[box type=’note’ fontsize=’16’] ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు అంతర్మధనం తప్పదు. కొన్నింటిని ఎదుర్కోలేక తప్పించుకుని కాలాన్ని నెట్టేసినా.. తాత్కాలికమే.. పరుగు ఆపి నిలబడ్డ సమయంలో వెనక్కు తిరిగి చూసుకుంటే మనుషులకో.. మనసులకో సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితి ఎదురైన వ్యక్తి, అతను తీసుకున్న నిర్ణయం గురించి ఈ నాటకం చెబుతుంది. [/box]
పాత్రలు
రాజారావు : 62 ఏళ్ళ వయస్సు రిటైర్డ్ హెచ్.ఎం.
గణపతి : 50 ఏళ్ళ టీచర్
జితేంద్ర, రాకేష్, అనిల్ : ఐఐటి చేసిన యువకులు
విశ్వనాధ్ : 45 సంవత్సరాల వ్యక్తి
సురేష్, మాధవి : భార్యా భర్తలు, రాజారావు కొడుకు కోడలు
విలేఖరులు : ఇద్దరు లేదా ముగ్గురు
సర్పంచ్ : 50 ఏళ్ళకు పైగా
***
ప్రారంభం
డిమ్ లైటింగ్ – స్టేజి మధ్యలో సోఫా లేదా వాలు కుర్చీలో రాజారావు పాత్రధారి పేపర్ చదువుతుంటాడు. బయటినుండి గణపతి మాస్టారు కేకవేస్తారు.
గణపతి :
రాజన్నా … రాజన్నా …
రాజారావు : ఎవరూ … లోపలికి రండి.
గణపతి :
అన్నగారూ నమస్కారం.
రాజారావు : ఓహో గణపతీ నువ్వా… రావయ్యా … చాలాకాలమైంది కనిపించి ఏంటీ విశేషాలు?
గణపతి :
మరేంలేదన్నా అర్జంటుగా ఓ పాతికవేలు అవసరం… మీరు సర్దుబాటు చేస్తారనీ.
రాజారావు :
మళ్ళీ ఊరికోసం ఖర్చా… నువ్వు మారవు.. సరే ఇస్తాగానీ మన స్కూల్ ఎలాగుందీ … నేను అక్కడ నుంచి ట్రాన్సఫర్ అయి వచ్చేసిన తర్వాత మళ్ళీ అటు వైపు రావడం కుదరడం లేదు. గ్రేడ్ ఏమైనా పెరిగిందా.. అన్నట్లు మళ్ళీ నీకు అవార్డు వచ్చిందిటగా… పేపర్‌లో నీ సన్మానం ఫోటోలు చూశాలే. అవునూ ఈ మధ్య కొత్త జివో వచ్చిందిగా ఇంకెంతుంది సర్వీసూ?
గణపతి :
అంతా బాగున్నట్లే… ఇంకా 8 ఎళ్ళు సర్వీసుందండీ.. మరేంటంటే త్వరలో శ్రీరామనవమి ఉత్సవాలు వస్తున్నాయి కదా.. ఈ వూరిలోనే వుంటున్న హరికథ భాగవతార్ గారికి, బుర్రకథ రాజుగారికీ బయానా ఇవ్వాలి. ఈసారి నాటకం కూడా ఏర్పాటు చేద్దామని ప్లాను. ఇంకా చాలా ఖర్చులున్నాయ్ కదా.. అందుకని పాతికవేలు కొరత పడ్డాయి. మిమ్మల్ని అడిగితే ఏమైనా… మళ్ళీ త్వరలో రుణం తీర్చేసుకుంటా.
రాజారావు : భలే వాడివయ్యా… నీకు సమకూరినప్పుడే తిరిగిద్దువులే …. అయినా ఇలా అప్పులు చేసీ తంటాలుపడి వాటిని నువ్వు ఉద్దరించాలా…. హూ…. నువ్వు మారవుగా. వుండు ఇస్తా.. ఇవుగో
గణపతి:
ధర్మో రక్షతి రక్షితః .. పెద్దల బాటలో నడవడమే! రుణానుబంధ రూపేణా పతి పత్నీ సుతాలయః. వస్తామరీ … ఇవన్నీ కాపాడుకుంటేనే కదండీ పల్లెల ఉనికి పదిలంగా వుండేది . ఉత్సవాలవగానే డబ్బులు సమకూరుతాయి గానీ.. మీ బాకీ తీర్చేస్తాను…
రాజారావు :
సరేగానీ.. ఇంతకీ వీరెవరూ… పరిచయం చేయలేదే
గణపతి : వీరు రామక్రిష్ణ గారనీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. మంచి నటులు పద్యాలు బాగా పాడుతారు.
రాజారావు :
అవునా చాలా సంతోషం … ఏవిటో ఏమో హడావుడి జీవితాల్లో ఓ నాటకం చూసి ఎన్నేళ్ళయిందో… మా కోసం ఏదైనా.. పద్యం గానీ ఏదైనా దైలాగూ..
రామక్రిష్ణ : తప్పదంటారా….
గణపతి : వారికి చాలా ఇష్టం.. ఏదో ఒకటి వదులుదురూ….
రామక్రిష్ణ : సరే …… -(ఒక డైలాగు లేదా పద్యం )
రాజారావు :
ఆహా….వండర్ ఫుల్… చాలా బాగుంది. కాదనకుండా స్వీకరించండి (ఇంట్లోంచి కొత్త బట్టలు తెచ్చి ఇస్తాడు).
రామక్రిష్ణ : అయ్యో… ఇప్పుడివన్నీ ఎందుకు సార్
గణపతి :
మాస్టారు గారు అభిమానంతో ఇస్తున్నారు… కాదనకుండా తీసుకోండి. ఆశీస్సులనుకోండి.
***
రెండవ అంకం
(సురేష్ – మాధవి బయటినుండి ప్రవేశిస్తారు).
మాధవి : హూ… హబ్బబ్బా… ఏం మనుషులో ఏం కోరికలో.. మరీ ఎంత ఆడపిల్ల పేరెంట్స్ అయితే నెత్తిన కొమ్ములొచ్చినట్లున్నాయ్.
(సురేష్ మౌనంగా ల్యాప్‍ట్యాప్ తెరిచి చూస్తుంటాడు).
రాజారావు :
ఏమైందమ్మా … ఏంటి సంగతి … ఏమైంది పెద్దాడి పెళ్ళి సంబంధం .. కాయా ? పండా?
మాధవి :
దుంప!
రాజారావు :
అదేంటమ్మా?
మాధవి : ఖర్మ… ఖర్మ… ఆడపిల్లలకు ఎంత డిమాండ్ వుంటే మాత్రం అంత దారుణంగా మాట్లాడుతారా? పెళ్ళి ఖర్చులు మనమే పెట్టుకుని ధూమ్ ధామ్ అంటూ పెళ్ళిచేసి మన అబ్బాయిని అమ్మాయి వెంట పంపాలంట. పైగా ఆస్తి సగం ముందుగానే అమ్మాయి పేరు మీద వ్రాసి యివ్వాలంట! కలికాలం అంటే ఇదేకదా!
రాజారావు :
అవునా! ఒకప్పుడు పెళ్ళికొడుకు తరపువారు అడిగే కట్నకానుకలు ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు అడుగుతున్నారు. డిమాండ్ అలాగుంది మరి! మున్ముందు పాతకాలంనాటి కన్యాశుల్కం మళ్ళీ దాపురించేలా వుంది.
మాధవి :
అంటే …
రాజారావు :
ఒకప్పుడు … ఇలాగే పురిట్లోనే ఆడశిశువులను హతమార్చిన ఫలితంగా దాదాపు వందేళ్ళ క్రితం వధువులు కొరత తీవ్రమై ఆడపిల్లలు పట్టగానే డబ్బులను ఎదురుకట్నంగా ఇచ్చి కొనుక్కొని పెళ్ళి చేసుకొనే దురాచారం కొంతకాలం కొనసాగింది. తర్వాత కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి మహానుభావులు చైతన్యం తీసుకొచ్చి రుపుమాపారు.
మాధవి :
హూ … రోజులు మారీ దారుణంగా తయారయినాయండి. మాకూ ఓ ఆడపిల్ల వుండుంటే బాగుండేది!
రాజారావు :
నేను అప్పుడే చెప్పాగా… మీరు కూడా అప్పుడు మగపిల్లలే ఉద్దారకులు కావాలి అని… ఆడనలుసే వద్దుకున్నారుగా!
