అనుబంధ బంధాలు-35

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 35వ భాగం. [/box]

[dropcap]“మా[/dropcap]మయ్యా నాకు తెలీక అడుగుతానూ, విత్తనం వేసాక పంట పండాలంటే చాలా కాలము పడతది. విత్తనం తేవాలి, పొలం ఋజువు చెయ్యాలి. విత్తాలి, నీళ్ళు కావాలి. పైరు మొలవాలి. రోగం రోష్టు లేకుండా అది ఎదగాలి. పొట్టకు రావాలి, ఈనాలి, కంకి పాలు పోసుకోవాలి. ముదరాలి. మెరువుకు రావాలి. అప్పుడు దాన్ని కోసి కైలు జేసి ఇంటికి వస్తేగానీ పంట చేతి కొచ్చినట్టు అవదు” అంది.

“అవును. ఎంత చాకిరీతో కూడుకున్న పననుకున్నావు. మజాక్ కాదు” అన్నది.

“ఇదిగాక పిల్లలుంటే వాళ్ళను తయారు చేసి వండి ఇంత పెట్టి బళ్ళకు పంపాలి గదా. ఇప్పుడు…. మరి ఇదంతా పని కాదంటారా. ఇందులో మగా అడా తేడా అని లేదుగానీ ఈ పనిలో కష్టం… మీరు అర్థం చేసుకుంటే గదా తెలుస్తది” అంది.

‘మంచి మాటేదో చెప్పినట్లుగా ప్రారంభించి ఇది కూడా’ అనుకున్నాడు.

“నీళ్ళు పెట్టాను” అంది శాంతమ్మ. లేచాడు.

స్నానానికి వెళ్తూ “విజయా నువ్వు ఉండు, బాగా చీకటి పడింది. నేనొచ్చి దిగబెడతాను” అన్నాడు.

“అంత అబలల్ని చేసారు ఆడాళ్ళని. అంతేనా మామయ్యా, చీకటి పడ్డాక ఉన్న ఊళ్ళో బజారు దాటాలంటే మగ తోడు కావాలి. ఆ తోడు లేకపోతే చాలా ప్రమాదమనీ, వాటిని తట్టుకునేందుకు ఆడవారు సరిపోరనీ గమనంలోకి వచ్చేలా పిరికి పారేలా చేసారు” అంది నవ్వుతూ.

‘దీనికి పైత్యం ఎక్కువయింది’ అనుకుంటూ నడచాడు.

శాంతమ్మ వచ్చి విజయ ప్రక్కన కూర్చుంది.

“ఇక నేను వెళ్తాను!” అంటూ లేచింది విజయ.

“వస్తానన్నాడు గదా, ఆగు.”

“ఎందుకాగాలి? మొగాళ్ళకు అలా అనడం అలవాటు. మనకు రక్షణ కవచంలా వారుండి నిత్యం కాపాడుతుంటారనిపించుకునేందుకు. మనం నిజంగానే చాలా బలహీనులం అనేది మనకు అవగాహనలోకి వచ్చేందుకు చాలా సహజంగా ప్రవర్తిస్తుంటారు” అంటూనే గడప దాటింది విజయ.

స్నానం ముగించి వచ్చిన దీక్షితులు “అమ్మాయేది?” అనడిగాడు.

“వెళ్ళింది.”

“ఒక్కర్తేనా?”

“ఊఁ.”

“నీకసలు బుద్ది ఉందా? ఒంటరిగానా దాన్ని పంపేది? చీకటి పడ్డాక ఆడపిల్లను గడప దాటనీయవచ్చా?” అన్నాడు కోపంగా.

“మగ జాతి మీద మీకు అంతటి నమ్మకం సదభిప్రాయం ఉందన్నమాట” అంది.

“నేనెందుకు చెప్పుతున్నానో అర్థం చేసుకొనలేదు. పైగా వితండవాదన. శాంతా, నెల రోజులుగా నీ వరసలో మార్పు కనిపిస్తుంది. మంచిదేననుకో కానీ మన చుట్టూరా ఉన్న సమాజాన్ని దాని నడక తీరునూ క్షుణ్ణంగా పరిశీలించు, అవగతమవుతది. పెంకితనం కొన్ని సందర్భాలలో ముద్దుగా ఉండొచ్చు గానీ రాణించదు. ఒక్కసారి భరించలేనిదిగా అవుతది” అన్నాడు కోపాన్ని బలవంతాన దిగమింగుతూ.

