[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
కార్యవీర్యార్జున స్వామి నామాంకం చ దివాకరమ్।
కశ్యపస్వామి మార్తాండ విశ్వగశ్వకృతమ్ రవిమ్॥
[dropcap]కా[/dropcap]ర్యవీర్యార్జున స్వామి, దివాకరుడు, కశ్యపస్వామి, మార్తాండ దర్శనం, విశ్వగశ్వుడు ప్రతిష్ఠించిన రవి దర్శనంతో పాటు శుభద్రుడు, శుభకేశుడు, సురభిస్వామిల దర్శనం వల్ల అశ్వాలను దానం చేసిన పలం లభిస్తుంది.
బ్రహ్మ స్వయంగా పర్వత రూపం ధరించాడు. విష్ణుస్వామి, హరస్వామి, కశ్యపస్వామిలతో సహా పర్వత రూపంలో బ్రహ్మను దర్శించుకున్న వారి పూర్వీకులకు స్వర్గం ప్రాప్తిస్తుంది. సర్వపాపహర కారకమైన భగవంతుడి దర్శనం ఈ క్రింది దేవతల దర్శనంతో లభిస్తుంది.
చక్రస్వామి దగ్గర ఉన్న సుదర్శహరుడి దర్శనం, అగ్ని దేవత స్థాపించిన పింగళేశ్వరుడు, స్వయంభు హర దర్శనం, బిందునాదేశ్వర, భద్రేశ్వర, జేష్ఠేనుడితో పాటు ఉన్న చంద్రేశ్వరుడు, వాలఖిల్యేశ్వర, హరికేశవేశ, సమేశ, ధీమ్యేశ, వరుణేశ్వర, చక్రేశ్వర, చంద్రేశ, కశ్యపేష, నిలోహిత, వామదేవ, వశిష్ఠేశ, భూతేశ, గణేశ్వర, సూర్యేశ్వర, భస్మేశ, విమలేశ్వర, వరాలిచ్చే హిమాచలేశ, శంభేశ, వైవర్తివేశ్వర, మహానదీశ్వర, శంభు, కశ్యపేశ్వర, రాజేశ్వర, నృసింహేశ్వర, ధనాదేశ్వరుల దర్శనం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. పూర్వీకులకు పుణ్యలోకాలు లభిస్తాయి. భూతగణాధిపుడు, హరుడు ఈ ప్రాంతాలలోని అణువణువునా ఎల్లప్పుడూ ఉంటాడు.
నంది దర్శనమాత్రంతో సకల పాపాలు నశిస్తాయి. భూతేశ్వరుడున్న చోటల్లా నంది ప్రసన్నుడై ఉంటాడు. భూతేశ్వరుడు సకల సౌక్యప్రదాయి. హరుడి భక్తి వల్ల నంది హరుడు ఉన్న ప్రతి స్థలంలో ఉంటాడు. వీరు భూమిపై ఉన్నది విశ్వకళ్యాణం కోసం.
జలమధ్యంలో ఉన్న కపోతేశ్వరుడి దర్శనంతో వెయ్యి గోవులు లభిస్తాయి. కపోతేశ్వరుడిని పూజిస్తే కోరినది లభిస్తుంది.
బృహదశ్వుడు ఒకటొకటిగా చెప్తున్న పవిత్ర దేవతల విగ్రహాల పేర్లు మనకు దేశంలోని ఇతర ప్రాంతాలలో వినిపించేవే. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే భారతదేశం రాజకీయంగా పలు విభిన్నమైన రాజ్యాలుగా ఉన్నా, ధార్మికంగా వారంతా ఒకటే. ధర్మం వారందరినీ రాజులు, రాజ్యాలకు అతీతంగా ఏకం చేసిన అంశం. అంటే భారతదేశ ప్రజలను ఏకత్రితం చేయగలిగింది ధర్మం ఒక్కటే అన్నమాట. అందుకే కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఒకటే ధర్మం విలసిల్లుతూ వచ్చింది. ప్రాంతాలను బట్టి పూజా విధానాలు మారినా, దేవీ దేవతల రూపాలు, నామాలు వేరయినా అన్నిటినీ కలుపుతూ పురాణాలు ఉన్నాయి. ఒకే దైవానికి పలు నామాలుంటే, ఆయా నామాల నేపథ్య గాథను పురాణాలు తెలుపుతాయి. తద్వారా ఒక ప్రాంతంలో ప్రత్యేకమైన నామం మరో ప్రాంతంలోని నామంతో జత కలుపుతుంది. ఆ దైవం విభిన్న నామాల జాబితాలో చేరుతుంది. దాంతో ప్రాంతీయాలకే ప్రత్యేకమైన దైవ నామం జాతీయ స్థాయిలో అందరికీ తెలుస్తుంది. ప్రాంతాలు కలిసిపోతాయి. విభేదాలు సమసిపోతాయి. దేశమంతా ఒకటిగా నిలుస్తుంది.