మాధవి :
ఇప్పుడవన్నీ ఎందుకులెండి? గతాన్ని తవ్విపోస్తారూ.. అయినా ఏంటో సంధికాలం.
సురేష్ :
ఏమోయ్ …. ఇలారా … నీ పెద్దకొడుకు స్కైప్‌లో పిలుస్తున్నాడు .. నీతో మాట్లాడాలంట.
(మాధవి సురేష్ దగ్గరకు వచ్చి ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసివున్న ఇయర్ఫోన్ చెవులకు తగిలించుకుంటుంది)
మాధవి :
చెప్పు నాన్నా … ఆ… ఆ… అలాగా … సంతోషం ! ఆహా! సరే సరే.. ఉహూ. లేదురా ఈ సంబంధం తప్పిపోయినట్లే. నేను తర్వాత వివరంగా నీకు ఫోన్లో చెప్తాలే! ఉంటా మరి.
మాధవి :
హూ … ఏం కాలం వచ్చిపడింది. విడ్డూరంగా, చక్కగా బెంగుళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పిల్లాడంటే ఇంతకుముందు ఆడపిల్లల తల్లిదండ్రులు క్యూలు కట్టేవారు. ప్రారబ్దం! అన్నట్లు మామయ్యగారు మీ మనవడు ఆవకాయ జాడీరెడీ చేసి పెట్టమన్నాడు! వచ్చేవారం వస్తాడంట! కొంచెం మేడపైకి వెళ్ళి మన చెట్టు మామిడికాయలు కోసి తెస్తారా! వాడికి మన చెట్టుకాయలు ఊరగాయంటే ప్రాణం కదా!
రాజారావు :
సరే… అలాగే ఎంతైనా మన చెట్టుకాయలు రుచికదా! అన్నట్లు మళ్ళీ మనవరాలికి కూడా ఆవకాయ జాడీ పార్శిల్ పంపాలేమో కదా సరే ఎన్నుంటే అన్నీ కోసుకొస్తా.
(సురేష్, మాధవి ల్యాప్ టాప్, ఫోన్లలో చూసుకుంటూ ఉంటారు. రాజారావు లోపలికి వెళ్ళి వస్తాడు).
రాజారావు :
హుష్ … అమ్మాయ్ చెట్టుకు పెద్దకాయలు లేవమ్మా.
మాధవి :
అదేంటండీ మొన్న బట్టలు ఆరేస్తూ నేను గమనించాను. చాలా కాయలుండాలి.
రాజారావు :
ఏమోనమ్మా పిందెలు తప్ప కాయలు లేవు.
మాధవి :
ఆ పక్కింటివాళ్లు కోసేసి వుంటారయితే … వాళ్ళకు ఎప్పుడూ మన చెట్టు మీదే కళ్ళు. పాపిష్టి ముఖాలు. వాళ్ళ చేతులు విరిగిపోనూ!
రాజారావు :
హయ్యో అదేంటమ్మా అలా శాపనార్థాలు… పోన్లే నాలుగు కాయలు కోసుకుంటే తప్పేముంది.
సురేష్ :
ఆహా … మన చెట్టుకాయలు వాళ్ళెవరో కోసుకుని తింటే తప్పులేదా? అయినా అది దొంగతనంకదా! రాస్కెల్స్ ఛీ ఛీ చండాలమైన పొరుగూ.
రాజారావు :
అదేంట్రా … మనమైనా అన్ని కాయలు ఏం చేసుకుంటాం! చుట్టుప్రక్కలవాళ్ళుకు పంచితే పుణ్యం.
సురేష్ :
మనం ఏరికోరి తెచ్చుకుని ఇల్లు కట్టినప్పుడు నాటిన మొక్క. మాధవి జాగ్రత్తగా పెంచితే కాపుకొచ్చింది. మనం తినకుండా ఎవరికో పంద్యారం చేస్తామా ? చ… ఛ…
మాధవి :
అంతే ఈ రోజుల్లో కష్టం ఒకరిది, ఫలితం ఇంకొకరిది. ఈసారి పక్కింటి వాళ్ళకు గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందే.
రాజారావు :
ఇరుగు పొరుగుతో మంచిగావుంటే మేలమ్మా … నా మాట అది …. ఇక మీ ఇష్టం.
(రాజారావు బయటకు … సురేష్, మాధవి లోపలకు)
మూడవ అంకం
(బయటినుండి ఇద్దరు యువకులు రాకేష్, అనిల్ వస్తారు)
హే … బ్రో … జీతూ … వేరార్యూ మ్యాన్ … గ్రాంపా వేరీజ్ జీతూ…
(రాజారావు అటువైపు తిరుగుతాడు)
యువకులు :
గ్రాంపా … గ్రాంపా మిమ్మల్నే …
రాజారావు :
అలా గంపా దుంపా అని పిలిస్తే నాకు కంపరం.
రాకేష్ :
ఓహ్…. అలిగారా. సారీ …. పార్డన్.
రాజారావు :
చక్కగా తాతగారూ, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, అమ్మమ్మ, నాయనమ్మ అని పిలువకుండా ఈ కొత్త రకం సంకర పిలుపులేంటనీ.
అనిల్ :
వుయార్ ఫ్లయింగ్ టూ అమెరికా ఇన్ సూన్.. సో… ఓన్లీ … ఇంగ్లీష్
రాకేష్ :
అంటే ఇప్పటినుంచే ప్రాక్టీసింగ్ అన్నమాట. కోప్పడకండి గ్రాంపా.. సారీ తాతగారూ.
రాజారావు :
ఆహా…. సరే.. ఇదుగోండి ఈ చేతికర్ర తీసుకుని ఇకనుంచే దీంతో నడక ప్రాక్టీస్ చేయండి.
అన్నట్లు ఇవుగో ఈ కళ్ళద్దాలు కూడా.
రాకేష్, అనిల్ :
వై … వాటీజ్ నెసిసిటీ …
రాజారావు :
ఎలాగూ మీరు కొన్నేళ్ళ తర్వాత నాలా ముసలివాళ్ళువుతారుగా …..
రాకేష్ :
ఓహో సెటైరా… ఏమండి… మన పెద్దలు చెప్పిందే కదా… బీ ఏ రోమన్ ఇన్ రోమ్ ….
రాజారావు :
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని కూడా… అయినా… ముందు జాగ్రత్త వేరు, అతి జాగ్రత్త వేరు… దీన్ని పిచ్చి అంటారు. తగ్గించుకోండి లేదంటే అవమానాల పాలవుతారు.
అనిల్ :
ఓకే బాబా… నో డిస్కషన్స్… ఇంతకీ మన జితేంద్ర ఎక్కడ….
రాకేష్ :
ఏంటో స్వీట్ కబురు చెప్తాను అర్జంట్‌గా ఇంటికి రమ్మన్నాడు.
రాజారావు :
అర్ధరాత్రి వరకూ ఆ ల్యాప్‌టాప్ పట్టుకుని కుస్తీ పడ్తున్నట్లున్నాడు. ఇంకా లేచినట్లు లేదు. నేను లేపి వస్తానుండండి.
రాకేష్, అనిల్ :
ఓహ్ వెయిట్ చేయాలా…. బోరింగ్ అంటూ ఫోన్లలో వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు చూసుకుంటుంటారు.
(లోపలికి వెళ్ళొచ్చిన రాజారావు వారివైపు చూస్తూ)
రాజారావు :
ఏంటమ్మా మనుషుల మధ్యనే వుంటారు కానీ ఈ లోకంలో వుండరుకదా. ఏంటో అంతలా ఫోన్లు పట్టుకుని వెతికేస్తుంటారు?
అనిల్, రాకేష్ :
మీ తరానికి తెలీదులెండి. వాట్సాప్‌లో ఎంత ఫన్ వుంటుందో. ఎఫ్‌బీలో ఎన్ని ముచ్చట్లో.
రాజారావు :
నాకూ తెలుసులే… ఓల్ట్ ఎమ్మే బి.ఇడి. ఇక్కడ . పెన్షనర్ల సంఘం లీడర్ కూడా.. హహ అన్నట్లు ఈ చాట ఫోన్లకూ, పిల్లల డైపర్స్ కూ ఓ పోలిక వుంది ఏంటో చెప్పగలరా ?
పిల్లలు :
హో … క్రేజీ … ఏంటబ్బా.