“అర్ధరాత్రి ఆడపిల్ల నిర్భీతిగా తిరగగల సమాజం కావాలని బాపుజీ కలలు కన్నాడు. అలా చెప్పకుండా మాములు మనిషి నిర్భయంగా ఏ రాత్రయినా సంచరించగల సమాజం కావాలని కోరుకుంటే బావుండేది. ఆడపిల్ల నిర్భీతిగా అంటే ఆడపిల్ల అనగానే బలహీనురాలని మనకు స్ఫురించుతుంది గదా. బలహీనులు కూడా నిర్భయంగా అర్ధరాత్రి తిరగడం అని కాదా? అట్టా అవసరం లేదు. మనిషి ఆడా మగా తేడా అక్కరలేదు. ఈ మగయిన ఎంత సూర్మన్ కాడు. అయినా అలా తిరగగల సమాజాన్ని కోరుకొని ఉంటే ఇంకా బావుండేది. కొండో కచో ఆయన ఆశ ఫలించే అవకాశం ఉండి ఉండేది. రోజూ పేపరు చూస్తున్నా మనకు ఈ సమాజంపై ఒక అభిప్రాయం ఉంది. మగాడు కూడా ధైర్యంగా తిరగాడ లేని దుస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇట్టాంటి వాతావరణం ఉందని తెలిసి పిల్లని అంటారు.

అంతే కదా, మన పల్లెలు ఇంకా అంత తెంపరితనాన్ని అలవరుచుకోలేదు. మనని ఏలుతున్న రాజకీయ అరాచకవాదులు ఎంత వెధవలుగా కనిపిస్తున్నా పెద్దా చిన్నా మంచీ చెడు అనే విచక్షణ ఇంకా పోలేదు. పాపం అన్ని పార్టీల వారు కలిసి ఈ కాస్త మంచి మనుగడ తీరుని చెరపేందుకు నేల నాల్గు చెరగులా వారి శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారి కిరాతకమైన శ్రమ ఇంకా ఫలించలేదు. వారు మాత్రం ఆశావాదులు, అది మన దురదృష్టం.

హంపి నగరాన్ని దానిలో నిక్షిప్త పరుచుకున్న అపురూప శిల్ప సంపదనూ గెలిచిన రాజులు నాశనం చేసే ప్రయత్నంలో కొన్ని నెలలు కూలీలను వినియోగించినట్లుగా చరిత్ర చెప్పుతుంది. విరిగిన ముక్కలలో కూడా ఆ శిల్పకళా వైభవం ఇవాళ్టికి అత్యున్నతంగా అత్యద్భుతంగా దర్శనమిస్తుంది.

అంటే వారు పశుబలానికి శిధిలమవుతూ కూడా లొంగలేదన్నమాట. అలాగే మన నేతలు ఏభై సంవత్సరాల నుంచి చెస్తున్న అవిశ్రాంతపు అరాచకపు విధానాలు జాతి జీవన స్రవంతిని అంతగా ఛిద్రం చేయలేకపోయినయి. అయినా నాకు తేలీక అడుగుతాను….

వీళ్ళసలు దేశాన్నీ, దేశ ప్రజలనూ పాలిస్తున్నారా? లేక తిరుపతి వెంకన్నలా నిలువు దోపిడి చేస్తున్నారా?

వీరి తీరు మాములు జనానికి అర్థమయ్యాక కూడా ఎంత నిర్లజ్జగా… సిగ్గు శరం విడచి నాయకుల హోదాల్లోనే కనిపించే ప్రయత్నం చేయడమన్నదే అది మాత్రం భరించరాని స్థితి” అని ఆగింది.

“పిల్లదాన్ని ఒంటరిగా ఎందుకు పంపావేం నేను వస్తున్నను గదా, అంటే ఇంత ఉపన్యాసమా?”

‘ఇదేం విడ్డూరం? అసలీవిడ తన శాంతేనా?’ అన్న అనుమానం కల్గి మాటా పలుకూ పడిపోయిన వానిలా కూలబడిపోయాడు. ‘ఇక దీనితో మాట మాత్రంగా కూడా అడగడం తప్పు’ అనుకని లేచి చెప్పులు తొడుక్కుని బయలుదేరాడు.