‘త్రయంబకం’ అన్నది ‘నాసిక్’ దగ్గరి ప్రాంతం. అక్కడి శివుడు త్రయంబకేశ్వరుడు. కానీ త్రయంబకేశ్వరుడు శివుడు. శివుడు దేశమంతా ఉన్నాడు. దాంతో పలు ప్రాంతాలలో త్రయంబకేశ్వర ఆలయాలు ఉన్నాయి. అయితే ‘త్రయంబకం’ అన్నది ఏకాదశ రుద్రులలో ఒక రుద్రుడి నామం. ఏకాదశ రుద్రుల నామాలు పలు పురాణాలలో కాస్త తేడాలతో ఉంటాయి. విష్ణుపురాణం ప్రకారం – అజైకాపాత్, అహిర్భుధ్న, విరూపాక్ష, సురేశ్వర, జయంత, బహురూప, అపరాజిత, సావిత్ర, త్రయంబక, వైవస్వత, హర అన్నవి ఏకాదశ రుద్రుల నామాలు. ఈ ఏకాదశ రుద్రులలో త్రయంబకుడు ఒక నామం. అయితే రుద్రుడి జననం పురాణాల ప్రకారం బ్రహ్మ నుండి. బ్రహ్మ కోపం వల్ల జనించిన అగ్ని నుండి మధ్యాహ్న మార్తాండుడిలా రుద్రుడు జన్మించాడు. ఆ రుద్రుడు బ్రహ్మ ఆజ్ఞ వల్ల స్త్రీ, పురుషులుగా విడిపోయాడు. ఆ పురుషుడిగా విడిపోయిన భాగం మరో పదకొండు భాగాలుగా విభజితమయింది. ఈ పదకొండు భాగాలే ఏకాదశ రుద్రులు. స్త్రీగా విభాజితమైన భాగం నుండి పదకొండు రుద్రాణిలు ఏర్పడ్డారు. వారు ధీ, వృత్తి, ఉశాన, ఉమ, నియుత, స్పర్శి, ఇళా, అంబిక, ఐరావతి, సుధ, దీక్ష. ఈ పదకొండు రుద్రాణిలు ఈ ఏకాదశ రుద్రుల భార్యలయ్యారు.
వాల్మీకి రామాయణం ప్రకారం ప్రజాపతి కశ్యపుడు, అదితులకు 33 మంది సంతానం. వారిలో రుద్రులు పదకొండు మంది. దేవీ భాగవతం ప్రకారం బ్రహ్మ కోపాగ్ని నుంచి రుద్రుడు జన్మించాడు. మరో పురాణం ప్రకారం సంతానం కోసం బ్రహ్మ తపస్సు చేయగా అతని ఒడిలో బిడ్డ ప్రత్యక్షమయ్యాడు. అతడు ఏడుస్తూండడంతో రోదించేవాడు కాబట్టి ‘రుద్ర’ అని నామకరణం చేశాడు. అతడు మరో ఏడుసార్లు రోదించాడు. మరో ఏడు పేర్లు పెట్టి ఇచ్చాడు బ్రహ్మ. అలా ఎనిమిది మంది రుద్రులు అయ్యారు. బ్రహ్మ వారికి భార్యలను ఇచ్చాడు. ఈ రుద్రుడు ప్రజాపతి దక్షుడి కూతురు సతీదేవిని వివాహమాడాడు. శివుడి మరో పేరు రుద్రుడు. అంటే రుద్రుడు శివుడు ఒకటే అన్నమాట. మహాభారతం ఆదిపర్వం ప్రకారం ఏకాదశ రుద్రులు శివసంతానం. వారు మృగవ్యాధ, సర్ప, నిరుత్తి, అజైకాపాత్, అహిర్భుధ్న, పినాకి, ఈశ్వర, కపాలి, స్థాణు, భార్గ.
(ఇంకా ఉంది)