రాజారావు :
పిల్లలకు డైపర్స్ వేసి బయటకు తీసుకొచ్చిన తల్లులు మాటమాటకి … ఏమైనా వచ్చిందా అని చెక్ చేస్తుంటారు. అలాగే ఫోన్సు పట్టుకుని కుయ్ మనగానే.. ఏమైనా వచ్చిందా అని మీరు ఫోన్లలోకి చూస్తుంటారుగా… కొన్నేళ్ళు పోతే ఫేస్‌బుక్ లోకం, ఎఫ్ ఫ్రెండ్స్, వాట్సాప్ పిలుపులు, ఎఫ్ బి పేరంటాలే ఎవడైనా పోతే ఓ ట్వీట్టూ, ఓ కామెంటూ లేకుంటే ఆర్‌ఐపి అంటూ ఓ కామెంటూ. ఏంటో మనుషుల మధ్యనే వుంటారు కానీ మనుషుల్లో వుండరు కదా.
రాజారావు :
అది సరేగానీ, మీరంతా ఐఐటిలు ఏవో చదివారు కదా.. ఒక్కొక్కరికీ పాతికేళ్ళు వస్తున్నట్లున్నాయ్. ఈ ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళు ఎప్పుడంటా.
రాకేష్, అనిల్ :
వియార్ జీనియస్ పీపుల్.. ఇక్కడ చెత్త వుద్యోగాలు… నథింగ్ డూయింగ్
రాజారావు :
హబ్బో… సరే జీనియస్ కుర్రాళ్ళూ ఓ పజిల్ ఇస్తా కాసేపు కాలక్షేపం.. రెడీయా
రాకేష్ :
ఒహో మమ్మల్ని టెస్టింగా… కానీండి.
రాజారావు :
కావాలంటే కాగితంపై లెక్కేసు కోవచ్చు అబ్బాయిలూ.
అనిల్ :
నో నీడ్ కమాన్ ప్రొసీడ్ గ్రాంపా…
రాజారావు :
అదే నాకు నచ్చంది. సరే ఓ పని చేద్దాం. ఈ లెక్కలో మీరు గెలిస్తే మీ ఇష్ట ప్రకారం పిలుద్దురు. ఆన్సర్ చెప్పలేకపోతే మాత్రం నేను చెప్పినట్లు వినాలి.
అనిల్ :
ఇలా ఫిటింగ్ పెడ్తున్నారా.. ఓకే..డన్.
రాజారావు :
కాచుకోండయితే.. మీరు జీనియర్లు కదా.. నేను ప్రశ్న అడగడం అయిపోగానే టక్ మని జవాబు చెప్పాలి. లేకుంటే మీరు ఢమాల్ ..
రాకేష్ :
సెకన్లలో చెప్పేయగలం… (అనిల్ వైపు తిరిగి) నువ్వు కాలికులేటర్ వాడరా ఎందుకైనా మంచిది.
రాజారావు :
మరేమో.. తిరుపతిలో 80 మంది ప్రయాణికులతో బయలుదేరిన పాసింజర్ రైలు మొదట రేణిగుంటలో ఆగింది. అక్కడ ఇద్దరు ఎక్కారు. తర్వాత వెంకటగిరి స్టేషన్‌లో మరో 8 మంది ఎక్కారు. గూడూరులో ఇద్దరు దిగిపోయారు 20 మంది ఎక్కారు. వెంకటాచలంలో 2 మంది ఎక్కారు. నెల్లూరులో 8 మంది దిగిపోయారు.
కోవూరులో నలుగురు ఎక్కారన్న మాట. తర్వాత బిట్రగుంటలో ముగ్గురు ఎక్కారు. కావలి స్టేషన్‌లో 24 మంది రైలెక్కారు. సింగరాయకొండలో 30 మంది ఎక్కారు. టంగుటూరులో ఇద్దరు దిగేసారు 2 మంది ఎక్కారు. చీరాల స్టేషన్‌లో 8 మంది ఎక్కారు. బాపట్లలో ముగ్గురు దిగేసారు. గుంటూరుకు వచ్చేసరికీ…. మొత్తం ఎన్ని స్టేషన్లలో రైలాగింది అబ్బాయ్‌లూ…
అనిల్ :
హూ.. చీటింగ్.. మేము పాసింజర్లను లెక్కేసాం..
రాకేష్ :
హహహ భలే తాతగారూ..
(జితేంద్ర ఇంట్లోంచి వస్తాడు)
రాకేష్ :
రా బాబు… రాండి సార్! ఏంటో తియ్యటి కబురు చెప్తానని ఊరిస్తున్నావు. నీకోసం వెయిటింగ్…. వాటీజ్ ద న్యూస్ … బోలో.
జితేంద్ర :
చెప్తా చెప్తా … ఆ టీపాయ్ ఇలా తీసుకురండి. (టీపాయ్ మీద తనతో తెచ్చిన కేక్ పెడ్తాడు)
ముందు కేక్ కటింగ్… సెలబ్రేషన్. చెప్తున్నా… చెప్తున్నా… మన కొత్త ప్రాజెక్ట్‌కు మనం ప్రపోజల్ పంపిన ఎమ్.ఎన్.సి. నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందోచ్…
అందరూ కలసి :
వావ్ … హుర్రే ….
అనిల్ :
అవునా… గుడ్ న్యూస్ … హ్యాపీ … ఇంతకీ డిటెయిల్స్ ఏంటీ?
జితేంద్ర :
ఎర్లీ అవర్స్‌లో కాల్ చేసాడురా … తర్వాత మెయిల్ పెట్టాడు. ఇదుగో చదువుదాం!
(ట్యాబ్‌లో చూస్తారు)
జితేంద్ర :
అరే వాళ్ళ నుంచి ఇంకో మెయిల్ కూడా (పెద్దగా చదువుతాడు)
రేయ్ ఆ కంపెనీ ఫౌండర్ ఛైర్మన్ గారు పూణే, ఢిల్లీ బ్రాంచ్ హెడ్‌తో కలిసి ఇండియాకు వస్తున్నారంట … హమ్మో అన్నట్లు … తిరుమల బాలాజీ దర్శన్ తర్వాత … ఆన్ ది వే … మన ఊరికొచ్చి “రేపే” మనల్ని నేరుగా కలుస్తారంట. “లెటజ్ డిస్కస్ ఎబవుట్ ది ప్రాజెక్ట్” అంటూ ట్యాగ్ తగిలించారురా! రేయ్ ఓ వైపు ఆనందంతో గాల్లో తేలినట్లున్నా … మరోవైపు కంగారుతో కాళ్ళు వణుకుతున్నాయిరా!
అనిల్ :
వై డు యూ వర్రీ, లెటజ్ ప్లాన్ యార్. మన ప్రాజెక్ట్ సబ్మిషన్‌తో పాటు మన ట్రీట్ చూసి అదిరిపోవాలి మై హూనా! (అందరూ కూర్చుని డిస్కషన్)
(ఇంతలో జితేంద్ర ఫోన్ మోగుతుంది) : ఆ … సార్ … ఓకే … ఓకే … ఈజిట్ వావ్… హో … సింప్లీ సూపర్బ్ … ష్యూర్ సర్… (ఫోన్ పెట్టేస్తాడు)
అనిల్ :
ఏంట్రా బాబూ …
జితేంద్ర :
వాళ్ళ పి.ఎ. ఫోన్ … ఆ వచ్చే త్రీమెన్ కమిటీకి … మెనూ … చెప్తున్నాడు …
రాకేష్ :
ఏంట్రా ఈ బిల్డప్పు… అమెరికా ప్రెసిడెంట్ విజిట్‌కు వస్తున్నట్లు …
జితేంద్ర :
అది కాదురా … వీలైతే హోమ్లీ ట్రీట్ అంటున్నాడు. వాళ్ళను శాటిస్ఫై చేస్తే… మన జాతకాలు మారిపోతాయ్ … హూ … తప్పదు.
అనిల్ :
ఇంతకీ సమస్య ఏంట్రా … చక్కగా పెద్ద హోటల్లో మన మీటింగ్ అరేంజ్ చేసి బాగా మెక్కబెట్టి అట్నుంచటే సాగనంపితే పోతుందిరా .. బస్.
జితేంద్ర :
అలాకాదంట … అంతా హోమ్లీగా కావాలంట. ఏమిటో ఏవడైనా ఆంధ్రాకు ఇటువైపు వస్తే అరిటాకు, అప్పడం, తిరుమల లడ్డు కావాలంటారు. అటువైపు వెళ్లే పూతరేకులు, మడత కాజాలంటారు.
(రాజారావుగారు లోపలినుంచి ప్రవేశం)
రాజారావు :
ఏంట్రా అబ్బాయిలూ ఏంటో తీవ్రంగా మేథోమధనం చేస్తున్నారు!