దశరథం ఇంట్లకి జొరబడిందాకా తల ఎత్తలేదు. “దశరథా” అని పిలుస్తూ మాత్రమే తల ఎత్తాడు.

“ఇద్దరూ కలిసే వచ్చారా ఏమిటి?” అనడిగాడు.

“ఇద్దరెవరు?”

“అదేంట్రా? విజయా కూడా మీ ఇంటి దగ్గర నుంచేగా వచ్చింది” అన్నాడు ఆశ్చర్యపోతూ.

‘అంటే విజయ ఇంట్లోకి వచ్చిందన్నమాట’ అనుకుని “ఇక వెళ్తున్నా” అని వెనక్కి తిరిగాడు.

అసలు వీడు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టూ అన్న విషయం అర్థం కాలేదు దశరథానికి.

“దీక్షితులూ” అని కేక వేసాడు.

“పొద్దుటే వస్తాను” అంటూ చక చకా నడచాడు.

***

తృప్తి అనేది మానసికమైంది. కాకపోతే మనస్సు శరీరంలో ఉంటుంది గనుకే శరీరం మనస్సు ప్రేరణలోనే నడుస్తుంది గనుకా దాని activities లో ఇది ఉంటుంటుంది.

“ఇవ్వాళ్ళ చాలా తృప్తిగా ఉంది” అంటుంటాడొకడు.

అంటే అతనికున్న కోరికలు కొలిక్కి వచ్చినయన్నమాట. బ్రతుకు బొంగరం బాగానే తిరుగాడుతుందని అర్థం.

“అన్నార్తుడికి పట్టెడన్నం తృప్తినిస్తుంది.”

“వ్యవసాయదారునికి పాడీ పంటా తృప్తినిస్తుంది.”

“పని చేసుకని బ్రతుకీడ్చే వానికి అది దొరకడం తృప్తి.”

“కోరుకున్న పిల్లతో పెళ్ళయితే తృప్తి పడతారు కొందరు.”

ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు.

ఏది ఎన్నిరకాలుగా చెపుతూ పోయినా ఈ తృప్తి అనేది మనిషి ఆటుపోటుకు సంబంధించినది. న్యాయంగా ఇది మనిషి ఆకలిని తీర్చదు. ఆర్తిని చల్లార్చదు. కానీ ఈ రెంటినీ జయిస్తుంది. కామాతురత స్త్రీ పొందుతో తృప్తినిస్తే…. దాహం వేసిన వానికి ఇన్ని మంచి నీళ్ళు చాలు, బోలెడు తృప్తి.

“అమ్మా మీరు నాతోనే ఉంటారు. మీకు నేను తప్ప ఎవ్వరూ లేరు. ఈ విషయం తెలవని వారెవరు? అందుకే మీరు నాతో వస్తున్నారు” అంది విజయ.

ఎదురుగా దశరథం సీతమ్మ కూర్చుని ఉన్నారు. దీక్షితులు వింటున్నాడు.

సీతమ్మ అందపుడు…. “అమ్మా నువ్వు మాటాడే ముందు మన చుట్టూరా ఉన్న మన కుటుంబాలలో ఏం జరగుతూ వస్తుందో, వాళ్ళేలా ఉంటున్నారో గమనించు. అందున్న మంచి చెడుల ప్రస్తావన తరువాత తెద్దువుగాని. జరుగుతూ వస్తున్న పద్ధతుల పైన న్యాయాన్యాయాలను రుద్దకు. చూడు. ఆ తరువాత నీ నిర్ణయం చెప్పు. అలా కానప్పుడు సజావుగా నడచే కుటుంబాలలో చికాకులు కల్గుతాయి” అంది.

నాకూ తెల్సు అన్నట్లుగా చూసింది విజయ.

“అయితే ఇప్పటికీ నీకున్న ఉద్దేశం మారదా?” అడిగాడు దీక్షితులు. తల అడ్డంగా ఊపింది పెదవి కదపకుండా.

“అమ్మా విజయ ఇది పితృస్వామ్య వ్యవస్థ. అందుచేత అతగాని తల్లిదండ్రులు మాత్రమే అతనితో ఉంటారు. అదే ఇక్కడ మన కుటుంబాలలో జరుగుతూ వస్తున్న రివాజు. నాకు కొడుకు పోకుండా ఉంటే దగ్గరే ఉండేవాణ్ణి గదా.

