ్వూ ఆలాగై తయారవ్వాలి.”

ఆ మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. అప్పటినుండి ఎంతెంత దూరాలకైనా ట్రాఫిక్ బాగా వుండే రోడ్లమీదకైనా ఒంటరిగా వెళ్లడం అలవాటు చేసుకున్నాను.

గైడింగ్ లైట్ నాకు ఆట, పాట, మాట నేర్పింది. ధైర్యం అలవరచింది. వేదికలమీద నేను ధైర్యంగా ఎన్నో షోలలో అందుకీ పాడగలుగుతున్నాను. ఎలా పూజ చెయ్యాలి. దేముడికేలా సేవలు చేసుకోవాలి వగైరా మామ్ నేర్పితే, ఎలా భజన చేసి భగవంతుడిని మెప్పించాలి అనేది భవాని శంకర్ సర్ నేర్పించారు.

ఇప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవ్వట్లేదు. డిగ్రీ పూర్తవుతోందన్న ధీమాలో వున్నాను. కళాకారిణిగా ముందడుగు వేస్తున్నానన్న ఆనందంతో వున్నాను. నా తర్వాతి తరాలవారికి ధైర్యం చెప్పగలగడమే కాదు వైకల్యాన్ని అధిగమించే స్థైర్యం అలవరచుకుని ముందుకి సాగే మూడ్‌లో వున్నాను. అనాథనని అనుకోడం ఎప్పుడో మానేసిన నేను అత్యంత ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నాను. ఒంటరి ప్రయాణాన్ని ధైర్యంగా చేయగలుగుతున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here