అనిల్ :
ఒరే జీతూ…. బెస్ట్ అయిడియా మీ తాతగారికే ఈ ప్రాబ్లమ్ హ్యాండోవర్ చేస్తే …
జితేంద్ర :
కరెక్ట్ … మరేంలేదు తాతయ్యా … ……… ఇదీ విషయం.
రాజారావు :
పెద్ద చిక్కువచ్చి పడిందే…. మన ఊరు కూడా సిటీ కల్చర్ బాట పట్టిందికదా! ఆ వచ్చే వాళ్ళు ఏం ఊహించుకుని వస్తున్నారో…. ఎలాగబ్బా (ఆలోచిస్తూ పచార్లు చేస్తాడు) ఆ… ఆ… ఒక మార్గం తోచిందిరా… ఇక అదొకటే దారి! పల్లెకు పోదాం… పారును చూద్దాం చలో… చలో …
జితేంద్ర : అంటే?
రాజారావు :
పచ్చని ప్రకృతీ … పసందైన పల్లె వంటకాలూ… కేరాఫ్ మన రామవరప్పాడు …. అదేరా మీ మేనత్త పార్వతమ్మ ఊరు. మనం ఎప్పుడో పదేళ్ళ క్రితం వెళ్ళాం.
జితేంద్ర :
హమ్మయ్యా గండం గట్టెక్కిస్తున్నారు. కానీ… ఎవరెవర్నో వెంటబెట్టుకుని అలా వాళ్ళ ఇంటి మీదకు దండెత్తి వెళ్లే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో! నాన్నగారు తిడ్తారు.
రాజారావు :
ఇక అంతకంటే మార్గం లేదురా అబ్బాయ్. నేను మేనేజ్ చేస్తాకదా. మీ అమ్మా నాన్నలను కూడా అక్కడకు నేను రప్పిస్తాగా.. సరదాగా ఓ సందర్భం క్రియేట్ చేసే పూచీ నాదీ.. ఓ పని చేయండి ముందు మన కారులో నన్ను అక్కడ దింపేసి రండి. మీకు రూటు కూడా తెలిసినట్లుంటుంది. ఓకేనా…
మిత్రులు : ఓకే డన్ తాతగారూ … హమ్మయ్యా.
– లైట్సాఫ్ –
పల్లెటూరు ఇంటి వాతావరణం
(రాజారావు పచార్లు చేస్తుంటాడు… మాధవి సురేష్ ఆపసోపాలు పడ్తూ ప్రవేశం)
రాజారావు :
రాండి రాండి, పాపం బాగా అలసిపోయినట్లున్నారు.
సురేష్ :
అయినా కట్టకట్టుకుని ఇప్పుడెందుకు ఇక్కడకు చేరుతున్నట్లు, ఏమిటో ఏదీ సవ్యంగా చెప్పరు.
మాధవి :
మామయ్యగారూ ఇంతకీ మా చేత ఆఫీసులకు శెలవు పెట్టించి ఈ పల్లెటూరుకి పిలిపించారు. ఏమిటో విషయం ఇప్పుడైనా చెప్తారా?
రాజారావు :
స్వామికార్యం స్వకార్యం.. ఎలాగూ మన జితేంద్ర వాళ్ళెవరో అమెరికా కంపెనీ వాళ్ళకు విందు ఏర్పాటు చేయిస్తున్నాడుగా.. పనిలో పనిగా మీరూ వుంటే బాగుంటుందనీ.
మాధవి :
హూ.. ఏమైనా అర్ధం వుందా..
రాజారావు :
భలేదానివే…ఇదో కారణం అంతే.. అసలు విషయం.. ఇక్కడ మన పార్వతిని కొంచం మంచి చేసుకోవాలమ్మాయ్. ఇప్పుడు తను పెళ్ళి సంబంధాలు కుదర్చడంలో చక్రం తిప్పుతోంది మరి. మన పెద్దాడికి మంచి సంబంధం చూసిపెడ్తుంది.
మాధవి :
ఒహో.. సరే అలాగైతే తప్పదుగా… అయినా.. మన అవసరం కోసం ఇలా వచ్చి పడిపొయామని ఆడిపోసుకుంటారేమో..
రాజారావు :
పాపం పార్వతి అలా ఏమీ అనుకునే రకం కాదులే… జితేంద్ర తీసుకువచ్చిన వాళ్ళను చాలా బాగా రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసింది. ఇప్పుడే వాళ్ళు భోజనాలకు కూర్చున్నారు.
(లోపలినుండి ఎం.ఎన్.సి. బృందం బయటకు వస్తారు. రాజారావు వారికి పరిచయాలు చేస్తాడు. నమస్కారాలు. తర్వాత మాధవి సురేష్ లోపలికి వెళ్తారు)
ఎస్ఎంసి ఫౌండర్ ఛైర్మన్ :
వెల్డన్ మై బాయ్స్. వెరీగుడ్! ఇలా చక్కటి మన ఆంధ్రా వంటకాలు ఇంత రుచిగా తిని చాలా కాలమైంది. వండ్రఫుల్ .. వెరీ హ్యాపీ… నేచురల్ ఫుడ్ … వెరీనైస్.
జితేంద్ర :
థాంక్యూ వెరీమచ్ సార్… మా ప్రాజెక్టుకు మీ అప్రూవల్ కోసం చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఎబ్రాడ్లో సెటిలవ్వాలనేది మా అందరి డ్రీమ్. మీ దయవల్ల మా కల నెరవేరుతుందనీ….
ఛైర్మన్ :
ఓ ఇట్స్ ఓకే. మీరు తయారు చేసిన ప్రాజెక్ట్‌ను మా వాళ్ళు ఫైనల్ అప్రూవ్ చేసిన తర్వాత మీకు వీసాలు అవీ వస్తాయి. డోంట్ వర్రీ… యాజ్ ఇండియన్ … దట్ టూ బీయంగ్ ఏ ఆంధ్రా ఇటీజ్ మై యాంబిషన్. విదేశాల్లో మనవాళ్ళు సత్తా చాటాలి. మీలాంటి వారిని ప్రోత్సహించి అవకాశాలు కల్పించాలన్నం నా లక్ష్యం. ఒకప్పుడు నేను కూడా మీలానే కలలు కని .. పైకి వచ్చినవాడినే …
సర్పంచ్ :
బాబూ …. రాజారావుగారున్నారా.
జితేంద్ర :
ఆ … లోపలున్నారండీ. మీరెవరు?
సర్పంచ్ :
నేను ఈ ఊరి సర్పంచ్‌ను. మన ఊరికి … అదే ఇక్కడకు ఎవరో చాలా గొప్ప ఫారెన్ కంపెనీ ఓనర్లు వచ్చారని తెలిసింది. పనిలో పనిగా విలేఖరులను కూడా పిలిపించా. మన ఊరి పేరు పేపర్లో వస్తే ఏదో… కొంచెం గుర్తింపుకదా.
(రాజారావుగారు బయటకు వస్తారు)
రాజారావు :
ఓహో సర్పంచ్ గారా …. బాగున్నారా …. ఏంటిలా వచ్చారు ?
జితేంద్ర :
అదేనండీ…. వారిని కలవాలంట, విలేఖరులు ఇంటర్వూ చేస్తారంట. వారిని కనుక్కుని పిలుస్తా… వుండండి.
(జితేంద్ర మళ్ళీ వారి దగ్గర కొచ్చి)
రమ్మంటున్నారు రండి.
(మధ్యలో ఛైర్మన్, పక్కన సర్పంచ్ కూర్చుని సెల్ఫీ తీసుకుంటాడు. అటూ ఇటూ విలేఖరులు కూర్చుంటారు)
విలేఖరులు :
సార్ మీ గురించి వివరించండి సార్..
ఛైర్మన్ :
నా పేరు వి.ఎన్. పాలపర్తి. (ప్రక్కన ఉన్న మరో ఇద్దర్ని చూపిస్తూ) వీరు నా బిజినెస్ పార్టనర్స్. ఐయామే డాక్టర్… మరో నాలుగు రంగాలకు చెందిన వారిని కలుపుకుని అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, చైనా, జర్మనీ దేశాల్లో బిజినెస్ చేస్తున్నాం.
విలేఖరులు :
మీ నేటివ్ ప్లేస్, మీ కుటుంబం వివరాలు?
ఛైర్మన్ :
నేను ఈ జిల్లా వాడినే. చిన్నప్పుడు చాలా పేదకుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చా. చదువు మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనేందుకు నేనే లైవ్ ఎగ్జాంపుల్.
విలేఖరులు :
ఎక్కడ చదివారు … ఎలా?