భగవంతుడా నాకా అవకాశం ఇవ్వలేదు. కొడుకువయినా కూతురువయినా మాకు నువ్వే, కాదనను. నువ్వు కూతురువేనని ఈ సమాజం అంటుంది. కొడుకుగా మేం అనుకున్నా కుదరదు. అంటే నువ్వు నీ భర్తతో వెళ్ళిపోవల్సినదానవన్నమాట. నీ భర్త ఎంత ఇదయినా నీ తల్లిదండ్రులను నీతో తీసుకొని వస్తానంటే నిర్ణయం చెప్పాల్సింది అతనే. మేం నిన్ను అత్తారింటికి పంపి నీ బాగోగుల్ని దూరంగా ఉంటూ మాత్రమే గమనించాలి. ఇది ఇప్పటి తీరు. దీన్ని మనం కాదనలేము.  తప్పు పట్టే వీలులేనిదీ విషయం” అని నవ్వి “ఇందులో న్యాయాన్యాయ ప్రసక్తి వద్దు. నడుస్తున్న తీరు మాత్రమే ఈ స్థితిని సమాజం అంగీకరించి అనుసరస్తుంది గనుక” అని..

“అమ్మా దీనికి నువ్వు ఒక్కదానివే భిన్నంగా ఆలోచించినా కుదరదు. నీకు మాపైన అభిమానం ఆదరణ ఉండడం వేరు. బాధ్యత కూడా ఉంది. కాదనను. కూతురువు కనుక ఇంకొంచం ఎక్కువగా ఉన్నా ఏం లేదు. కానీ నువ్వు నీ భర్తకు ఇష్టం లేకుండా మా భారాన్ని అతని పై మోపడం సబబు గాదు. తొందరపడడం మూలాన చెడతది. అంటే మేం కోరుకున్న ఆశ మా కళ్ళ ముందే గజిబిజి అవుతది. మేం దాన్ని భరించలేం. అదీ మా కారణంగా జరగడానికి మేం ఒప్పుకోం. అయినా విజయా మాదేముంది ఊరు పొమ్మంటున్నది… కాడు రమ్మంటున్నది. అలాంటి మా కోసం నిండుగా నడచే నీ కాపురాన్ని కాదనుకోవద్దు. పెద్దవానిగా నీ శ్రేయోభిలాషిగా చెపుతున్నాను” అన్నాడు దీక్షితులు. విజయ విన్నదే కాని సమాధానం చెప్పలేదు.

దీక్షితులు చెప్పిన దాంట్లో సాంప్రదాయపు రివాజు కనిపించిందే తప్ప బిడ్డగా బాధ్యతా ధర్మం స్పురించలేదు అనుకొని, ‘అయినా బాద్యత అనేది ఒక్కమగవానికే ఉంటుందా? ఆడదానికి ఉండదా? చేతనయినపుడు చేసే ఏ ఉపకారమూ తప్పుకాదు గదా? మరి దీన్ని బేలతనంగా చూపి అనర్హురాలు అనడం న్యాయం కాదు గదా’ అనుకుంది విజయ.

ఈ సమాజాన్ని ఇలా మలుపుతూ వచ్చిన మేధావులపై జుగుప్స కల్గింది. కళ్ళ వెంట నీరుబికింది.

కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి “మామయ్యా నేను చిన్న పిల్లలకు బడి చెపుదామనుకుంటున్నాను” అంది స్థిరంగా. ఉలిక్కి పడ్డారు ముగ్గురూ.

“ఇక్కడ బడి చెప్తావుటే?” అంది సీతమ్మ. తల ఊపింది దృఢంగా.

“మమ్మల్ని సుఖ పెట్టడానికేనా?”

“ఊఁ.”

“నీ సంసారాన్నేం చేస్తావు?”

‘భార్యాభర్తలు కలసి ఉండి చేస్తేనే గదా సంసారమయ్యేది’ అనుకొని మాటడలేదు.

“ఇదన్నయ్యా, దీని వరస. చెప్తే వినే అలవాటు లేదు. స్వయంగా తెలీదు. భగవంతుడా ఎందుకయ్యా ఇలా వేదిస్తున్నావు?” అని తలబాదుకుంది సీతమ్మ.

విజయనే చూస్తూ దీక్షితులు లేచాడు. ఏదోలా తల ఊపి బయటకు నడచాడు.