ఛైర్మన్ :
ఎయిమ్స్‌లో మెడిసిన్, పి.జి. … టాపర్‌గా నిలిచా. అమెరికా నుంచి వెంటనే బంపర్ ఆఫర్ వచ్చింది. సో సెటిల్డ్ దేర్ … కానీ అన్ని రంగాల్లో మన దేశపు జెండా ఎగరేయాలనేది నా లక్ష్యం. సో … బిజినెస్ స్టార్ట్ చేశా. ఇండియాలోని జెమ్స్ ను ఏరి పట్టుకుని అవకాశాలు కల్పించి విదేశాల్లో మా బిజినెస్‌ను విస్తరిస్తున్నాం.
విలేఖరులు :
యువతకు మీరిచ్చే సందేశం?
ఛైర్మన్ :
లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అలుపు లేకుండా శ్రమించాలి. అన్ని అవకాశాలు అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలి. మన తల్లిదండ్రులను సుఖాలలో ముంచాలి. బంధువులు మనల్ని చూసి గర్వపడాలి.
(యువకులు, సర్పంచ్ చప్పట్లు కొట్టారు. వెల్ సెడ్, గ్రేట్ ఇక వెళ్ళిస్తామంటూ విలేఖరులు బయలుదేరుతారు)
సర్పంచ్ :
చాలా సంతోషం సార్ … మన తెలుగోళ్ళు అమెరికాలో ఇంగ్లాండ్‌లో జెండా పాతితే మాలాంటోళ్ళకు చాలా హేపీసు … అన్నట్లు రాజారావుగారు … మన ఊరికి ఈ బాబుగారేమైనా సాయం చేస్తారేమో … ఆయన పేరు చెప్పుకుని పిలకాయలు చదువుకుంటారు, బడికి మరో రెండు గదులు వేయించాల మరీ ….
(బయటినుండి వచ్చి కొద్ది సేపటి నుండి ఓ పక్కన నిల్చుని గణపతి నిశ్శబ్ధంగా గమనిస్తుంటాడు)
గణపతి :
హహహ్హ.. చేస్తాడు చేస్తాడు.
సర్పంచ్ :
ఎవరూ.. మీరా గణపతిగారూ… ఏంటిలా …..
రాజారావు :
మేస్టారూ … ఇలా వచ్చారేంటి (ఆశ్చర్యం).
గణపతి :
అప్పుడు మీ దగ్గర తీసుకున్న అప్పు చెల్లిద్దామని సిటీలో మీ ఇంటికి వెళ్తే… ఇలా పల్లెకు వచ్చారని చెప్పారు. పక్కనే కదా మా ఊరు, దారిలో దిగి మీ బాకీ తీర్చేద్దామని వచ్చానండీ.
రాజారావు :
భలేవారండీ … నేనేమైనా మిమ్మల్ని అడిగానా … సరే భోజనం చేసి వెళ్ళాలి మరి. (లోపలకు వెళ్ళబోతాడు)
గణపతి :
రుణశేషం వుండకూడదండీ … ఎప్పటికప్పుడు తీర్చేసుకోవాలి ఇవుగోండి మీ డబ్బులు. (రాజారావు లోపలికి)
సర్పంచ్ :
సరేగానీ మేస్టారూ… ఇందాక ఆ బాబుగారిని నేనేదో సాయమడగబోతుంటే మీరు అడ్డుపడి వెటకారంగా ఏదో అన్నారు. ఎందుకండీ.
గణపతి :
ఆయన గురించి నాకు బాగా తెలుసు. బహుశా వారు నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. లేక గుర్తుపట్టినా ఇష్టం లేక మొహం తిప్పుకున్నారేమో!
ఛైర్మన్ :
ఓహో మీరా సార్… బాగున్నారా.
గణపతి :
మన ఊరి రామలింగేశ్వరుడి దయవల్ల మేమంతా బాగానే వున్నాములే బాబూ! అన్నట్లు సర్పంచ్ గారూ, మీకు ఎన్ఆర్‌ఐ లంటే ఏదో అపోహలున్నట్లున్నాయ్… ఇలాంటివారు పైసా విదిల్చరు.
సర్పంచ్ :
మీరెలా చెప్తున్నారు. అయినా ఆ బాబుగారు ఫీలవుతారు.
గణపతి :
నేను అందరు ప్రవాస భారతీయులను తప్పు పట్టడం లేదు. ఇదుగో ఈ విశ్వనాథంలాంటి ఎస్కేపిస్టులు, స్వార్థపరుల గురించి మాత్రమే చెప్తున్నా…
సర్పంచ్ :
మీకు వారు బాగా తెలుసా?
గణపతి :
మా ఊరివాడే … పౌరోహిత్యం చేసే పాలపర్తి సుబ్రహ్మణ్యంగారి కుమారుడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆ మహాతల్లి ఆరుగురు పిల్లలను అష్టకష్టాలు పడి పెంచింది…
విశ్వనాథం :
అందుకే… ఇందుకే … ఇటువైపు రావాలన్నా, ఆ ఊరివారితో మాట్లాడాలన్నా నాకు అసహ్యం, కంపరం. గతాన్ని గుర్తుచేసి అవమానిస్తారు. అయినా నన్ను మీరు ఎస్కేపిస్టని, స్వార్థపరుడ్ని అనడం టూమచ్. నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు.
గణపతి :
మన ఊరికి, మొత్తం మన జాతికి ద్రోహం చేసినవాడివి, పచ్చి స్వార్థపరుడివి కాకుంటే… ఊరివాళ్ళు ఎన్ని ఉత్తరాలు వ్రాశారు … ఫోన్లు చేశారు … నువ్వు కనీసం ఒక్కరికైనా స్పందించావా?
విశ్వనాథం :
చూడండి నా తెలివితేటలతో కష్టపడి చదువుకున్నా, ప్రభుత్వ స్కాలర్షిప్‌లతో పూర్తిచేసి నాకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పైకొచ్చా. ఇప్పుడు నా దగ్గర కోట్లున్నాయని.. ఊరివారికి పంచేసేయాలా?
గణపతి :
శబాష్ … దీన్నే ఎస్కేపిజం అంటారు.
రాజారావు :
(లోపలి నుంచి వచ్చి) అయినా నా ఇంటికి వచ్చిన అతిథిని అవమానించడం సబబు కాదండీ.
గణపతి :
మీకు అతిథి కాకముందు వీడు నా స్టూడెంట్ సార్! వీడు బాగా చదివి అందర్నీ ఉద్దరిస్తాడని తలా పిడికెడు సాయం చేసి చదివించారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్‍లొ సీటొస్తే ఊరి జనాలు పండగ చేసుకున్నారు. కానీ వీడు … ఆ తర్వాత ….ఇరవయ్యేళ్ళ తర్వాత ఇప్పుడే కనిపించడం.
జితేంద్ర :
మీరు టీచర్ అనే గౌరవంతో ఊరుకున్నాం… మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయనేదో మిమ్మల్ని దోచుకుని మోసం చేసినట్లు చెప్పడం బాగాలేదు.
గణపతి :
నన్ను, మా ఊరి వారినే కాదు … ఈ దేశాన్నే దోచుకున్న మహానుభావుడు.
రాజారావు :
ఏంటండీ మీరు మీ మాటలు…
గణపతి :
నిజం మాస్టారూ… ఇలాంటి ఒక్కో డాక్టర్‌ను తయారుచేయడానికి మన ప్రభుత్వం ఎయిమ్స్‌లో ఒకొక్కరిపై ఒక కోటి 70 లక్షలు ఖర్చు పెడ్తోంది. కానీ డాక్టర్లయిన తర్వాత తెల్లకోటు వేసుకుని 53 శాతంమంది విదేశాలకు ఎగిరిపోతున్నారు. మీకో విషయం తెలుసా. ఇక ఐఐటీలో, ఎస్ఈటీలో, ఇతర యూనివర్శిటీల్లో ఈ యువతను మేధావులుగా తయారుచేయడానికి ఒక్కొక్కరి పై 60 లక్షలు ఖర్చు అవుతుంది. మరి వీరు అమెరికా, లండన్లకు వలస వెళ్ళిపోతే ఏడాదికి సుమారు 40 వేల కోట్ల రూపాయలు వీళ్ళపై పెట్టుబడి రూపంలో ప్రభుత్వం వృథా చేసినట్లే కదా.
జితేంద్ర :
తప్పేముందండీ… అక్కడ మా ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కాబట్టి వెళ్తున్నాం. అయినా ఈ ఇండియన్ సిస్టమ్ హారిబుల్… ప్రతిదానికీ లంచం, పర్మిషన్లు, సర్టిఫికేట్లు పేరుతో అవినీతి కంపు. ప్రజలకు బాధ్యతారాహిత్యం , ఇక్కడేముందండీ. ట్రాష్…. అందుకే విదేశాల్లో స్థిరపడ్తాం.
గణపతి :
ఇక్కడ ఏముందా? అనుబంధాలున్నాయ్. అపూర్వ జ్ఞానసంపద వుంది. ఇక్కడ చదివిన చదువుకే కదండీ బాబూ మీకు అమెరికా వీసాలు వస్తున్నాయ్. అయినా సిస్టమ్ బాగాలేదు, వ్యవస్థలు చెడిపోయాయంటూ తిడ్తున్నారు కదా…. మీరు ఎందుకు బాగుచేయకూడదు, ఎందుకు పారిపోతున్నారు!
రాకేష్, అనిల్ :
మాకా ఖర్మపట్టలేదు. మేము పారిపోవడం లేదు… మా ఇష్టం… డాలర్ల సంపాదన కోసం… సుఖవంతమైన జీవితం కోసం మైగ్రేషన్…
గణపతి :
ప్రతి సంవత్సరం యువతను మేధావులుగా తయారు చేసేందుకు యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు ఇస్తున్న నిధులను గనుక రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్ళిస్తే ఇప్పటికి దేశంలోని సగం రాష్ట్రాలు సంపూర్ణంగా బాగుపడి వుండేవి. హూ.. వెళ్ళండి .. మీ ఇష్టమొచ్చిన చోటుకి వెళ్ళిపోండి. పది చేతులా సంపాదించండి. కోట్లు పోగేయండి.
విశ్వనాథం, జితేంద్ర :
ఓహ్ .. అదేకదా మేము కోరుకునేది, చెప్పేది కూడా.
గణపతి :
కానీ… కానీ.. మీ మీద ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి అణాపైసలతో సహా వడ్డీ లెక్కకట్టి వెనక్కు తిరిగిచ్చేయండి. అడగడం ఈ దేశ పౌరుడిగా మా హక్కు. మేము అగచాట్లు పడి చెల్లించిన పన్నుల డబ్బు. కాబట్టి మీరు వెళ్ళముందు అలాగని అగ్రిమెంటు వ్రాయాలి.
విశ్వనాథం :
ఒకవేళ చెల్లించకపోతే …….
గణపతి :
మిమ్మల్ని కూడా దేశద్రోహులమనే పిలుస్తాం! జాతి ద్రోహులు వీరేనంటూ మీ ఫోటోలతో సహా ఊరి మొదట్లో గోడలపై ప్రకటనలు వ్రాయిస్తాం.
జితేంద్ర :
టూమచ్! రిడిక్యులస్.
గణపతి :
అంతేకాదు, పండగలకు, పబ్బాలకు, తిరునాళ్ళకు, పెళ్ళిసంబంధాలకు ఇక్కడకు రాకండి! ఎన్ఆర్‌ఐలు అంటూ మీ గొప్పలు చాటుకునేందుకు, ఈ గడ్డను ప్రేమిస్తున్నామంటూ… ఏమీ ఇవ్వకుండా ఫోటోలు, వీడియోలు, పొగడ్తలు, అభిమానాలు, సన్మానాలు మూటగట్టుకుని కాదు కాదు దోచుకుని పోయేందుకు, మళ్ళీ అడుగుపెట్టమాకండి.
జితేంద్ర :
(రాజారావు దగ్గరకు వెళ్ళి) ఏంటి తాతయ్య ఈయనగారి విపరీతపు చాదస్తం.
రాజారావు :
గణపతి వాదన కరక్టనిపిస్తోందిరా. పశుపక్ష్యాదులకు, మనుష్యులకు మధ్య తేడా -విచక్షణా జ్ఞానం, అనుబంధాలు మాత్రమే. వాటిని పక్కనపెట్టి కేవలం స్వార్ధం చూసుకోవడం తప్పేకదా?
జితేంద్ర :
మీరు కూడానా!
రాజారావు :
విదేశీ ప్రలోభాలకు లొంగివుంటే మోక్షగుండం విశ్వశ్వరయ్యగారు, అబ్దుల్ కలాంగారు, మహాత్మగాంధీ, యల్లాప్రగడ వంటి మహనీయుల సేవలు మనకు లభించవుగా. అంతెందుకు విదేశీయుడు కాటన్ దొర మన ఆంధ్రాను అన్నపూర్ణగా మార్చేందుకు త్యాగాలు చేయలేదా ?
విశ్వనాథం :
ఇదేమీ సినిమాకాదు. గ్రామాలను దత్తత తీసుకోవడం, ఏడాదికోరోజు ఫ్లయిట్ చార్జీలకు లక్షలు తగలేసి వచ్చిపోవడం జరిగేందుకు. రోజులు మారాయి. ఎవరి దారి వారిదే! అయినా మా మీద మీ పెత్తనం ఏమిటటా… అసలు మీరెవరు మమ్మల్ని ప్రశ్నించేందుకు?
జితేంద్ర :
ఏవరూ మీలా మమ్మల్ని ఇలా అడగడం లేదు. అసలు మీకేంటి సంబంధం? మీరెవరనీ?
గణపతి :
నేను ఏవరినా.. భారతీయుడిని.. నాకేం సంబంధమంటే… నాడు మహాత్ములు విదేశీయుల బారి నుంచి భారతదేశానికి అన్యాయం జరుగుతుంటే సత్యాగ్రహంతో ఎదుర్కొన్నారు. నేడు మాలాంటి వాళ్ళం.. మీ లాంటి పరాయీకరణ చెందిన స్వజాతి కాదు కాదు.. వింతజాతీయుల నుంచి భారతీయులకు నష్టం జరుగకుండా… అడ్డుకునేందుకు… నిరోధించేందుకూ… మేమూ… ధర్మాగ్రహం… సత్యాగ్రహ ఉద్యమంలా… చేపడ్తాం.
జితేంద్ర :
హహ.. మీరేమైనా గాంధీ గారా. మేమైనా బ్రిటిషర్లమా. మీ ఆగ్రహాలు మా దారిని మార్చలేవు.. మాకు అడ్డురాకండి.
గణపతి :
మీ దారికి ఎవరూ అడ్డురారండీ. పారిపోండి. భారత జాతీయతను వదిలేసుకోండి. మళ్ళీ వెనక్కు తిరిగిరాకండి. ఈసారి ఇంకా అవమానాల పాలవుతారు.
విశ్వనాథం :
ఓహో అలాగా! మేమంతా దేశానికి ద్రోహం చేస్తున్నామంటారు… ఊ
జితేంద్ర :
అయితే మేముకూడా బంగారు భవిష్యత్ వదిలేసుకుని ఇక్కడ ఎలాగోలా బతికేయాలా!
గణపతి :
బాబూ మీ హక్కులను అభివృద్ధిని వదులుకోమని చెప్పడం లేదు. ఓసారి మీ బాధ్యతలు కూడా గుర్తుచేసుకోమంటున్నాను. మన దేశానికి, రాష్ట్రానికి వెన్నుముకలాంటి పల్లెల దుస్థితిపై దృష్టి సారించమని వేడుకొంటున్నాను.
రాజారావు :
అవును నిజం. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల ద్వారా వసూలైన పన్నుల సొమ్ముతో ఉన్నత చదువులు చదివిన మేధావులంతా వలస వెళ్ళిపోతే ఇక ఇక్కడ మిగిలేది మాలాంటి వృద్ధులు, పనికిరాని సజ్జ మాత్రమేకదా!
గణపతి :
మీరు అక్కడెక్కడికో వెళ్ళి భరతమాతపై పాటలు, తెలుగుతల్లి గీతాలు పాడి కిరీటాలు పెట్టించుకొంటే ఇక్కడ మన అమాయక ప్రజలకు ఒరిగేదేమిటి? ఎన్‌ఆర్‌ఐ అనుకునే ప్రతి ఒక్కరు వారి సంపాదనలో కనీసం 30 శాతం తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి.
రాజారావు :
అలాకాకుంటే ఆ డబ్బును మీరే స్వయంగా మన పల్లెల్లో ప్రజలకు మంచి వసతులు కల్పించేందుకు ఉపయోగించాలి. ఎండిపోతున్న చెరువులు కాలువలు తవ్వించవచ్చు, బడులు కట్టించవచ్చు.
విశ్వనాథం :
వాటికి ప్రభుత్వాలున్నాయ్ లెండి. మీరూ … మీ చాదస్తం! నేను బయలుదేరుతున్నా … శెలవ్!