***

తెల్లవారి దీక్షితులు దశరథం ఇంటికి వచ్చేసరికి విజయ ఇరవై మంది పిల్లలకు ‘అ ఆ’ లు చెప్పుతూ కనిపించింది వరండాలో. పిల్లలని అట్టాగే చూసాడు చాలా సేపు. ఏం మాటాడాలో, అసలేం చేయాలో తోచలేదు. జరుగుతున్నది ఎంత దూరం వెళ్తుందో తెలియలేదు.

ఇలా రెండు నెలలు గడచిపోయినయి కాలగమనంలో…

ఒకనాడు శ్రీనివాసు వచ్చాడు అకస్మాత్తుగా. వరండాలో చదువు చెపుతూ కనిపించింది విజయ. ఆశ్చర్యపోయాడు మొదట. తేరుకొని “పిల్లల బడి చెపుతున్నావా?” అడిగాడు. తల ఊపింది.

“పెళ్ళి చేసుకుంది పుట్టింట్లో ఉండి, పిల్లలకు బడి చెప్పేందుకా” అడిగాడు.

తల అడ్డంగా ఊపింది, వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ.

“మరి నువ్వు చేస్తున్నదేంటి?”

“ఉన్నదంతా మన పెళ్ళికే ఒడిసిపోయింది గదా, పైగా అప్పులు శక్తి ఉడిగన అమ్మా నాన్నలు! మరో మార్గం తోచక” అంది.

ఉరిమి చూసాడు శ్రీనివాసు.

మాటడక ఓ క్షణం నిల్చుని, “లోనికి రండి, కాళ్ళ కడుక్కొందురుగాని” అంది విజయ.

“నాతో రావడం లేదా?” అడిగాడు అనుమానంగా చూస్తూ.

“ఇప్పుడా? మా వాళ్ళకు ఎంతో కొంత ఆసరా చూపి వస్తాను. నా తల్లిదండ్రుల పట్ల నాకు ఎంతో కొంత బాధ్యత ఉంటుంది గదా, నాకు అన్నయ్య తమ్ములు ఉంటే ఆ దారి వేరు.”

‘ఎంత పొగరు’ అనుకున్నాడు మనస్సులో. ముఖం ఎఱ్ఱబడింది.

‘ఇద్దరం భార్యాభర్తలం గదా, బాధ్యతలను గుర్తిస్తే బాగు’ అనుకుంది.

‘అసలింట్లో ఎవరైనా ఉన్నారా? చచ్చారా? ఏమిటిది? ఇంత కంటే అవమానమేముంది?’ అనుకుని “నాతో వస్తున్నావా?” అనడిగాడు మళ్ళా.

“చెప్పానుగా పరిస్థితి” అంది కొంచం బెరుకుగా.

ఇక ఒక్క క్షణం అక్కడ ఉన్నా ఇంకెన్ని అవమానాలు భరించాల్సి వస్తుందోనని తలపోసి “ఇక వెళ్తున్నా” అంటునే వచ్చి స్కూటరెక్కాడు.

ఇంతలో సీతమ్మ ఇంట్లో నుంచి అల్లుణ్ని గమనించింది. గబగబా బయటకొచ్చింది పరామర్శించడానికి. కానీ వెళ్ళపోతున్న అల్లుణ్ని చూసి అట్టాగే నిలబడిపోయింది. గేటు ముందు సరిగ్గా దశరథంగారు ఎదురు పడి “అబ్బాయి ఇప్పుడేనా రావడం? విజయ లోపలే ఉంది గదా, కనబడిందా?” అని “అంతా బావున్నారా, పంటలెలా ఉన్నాయి” అని అడిగాడు.

“బావున్నారండి, పంటలు పరవాలేదు” అంటూ స్కూటరు దిగాడు శ్రీనివాసు.

“రా వెళ్దాం, అప్పుడే ఉళ్ళోకెందుకు? అయినా దీక్షితులు ఇప్పుడు ఉండడు. నీకు వెళ్ళాల్సిన పనే ఉంటే కాఫీ త్రాగాక వెళ్దువుగాని” అన్నాడు.

సరేనని లోనికొచ్చాడు శ్రీనివాసు.

దశరథం అల్లునికి పడక కుర్చీని చూపి తను కూర్చున్నాడు. వ్యవహారంలో దిగారు. ఇంతలో మంచి ‘కాఫీ’ వచ్చింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here