యువకులు :
మేము కూడా వారితోపాటే! బై బై..
(గణపతి దిగాలుగా వారివైపు చూస్తుంటాడు. రాజారావు అతన్ని భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చోపెడ్తాడు)
గణపతి :
సార్ నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా?
రాజారావు :
మనతరానికి, ఈ తరానికి చాలా తేడావుంది మాస్టారు. ఈ నవతరాన్ని ఇప్పుడు మనం తప్పుపట్టలేం! అసలు తప్పు మన తరానిదే!
గణపతి :
అదేమిటి అలా అంటారు?
రాజారావు :
అవునండి… మధ్యలో… ఒక తరం … విషయంలో అదే ఈ యువత తల్లిదండ్రుల విషయంలో మనం పొరపాటు చేశాం. వారికి మన ఈ హితబోధని చేసి వుండాల్సింది. చదువు ఉద్యోగం పరమావధిగా ఈ పిల్లల తల్లిదండ్రులను అదే మన పిల్లలను సంపాదన యంత్రాలుగా పెంచాంకదా! అందుకే ఈ స్వార్థ సంకుచిత మనస్తత్వం నేటి నవతరాన్ని కుదిపేస్తోంది.
గణపతి :
మనం అలా చూస్తూ వుండాల్సిందేనా? మేధావులైన ప్రతిభావంతులు వలసదారి వెతుకుతుంటే ఇక మన పల్లెలు, పట్టణాలు నిస్తేజంగా మిగలాల్సిందేనా?
(ఇద్దరూ దిగాలుగా ఆలోచిస్తూ కూర్చుంటారు)
(లోపలనుంచి వచ్చిన మాధవి వీరి వద్దకు వస్తుంది)
మాధవి :
మామయ్యగారూ నేను లోపలనుంచి మీ మాటలన్నీ విన్నా…. పిల్లలను అంత దారుణంగా మాట్లాడి అవమానించడం బాగలేదండీ… వీరెవరో నాకు తెలీదు కానీ… టూ మచ్… హారిబుల్… పాపం పిల్లలు వారి ఆశలు వారికుంటాయ్.. ఎంకరేజ్ చేయడం ఇష్టం లేకుంటే గమ్ముగుండాలి. అంతేకానీ అలా నేరస్తుల్లా అవమానించి డిస్కరేజ్ చేయడం శాడిజం అనిపించుకుంటుంది.
రాజారావు :
అమ్మా మాధవీ…. వీరు గతంలో నా కొలీగ్… నిజమైన ఆదర్శవాది. ఆయన మాటలు మిమ్మల్ని నొప్పించి వుండవచ్చు… కానీ… నీ తల్లి మనసును కాసేపు పక్కన పెట్టి ఆలోచించు..
మాధవి :
పిల్లల ఆలోచనే కరెక్టనిపిస్తోంది. వారి ఎదుగుదలను కోరుకుంటే, వాళ్ళ ఆశయాలను, ఆకాంక్షలను సమర్ధించక తప్పదు. విదేశాలకు వెళ్ళడం, అవకాశాల మేరకు సంపాదించుకుని ఆస్తులు కూడబెట్టడం నేరం కాదు.
జితేంద్ర, అనిల్, రాకేష్ నీరసంగా వస్తారు-ఉసూరుమంటూ కుర్చీల్లో కూర్చుంటారు.
మాధవి :
ఏంటి నాన్నా … ఏమైంది
జితేంద్ర :
కొలాప్స్….. ఆ సార్ వాళ్ళు సైలెంట్‌గా వెళ్ళి పోయారమ్మా… ఎన్ని హోప్స్ పెట్టుకున్నాము
రాకేష్ : చచచ ఆంతా చెడగొట్టారు… తర్వాత వారి రెస్పాన్స్ ఎలాగుంటుందో.. ఏం పాడో.
మాధవి :
(నిరసనగా రాజారావు గణపతి వైపూ చూస్తూ.) అయినా రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోవడం సహజం కదా. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు నానా మాటలూ అన్నారు. మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి స్కాలర్షిప్పులు వచ్చాయి.. కష్టపడి చదివి టాప్ ర్యాంకర్లుగా నిలుస్తున్నారు కాబట్టి ఇంకా పెద్ద చదువుల కోసమో వీళ్ళ సేవలు ఉపయోగించుకునేందుకో ఎక్కువ జీతాలిచ్చి అబ్రాడ్‌లో కంపెనీలు వీళ్ళను ఎగరేసుకుపోతున్నాయి. తప్పేమిటటా.. పాపం వీళ్ళను చూడండి డీలా పడిపోయారుగా.
రాజారావు :
నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా వుంటాయి. నొచ్చుకుంటారు. మనం మనుషులం కదమ్మా. నువ్వేమీ అనుకోకుంటే ఓ మాట అడగనా.. మనింట్లో ఒక మామిడి మొక్క నాటి రోజూ దోసెడు నీళ్ళు పోసిన చెట్టుకు కాసిన కాయలు కాసిని కాయలు ఎవరో కోసుకెళ్తే అంత బాధ పడ్డావు కద తల్లీ. మరీ.. వీళ్ళేదో ఉద్ధరిస్తారని ప్రజలకేదో మేలు జరుగుతుందనీ పన్నుల సొమ్ము ధారపోసి చదివిస్తే.. ఈ పంట( యువకుల వైపు చూపిస్తాడు) వేరే దేశం ప్రలోభాల దోట్లు వేసి లాగేసుకుంటే.. పాపం ఈ నేల తల్లికి మాటలు రావు కాబట్టి అడగలేదు.. కన్న తల్లివి కాబట్టి నువ్వు.. అన్యాయమని అడగలేవూ.. నిజమింతే కదమ్మా. అపార్థం చేసుకుంటున్నారు గానీ.. వాడు స్వంత మనవడే కదా, ఈ పిల్లలు విజయాలు సాధించి పేరు తెచ్చుకుంటే మా అందరికీ ఆనందమే.
(మాధవి మవునంగా ఆయనకు నమస్కారం పెట్టి లోపలకు).
జితేంద్ర :
హూ… చేసిందంతా చేసేసీ…మా మేలు కోరేవారైతే.. ఇంత రాద్ధాంతం చేస్తారా.
రాజారావు :
ఇదేంటిరా.. ఇక్కడికే ఏదో అంతా అయిపోయినట్లూ… ఇక మీకు వేరే ఉద్యోగాలే రావన్నట్లు.. హెబ్బెబ్బే. మీకేంటిరా ఎక్కడికెళ్ళినా కళ్ళకద్దుకుని ఉద్యోగాలిస్తారు. డోంట్ వర్రీ.. ఇప్పుడొచ్చిన వారైనా ఇంకా ఏ సంగతీ స్పష్టంగా చెప్పలేదుగా.. ఏంటో మీ ఫీలింగ్సూ.
జితేంద్ర :
మీకు అర్థం కాదులెండి మా బాధ.. ఇలాంటి గోల్డెన్ చాన్స్ అందరికీ రాదండీ.. అంత పెద్ద కంపెనీ చైర్మన్ గారితో పరిచయం .. నేరుగా వారి నోటి వెంట ఓకె అనిపించుకోవడం మా కెరియర్‌కు ఏంత ప్లస్ అవుతుందో మీలాంటివారికి అస్సలు తెలీదు
(గణపతి వైపు తిరిగి) మీరు పదండి మాస్టారూ
గణపతీ :
(యువకుల వైపు చూస్తూ ).. మిమ్మల్ని హర్ట్ చేసుంటే క్షమించండి. (ఇంకా ఏదో చెప్పబోతుంటాడు-జితేంద్ర సెల్ మాగుతుంది)
జితేంద్ర :
ఆ… సార్ చెప్పండి.. ఓకె సార్… ఇవ్వండి అలాగే సార్…. సార్.. ఓహ్.. సో కైండ్ ఆఫ్ యూ.. థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్.. అలాగేనండీ.. సార్…………. ఓకే … వారికివ్వమంటారా. (గణపతి వైపు చూపు).. సరే సార్.. థాంక్యూ వన్స్ ఎగైన్. వుంటా సార్. గుడ్ డే.
స్నేహితులు ఉత్కంఠగా చూస్తుంటారు
జితేంద్ర :
యాహూ.. విహావ్ సక్సీడెడ్… విశ్వనాధం గారు ఫోన్… గుడ్ న్యూస్
(అందరూ చేతులు కలుపుతూ కంగ్రాటులేషన్స్ చెప్తారు)
మాధవి సురేష్ బయటకు వస్తారు …
జితేంద్ర :
మమ్మీ డాడీ.. సాధించామ్.. మాకు ప్లేస్‌మెంట్స్ ఓకే చేసారు.. ప్రస్తుతానికి అమెరికాలో పరిస్థితులు బాగా లేవు కదా.. మా ముగ్గురినీ జర్మనీ ప్రాజెక్టుకు తీసుకుంటున్నారంట.
సురేష్ :
వెరీ గుడ్.. చాలా సంతోషం.. ఎప్పుడంట ప్రయాణం.. శాలరీ ప్యాకేజీ వివరాలూ..
జితేంద్ర :
ఇన్ సూన్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది… ఆ ఆ అన్నట్లు … ముందుగా గణపతి గారికి థాంక్సు చెప్పమన్నారు. (గణపతి వద్దకు వెళ్ళి చేతులు పట్టుకుంటాడు) వెరీ సారీ .. మిమ్మల్ని బాధ పెట్టి వుంటే క్షమించండి.
గణపతి :
మరేం ఫర్వాలేదులే బాబూ…. మీరు వృద్ధిలోకి రావడమే అందరూ కోరుకునేది… కానీ.. కలలు నెరవేర్చుకునే క్రమంలో… కన్నతల్లిని జన్మభూమినీ మర్చిపోవద్దనేదే మా ఆక్రోశం.
జితేంద్ర :
ఓహ్ సారీ.. విశ్వనాధం గారు ఏదో మెయిల్ కూడా పంపినట్లు చెప్పారు.. వుండండి చూస్తా (ట్యాబ్ చూస్తాడు) మీకేనంట లెటర్( గణపతి చేతికిస్తాడు)
గణపతి :
(చదివి నవ్వుతాడు) మనిషి ఎంత ఎదిగినా.. ఎన్ని అహాల పొరలు కమ్మినా.. ఎన్ని సాధించినా.. అంతరాత్మను మాత్రం మోసం చేయలేడండీ.. దానికి సమాధానం చెప్పుకోవాల్సిందే కదా.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు అంతర్మధనం తప్పదు. కొన్నింటిని ఎదుర్కోలేక తప్పించుకుని కాలాన్ని నెట్టేసినా.. తాత్కాలికమే.. పరుగు ఆపి నిలబడ్డ సమయంలో వెనక్కు తిరిగి చూసుకుంటే మనుషులకో.. మనసులకో సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.
రాజారావు :
ఇంతకూ ఏముంది మెయిల్‌లో.. ఏమని వ్రాసాడండీ
గణపతి :
మీరే చదవండి
రాజారావు :
(చదువుతాడు) హహహ… వెరీ గుడ్…గుడ్. గణపతి గారూ అయితే మీ కంఠ శోష వృథా కాలేదండీ.
జితేంద్ర :
తాతయ్యా మాకు కూడా చెప్పవచ్చు కదా….
రాజారావు :
చెప్పాల్సింది మీకే… మీ గురించే అసలు పాయింటూ.. ఆ విశ్వనాధం గారు.. ఆలస్యంగా రియలైజ్ అయినా… మంచి నిర్ణయం తీసుకున్నారు రా. చెప్తా వినండి. మీరు కోరుకున్నట్లే మీకు పోస్టింగులు ఖరారు చేసారు. కానీ పదేళ్ళు మాత్రమే మీరు విదేశాల్లో వుండబోయేది. తర్వాత ఇండియాలోనేనంట. గణపతి గారి వాదన వారిలో మార్పు తెచ్చినట్లుందిరా. వీరు లేవనెత్తిన పాయింట్లను పరిగణలోకి తీసుకుని వారి కంపెనీల్లో అమలు చేస్తారంట. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారి జీతాల్లోంచి 30 శాతం మినహాయించి నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఆ ఉద్యోగుల విరాళం కింద ఆ కంపెనీయే జమ చేస్తుందిట. విదేశాల్లో ఉన్నత విద్య, పరిశోధనల ద్వారా నైపుణ్యాలను మెరుగు పర్చుకుని తిరిగి మన దేశానికి వచ్చి సేవలందించాలనుకునే వారికే ఇక నుంచి ఆ కంపెనీలో ప్రాధాన్యత నిస్తారంట. సూపర్ కదా. నీకు సెపరేట్‌గా ఓ మెయిల్ చేసారంట చూడు.
జితేంద్ర :
యెస్…. (దీర్ఘంగా ఆలోచిస్తాడు) కష్టమే… కాని అసాధ్యం కాదు.
రాకేష్, అనిల్ :
ఏంటదీ…
జితేంద్ర :
ఒక యాప్ డెవలప్ చేసే బాధ్యత కూడా మన మీద పెట్టారురా.. మన దేశం నుంచి ఎంత మంది విదేశాల్లో వున్నారు, స్కాలర్ సిప్‌లు ప్రభుత్వ సహాయంతో చదువుకుని విదేశాల్లో స్థిరపడ్డ వారెవరెవరూ, వారి స్వగ్రామాల అభివృద్ధికి వారి తోడ్పాటు, ఎన్‌ఆర్‌ఐ ల గురించి వారి గ్రామాల్లో ప్రజల అభిప్రాయం వంటి సమగ్ర వివరాలతో ఆ యాప్ తయారు చేయాలంట.
(అంతా నిశ్శబ్ధంగా వుంటారు)
గణపతి :
వండర్ ఫుల్ …
అంతా చప్పట్లు కొడ్తారు
జితేంద్ర :
ఓహ్……గ్రేట్ .. విశ్వనాధం గారు గ్రేట్ తాతయ్యా…..వావ్…
(అంతా అతని వంక ఆశ్చర్యంగా చూస్తారు)
జితేంద్ర :
టెన్ మిలియన్ డాలర్లు .. ఓహ్.. వారి తండ్రి గారి పేరుతో చారిటీ ట్రస్టు.. గణపతి గారూ మీరే బాధ్యత తీసుకుని మీ ఊరు అభివృద్ధి చేయాలంట…
రాజారావు :
మాస్టారూ…. అయితే నిష్ఠూరంగానైనా.. సాధించారు
గణపతి :
మనం తెలుగు వాళ్ళం కదా సార్.. ఏదీ పట్టించుకోం.. కానీ ఏదైనా చేయాలనుకుంటే మాత్రం అందరికంటే పై చేయి మనదే కావాలి.. కొంపదీసి నా గురించి అనుకునేరు.. కాదండీ విశ్వనాధ్ గురించి… మన విశ్వనాధ్ గురించండీ.. ఇక్కడకు ఆ దైవమే రప్పించాడు. పల్లెను తల్లినీ పలకరించిన వాడు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళలేడండీ.. మనసు ఒప్పదు. శుభం.
మాధవి :
అంతే కాదు మామయ్యా మమతలు అనుబంధాలతో బతుకులను పచ్చగా మార్చే శక్తి కేవలం పల్లెలకే వుందండీ.
రాజారావు :
ఏమిటమ్మా ఏమిటో చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. పిల్లలకు జాబ్స్ వచ్చాయనా?
సురేష్ :
కాదు నాన్నగారూ.. త్వరలో అత్తగారి పోస్టు రాబోతోంది అందుకనీ.
రాజారావు :
హా.. అవునా.. ఎలా?
సురేష్ :
పార్వతక్కయ్య మన వాళ్ళలో ఓ సంబంధం వెతికేయడం, అప్పుడే ఈవిడ గారు ఫోన్‌లో వారితో మాట్లాడ్డం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మీ కూతురు పార్వతికి ఈ మాధవి వీరాభిమానిగా.
రాజారావు :
ఆహా.. సో ఇక్కడకు వచ్చినందుకు అందరూ హేపీ అన్నమాట.
గణపతి :
అంతే కదా సార్… పల్లెలను నమ్ముకుంటే .. బతుకులూ పచ్చగా వుంటాయ్.
సురేష్, మాధవి, జితేంద్ర, రాజారావు :
కరెక్టు…. నిజం…
యువకులు :
మేము కూడా మీ వెంటే మాస్టారూ.. మీ ధర్మాగ్రహాన్ని ప్రవాసాంధ్రులందరికీ చేర్చడంలో.. మేము సైతం.. మీ గళానికి వాదనకూ ప్రశ్నలకూ మా నాలెడ్జ్ జోడించి సోషల్ మీడియా ఉపయోగించి ఉద్యమంగా మారుస్తామ్..
అంతా చేతులు కలుపుతారు. బ్యాక్ గ్రవుండ్ లో పాట – వందే మాతరం.
శుభం